కాంతార మూవీ రివ్యూ: సినిమా అంతా ఒక లెవెల్లో ఉంటే చివరి పది నిమిషాలది మరో లెవెల్

కాంతారా సినిమాలో రిషబ్ శెట్టి

ఫొటో సోర్స్, Twitter/Rishab Shetty

    • రచయిత, సాహితి
    • హోదా, బీబీసీ కోసం

ఇది వ‌ర‌కు క‌న్న‌డ సినిమా అంటే... ఓ చిన్న చూపు ఉండేది. అరకొర బ‌డ్జెట్‌తో సినిమాలు తీస్తారని, ఊర మాస్ క‌థ‌ల‌తో రీళ్ళు చుట్టేస్తార‌నే ర‌క‌ర‌కాల అప‌వాదులూ వినిపించేవి. వాట‌న్నింటినీ దాటుకొని వ‌చ్చి ఈరోజు `కేజీఎఫ్‌` నిల‌బ‌డింది. దేశం మొత్తం క‌న్న‌డ సీమ వైపు చూసేలా చేసింది.

కేజీఎఫ్ రాక‌తో క‌న్న‌డ సినిమా రూపు రేఖ‌లు మారాయి. వాళ్లు సినిమాని తీసే, చూసే విధానం మారింది. అందులో భాగంగా కొత్త తర‌హా క‌థ‌లు, సినిమాలు క‌న్న‌డ సీమ నుంచి వ‌స్తున్నాయి. `కాంతారా` కూడా అలాంటి సినిమానే. ఈమ‌ధ్యే క‌న్న‌డ‌లో ఎలాంటి అంచ‌నాలు లేకుండా విడుద‌లై.. సంచ‌ల‌న‌మై కూర్చుంది. ఈ సినిమాని మిగిలిన భాష‌ల్లో డ‌బ్ చేయ‌మ‌ని... నిర్మాత‌పై ఒత్తిడి తీసుకొచ్చారు. దాంతో... ఇప్పుడు తెలుగులో అదే పేరుతో వ‌చ్చింది. మ‌రి.. కాంతారాలో అంత అబ్బుర ప‌రిచే విష‌యాలు ఏమున్నాయి? క‌న్న‌డ‌లో `క్లాసిక్‌`గా పేరు తెచ్చుకొన్న `కాంతారా` తెలుగులోనూ కాంతులు పంచుతుందా?

క‌థ చాలా సింపుల్. అన‌గ‌నన‌గా ఓ రాజు. త‌న‌క‌న్నీ ఉన్నాయి. మ‌నశ్శాంతి త‌ప్ప‌. దాని కోసం... రాజ్యం మొత్తం ఒంటరిగా అన్వేషిస్తూ తిరుగుతుంటాడు. చివ‌రికి ఓ అడ‌విలో ఓ చిన్న శిల ముందు... త‌న మ‌న‌స్సుకు శాంతి చేకూరుతుంది. ఆ శిల‌ని ఇంటికి తీసుకెళ్తా.. అని ఆ అడ‌వి వాసుల్ని అడుగుతాడు రాజు. దానికి బ‌దులుగా ఆ అడ‌విని.. ప్ర‌జ‌ల‌కే వ‌దిలి వెళ్లాల‌న్న ష‌ర‌తుపై.. శిల‌ని ఇంటికి తీసుకెళ్తాడు.

కాంతారా సినిమాలో రిషబ్ శెట్టి

ఫొటో సోర్స్, Twitter/RishabShetty

ఫొటో క్యాప్షన్, కాంతారా సినిమాలో రిషబ్ శెట్టి

అలా కొన్ని త‌రాలు గ‌డుస్తాయి. రాజు వార‌సులు ఇప్పుడు ఆ అడ‌విపై క‌న్నేస్తారు. `ఈ భూమి మాది క‌దా.. మాకు చెందాలి క‌దా` అని ఎదురు తిరుగుతారు. అప్ప‌టి నుంచి అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. చివ‌రికి.. ఆ అడ‌వి ఎవ‌రి సొంతమైంద‌నేది తెర‌పై చూడాలి.

