భారత మహిళా ఫుట్‌బాల్‌లో చరిత్ర సృష్టించిన క్రీడాకారిణి బాలాదేవి

ఫొటో సోర్స్, Twitter
బాలాదేవి... భారత్‌కు చెందిన ఈ ఫుట్‌బాల్ క్రీడాకారిణి చరిత్ర సృష్టించారు.
స్కాట్లాండ్‌కు చెందిన ఫుట్‌బాల్ క్లబ్ రేంజర్స్ ఎఫ్‌సీ తరఫున 18 నెలల పాటు ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్న ఆమె అలాంటి ఘనత సాధించిన తొలి భారతీయ ఫుట్‌బాల్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందారు.
బీబీసీ ప్రతినిధి జాహ్నవి మూలె ఆమెతో మాట్లాడారు.. బాలాదేవి ప్రస్థానం, ఆమె లక్ష్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఒకప్పుడు భారత మహిళా ఫుట్‌బాల్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న బాలాదేవికి భారత్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఫుట్‌బాల్ క్రీడాకారిణిగానూ రికార్డు ఉంది. ''భారతదేశం గర్వపడేలా చేస్తాను'' అని ఈ 29 ఏళ్ల క్రీడాకారిణి బీబీసీతో చెప్పింది.


తనకు 15 ఏళ్ల వయసున్నప్పటి నుంచి భారత్ తరఫున ఆడుతున్నానని.. ఇప్పటికీ ఏ మ్యాచ్ ఆడినా అదే తన తొలి మ్యాచ్ అన్నట్లుగా ఆడతానని చెప్పారామె.
రేంజర్స్ ఫుట్ బాల్ క్లబ్ తరఫున ఇక ఆడనున్న తాను భారత్‌లోని కొత్తతరం ఫుట్ బాల్ క్రీడాకారిణులకు స్ఫూర్తిగా నిలవాలనుకుంటున్నట్లు చెప్పారు.
బాలాదేవితో తాము ఒప్పందం చేసుకున్నామంటూ ఈ ఏడాది జనవరి 29న రేంజర్స్ క్లబ్ ప్రకటించింది. అంతకుముందు 2015లో గోల్ కీపర్ అదితి చౌహాన్ వెస్ట్‌హామ్ యునైటెడ్‌కు అతి కొద్దికాలం ఆడినప్పటికీ ఇలా ప్రొఫెషనల్ కాంట్రాక్ట్ కుదిరింది మాత్రం ఒక్క బాలాదేవితో మాత్రమే.
బాలాదేవి భారత్ తరఫున 58 మ్యాచ్‌లు ఆడి 52 గోల్స్ చేశారు. దేశీయ పోటీల్లో 100కి పైగా గోల్స్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
మణిపూర్ నుంచి..
ఫుట్‌బాల్‌కు మంచి ఆదరణ ఉన్న మణిపూర్ బాలాదేవి సొంత రాష్ట్రం. ఆమె అక్కడే పుట్టి పెరిగారు.
1991 నుంచి జరిగిన 25 జాతీయ చాంపియన్‌షిప్‌లలో 20 సార్లు మణిపూరే విజేత. ''మా మణిపూర్‌లో అమ్మాయిలు క్రీడల్లో పాల్గొంటే ప్రోత్సహిస్తారు'' అని చెప్పారామె.
చిన్నప్పటి నుంచే ఫుట్ బాల్, టెన్నిస్, బేస్ బాల్ ఆడేదాన్నని.. అయితే, తన తండ్రి స్ఫూర్తితో ఫుట్‌బాల్‌ను కెరీర్‌గా ఎంచుకున్నానని ఆమె చెప్పారు. తన తండ్రి కూడా ఫుట్‌బాల్ ఆడేవారని తెలిపారామె.
''నాకు ఫుట్ బాల్ అంటే ఇష్టం. స్థానికంగా ఉండే అబ్బాయిలతో ఫుట్‌బాల్ ఆడుతూ వారిని ఓడించేదాన్ని'' అన్నారామె.
తనకు పదకొండేళ్ల వయసున్నప్పుడు మణిపూర్‌లోని మహిళా ఫుట్‌బాల్ క్లబ్ ఐసీఎస్‌ఏలో చేరి జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొనేదాన్నని చెప్పారామె.
బ్రెజిల్ దిగ్గజాలు రోనాల్డో, రొనాల్డిన్హో ఆటను అభిమానిస్తూ పెరిగానన్న ఆమె, ప్రస్తుతం అమెరికా మహిళా ఫుట్‌బాల్ జట్టు మిడ్ ఫీల్డర్ మేగన్ రాపినో.. పోర్చ్‌గీస్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోలంటే ఇష్టమని చెప్పారు.
భారత క్రీడాకారిణుల్లో మణిపూర్‌కే చెందిన జాతీయ క్రీడాకారిణి ఓయ్నమ్ బెంబెమ్ దేవి అంటే బాలాదేవికి అమితమైన ఇష్టం. భారత ఫుట్‌బాల్ చరిత్రలో దుర్గాదేవిగా అభివర్ణించే బెంబెమ్ దేవితో 2002లో కలిసి ఆడారు బాలాదేవి. ఆమెతో కలిసి ఆడతానని అస్సలు ఊహించలేదంటూ ఆ సమయంలో బాలాదేవి సంతోషం వ్యక్తంచేశారు.
2005లో తనకు 15 ఏళ్ల వయసున్నప్పుడు అండర్-17 జట్టుకు బాలాదేవి ఎంపికయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
రేంజర్స్ వరకు..
అండర్-17కు ఎంపికైనప్పటి నుంచి బాలాదేవి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 2010లో ఆమెకు మణిపూర్ పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చింది. భారత్‌లో మూడు వేర్వేరు క్లబ్‌లకు ఆడారామె. 2015, 2016లో ఆమె ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపికయ్యారు.
స్కాట్లాండ్ రేంజర్స్ క్లబ్ సంప్రదించేటప్పటికి ఆమె మణిపూర్ పోలీస్ స్పోర్ట్స్ క్లబ్ తరఫున ఆడుతున్నారు. నవంబరులో ఆమె రేంజర్స్ తరఫున ట్రయల్స్ ఆడినప్పుడు కోచ్ సంతృప్తి చెంది ఒప్పందం కుదుర్చుకోవాలని క్లబ్‌కు సూచించారు.
భారత్‌కు ఆడినప్పుడు వేసుకునే పదో నంబర్ జెర్సీనే రేంజర్స్ క్లబ్‌లోనూ వేసుకోవాలని కోరుకుంటున్నట్లు బాలాదేవి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
మహిళల ఫుట్‌బాల్‌కు మునుపటి కంటే ఆదరణ పెరిగిందని.. గత ఉమెన్స్ వరల్డ్ కప్ ప్రపంచంలో అత్యధికులు చూసిన స్పోర్ట్స్ ఈవెంట్లలో ఒకటని ఆమె చెప్పారు. 2019లో ఫ్రాన్సులో జరిగిన ఆ పోటీలను 100 కోట్ల మందికిపైగా చూసినట్లు ఫిపా లెక్కలు చెబుతున్నాయి. ఆ పోటీల దెబ్బకు టీవీ రికార్డులన్నీ బద్దలయ్యాయి.
ఈ ఏడాది భారత్‌లో జరగబోయే అండర్-17 ప్రపంచకప్ దేశంలోని మరింతమంది అమ్మాయిలను ఫుట్‌బాల్ వైపు మళ్లిస్తుందని బాలాదేవి అన్నారు.
''ఆకాశాన్ని లక్ష్యం చేసుకోవాలి'' అనేదే తాను ఈ రంగంలోకి కొత్తగా వస్తున్న క్రీడాకారిణులకు ఇచ్చే సలహా అన్నారామె.

