FIFA : ఇండియాలో జరగాల్సిన అండర్-17 మహిళల వరల్డ్ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంటు ఆగిపోయే పరిస్థితి ఎందుకొచ్చింది?

ఫొటో సోర్స్, INDRANIL MUKHERJEE / AFP
- రచయిత, జాహ్నవీ మూలే
- హోదా, బీబీసీ మరాఠీ
భారత ఫుట్‌బాల్ అసోసియేషన్‌ను సస్పెండ్ చేస్తూ ఫిఫా తీసుకున్న నిర్ణయంతో.. భారతదేశంలో ఈ క్రీడ భవిష్యత్తు మీద, ఈ క్రీడాకారుల భవిష్యత్తు మీద చీకట్లు కమ్మాయి.
ఫిఫా సోమవారం రాత్రి ప్రకటించిన ఈ నిషేధం కారణంగా.. ఈ ఏడాది అక్టోబర్ 11వ తేదీ నుంచి భారతదేశంలో ప్రారంభం కావలసివున్న మహిళల అండర్-17 ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను భారత్ నిర్వహించే అవకాశం ఉండకపోవచ్చు.
ఈ సస్పెన్షన్‌ను తొలగించే విధంగా, వరల్డ్ కప్ టోర్నమెంట్ ప్రణాళిక ప్రకారం కొనసాగే విధంగా 'క్రియాశీల చర్యలు' చేపట్టాలంటూ సుప్రీంకోర్టు బుధవారం నాడు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
''థర్డ్ పార్టీ అనవసర జోక్యం'' అనే కారణంతో ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ను రద్దు చేస్తున్నట్లు ఫిఫా చెప్పింది. దీనికి ముందు గత మే నెలలో ఏఐఎఫ్ఎఫ్‌ను భారత సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ క్రీడ పర్యవేక్షణ కోసం ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది.
అయితే.. ఫిఫాలో సభ్యత్వం ఉన్న ఫెడరేషన్లలో న్యాయపరమైన, రాజకీయపరమైన జోక్యాలు ఉండటానికి వీలులేదని ఫిఫా నిబంధనలు చెప్తున్నాయి.
ఫిఫా సస్పెన్షన్ నిర్ణయం.. దేశీయ టోర్నమెంట్లకు వర్తించబోదు. కానీ అంతర్జాతీయ మ్యాచ్‌లు, టోర్నమెంట్లలో భారత్ పాలుపంచుకోవటం మీద ఈ సస్పెన్షన్ ప్రభావం చూపుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
త్వరలో జరగబోయే ప్రపంచ కప్ పోటీల్లో పాల్గొనటానికి ఉవ్విళ్లూరుతున్న యువ క్రీడాకారిణిలకు ఈ సస్పెన్షన్ శరాఘాతమే అవుతుంది.
నిజానికి ఈ టోర్నమెంటును భారతదేశం 2020 లోనే నిర్వహించాల్సి ఉండింది. కానీ కోవిడ్ మహమ్మారి వల్ల ఈ క్రీడా పోటీల నిర్వహణను వాయిదా వేసింది. ఈ టోర్నమెంటుకు ఆతిథ్యమిస్తున్నందున ఈ పోటీల్లో భారత్ కూడా పాల్గొనటానికి అవకాశం దక్కింది.
కానీ ఇప్పుడు భారత ఫుట్‌బాల్ అసోసియేషన్‌ను ఫిఫా సస్పెండ్ చేసిందన్న వార్త ఫుట్‌బాల్ క్రీడాకారులను, అభిమానులను తీవ్ర నిరుత్సాహానికి గురి చేసింది.
''ప్రపంచ కప్ టోర్నమెంటును చూడాలని నేను చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నా. ఆ టోర్నీ నిర్వహణ భారతదేశానికి గొప్ప గౌరవాన్ని ఇవ్వగలదు. కానీ ఆ పోటీలు జరగకపోవచ్చునన్న ఆలోచన విచారం కలిగిస్తోంది'' అని ముంబై నగరానికి చెందిన 17 ఏళ్ల క్రీడాకారిణి సాయి పేర్కొన్నారు. ఆమె జట్టులోకి ఎంపిక కాలేకపోయారు.
