ఆక్స్‌ఫామ్: ‘నాలుగు సెకండ్లకో నిరుపేద చనిపోతుంటే... రోజుకో కుబేరుడు పుట్టుకొచ్చాడు...’ - కోవిడ్ కాలంలో భారతదేశంలో అసమానతలపై తాజా నివేదిక ఏం చెప్తోంది?

పేదరికం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, పృథ్వీరాజ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రపంచాన్ని చుట్టుముట్టిన కోవిడ్ మహమ్మారి.. ప్రపంచ కుబేరులను మరింత సంపన్నులను చేసిందని.. కానీ మరింత ఎక్కువ మంది జనాన్ని పేదలుగా మార్చిందని ఆక్స్‌ఫామ్ సంస్థ చెప్తోంది.

ప్రపంచంలో పేదల ఆదాయాలు మరింతగా పడిపోవటం.. రోజుకు 21,000 మంది మరణాలకు దారితీసిందని ఆ స్వచ్ఛంద సంస్థ తాజా నివేదిక పేర్కొంది. అంటే.. సగటున నాలుగు సెకన్లకు ఒక మరణం సంభవిస్తోందని తెలిపింది.

భారతదేశంలోనూ కోవిడ్ మహమ్మారి కారణంగా ఆర్థిక అంతరాలు మరింత తీవ్రమయ్యాయని ఆక్స్‌ఫామ్ నివేదిక చెప్పింది. 2021 సంవత్సరంలో ఒకవైపు దేశంలో 84 శాతం కుటుంబాల ఆదాయం పడిపోగా.. మరోవైపు దేశంలో బిలియనీర్ల సంఖ్య 102 నుంచి 142కు పెరిగిందని తెలిపింది.

ఇనీక్వాలిటీ కిల్స్ (అసమానత చంపుతుంది) నివేదికను ఆక్స్‌ఫామ్ ఆదివారం విడుదల చేసింది.

పేదరికం

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌లో ఏడాది కాలంలో కొత్తగా నిరుపేదలైన వారు 4.60 కోట్ల మంది...

కోవిడ్ భారతదేశాన్ని ఇంకా కుదేలు చేసిందని చెప్పింది. దేశ ఆరోగ్య రంగానికి కేటాయింపులు.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో సవరించిన బడ్జెట్ అంచనాల కన్నా 10 శాతం తగ్గాయని తెలిపింది. అలాగే విద్యా రంగానికి కేటాయింపుల్లో 6 శాతం కోత పడినట్లు చెప్పింది. ఇక సామాజిక భద్రత పథకాలకు మొత్తం కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు 1.5 శాతం నుంచి 6 శాతానికి పడిపోయినట్లు వెల్లడించింది.

దేశంలో 100 మంది అత్యంత సంపన్నుల ఉమ్మడి ఆదాయం 2021 సంవత్సరంలో రికార్డు స్థాయిలో 57.3 లక్షల కోట్లకు పెరిగిందని ఆక్స్‌ఫామ్ నివేదిక తెలిపింది. అదే ఏడాది.. జాతీయ సంపదలో జనాభాలో అట్టడుగున ఉన్న 50 శాతం ప్రజల వాటా కేవలం 6 శాతంగానే ఉందని వివరించింది.

మహమ్మారి కాలంలో (2020 మార్చి నుంచి 2021 నవంబర్ వరకు) భారత బిలియనీర్ల సంపద 23.14 లక్షల కోట్ల నుంచి 53.16 లక్షల కోట్లకు పెరిగింది. 2021లో భారత్‌లో బిలియనీర్ల సంఖ్య 39 శాతం పెరిగింది.

మరోవైపు అదే కాలంలో 4 కోట్ల 60 లక్షల మందికి పైగా భారతీయులు పేదరికంలోకి జారిపోయినట్లు అంచనా వేసింది. ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం.. మొత్తం ప్రపంచంలో కొత్తగా పేదలైన వారిలో సగం మంది భారతీయులే.

అదానీ

ఫొటో సోర్స్, Getty Images

8 నెలల్లో 8 రెట్లు పెరిగిన అదానీ సంపద...