కాంతారా అంటే అడ‌వి. ఆ అడవి చుట్టూ సాగే కథే ఇది. నాలుగు ముక్క‌ల్లో ఈ క‌థ గురించి చెబితే... `ఓస్ ఇంతే క‌దా.. ఇందులో ఏముంది` అనిపిస్తుంది. నిజ‌మే. ఈ క‌థ‌ని ద‌ర్శ‌కుడు ఓ క‌థానాయ‌కుడికి చెప్పి, ఒప్పించ‌డం కత్తిమీద సామే. ఎందుకంటే క‌థ‌గా చెబితే అందులో ఏమీ ఉండ‌దు. ద‌ర్శ‌కుడి విజ‌న్‌ని హీరో అర్థం చేసుకొంటేనే ఇలాంటి క‌థ‌లు తెర‌పైకొస్తాయి.

`కాంతారా` అదృష్టం ఏమిటంటే.. ఈ సినిమాకి ద‌ర్శ‌కుడు, క‌థానాయ‌కుడు ఒక్క‌రే (రిష‌బ్ శెట్టి) కావ‌డం. ఈ క‌థ‌ని రాసుకొంటున్న‌ప్పుడే రిష‌బ్ విజువ‌లైజ్ చేసుకొన్నాడు. కాబ‌ట్టి... త‌ను ఈ క‌థ‌ని బ‌లంగా న‌మ్మ‌గ‌లిగాడు. ఓ మామూలు క‌థ‌కు నేటివిటీని జోడించాడు. అడ‌విలోని మామూలు మ‌నుషులు, వాళ్ల వృత్తి, వాళ్లు న‌మ్ముకొన్న దేవుడు, ఆచారాలు, వ్య‌వ‌హారాలు.. ఇవ‌న్నీ క‌లిపి దానికి క‌మ‌ర్షియ‌ల్ కోటింగ్ ఇచ్చి - చివ‌రి పది నిమిషాల్లో మెస్మ‌రైజ్ చేసేశాడు.

తొలి ప‌ది నిమిషాల్లోనే క‌థంతా చెప్పేశాడు ద‌ర్శ‌కుడు. ఓ అడ‌వి ఉంది. ఆ భూమి కోసం జ‌రిగే పోరు ఇదంటూ.. మొత్తం క‌థ‌ని అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా, అర‌టి పండు ఒలిచి నోట్లో పెట్టిన‌ట్టు చూపించాడు. ఆ త‌ర‌వాత‌... శివ (రిష‌బ్ శెట్టి) పాత్ర ఎంట‌ర్ అవుతుంది. త‌న నాటుద‌నం, హీరోయిజం, మొండిత‌నం, ధైర్యం ఇవ‌న్నీ రెండు మూడు సీన్ల‌కే ప్రేక్ష‌కుల‌కు ఎక్కేస్తాయి. ఆ త‌ర‌వాత‌.. నేటివిటీ గురించి ఏమాత్రం ప‌ట్టించుకోం. మ‌న క‌థే.. అనుకొని ఫాలో అవుతాం.

కాంతారా సినిమా

ఫొటో సోర్స్, Facebook/Bunny Vasu

మ‌ట్టివాస‌న ఎప్పుడూ గుభాళిస్తూనే ఉంటుంది. దానికి క్లాస్‌, మాస్ ఉండ‌దు. అంద‌రికీ న‌చ్చుతుంది. అడ‌వి.. దాన్ని న‌మ్ముకొని బ‌తికే మ‌నుషులు, వాళ్ల ప్ర‌వ‌ర్త‌న‌.. వీటికి ఆ శోభ అంటింది. క‌థానాయ‌కుడి చుట్టూ కొన్ని పాత్ర‌లుంటాయి. వాటిని వినోదం పంచ‌డానికి ప్ర‌ధాన‌మైన సాధ‌నంగా వాడుకొన్నాడు ద‌ర్శ‌కుడు. చిన్న చిన్న విష‌యాలే. థియేట‌ర్లో గోల పెడ‌తారు జ‌నాలు.

