రాజీవ్ గాంధీ 1971 యుద్ధంలో దేశం వదిలి పారిపోయారా: Fact Check

ఫొటో సోర్స్, Keystone/Getty Images
- రచయిత, బీబీసీ న్యూస్
- హోదా, ఫ్యాక్ట్ చెక్
మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీకి సంబంధించి ఒక వైరల్ మెసేజ్ సోషల్ మీడియాలో పంపిణీ అవుతోంది.
"1971 ఇండో-పాక్ యుద్ధంలో దేశానికి ఆయన అవసరమైనపుడు.. భారత వాయుసేన పైలట్ రాజీవ్ గాంధీ దేశం వదిలి పరారయ్యారు" అని ఆ మెసేజ్ చెప్తోంది.
ఈ మెసేజ్‌కు సంబంధించి రివర్స్ సెర్చ్ చేసినపుడు.. ఇటీవల వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను పాకిస్తాన్ విడుదల చేసిన అనంతరం ఈ మెసేజీని సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపింపజేస్తున్నట్లు వెల్లడైంది.
ఫిబ్రవరి 26వ తేదీన భారత వైమానిక దాడికి ప్రతిగా చేసిన వైమానిక దాడి అనంతరం ఫిబ్రవరి 27వ తేదీన అభినందన్‌ను పాకిస్తాన్ బంధించింది.
రాజీవ్ గాంధీకి సంబంధించిన మెసేజీని మితవాద ఫేస్‌బుక్, వాట్సాప్ గ్రూపుల్లో "భారత వైమానిక దాడులకు సంబంధించి ఆధారాలు కావాలని రాహుల్ గాంధీ ఈ రోజు కోరుతున్నారు. కానీ ఆయన తండ్రి కష్ట కాలంలో దేశానికి మద్దతుగా నిలబడలేదు" అనే శీర్షికతో విస్తృతంగా ప్రచారమవుతోంది.
ఫేస్‌బుక్, ట్విటర్ యూజర్లు "పోస్ట్‌కార్డ్", "పికా పోస్ట్" వంటి వెబ్‌సైట్లు 2015, 2018ల్లో ప్రచురించినట్లుగా ఉన్న వార్తా కథనాలను ఉటంకిస్తూ తమ వాదనలను నిరూపించుకోవటానికి ప్రయత్నించారు.

ఫొటో సోర్స్, SM Viral Post
ఈ పోస్టును వేలాది సార్లు షేర్ చేశారు. కానీ ఈ వాదనలు తప్పుదారి పట్టించేవని బీబీసీ ఫ్యాక్ట్ చెక్ బృందం గుర్తించింది.
ప్రధానమంత్రులకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. రాజీవ్‌గాంధీ 1944 ఆగస్టు 20న ముంబైలో జన్మించారు. ఆయన 40వ ఏట దేశ ప్రధానమంత్రి అయ్యారు.
1971 ఇండియా-పాకిస్తాన్ యుద్ధం సమయంలో ఇందిరాగాంధీ ఈ దేశ ప్రధానమంత్రి. ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ ఆ సమయంలో రాజకీయాల్లో లేరు.
రాజీవ్ గాంధీ హాబీ విమానాలు నడపటం అని అధికారిక వెబ్‌సైట్ చెప్తోంది.
ఆయన తన హాబీలో భాగంగా.. "దిల్లీ ఫ్లయింగ్ క్లబ్" నుంచి కమర్షియల్ ఫ్లయింగ్ లైసెన్స్ పొందారు.
ఆ వెబ్‌సైట్ ప్రకారం రాజీవ్‌గాంధీ 1968లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ పైలట్‌గా పనిచేయటం ప్రారంభించారు. దాదాపు దశాబ్ద కాలం పాటు ఆయన పైలట్‌గా పనిచేశారు.
ఆయన ఎన్నడూ భారత వైమానిక దళం పైలట్ కాదు. కాబట్టి యుద్ధ విమాన పైలట్ అని చెప్పటం బూటకం.
"1971 యుద్ధంతో ఆయనకు (రాజీవ్ గాంధీకి) ఎలాంటి సంబంధం లేదు. ఆయన ఎయిర్ ఇండియాకు పాసింజర్ విమానాలు నడిపేవారు. పెద్ద బోయింగ్ విమానాలు నడపటం ఆయనకు చాలా ఇష్టం. ఆయన కెరీర్ మొదలైనపుడు.. భారతదేశానికి అటువంటి పెద్ద పాసింజర్ విమానాలు లేవు. అయితే ఆయన తన కెరీర్ చివరి సంవత్సరాల్లో ఒక బోయింగ్ విమానం నడిపారు" అని "సోనియా: ఎ బయోగ్రఫీ" రచయిత రషీద్ కిద్వాయ్ బీబీసీకి చెప్పారు.

