అఫ్గానిస్తాన్: నిన్నటి దాకా తుపాకులు పట్టుకుని తిరిగాడు. ఇవాళ అర్బన్ డెవలప్‌మెంట్ వ్యవహారాలు చూస్తున్నాడు

అయినుద్దీన్
ఫొటో క్యాప్షన్, అయినుద్దీన్

గత ఆగస్టులో అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్లు అధికారంలోకి రావడంతో చాలా మంది ప్రజల జీవితాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఏడాది కాలంలో లక్షల మంది అఫ్గాన్‌వాసులు దేశాన్ని వదిలి పరారయ్యారు. చాలా బాలికల పాఠశాలలను మూసివేయించారు. మరోవైపు పేదరికం కూడా పెరుగుతోంది.

అయితే, గత నాలుగు దశాబ్దాలలో తొలిసారిగా ఇక్కడ హింస తగ్గినట్లు కనిపిస్తోంది. అవినీతిని కూడా అదుపు చేయగలిగినట్లు తాలిబాన్లు చెబుతున్నారు. తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పటి పరిస్థితులను బీబీసీ ప్రతినిధి సికెందర్ కిర్మాణీ దగ్గరుండి గమనించారు. గత ఏడాది కలిసిన తాలిబాన్ ప్రతినిధులతో మళ్లీ ఇప్పుడు ఆయన మాట్లాడారు.

అయినుద్దీన్
ఫొటో క్యాప్షన్, అయినుద్దీన్

కొత్త జీవితం

గత ఏడాది వేసవిలో తాలిబాన్లు వరుసగా కొన్ని ప్రాంతాలపై పట్టు సాధించడం మొదలుపెట్టారు. అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనల ఉపసంహరణ వార్తల నడుమ అప్పటి ప్రభుత్వ ఆధీనంలోని ప్రాంతాలను వీరు ఒక్కొక్కటిగా వెనక్కి తీసుకున్నారు. అప్పుడే ఉత్తర బాల్ఖ్ జిల్లాలోని తాలిబాన్ మిలిటెంట్ అయినుద్దీన్‌ను మేం కలిశాం.

మేం మాట్లాడేటప్పుడు ఆయన కళ్లలో ఎలాంటి హావభావాలు కనిపించలేదు. చూడటానికి చాలా కఠినంగా ఆయన అనిపించారు. ‘‘ప్రజలకు ఎలాంటి హాని తలపెట్టకుండా ముందుకు వెళ్లేందుకు మేం చాలా ప్రయత్నిస్తున్నాం. కానీ, ఇది పోరాటం, ప్రజలు కూడా చనిపోతారు’’అని ఆయన వ్యాఖ్యానించారు. హింసను మీరు ఎలా వెనకేసుకొస్తున్నారు? అని ఆయన్ను ప్రశ్నించాను. అయితే, ‘‘అఫ్గానిస్తాన్‌లో ఇస్లామిక్ వ్యవస్థను తప్పా.. వేరే దేన్నీ అంగీకరించబోం’’అని ఆయన వ్యాఖ్యానించారు.

మా సంభాషణ చాలా స్వల్పంగానే ముగిసింది. అప్పటికి భీకర పోరాటం నడుస్తోంది. ప్రభుత్వం వైమానిక దాడులు చేస్తుందనే ముప్పు అక్కడ అందరినీ వెంటాడింది.

కొన్ని నెలల తర్వాత, ఇక్కడ తాలిబాన్ ప్రభుత్వం ఏర్పాటైంది. అఫ్గాన్-ఉజ్బెకిస్తాన్ సరిహద్దుల్లోని అమూదర్యా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఇంటిలో భోజనానికి మేం కూర్చున్నాం. ఇదివరకు తాను తాలిబాన్ స్నైపర్‌గా పనిచేశానని అయినుద్దీన్ మరోసారి నాకు గుర్తుచేశారు. దాదాపు పదికిపైగా ఘటనల్లో ఆయన గాయపడ్డారు.

తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత, బాల్ఖ్ ప్రావిన్స్‌లోని ల్యాండ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ విభాగానికి ఆయన డైరెక్టర్‌గా నియమితులయ్యారు. మీరు ‘‘జిహాద్‌ను మిస్ అవుతున్నారా? ఎందుకంటే మీరు చాలా ఏళ్లపాటు పోరాడారు కదా’’అని ఆయన్ను నేను అప్పటిలో ప్రశ్నించాను. దీనికి అవునని ఆయన సమాధానం ఇచ్చారు.