అమెరికా, చైనాల తర్వాత అత్యధిక సంఖ్యలో బిలియనీర్లు భారతదేశంలోనే ఉన్నారు. ఫ్రాన్స్, స్వీడన్, స్విట్జర్లాండ్ దేశాల్లో ఉన్న మొత్తం బిలియనీర్ల కన్నా ఇండియాలోనే ఎక్కువ మంది ఉన్నారు.

‘‘భారతదేశంలో నిరుద్యోగిత అత్యధికంగా 15 శాతంగా ఉన్నపుడు, వైద్య వ్యవస్థ కుప్పకూలే పరిస్థితుల్లో ఉన్నపుడు దేశంలో బిలియనీర్ల సంఖ్య పెరిగింది’’ అని ఆక్స్‌ఫామ్ నివేదిక చెప్తోంది.

భారతలోని 100 మంది బిలియనీర్ల సంపద పెరుగుదలలో దాదాపు ఐదో వంతు ఒకే ఒక్క కుటుంబం – అదానీలదేనని తెలిపింది.

ఆ నివేదిక ప్రకారం... ప్రపంచ కుబేరుల్లో 24వ స్థానంలో, భారతదేశంలో రెండో స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ సంపద ఒక్క ఏడాదిలో ఎనిమిది రెట్లు పెరిగింది.

2020లో 890 కోట్ల డాలర్లుగా ఉన్న ఆయన సంపద.. 2021లో 5,500 కోట్ల డాలర్లకు పెరిగింది. ఫోర్బ్స్ రియల్‌ టైమ్ డాటా ప్రకారం.. 2021 నవంబర్ 24వ తేదీ నాటికి అదానీ సంపద 8,220 కోట్ల డాలర్లుగా ఉంది.

భారతదేశంలో ప్రాణాంతక కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో.. కేవలం ఎనిమిది నెలల కాలంలో ఇంత భారీగా సంపద పెరిగింది. అదానీ ఆస్ట్రేలియాలో కొత్తగా కొన్న కెమికల్ గనులు, ముంబై విమానాశ్రయంలో కొనుగోలు చేసిన 74 శాతం వాటా కూడా ఈ పెరిగిన సంపదలో ఉన్నాయి.

అదే సమయంలో ముకేశ్ అంబానీ సంపద 2021లో రెట్టింపయింది. 2020లో 3,680 కోట్ల డాలర్లుగా ఉన్న ఆయన ఆదాయం 2021లో 8,550 కోట్లకు పెరిగింది.

పేదరికం

ఫొటో సోర్స్, Getty Images

నిరుపేదలపై పన్నుల భారం.. కుబేరులకు సర్కారు కటాక్షం...

భారతదేశంలో గత నాలుగేళ్లలో కేంద్ర ప్రభుత్వ పరోక్ష పన్నుల ఆదాయం పెరుగుతూ వచ్చిందని, కానీ అదే కాలంలో కార్పొరేట్ పన్ను వాటా తగ్గుతూ వచ్చిందని ఆక్స్‌ఫామ్ ఇండియా వెల్లడించింది.

చమురు మీద విధించే అదనపు పన్ను 2020-21 సంవత్సరం తొలి ఆరు నెలల్లో 33 శాతం పెరిగింది. కోవిడ్ ముందు నాటితో పోలిస్తే ఆ పన్ను పెంపు 79 శాతంగా ఉంది. అదే సమయంలో అత్యంత సంపన్నుల మీద సంపద పన్నును 2016లో రద్దు చేశారు.

పెట్టుబడులను ఆకర్షించటానికి కార్పొరేట్ పన్నులను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించటం వల్ల 1.5 లక్షల కోట్ల రూపాయల ఆదాయం నష్టపోయింది. దీనివల్ల భారతదేశపు ద్రవ్య లోటు పెరిగింది.

‘‘మహమ్మారి కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్న పేదలు, మధ్య తరగతి వారు ఎక్కువ పన్నులు చెల్లిస్తోంటే.. సంపన్నులు తమ న్యాయమైన వాటా పన్నులు చెల్లించకుండా మరింతగా సంపదను కూడబెట్టుకుంటున్నారని ఈ సరళి చాటుతోంది’’ అని ఆక్స్‌ఫామ్ వ్యాఖ్యానించింది.