ప్రేమ క‌థ కూడా చాలా స‌హ‌జంగా ఉంది. క‌థానాయిక అన‌గానే తెల్ల‌ తోలు అమ్మాయిని తీసుకొచ్చి, నేటివిటీ కోసం మ‌సి పూయ‌డం చేయ‌లేదు ద‌ర్శ‌కుడు. అచ్చంగా గూడెంలో పుట్టి, అక్క‌డే పెరిగిన అమ్మాయిలా ఉంటుంది క‌థానాయిక పాత్ర‌. అందుకే, హీరోయిన్ సప్తమి గౌడ నటనతో వెంట‌నే క‌నెక్ట్ అయిపోతాం. దొర పాత్ర‌ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. అయితే ఆ పాత్ర ద్వారా వ‌చ్చే ట్విస్ట్ అంత కొత్త‌గా అనిపించ‌దు. దాన్ని చాలామంది ఊహిస్తారు కూడా. కాక‌పోతే... దాన్ని రివీల్ చేసే విధానం బాగుంది. రొటీన్ అయినా... అక్క‌డ కూడా ఓ ఉలికి పాటు వ‌స్తుంది.

ఇక ఈ క‌థ‌లో ద‌ర్శ‌కుడి తెలివిగా మిక్స్ చేసిన అంశం.. దైవ‌త్వం. తొలి ప‌ది నిమిషాల్లోనూ, ప‌తాక దృశ్యాల్లోనూ వాటిని వాడుకొన్న విధానానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఓ చిన్న‌పాటి అరుపుని కూడా ఈ క‌థ‌లో ఓ పాత్ర‌గా మ‌లిచాడు ద‌ర్శ‌కుడు. ఆ అరుపు ఎప్పుడొచ్చినా ప్రేక్ష‌కుల్లో ఓ ఉలికిపాటు వ‌స్తుంది.

స‌డ‌న్‌గా క‌నిపించే రూపం, వినిపించే శ‌బ్దం థియేట‌ర్‌ని గ‌గుర్పాటు గురి చేస్తాయి. వ‌రాహ అవ‌తారాన్ని, పంది వేట‌ని.. ఈ రెండింటికీ తెలివిగా క‌థ‌లో మిక్స్ చేయ‌డం బాగుంది. ద్వితీయార్థంలో కొంత భాగం చాలా రొటీన్‌గా అనిపిస్తుంది. క‌థ‌ని సాగ‌దీస్తున్నాడా? అనే భావ‌న క‌లిగేలా చేస్తుంది. అయితే అదంతా క్లైమాక్స్‌కు ముందున్న ప్ర‌శాంత‌త మాత్ర‌మే.

ఎందుకంటే ప‌తాక స‌న్నివేశాల్లో రిష‌బ్ శెట్టి విశ్వ‌రూప విన్యాసం చేశాడు. చాలా సుదీర్ఘ‌మైన ఎపిసోడ్ అది. ఆ ప‌ది నిమిషాల్లోనూ.. వ‌న్ మాన్ షోనే. కేవ‌లం అరుపుల‌తోనే హ‌డ‌ల‌గొట్టాడు రిష‌బ్‌. ఆ స‌న్నివేశాల్లో విజువ‌లైజేష‌న్‌, సౌండ్ డిజైనింగ్‌, నేప‌థ్య సంగీతం.. ఇవ‌న్నీ అత్యుత్త‌మ ప్ర‌తిభ‌ని ప్ర‌ద‌ర్శించాయి.

అప్ప‌టి వ‌ర‌కూ `కాంతారా`పై ఓ ర‌క‌మైన ప్రేమ ఏర్ప‌డుతుంది. ఆ సీన్‌తో.. `కాంతారా`పై పిచ్చి పెరుగుతుంది. అంత‌కు ముందున్న సినిమా అంతా ఓ స్థాయి అయితే.. చివ‌రి ప‌ది నిమిషాల‌దీ మ‌రో స్థాయి. థియేట‌రిక‌ల్ ఎక్స్‌పీరియ‌న్స్ అంటారే... అదేంటో తెలియాలంటే.. క‌చ్చితంగా ఈ సినిమాని, ఆ చివ‌రి ప‌ది నిమిషాల‌నూ తెర‌పై చూడాల్సిందే.

