అఫ్గానిస్తాన్: తన కమాండర్ మాట కాదని తాలిబాన్‌లకు హెలికాప్టర్ అప్పగించిన పైలట్

మొహమ్మద్ ఎద్రిస్ మొమాంద్

ఫొటో సోర్స్, Mohammad Edris Momand

ఫొటో క్యాప్షన్, మొహమ్మద్ ఎద్రిస్ మొమాంద్

'నేను చేసిన పని కొందరికి నచ్చకపోవచ్చు. వారి అభిప్రాయాలు భిన్నంగా ఉండొచ్చు.. కానీ, నేను అందరికీ చెప్పేది ఒకటే. కన్నతల్లిలాంటి దేశాన్ని ఎవరూ మోసం చేయకూడదు'' అన్నారు మొహమ్మద్ ఎద్రిస్ మొమాంద్.

అఫ్గానిస్తాన్ మిలటరీ నుంచి అమెరికాలో శిక్షణ తీసుకున్న పైలట్ ఆయన.

కానీ, తాలిబాన్‌లు కాబుల్‌ను స్వాధీనం చేసుకున్న తరువాత ఆయన సంకీర్ణ సేనల నుంచి తప్పుకొని సొంతూరికి వెళ్లి తన హెలికాప్టర్‌ను తాలిబాన్లకు అప్పగించేశారు.

'అఫ్గానిస్తాన్‌ ఆస్తిని రక్షించడమే లక్ష్యంగా ఆ పని చేశాను' అని ఆయన ఏడాది తరువాత ఇప్పడు 'బీబీసీ'తో చెప్పారు.

ట్రైనింగ్‌లో మొహమ్మద్ ఎద్రిస్ మొమాంద్

ఫొటో సోర్స్, Mohammad Edris Momand

ఫొటో క్యాప్షన్, ట్రైనింగ్‌లో మొహమ్మద్ ఎద్రిస్ మొమాంద్

అమెరికాలో శిక్షణ

మొమాండ్ 2009లో అఫ్దానిస్తాన్ సైన్యంలో చేరారు. ఆ తరువాత అమెరికా వెళ్లి వెస్ట్ పాయింట్‌గా పిలిచే ఆ దేశ మిలటరీ అకాడమీలో నాలుగేళ్ల పాటు కఠోర శిక్షణ పొందారు. శిక్షణ తరువాత ఆయన పశ్చిమ అఫ్గానిస్తాన్‌లోని హేరత్‌లో పనిచేశారు. అక్కడ ఆయన రష్యా తయారీ ఎంఐ-17 హెలికాప్టర్ నడిపేవారు.

'2018 చివర్లో కొందరు యువ పైలట్లకు బ్లాక్ హ్యాక్ హెలికాప్టర్లు నడిపే పని అప్పగించారు. అప్పటి నుంచి నేను 'మజర్ ఎ షరీఫ్'లో బ్లాక్ హ్యాక్ పైలట్‌గా పనిచేస్తున్నాను' అన్నారు మొమాంద్. 9/11 దాడికి 20 ఏళ్లు పూర్తికావడానికి ముందే అఫ్గాన్ నుంచి అమెరికా సేనలను పూర్తిగా వెనక్కు రప్పిస్తున్నట్లు 2021లో జో బైడెన్ ప్రకటించేటప్పటికి మొమాంద్ 'మజర్ ఎ షరీఫ్'లో ఉన్నారు.

అయితే, ఆ తరువాత సేనలను వెనక్కిరప్పించే తేదీ ఇంకా ముందుకు.. అంటే ఆగస్ట్ 31గా నిర్ణయించింది అమెరికా. అదేసమయంలో అఫ్గాన్ సైన్యం పట్టుకోల్పోతూ తాలిబాన్లు మరిన్ని ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకోవడం మొదలైంది.

ఒక్కో రాష్ట్రాన్ని తమ అధీనంలోకి తీసుకుంటూ తాలిబాన్లు చివరకు ఆగస్ట్ 15న రాజధాని కాబుల్‌ను స్వాధీనం చేసుకున్నారు. తాము ప్రతిఘటన ఎదుర్కొంటున్న పంజ్‌షీర్‌ను కూడా సెప్టెంబర్ 7న తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారు.

మొహమ్మద్ ఎద్రిస్ మొమాంద్

ఫొటో సోర్స్, Mohammad Edris Momand.

ఫొటో క్యాప్షన్, మొహమ్మద్ ఎద్రిస్ మొమాంద్

దేశంలో అనిశ్చితి నెలకొనడంతో మొమాంద్ ఆర్నెల్ల పాటు 'మజర్ ఎ షరీఫ్'లో చేయాల్సిన పని ముందే ముగిసిపోయింది. దాంతో ఆయన వెనక్కు వచ్చేసి ఆగస్ట్ 14న కాబుల్ ఎయిర్‌పోర్ట్‌లో రిపోర్ట్ చేశారు.