పేదరికం

ఫొటో సోర్స్, Getty Images

ప్రతి రోజూ ఒక బిలియనీర్ ఆవిర్భావం...

‘‘ఈ మహమ్మారి కాలంలో దాదాపు రోజుకు ఒక బిలియనీర్ చొప్పున పుట్టుకొచ్చారు. మరోవైపు లాక్‌డౌన్లు, అంతర్జాతీయ వాణిజ్యం పడిపోవటం, పర్యాటక రంగం దిగజారిపోవటం వల్ల ప్రపంచ జనాభాలో 99 శాతం మంది పరిస్థితి దారుణంగా ఉంది. దాని ఫలితంగా కొత్తగా 16 కోట్ల మంది జనం పేదరికంలో కూరుకుపోయారు’’ అని ఆక్స్‌ఫామ్ గ్రేట్ బ్రిటన్ చీఫ్ ఎక్జిక్యూటివ్ డానీ స్రిస్కాండరాయా వివరించారు.

‘‘మన ఆర్థిక వ్యవస్థలో ఏదో తీవ్ర లోపం ఉంది’’ అన్నారాయన.

కోవిడ్ కాలంలో ప్రపంచంలో అగ్రస్థాయి 10 మంది సంపన్నుల ఆదాయం మొత్తం 2020 మార్చి నుంచి రెట్టింపుకు పైగా పెరిగిందని ఆక్స్‌ఫామ్ నివేదిక వివరించింది.

దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్) సదస్సు ప్రారంభానికి ముందు.. ప్రపంచ అసమానతలపై ఆక్స్‌ఫామ్ తన అధ్యయన నివేదికను విడుదల చేయటం పరిపాటి.

సాధారణంగా స్విట్జర్లాండ్‌లో ప్రఖ్యాత స్కీ రిసార్ట్ కేంద్రం దావోస్‌లో జరిగే ఈ సదస్సుకు వేలాది మంది కార్పొరేట్, రాజకీయ నాయకులు, సెలెబ్రిటీలు, ఉద్యమకారులు, ఆర్థికవేత్తలు, పాత్రికేయులు హాజరవుతుంటారు.

అయితే.. ఈ సదస్సు వరుసగా రెండో ఏడాది కూడా ఆన్‌లైన్‌లో మాత్రమే జరుగుతోంది. ఎప్పటిలా దావోస్‌లో సదస్సు నిర్వహించాలన్న ప్రణాళికలను ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి అడ్డుకుంది.

ఈ వారంలో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక ఆన్‌లైన్ సదస్సులో చర్చించబోయే అంశాల్లో.. మహమ్మారి భవిష్యత్తులో ఎలా ఉంటుంది, వ్యాక్సీన్ సైరఫరాలో సమానత్వం సాధించటం, ఇంధన వనరుల మార్పు తదితర అంశాలు ప్రధానంగా ఉండొచ్చు.

ఆర్థిక, వాణిజ్య, రాజకీయ నేతల దృష్టిని ఆకర్షించటానికి తమ నివేదికను ప్రతి ఏటా దావోస్ సదస్సుకు ముందు విడుదల చేస్తుంటామని డానీ చెప్పారు.

ఎలాన్ మస్క్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎలాన్ మస్క్

10 మంది ప్రపంచ కుబేరుల ఆదాయం ఏడాదిలో రెట్టింపు...

ఆక్స్‌ఫామ్ ఉటంకించిన ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం ప్రపంచంలో అత్యంత సంపన్నులు: ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, బెర్నార్డ్ అర్నాల్ట్ - ఆయన కుటుంబం, బిల్ గేట్స్, లారీ ఎలిసన్, లారీ పేజ్, సెర్గీ బ్రిన్, మార్క్ జుకర్‌బర్గ్, స్టీవ్ బాల్మర్, వారెన్ బఫెట్.

వీరందరి సపంద కలిసి 7,00,000 కోట్ల డాలర్లుగా ఉంటే.. ఈ రెండేళ్లలోనే 15,00,000 కోట్లకు పెరిగింది. అయితే విడివిడిగా చూసినపుడు వీరి ఆదాయాల పెరుగుదలల్లో గణనీయమైన తేడాలున్నాయి.