తాలిబాన్

సంవత్సరం తర్వాత, ఇస్లామిక్ ఎమిరేట్ జెండా కనిపిస్తున్న టేబుల్‌ ముందు ఆయన కూర్చుంటూ కనిపించారు. కొత్త జీవితానికి ఆయన అలవాటు పడినట్లు అనిపిస్తోంది. తన పదవి ప్రాధాన్యాన్ని ఇప్పుడు తాను గుర్తించానని ఆయన అన్నారు.

‘‘మేం మా శత్రువులతో తుపాకులు పట్టుకుని పోరాడాం. దేవుడి దయ వల్ల వారిని మేం ఓడించగలిగాం. ఇప్పుడు మా సొంత ప్రజలకు పెన్నులతో సేవ చేస్తున్నాం’’అని అయినుద్దీన్ అన్నారు. పోరాటంలో ఉండేటప్పుడు సంతోషంగా ఉండేవాడినని, ఇప్పుడు కూడా ఆనందంగానే ఉన్నానని తెలిపారు.

అయితే, ఒకప్పుడు తుపాకులు పట్టుకొని పోరాడిన కొందరు తాలిబాన్లు తమ కొత్త పదవుల విషయంలో సంతృప్తి వ్యక్తం చేయలేదు.

ప్రస్తుతం అయినుద్దీన్ కింద పనిచేస్తున్న సిబ్బందిలో చాలా మందిని ఇదివరకటి ప్రభుత్వమే నియమించింది. కొన్నిచోట్ల మాత్రం ఇదివరకటి ప్రభుత్వ ఉద్యోగాలను తాలిబాన్ ఫైటర్లు బలవంతంగా తీసేసుకున్నారని వార్తలు వచ్చాయి.

అయితే, ఈ పదవికి తగిన అర్హతలు మీకు ఉన్నాయా? అని అయినుద్దీన్ నేను అడిగాను.

‘‘సైనిక విద్యతోపాటు మోడర్న్ ఎడ్యుకేషన్‌లోనూ నేను చదువుకున్నాను. సైనిక నేపథ్యమైనప్పటికీ, మేం మెరుగ్గా పనిచేయగలుగుతున్నాం. ఇదివరకటి ప్రభుత్వం కంటే మంచి ఫలితాలను సాధిస్తున్నాం’’అని ఆయన అన్నారు.

అయితే, పోరాటంతో పోల్చినప్పుడు పరిపాలన కాస్త కష్టంగా ఉంటుందని ఆయన చెప్పారు. ‘‘యుద్ధం కొంచెం తేలిక. ఎందుకంటే అక్కడ మనకు బాధ్యతలు తక్కువగా ఉంటాయి’’అని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం పోరాటం నుంచి పాలకులుగా మారడంలో తాలిబాన్లకు కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి.

సమీయుల్లా
ఫొటో క్యాప్షన్, సమీయుల్లా

ఇది పోరాట గ్రామం..

అఫ్గాన్‌లోని ప్రధాన నగరాల్లో బాంబుల విధ్వంసంపై మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. అయితే, అంతకంటే భీకర పోరాటాలు కొన్ని గ్రామాల్లో చోటుచేసుకున్నాయి.

తాలిబాన్లు, అఫ్గాన్ సైన్యం మధ్య సామాన్యులు చిక్కుకున్నారు. కొందరు ప్రజలు ఈ రెండు వర్గాల నుంచి విముక్తి కల్పించాలని, శాంతిని నెలకొల్పాలని మీడియా ముందు వేడుకున్నారు కూడా.

అలా భీకర పోరాటం జరిగిన ప్రాంతాల్లో కాబూల్‌కు తూర్పుగా లోగర్ ప్రావిన్స్‌లోని పడ్‌ఖ్వాబ్ గ్రామం కూడా ఒకటి. అక్కడకు మేం వెళ్లినప్పుడు.. అప్పటి యుద్ధ ఆనవాళ్లను ప్రజలు మాకు చూపించారు. కొన్ని వారాల ముందు వరకు వారి జీవితాలపై ఆ యుద్ధం చాలా ప్రభావం చూపింది.

‘‘పరిస్థితి చాలా దారుణంగా ఉండేది’’అని టైల్స్ తయారుచేసే సమీవుల్లా చెప్పారు. ‘‘మేం ఏ పనీ చేయలేకపోయేవాళ్లం. దుకాణాలు, బజారులకు కూడా వెళ్లలేకపోయేవాళ్లం. దేవుడి దయ వల్ల ఇప్పుడు పరిస్థితులు సద్దుమణిగాయి’’అని ఆయన అన్నారు.

