సల్మాన్ రష్దీ మీద దాడికి ఆయనే బాధ్యుడు...దాంతో మాకు సంబంధం లేదన్న ఇరాన్

సల్మాన్ రష్దీ

ఫొటో సోర్స్, Getty Images

ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ మీద జరిగిన దాడికి తమకు ఎటువంటి సంబంధం లేదని ఇరాన్ తెలిపింది.

'ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌ మీద ఆరోపణలు చేసే హక్కు ఎవరికీ లేదు' అని ఇరాన్ విదేశాంగశాఖ నాజర్ కనానీ అన్నారు.

సల్మాన్ రష్దీ మీద జరిగిన దాడికి ఆయనే బాధ్యుడని నాజర్ ఆరోపించారు.

'ఈ దాడికి సల్మాన్ రష్దీ, ఆయన మద్దతుదారులే బాధ్యులు. ఇస్లాంకు ఎంతో పవిత్రమైన వాటిని ఆయన అవమానించి హద్దులు దాటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 150 కోట్ల మంది ముస్లింల మనోభావాలను దెబ్బతీశారు. తద్వారా ప్రజల కోపానికి ఆగ్రహానికి తనతంట తానే కారణమయ్యారు' అని నాజర్ సోమవారం నాటి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పారు.

రష్దీ మీద దాడిన చేసిన వారి గురించి టీవీలో చూడటం తప్ప, తమకు ఎటువంటి సమాచారం తెలియదని ఆయన అన్నారు.

ఇటీవల అమెరికాలో 75 ఏళ్ల సల్మాన్ రష్దీ మీద కత్తితో దాడి జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది.

'ది సాటానిక్ వెర్సెస్' అనే వివాదాస్పద నవల రాసిన రష్దీని చంపేందుకు 1989లో ఇరాన్ సుప్రీం లీడర్ ఫత్వా జారీ చేశారు. నాడు కొన్ని సంవత్సరాల పాటు 'చంపు'తామనే బెదిరింపులు ఆయనకు వచ్చాయి.

రష్దీ మీద జరిగిన దాడిని 'దేవుని ప్రతీకారం'గా ఇరాన్ మీడియా అభివర్ణించింది.

'సైతాను ఒక కన్ను పోగొట్టుకుంది' అంటూ ఇరాన్ ప్రభుత్వ మీడియా జామ్-ఇ-జమ్ రాసింది.

దాంతో రష్దీ మీద దాడి వెనుక ఇరాన్ ఉండొచ్చనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్ విదేశాంగశాఖ ఇలా స్పందించింది.

సల్మాన్ రష్దీ

ఫొటో సోర్స్, Getty Images

రష్దీ మీద జరిగిన దాడిని బ్రిటన్, అమెరికా ఖండించాయి. 'అది రష్దీ మీద జరిగిన దాడి కాదు. భావ ప్రకటనా స్వేచ్ఛ మీద జరిగిన దాడి' అని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రతినిధి అన్నారు.

సల్మాన్ రష్దీ ఆరోగ్య పరిస్థితి ఇంకా ప్రమాదకరంగానే ఉందని, ఆయన కొడుకు తెలిపారు. 'ప్రాణాలతో పోరాడుతున్నప్పటికీ ఆయన ధైర్యం ఏ మాత్రం సడలలేదు. ఆయనలోని చతురత కూడా అలాగే ఉంది' అని రష్దీ కొడుకు అన్నారు.

'రష్దీ ఒక చేతిలోని నరాలు బాగా డ్యామేజ్ అయ్యాయి. కాలేయం కూడా బాగా దెబ్బతింది. ఆయనకు ఒక కన్ను పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి' అని రష్దీ ఏజెంట్ ఆండ్రూ తెలిపారు.

1988లో 'ది సాటానిక్ వెర్సెస్' పుస్తకం విడుదలైన తరువాత సల్మాన్ రష్దీ సుమారు 10 ఏళ్ల పాటు అజ్ఞాతంలో గడిపారు. మహ్మద్ ప్రవక్తను ఆయన అవమానించారని చాలా మంది ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వీడియో క్యాప్షన్, 10 లక్షల రూపాయల విలువైన రాఖీలు తయారుచేసిన సూరత్‌ జ్యూయెలర్లు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)