భారత మహిళల ఫుట్‌బాల్ ఇటీవలి సంవత్సరాల్లో నాటకీయంగా పురోగమించింది.

ఫొటో సోర్స్, Getty Images
కేరళ రాష్ట్రానికి చెందిన ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ టీమ్ 'గోకులం కేరళ ఎఫ్‌సీ'.. గత ఏడాది ప్రతిష్టాత్మక ఏషియన్ ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ వుమెన్స్ క్లబ్ చాంపియన్‌షిప్‌లో ఆడింది. ఈ పోటీల్లో ఆడిన తొలి భారత క్లబ్‌గా ఆ జట్టు నిలిచింది.
ఈ జట్టు ఈ ఏడాది జరగబోయే టోర్నమెంట్‌లో పాల్గొనటం కోసం ప్రస్తుతం ఉజ్బెకిస్తాన్‌లో ఉంది. ఆ టోర్నమెంటు ఈ వారంలో ప్రారంభం కానుంది. ఈ పోటీల్లో తాము పాల్గొంటామనే ఇంకా ఆశిస్తున్నట్లు టీమ్ ప్రెసిడెంట్ మంగళవారం నాడు చెప్పారు.
విదేశీ ఫుట్‌బాల్ క్లబ్‌లలో ఆడిన బాలాదేవి, ఆదితి చౌహాన్ వంటి ప్లేయర్లు భారతదేశంలో గణనీయమైన సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు. దేశంలో ఫుట్‌బాల్ క్రీడ పట్ల ఆసక్తిని పెంచుతున్నారు.
కానీ ఫిఫా నిషేధం దీని మీద ప్రభావం చూపవచ్చు. క్రీడాకారుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయవచ్చు.
''అక్టోబర్‌లో జరగబోయే టోర్నమెంటు వరల్డ్ కప్ టోర్నమెంటు కాబట్టి.. ఈ క్రీడకు చాలా ప్రాచుర్యం లభించేది. అందరి కళ్లూ భారతదేశం మీద, భారత క్రీడాకారుల మీద ఉండేవి. ఎంతోమంది బాలికలు ఈ క్రీడలను వీక్షించటం ద్వారా ఈ ఆట నేర్చుకోవాలనే ఆసక్తి, స్ఫూర్తి పొందేవారు'' అని సాయి పేర్కొన్నారు.
స్వయం ప్రతిపత్తి విషయంలో ఫిఫా నిబంధన మేరకు సస్పెండ్ అయిన తొలి దేశం భారతదేశం కాదు.
గతంలో బెనిన్, కువైట్, నైజీరియా, ఇరాక్ వంటి దేశాల మీద కూడా ఇలాంటి చర్యలు చేపట్టారు. గత ఏడాది పాకిస్తాన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను కూడా ఇదే నిబంధన కింద నిషేధించారు. అయితే.. ఈ ఏడాది జూలైలో ఆ నిషేధాన్ని తొలగించారు.

ఫొటో సోర్స్, Getty Images
భారతదేశంలో ఏఐఎఫ్ఎఫ్.. శతాబ్దానికి పైగా ఫిఫా మండలి మాజీ సభ్యుడు ప్రఫుల్ పటేల్ సారథ్యంలో ఉండింది. పార్లమెంటు సభ్యుడైన ప్రఫుల్ ఫటేల్.. దేశంలో ముఖ్యమైన ప్రతిపక్ష పార్టీల్లో ఒకటైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా.
ప్రఫుల్ పటేల్ ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడిగా మూడు పర్యాయాలు పనిచేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయన మళ్లీ ఆ పదవి చేపట్టటానికి అనర్హుడు.
కానీ ఆయన పదవీ కాలం 2020 డిసెంబర్‌లో ముగిసినా కూడా.. ఏఐఎఫ్ఎఫ్ ఎన్నికలు నిర్వహించనందున ప్రఫుల్ పటేల్ ఫెడరేషన్ అధ్యక్ష పదవిలో కొనసాగారు.
దీని కారణంగా ఈ ఏడాది మార్చిలో ఈ ఫెడరేషన్‌ను సుప్రీంకోర్టు రద్దుచేసింది. దీంతో ప్రఫుల్ పటేల్ అధ్యక్ష పదవి నుంచి దిగిపోయారు. ఈ నేపథ్యంలో ఫుట్‌బాల్ క్రీడ మీద పర్యవేక్షణ, పరిపాలన కోసం సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని నియమించింది.