పడ్‌ఖ్వాబ్ లాంటి గ్రామాల్లో స్థానిక సంప్రదాయాలకు తాలిబాన్ విలువలకు కాస్త దగ్గర పోలికలు కనిపిస్తాయి. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలోనూ ఇక్కడి మహిళలు బురఖాలు వేసుకునేవారు. స్థానిక మార్కెట్‌కు రావడానికి కూడా వారు ధైర్యం చేసేవారు కాదు.

తాలిబాన్

ఫొటో సోర్స్, Getty Images

కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ..

గత వారం పడ్‌ఖ్వాబ్ గ్రామాన్ని మేం చూడటానికి వచ్చినప్పుడు.. బజారులో గోడలకు తూటాలు చేసిన గొయ్యిలను ప్రజలు పూడ్చేశారు. పరిస్థితులు సద్దుమణగడంపై చాలా మంది ప్రజలు సంతోషం వ్యక్తంచేశారు.

‘‘ఇదివరకు రైతులతోపాటు చాలా మంది ప్రజలు పోరాటంలో గాయపడేవారు. చాలా మంది మరణించారు కూడా. దుకాణదారులపై కూడా కాల్పులు జరిగాయి’’అని టైలర్‌గా పనిచేస్తున్న గుల్ మహమ్మద్ చెప్పారు.

అమెరికా సేనల ఉపసంహరణ తర్వాత అఫ్గానిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఎందుకంటే ప్రభుత్వ వ్యయంలో 75 శాతం నిధులకు విదేశీ విరాళాలే ఇక్కడ ఆధారం. కానీ, నగదును బదిలీ చేసేందుకు అంతర్జాతీయ బ్యాంకులు ప్రస్తుతం నిరాకరిస్తున్నాయి. ఎందుకంటే ఈ బదిలీలకు అంగీకరిస్తే, ఆంక్షలను ఉల్లంఘించినట్లేనని భయపడుతున్నాయి.

అఫ్గాన్ సెంట్రల్ బ్యాంకు రిజర్వులు స్తంభించిపోవడానికి అమెరికానే కారణమని తాలిబాన్లు ఆరోపిస్తున్నారు. అయితే, మహిళల విషయంలో తాలిబాన్లు సానుకూల విధానాలను అనుసరిస్తే పరిస్థితులు మళ్లీ సాధారణానికి వచ్చే అవకాశముందని పశ్చిమ దేశాల దౌత్యవేత్తలు చెబుతున్నారు.

ప్రస్తుత సంక్షోభం నడుమ పట్టణ ప్రాంతాల్లోని మధ్యతరగతి కుటుంబాల ఆదాయం గణనీయంగా పడిపోయింది. మొదట్లో ప్రభుత్వ ఉద్యోగులకు నెలలపాటు జీతాలు ఇవ్వలేదు. ఆ తర్వాత జీతాలను తగ్గించారు. దీంతో అప్పటికే అత్తెసరు జీతాలతో ఇబ్బంది పడేవారు కుటుంబాలను పోషించడం మరింత భారమైంది.

వీడియో క్యాప్షన్, ఇక్కడ పాపుపుణ్యాల శాఖ అధికారులు ప్రతిరోజూ ప్రజల పాపాలు లెక్కిస్తారు

పడ్‌ఖ్వాబ్‌లో నిత్యవసర సరకుల ధరలు విపరీతంగా పెరిగాయని ప్రజలు చెబుతున్నారు. ‘‘దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారు. ఇక్కడ చాలా మందికి చేయడానికి పని దొరకడం లేదు’’అని సమీయుల్లా చెప్పారు. ‘‘అందరూ విదేశాల్లోని బంధువులపై ఆధారపడుతున్నారు’’అని ఆయన వివరించారు.

‘‘మాంసం, పళ్లను పక్కన పెట్టేయండి.. ప్రజలు కనీసం పిండిని కూడా కొనుక్కోలేకపోతున్నారు’’అని గుల్ మహమ్మద్ అన్నారు.

‘‘అప్పట్లో చాలా డబ్బులు ఉండేవి. నేడు మమ్మల్ని పూర్తిగా అణచివేస్తున్నారు’’అని సమీయుల్లా అన్నారు.

గ్రామాల్లో ప్రజలను వేధిస్తున్నట్లు తాలిబాన్లపై ఆరోపణలు వస్తున్నాయి. అయితే, ప్రజలు బహిరంగంగా దీనిపై మాట్లాడేందుకు ముందుకు రావడం లేదు.

కొందరేమో తాలిబాన్ల ప్రభుత్వ ఏర్పాటుతో తమ జీవితాలు మెరుగుపడాలని ఆశిస్తున్నారు. మరికొందరు తాలిబాన్ ప్రభుత్వంపై చాలా ఆందోళనతో ఉన్నారు.