కాంతారా సినిమాలో రిషబ్ శెట్టి

ఫొటో సోర్స్, Twitter/Rishab Shetty

ఈ సినిమా అంతా అడ‌విలోనే సాగింది. కెమెరాలో ప్ర‌తీ ఫ్రేమూ ప‌చ్చ‌గా క‌నిపిస్తుంది. రాత్రి వేళ‌లో అడ‌విలో తెర‌కెక్కించిన స‌న్నివేశాలు కెమెరామెన్ ప్ర‌తిభ‌కు అద్దం ప‌డ‌తాతాయి. టెక్నిక‌ల్‌గా ఈ సినిమా క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని పెంచేలా ఉంది. ముఖ్యంగా సౌండ్ డిజైనింగ్‌కు ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. ఓ ర‌క‌మైన అరుపు.. సినిమా మొత్తం వినిపిస్తుంటుంది. థియేట‌ర్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక కూడా ఆ అరుపు వెంటాడుతుంది. నేప‌థ్య సంగీతం చాలా వ‌ర‌కూ క‌థ‌ని న‌డిపించింది. ద‌ర్శ‌కుడిగా రిష‌బ్‌కు ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. ఎందుకంటే ఈ క‌థ‌ని పేప‌ర్ పై రాసుకొంటే స‌రిపోదు. దాన్ని ముందే విజువ‌లైజ్ చేయ‌గ‌ల‌గాలి. అది చేయ‌క‌పోతే. థియేట‌ర్లో ఆడియ‌న్స్‌పై ఇంత ఇంపాక్ట్ క్రియేట్ అవ్వ‌దు.

రిష‌బ్ శెట్టి త‌న కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ చేసిన పాత్ర‌ల్లో ది బెస్ట్ ఇదే. బ‌హుశా.. కొన్నాళ్ల పాటు రిష‌బ్ శెట్టి చేసిన శివ పాత్ర గురించి ఎక్కువ‌గా మాట్లాడుకొంటారు. ముఖ్యంగా చివ‌రి ప‌ది నిమిషాల గురించి. ఈ సినిమాతో రిష‌బ్ కొన్ని అవార్డులూ కొట్టుకుపోవొచ్చు. అడ‌వి మ‌నిషిగా, మొర‌టోడిగా, అమ్మ‌కి భ‌య‌ప‌డే కొడుకుగా... అత‌ని పాత్ర‌లో చాలా వేరియేష‌న్స్ ఉన్నాయి. వాట‌న్నింటినీ స‌మ‌ర్థంగా పండించాడు. క‌థానాయిక‌ స‌ప్త‌మి గౌడ చాలా స‌హ‌జంగా ఉంది. ఆమె న‌ట‌న‌లో ఎక్క‌డా సినిమాటిక్ ల‌క్ష‌ణాలు క‌నిపించ‌లేదు. ఫారెస్ట్ ఆఫీస‌ర్‌గా త‌న పాత్ర‌ని కిషోర్ ర‌క్తిక‌ట్టించాడు. హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో ఒక్క‌రు కూడా.. పేరున్న న‌టుడు లేడు. కానీ ఒక్కరి మొహం కూడా మ‌రి మ‌ర్చిపోలేం. ఆ పాత్ర‌లు అంత‌గా రిజిస్ట‌ర్ అయిపోతాయి.

కాంతారా సినిమాలో రిషబ్ శెట్టి

ఫొటో సోర్స్, Facebook/Bunny Vasu

క‌థ‌, సాంకేతిక నిపుణులు, న‌టీన‌టులు.. అంతా పొందిగ్గా కుదిరితే, వాళ్లంతా త‌మ ప్ర‌తిభ‌ని నూటికి నూరు పాళ్లూ ఆవిష్క‌రిస్తే... ఎలాంటి సినిమాలు వ‌స్తాయో చెప్ప‌డానికి `కాంతారా` అతి పెద్ద ఉదాహ‌ర‌ణ‌. ఇందులో తెలుగు నేటివిటీకి సంబంధించిన అంశాలేం ఉండ‌వు. మ‌న‌కు తెలిసిన స్టార్స్ లేరు. అయినా స‌రే.. తొలి స‌న్నివేశం నుంచే క‌థ‌లోకి లాక్కెళ్లి.. ప‌తాక స‌న్నివేశాల్లో ఊహించ‌ని ఉద్వేగంలో ప‌డేస్తుంది ఈ సినిమా.

వీడియో క్యాప్షన్, కాంతార మూవీ రివ్యూ: ఒక హీరోకి ఈ కథ చెప్పి ఒప్పించడం కష్టం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)