ఎలాన్ మస్క్ సంపద 1,000 శాతం పైగా పెరిగితే.. బిల్ గేట్స్ సంపద కేవలం 30 శాతం మాత్రమే పెరిగింది.

ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాతో పాటు.. ప్రపంచ సంపద పంపిణీని వివరించే క్రెడిట్ సుసీ గ్లోబల్ వెల్త్ వార్షిక నివేదిక, ప్రపంచ బ్యాంకు సమాచారాల ఆధారంగా ఆక్స్‌ఫామ్ ఈ అసమానత నివేదికను రూపొందిస్తుంది.

వైద్యం అందుబాటులో లేకపోవటం, ఆకలి, లింగ ఆధారిత హింస, వాతావరణ విధ్వంసం కారణంగా.. ప్రతి నాలుగు సెకన్లకూ ఒక మరణం సంభవించినట్లు ఆక్స్‌ఫామ్ నివేదిక చెప్తోంది.

పేదరికం

ఫొటో సోర్స్, Getty Images

ఆక్స్‌ఫామ్ నివేదిక ఇంకా ఏం చెప్తోందంటే...

కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 16 కోట్ల మంది కొత్తగా నిరుపేదలయ్యారని.. వారు రోజుకు 5.50 డాలర్లతో బతుకీడుస్తున్నారు.

మహమ్మారి ప్రభావం వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాల జాతీయ అప్పులు పెరగగా.. అవి సామాజిక వ్యయాన్ని తగ్గించాల్సి వచ్చింది.

లింగ సమానత్వం తిరోగమించింది. ప్రపంచ వ్యాప్తంగా మహిళా ఉద్యోగుల సంఖ్య 2019తో పోలిస్తే ఇప్పుడు 1 కోటీ 30 లక్షల మంది తగ్గిపోయింది. రెండు కోట్ల మందికి పైగా బాలికలు మళ్లీ బడికి వెళ్లే పరిస్థితి లేదు.

భారత్‌లో దళితులు, బ్రిటన్‌లో బంగ్లాదేశీయులు, అమెరికాలో నల్లజాతి వారు వంటి జాతిపరంగా మైనారిటీ జనం కోవిడ్ వల్ల ఎక్కువగా దెబ్బతిన్నారు.

వీడియో క్యాప్షన్, ఆర్థిక సంస్కరణలకు 30 ఏళ్లు: పీవీ, మన్మోహన్ తీసుకున్న కీలక నిర్ణయాలేంటి?

సంక్షోభాల్లోనూ సంపన్నులకు లాభాల పంట...

‘‘ప్రపంచ సంక్షోభాల్లో సైతం మన ఆర్థిక వ్యవస్థలు అత్యంత సంపన్నులకు భారీ లాభాలు కట్టబెట్టగలుగుతున్నాయి కానీ పేదలకు రక్షణ కల్పించలేకపోతున్నాయి’’ అని డానీ చెప్పారు.

‘‘మనం ప్రయాణిస్తున్న ప్రాణాంతక దిశను మార్చగలిగే సాహసోపేత ఆర్థిక వ్యూహాలకు మద్దతివ్వటానికి ప్రపంచ రాజకీయ నాయకులకు ఇప్పుడు ఒక చారిత్రక అవకాశం ఉంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

పెట్టుబడి, సంపదపై అధిక పన్నులు విధిస్తూ, ఆదాయాలను ‘‘నాణ్యమైన సార్వత్రిక వైద్య రక్షణ, అందరికీ సామాజిక భద్రత’’ కల్పించటానికి వెచ్చించే మరింత ప్రగతిశీల పన్ను వ్యవస్థలు అందులో భాగంగా ఉండాలని సూచించారు.

కోవిడ్ వ్యాక్సీన్లను విస్తృతంగా ఉత్పత్తి చేయటానికి, వేగంగా పంపిణీ చేయటానికి వీలుగా.. ఆ వ్యాక్సీన్ల మీద మేధో సంపత్తి హక్కులను కూడా తొలగించాలని కూడా ఆక్స్‌ఫామ్ పిలుపునిచ్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)