యూట్యూబర్ రొయినా
ఫొటో క్యాప్షన్, యూట్యూబర్ రొయినా

‘‘యూట్యూబ్‌లో వీడియోలు చేస్తున్నా..’’

గత ఏడాది కాబూల్‌లో తాలిబాన్ ఫైటర్లు అడుగుపెట్టినప్పుడు చాలా మంది ప్రజలు ఆందోళన వ్యక్తంచేశారు. ఎందుకంటే ఈ నగరంలో ఏళ్లుగా ఆత్మాహుతి దాడులను తాలిబాన్ చేపట్టింది. ఇప్పుడు కొంతమంది మహిళలు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అలా వస్తున్న వారిలో యూట్యూబర్ రొయినా ఒకరు.

‘‘పురుషులు, మహిళలకు సమానంగా హక్కులుండాలి’’అని గత ఆగస్టులో ఆమె అన్నారు. యూట్యూబ్ వీడియోలు చేయగలుగుతానో లేదోనని అప్పట్లో ఆమె ఆందోళన వ్యక్తంచేశారు.

అఫ్గాన్ ప్రజలతోపాటు అంతర్జాతీయంగానూ తాలిబాన్లపై భయం వ్యక్తం అవుతోంది. నిజానికి కొందరు తాలిబాన్ పాలకులు కూడా తమ పార్టీ అధినాయకత్వాన్ని చూసి భయపడుతున్నారు.

అయితే, 1990ల్లో తాలిబాన్ ప్రభుత్వంలా కాకుండా ప్రస్తుతం చిన్న వయసు బాలికలను చదువుకునేందుకు అనుమతిస్తున్నారు. మరోవైపు యూనివర్సిటీలో ప్రస్తుతమున్న అబ్బాయిలు, అమ్మాయిలను విడిగా ఉంచడంపై కొత్త నిబంధనలు కూడా తీసుకొచ్చారు. కానీ, టీనేజీ అమ్మాయిలను సెకండరీ పాఠశాలల్లో చదువుకునేందుకు అనుమతించేందుకు తాలిబాన్లు సిద్ధంగా లేరు. గత 20ఏళ్లలో ఇక్కడ మహిళా హక్కుల్లో కనిపించిన పురోగతి మళ్లీ వెనక్కి వెళ్తున్నట్లు అనిపిస్తోంది.

వీడియో క్యాప్షన్, పాడైపోయిన రొట్టె ముక్కలు తిని బతుకుతోన్న అఫ్గాన్ ప్రజలు

అలానే విద్య, ఆరోగ్య రంగం మినహా ఇతర ప్రభుత్వ విభాగాల్లోని మహిళలను పూర్తిగా ఇంటికే పరిమితం చేశారు. ప్రైవేటు సంస్థల్లో పనిచేసే కొద్దిమంది మహిళలు మాత్రం తమ ఉద్యోగాలు చేసుకుంటున్నారు.

అయితే, రొయినా ఇప్పటికీ వీడియోలు చేస్తున్నారు. ముఖానికి బురఖా వేసుకోనప్పటికీ, తలకు కట్టుకునే వస్త్రాన్ని మాత్రం జాగ్రత్తగా కట్టుకుని వీడియోల్లో ఆమె కనిపిస్తున్నారు.

తను కాబూల్‌లో తిరిగేటప్పుడు ఇదివరకటి కంటే ఎక్కువ సంప్రదాయ దుస్తులను వేసుకుంటున్నారు. మహిళలు తప్పనిసరిగా బురఖా వేసుకోవాలని తాలిబాన్లు స్పష్టంచేశారు. పెద్ద నగరాల్లో తలను మాత్రమే మహిళలు వస్త్రంతో కప్పుకుంటున్నారు. కానీ, చిన్నచిన్న పట్టణాలు, గ్రామాల్లో తాలిబాన్ల ఆంక్షలు పూర్తిస్థాయిలో అమలవుతున్నాయి.

తాలిబాన్ల గురించి మాట్లాడేటప్పుడు రొయినా పదాలను జాగ్రత్తగా ఎంచుకుంటూ అప్రమత్తంగా కనిపించారు. ‘‘మహిళలు, అమ్మాయిలు హిజాబ్ వేసుకుంటున్నారు. అయితే, ఇస్లాం ప్రసాదించిన అన్ని స్వేచ్ఛలనూ వారికి కల్పించాలి. వారి హక్కులను వెనక్కి తీసుకోకూడదు. వారిని చదువుకునేందుకు అనుమతించాలి’’అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)