అప్పటికే కీలక నేతలు, సైనికాధికారులు దేశం విడిచి వెళ్లిపోయారన్న వదంతుల నేపథ్యంలో అంతటా అయోమయ పరిస్థితులు కనిపిస్తున్నాయి.

తాలిబాన్లు కాబుల్ చుట్టూ ఉన్నారు. కాబుల్ విమానాశ్రయం అమెరికా సైన్యం అధీనంలో ఉంది.

'పైలట్లు అందరూ తమ వద్ద ఉన్నా హెలికాప్టర్లతో ఉజ్బెకిస్తాన్‌ వెళ్లిపోవాలని మా ఎయిర్‌ఫోర్స్ కమాండర్ ఆదేశించారు' అని మొమాంద్ ఆనాటి పరిస్థితిని గుర్తుచేసుకున్నారు.

కానీ, కమాండర్ ఆదేశాలు తనకు నచ్చలేదని, వాటిని పాటించరాదని తాను నిర్ణయించుకున్నానని మొమాంద్ చెప్పారు.

'దేశాన్ని మోసం చేయాలని నా కమాండర్ ఆదేశిస్తున్నారు.. అలాంటప్పుడు నేనెందుకు ఆ ఆదేశాలను పాటించాలి' అన్నారు మొమాంద్.

దాంతో తన కుటుంబాన్ని సంప్రదించానని.. ఉజ్బెకిస్తాన్ పారిపోవడాన్ని తన తండ్రి ఎంత మాత్రం ఇష్టపడలేదని.. దేశాన్ని వీడి వెళ్తే ఎన్నటికీ క్షమించబోనని తన తండ్రి చెప్పారని మొమాంద్ గుర్తుచేసుకున్నారు.

మొహమ్మద్ ఎద్రిస్ మొమాంద్

ఫొటో సోర్స్, Mohammad Edris Momand.

'ఆ హెలికాప్టర్ అఫ్గానిస్తాన్‌కు చెందినది కాబట్టి దాన్ని దేశం దాటించరాని నా తండ్రి చెప్పారు' అన్నారు మొమాంద్.

అప్పటికే మొమాంద్ సొంత రాష్ట్రం తాలిబాన్ల అధీనంలోకి వచ్చింది.. వారితో సంప్రదించగా మొమాంద్‌కు ఎలాంటి హాని తలపెట్టబోమని వారు హామీ ఇచ్చారు. దాంతో సొంతూరు కునార్‌కు హెలికాప్టర్లో వెళ్లిపోవాలని మొమాంద్ నిర్ణయించుకున్నారు.

అయితే, తన ప్లాన్ ఎవరికీ చెప్పలేదు. సాధారణంగా బ్లాక్ హాక్‌లో నలుగురు సిబ్బంది ఉంటారు. కానీ, వారంతా తనలాగే ఆలోచించాలని లేదు. వారికి కనుక తన ప్లాన్ తెలిస్తే ఇబ్బంది రావొచ్చు.

అదే జరిగితే తన ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. కాబట్టి మొమాంద్ అందుకు వేరే ప్లాన్ వేశారు. తన కమాండర్‌కు ఫోన్ చేసి హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య ఉందని..ఎగరలేదని చెప్పారు. అది విన్న మిగతా సిబ్బంది ఆ హెలికాప్టర్ నుంచి బయటకు దూకి ఉజ్బెకిస్తాన్ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న మరో హెలికాప్టర్ ఎక్కేశారు.

ఆ తరువాత బ్లాక్ హాక్ హెలికాప్టర్లన్నీ ఉజ్బెకిస్తాన్ బయలుదేరిపోయిన 30 నిమిషాల తరువాత మొమాంద్ తన హెలికాప్టర్ స్టార్ట్ చేసి సొంతూరు కునార్ దిశగా వెళ్లారు'

'అప్పటికి ఎయిర్ ట్రాఫిక్ అంతా అమెరికా సైన్యమే చూస్తోంది.. దాంతో నేను టేకాఫ్‌కు కొంచెం ముందు రేడియోలో వారికి ఉజ్బెకిస్తాన్ వెళ్తున్నట్లు సమాచారమిచ్చాను. క్లియరెన్స్ రాగానే టేకాఫ్ అయ్యాను. ఆ తరువాత రేడియో ఆపేసి కునార్ వైపు వెళ్లాను' అని చెప్పారు మొమాంద్.

'కునార్‌లో మా ఇంటికి సమీపంలోనే ల్యాండ్ అయ్యాను. తాలిబన్ల నుంచి హామీ దొరికిన తరువాత హెలికాప్టర్‌ను అక్కడి నుంచి ఇంకోచోటికి తరలించాను. అక్కడ గతంలో హెలికాప్టర్లకు ఇంధనం నింపేవారు.. నేను చేసిన పనికి స్నేహితులు, కుటుంబసభ్యుల నుంచి మద్దతు దొరికింది'' అన్నారు మొమాంద్.