ఇవి కూడా చదవండి:
- ఒలింపిక్స్‌తో సహా ప్రధాన క్రీడల ఈవెంట్లలో పాల్గొనకుండా నాలుగేళ్ల పాటు రష్యాపై నిషేధం
- టోక్యో ఒలింపిక్స్: పాత సామానుతో.. పతకాల తయారీ
- వరల్డ్ కప్: స్త్రీ - పురుష క్రీడాకారుల మధ్య వేతన వ్యత్యాసం ఎంత?
- ధోనీ హెలికాప్టర్ షాట్ ఎలా పుట్టింది... ఆ టెక్నిక్ నేర్పిందెవరు...
- ఫుట్‌బాల్ జ్ఞాపకాలు: లక్ష మంది ప్రేక్షకులపై భారత్ విజయం
- మహిళలు కనిపెట్టిన అద్భుతాలివి
- ప్రపంచ చాంపియన్ మేరీ కోమ్‌ను బాధించే విషయం ఏంటి?
- కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోతోందా... ఆ సంస్థ ప్రతినిధి బీబీసీతో ఏమన్నారు?
- దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: కేజ్రీవాల్ భవిష్యత్తు బడి పిల్లల చేతిలో ఉందా...
- పోలవరం ముందుకు వెళ్తోందా, లేదా? అప్పటి నుంచి ఇప్పటికి పురోగతి ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