ఫుట్‌బాల్ క్రీడ మీద పర్యవేక్షణకు త్రిసభ్య కమిటీని నియమిస్తూ ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించి, ఏఐఎఫ్‌ఎఫ్ రోజువారీ కార్యకలాపాల మీద పూర్తి నియంత్రణ ఏఐఎఫ్ఎఫ్ పాలక మండలికి తిరిగి అందినట్లయితే.. ఏఐఎఫ్ఎఫ్ మీద సస్పెన్షన్‌ను తొలగిస్తామని ఫిఫా ఒక ప్రకటనలో చెప్పింది.
భారత యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖతో ఫిఫా నిర్మాణాత్మక సంప్రదింపులు జరుపుతోందని.. ఈ ఉదంతానికి సానుకూల పరిష్కారం లభిస్తోందని తాము ఆశిస్తున్నామని ఫిఫా పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
భారతదేశంలో 2.3 కోట్ల మందికి పైగా జనం ఫుట్‌బాల్ వీక్షిస్తారని మీడియా కన్సల్టింగ్ సంస్థ ఆర్మాక్స్ ఇటీవల నిర్వహించిన ఒక సర్వే చెప్తోంది. కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఫుట్‌బాల్ క్రీడకు విపరీతమైన ప్రజాదరణ ఉంది. ఆ రెండు రాష్ట్రాల్లో స్థానిక ఫుట్‌బాల్ క్లబ్‌లు కూడా ఉన్నాయి.
ఫిఫా తన నిర్ణయం మీద పునరాలోచన చేస్తుందని తాను ఆశిస్తున్నట్లు బెంగళూరుకు చెందిన ఫుట్‌బాల్ అభిమాని అమీషా ఖాన్ చెప్పారు.
''ఇండియాలో మహిళల ఫుట్‌బాల్‌కు పెద్దగా ఫాలోయింగ్ లేదు. కానీ ఇటీవలి కాలంలో పరిస్థితులు మారాయి. ప్రపంచ కప్ టోర్నీలో బాలాదేవి వంటి ఫుట్‌బాలర్లు ఆడటం చూసి మేం చాలా ఎగ్జైట్ అయ్యాం. ఈ నిషేధం ఎంతో కాలం ఉండదని నేను ఆశిస్తున్నా''అని ఆమె పేర్కొన్నారు.
ఈ నిషేధం నిర్ణయం చాలా దురదృష్టకరమైన కఠిన నిర్ణయమని భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ భాయ్‌చుంగ్ భూటియా అభివర్ణించారు.
''అయితే అదే సమయంలో మన వ్యవస్థను సరైన గాడిలో పెట్టటానికి కూడా ఇది మంచి అవకాశమనీ నేను అనుకుంటున్నా'' అని ఆయన విలేఖరులతో చెప్పారు.
ఏఐఎఫ్ఎఫ్ ఎన్నికలు నిర్వహించిన తర్వాత ఈ సస్పెన్షన్‌ను తొలగిస్తారని తాను ఆశాభావంతో ఉన్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ఇంటిపై జాతీయ జెండా ఎగరేశారా, మరి ఇప్పుడు దాన్ని ఏం చేయాలి, ఫ్లాగ్ కోడ్ ఏం చెబుతోంది
- పీరియడ్ రోజుల చార్టులను ఈ అమ్మాయిలు ఇంటి తలుపులపై ఎందుకు పెడుతున్నారు?
- చీతా: ఇండియాలో 50 ఏళ్ల కిందట అంతరించిపోయిన మృగం మళ్లీ వస్తోంది
- మీరు డార్క్ చాక్లెట్‌ను ఇష్టంగా తింటారా, అది ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా?
- ఆహారం: నెయ్యి తింటే కొవ్వు పెరుగుతుందా... ఈ ప్రచారంలో నిజమెంత?
- ఆంధ్రప్రదేశ్ వెదర్‌మ్యాన్: పాతికేళ్ల యువకుడు సొంతంగా వాతావరణ సమాచారం ఎలా ఇస్తున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