ఫొటో సోర్స్, Delhi flying club/BBC
పిల్లలతో కలిసి దేశం వదిలి పరారయ్యారా?
ఆ వైరల్ మెసేజ్‌లో.. 1971 యుద్ధ సమయంలో రాజీవ్ గాంధీ తన భార్య సోనియా గాంధీ, పిల్లలు (ప్రియాంక, రాహుల్ గాంధీ)తో కలిసి భారతదేశం వదిలి ఇటలీ పారిపోయారని చెప్పటం కూడా అబద్ధం.
ఆ యుద్ధ సమయంలో రాహుల్ గాంధీ వయసు సుమారు ఆరు నెలలు. ప్రియాంకా గాంధీ ఆ యుద్ధం తర్వాత 1972లో పుట్టారు.
రాజీవ్ గాంధీ దేశం వదిలి వెళ్లారన్న వాదనలు కేవలం వదంతులేనని కిద్వాయ్ చెప్పారు.
"ఆ యుద్ధంలో రాజీవ్ పాత్ర అసలేమీ లేదు. దేశ సైన్యాన్ని ఆయన తల్లి నిర్వహిస్తోంది. మరో ముఖ్యమైన విషయం.. 1971 యుద్ధ సమయంలో ఇందిరాగాంధీ ఎక్కడికీ వెళ్లలేదు. ఆమె హయాంలో భారత సైన్యం పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. కాబట్టి ఆమె కుమారుడిని కానీ, మనవడిని కానీ ఎలా విమర్శిస్తారు?" అని ఆయన ప్రశ్నించారు.
రాజీవ్ గాంధీ దేశం వదిలి పారిపోయారన్న వాదనలపై సీనియర్ జర్నలిస్ట్ నీనా గోపాల్ కూడా అనుమానం వ్యక్తంచేశారు.
"ఏదేమైనా రాజీవ్ గాంధీ పిరికివాడు కాదు. ఆయన భయంతో దేశం వదిలివెళ్లాడనటం అవమానకరం" అని ఆమె వ్యాఖ్యానించారు.
ఆ వైరల్ మెసేజ్‌లో సరిగ్గా ఉన్న ఒకే ఒక్క అంశం.. రాజీవ్ గాంధీ పైలట్ యూనిఫాంలో ఉన్న ఫొటో. ఈ ఫొటోను "దిల్లీ ఫ్లయింగ్ క్లబ్"లో కూడా చూడవచ్చు.
(ఇలాంటి అనుమానాస్పద వార్తలు, ఫొటోలు, వీడియోలు లేదా సమాచారం ఏదైనా మీ దృష్టికి వస్తే, వాటి ప్రామాణికతను పరిశీలించడానికి బీబీసీ న్యూస్ వాట్సాప్ నెంబర్ +919811520111 కు పంపించండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి.)
ఇవి కూడా చదవండి.
- 1971లో భారత్‌పై పాకిస్తాన్ దాడి చేయబోతోందన్న విషయం RAW కి ముందే ఎలా తెలిసింది?
- బంగ్లాదేశ్ యుద్ధంలో 'రా' చీఫ్ రామేశ్వర్నాథ్దే కీలక పాత్ర!
- రామ జన్మభూమి-బాబ్రీ మసీదు కేసు పరిష్కరించనున్న మధ్యవర్తులు వీరే..
- నా గర్ల్‌ఫ్రెండ్ నన్ను ఎలా చిత్రహింసలు పెట్టిందంటే..
- మహిళల్లో సున్తీ (ఖత్నా) అంటే ఏమిటి... ఐక్యరాజ్య సమితి దీన్ని ఎందుకు నిషేధించాలంటోంది... #EndFGM
- ఒక అమ్మాయికి ముగ్గురు బాయ్‌ఫ్రెండ్స్... ఆ ముగ్గురితో ప్రేమ సాధ్యమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