తాను చేసిన పనికి ఏమాత్రం బాధపడడం లేదని మొమాంద్ అన్నారు. కుటుంబంతో కలిసి అఫ్గానిస్తాన్ వదిలివెళ్లిపోయే అవకాశం ఆయనకు వచ్చినా స్వదేశంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు మొమాంద్.

'అమెరికన్ అడ్వైజర్ నుంచి నాకు మూడుసార్లు మెసేజ్ వచ్చింది.. హెలికాప్టర్ తేలేకపోయినా రోడ్డుమార్గంలోనైనా కుటుంబంతో కలిసి వచ్చేస్తే దేశం దాటించే ఏర్పాటు చేస్తామన్నారు. కానీ, నేను అందుకు అంగీకరించలేదు' అన్నారు మొమాంద్.

మొహమ్మద్ ఎద్రిస్ మొమాంద్

ఫొటో సోర్స్, Mohammad Edris Momand

అఫ్గాన్ ఎయిర్‌ఫోర్స్..

2021 జూన్ చివరి నాటికి అఫ్గాన్ ఎయిర్‌ఫోర్స్ 167 ఎయిర్‌క్రాఫ్ట్‌లను నడిపేది. అందులో విమానాలు, అటాక్ హెలికాప్టర్లు ఉండేవి. వీటిలో కొన్నిటికి మొమాంద్ సహచరులు నడిపేవారు.

2021 ఆగస్ట్ 16 నాటి శాటిలైట్ చిత్రాల ప్రకారం.. ఉజ్బెకిస్తాన్‌లోని టెర్మెజ్ విమానాశ్రయం అప్పటికి అఫ్గానిస్తాన్‌కు చెందిన సుమారు 25 ఎయిర్‌క్రాఫ్ట్‌లకు ఆశ్రయమిచ్చింది.

అందులో ఎంఐ-17, ఎంఐ-25, బ్లాక్ హాక, ఏ-29, సీ208 రకాల హెలికాప్టర్లు ఉన్నాయి.

అఫ్గానిస్తాన్‌లో మిగిలిపోయిన ప్లేన్‌లు, హెలికాప్టర్లకు చేయగలిగినంత నష్టం చేశాయి అమెరికా దళాలు. పనిచేసే స్థితిలో ఉన్నవి ఎన్నో చెప్పలేని స్థితి.

మొహమ్మద్ ఎద్రిస్ మొమాంద్

ఫొటో సోర్స్, Mohammad Edris Momand.

'ఉపయోగించగలిగే స్థితిలో ఉన్న 7 బ్లాక్ హాక్ హెలికాప్టర్లున్నాయి. అరకొర వనరులు ఉన్న అఫ్గాన్ ఇంజినీర్లు వాటికి మరమ్మతులు చేయగలరు. క్రమంగా మిగతా బ్లాక్‌హాక్‌ హెలికాప్టర్లనూ వినియోగంలోకి తేగలం అనిపించింది' అన్నారు మొమాంద్.

హెలికాప్టర్లతో ఉజ్బెకిస్తాన్ వెళ్లిన తన సహచరులంతా దేశాన్ని మోసగించినట్లేనంటారు మొమాంద్.

అవన్నీ తిరిగి అఫ్గానిస్తాన్ వస్తాయని తనకు నమ్మకం లేదన్నారాయన.

ఒక హెలికాప్టర్ పైలట్ ట్రైనింగ్‌కు 60 లక్షల డాలర్లు ఖర్చవుతుందని అమెరికాలో ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలో మొమాంద్‌కు తెలిసింది. నాలుగేళ్ల శిక్షణ కాలంలో ఆయన అఫ్గానిస్తాన్‌లోని తన కుటుంబాన్ని కలిసేందుకు రాలేదు. అమెరికాలోనే ఉండిపోయారు.

Mohammad Edris Momand

ఫొటో సోర్స్, Mohammad Edris Momand

నిజానికి తాలిబాన్ల వ్యతిరేక పోరాటం కోసం మొమాంద్‌కు అప్పుడు శిక్షణ ఇచ్చారు. కానీ, ఇప్పుడాయన తాలిబాన్ల నియంత్రణలోని ప్రభుత్వం కోసం భ్లాక్ హాక్ హెలికాప్టర్ నడుపుతున్నారు.

'ప్రభుత్వాలు మారుతాయి. కానీ, రాజకీయాల్లో మిలటరీ జోక్యం చేసుకోరాదు. దేశానికి సేవ చేస్తేనే ప్రజలు మమ్మల్ని అభిమానిస్తారు' అన్నారాయన.

'జీవితాంతం నేను నా దేశానికే సేవ చేస్తాను' అని చెప్పారు మొమాంద్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)