షీ జిన్‌పింగ్: చైనా అధ్యక్షుడిగా మూడోసారి పగ్గాలు చేపట్టబోతున్న ఈ నిరంకుశ నేత కథేంటి?

షీ జిన్‌పింగ్

షీ జిన్‌పింగ్ మూడోసారి చైనా అధ్యక్ష పదవిని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అక్టోబర్ 16న జరగనున్న 20వ కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్‌లో అధ్యక్షుడిగా ఆయన పేరును ప్రకటిస్తారు. ఇక, జిన్‌పింగ్ జీవితాంతం అధికారంలో ఉండవచ్చు.

చైనాలో 1990ల నుంచి ఒక నిబంధన ఉంది. ఎవరూ కూడా రెండు కంటే ఎక్కువసార్లు అధ్యక్ష పదవిని చేపట్టలేరు. అయితే, 2018లో ఈ పరిమితిని తొలగించే సవరణకు మద్దతుగా చైనా నాయకులు ఓటు వేయడంతో, ఇప్పుడు జిన్‌పింగ్ మూడోసారి అధ్యక్షుడు అయ్యే అవకాశాన్ని పొందారు.

షీ జిన్‌పింగ్ 2012లో తొలిసారిగా అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి చైనాలో నిరంకుశత్వం మరింత పెరిగింది. అసమ్మతిని అణచివేయడం, విమర్శలను తొక్కిపెట్టడం, పలుకుబడిగల కోటీశ్వరులను, వ్యాపారాలను అణగదొక్కడం పెరిగింది.

కొందరు జిన్‌పింగ్‌ను "చైర్మన్ మావో తరువాత అత్యంత నిరంకుశత్వ నాయకుడిగా" అభివర్ణిస్తారు.

జిన్‌పింగ్‌ పాలనలోనే షిన్‌జియాంగ్ ప్రాంతంలో "రీ-ఎడ్యుకేషన్" శిబిరాలు ప్రారంభమయ్యాయి. ఈ శిబిరాల్లో వీగర్ ముస్లింలు, ఇతర మైనారిటీ మతస్థుల మానవ హక్కుల హననం జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి.

అలాగే, హాంగ్‌కాంగ్‌పై చైనా తన పట్టు బిగించింది. తైవాన్‌ను చైనాలో కలిపేసుకుంటామని ప్రతిజ్ఞ పూనింది. అవసరమైతే బలప్రయోగానికి వెనుకాడమని హెచ్చరించింది.

జిన్‌పింగ్ ప్రభావం ఎంత ఉందంటే, 2017లో కమ్యూనిస్ట్ పార్టీ, జిన్‌పింగ్ సిద్ధాంతాలను "షీ జిన్‌పింగ్ థాట్ ఆన్ సోషలిజం విత్ చైనీస్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ ది న్యూ ఎరా" పేరుతో రాజ్యాంగంలో చేర్చేందుకు ఓటు వేసింది.

ఇప్పటివరకు, కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్, 1980లలో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టిన నాయకుడు డెంగ్ జియావోపింగ్‌ల సూత్రాలు మాత్రమే ముఖ్యమైన ప్రాథమిక చట్టాలుగా రాజ్యాంగంలోకి ఎక్కాయి.

షీ జిన్‌పింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, షీ జిన్‌పింగ్

విప్లవకారుడి కుమారుడు

షీ జిన్‌పింగ్ 1953లో బీజింగ్‌లో జన్మించారు. ఆయన తండ్రి విప్లవకారుడు, మాజీ వైస్-ప్రీమియర్, కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన షీ జాంగ్‌క్సన్.

ఆయనకున్న మూలాలు, పలుకుబడి కారణంగా ఉన్నతాధికారుల బిడ్డగా, చిన్న స్థాయి నేత నుంచి ఉన్నత స్థాయికి ఎదిగారు.

అయితే, 1962లో జిన్‌పింగ్ తండ్రిని జైల్లో పెట్టడంతో పరిస్థితులు తారుమారయ్యాయి. పార్టీ శ్రేణుల్లో తిరుగుబాటు రావొచ్చని శంకించి, అనుమానం ఉన్న వాళ్లందరినీ మావో జైల్లో పెట్టించారు.

ఈ నేపథ్యంలో, లక్షలాదిమందిని చైనా సంస్కృతికి వ్యతిరేకులుగా ముద్ర వేశారు. దాంతో, 1966లో సాంస్కృతిక విప్లవమని పిలిచే ముసలం పుట్టుకొచ్చింది. దేశవ్యాప్తంగా హింస చెలరేగింది.

షీ జిన్‌పింగ్ కుటుంబం కూడా కష్టాల పాలైంది. ఆయన సవతి సోదరి హింసకు గురై మరణించారని అధికారిక సమాచారం. కానీ, ఆమె ఒత్తిడితో తన ప్రాణాలు తానే తీసుకున్నారని పార్టీ ఉన్నత వర్గాలతో సంబంధం ఉన్న ఒక చరిత్రకారుడు చెప్పినట్టుగా న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ పేర్కొంది.

రాజకీయ ప్రముఖుల పిల్లలు చదివే పాఠశాల నుంచి జిన్‌పింగ్‌కు బయటకు పంపించేశారు. 15 ఏళ్ల వయసులో జిన్‌పింగ్‌ను "రీ-ఎడ్యుకేషన్" కోసం బీజింగ్ నుంచి గ్రామీణ ప్రాంతాలకు పంపించారు.

చైనాకు ఈశాన్యంలో ఉన్న మారుమూల, పేద గ్రామమైన లియాంగ్జియాహేలో ఆయన ఏడు సంవత్సరాలు కష్టించి పనిచేశారు.

ఇంత జరిగినా జిన్‌పింగ్ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి దూరంగా పారిపోలేదు. చిత్రంగా, మరింత దగ్గరయ్యారు. పార్టీలో చేరేందుకు పలుమార్లు ప్రయత్నించారు. కానీ, ఆయన తండ్రికి ఉన్న పేరు, వైఖరి కారణంగా తిరస్కారమే ఎదురైంది.

చివరికి 1974లో ఆయనకు పార్టీలో స్థానం దక్కింది. హెబీ ప్రావిన్స్‌లో ప్రారంభించి, మెల్లమెల్లగా అగ్రస్థానానికి చేరుకున్నారు.

షీ జిన్‌పింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, షీ జిన్‌పింగ్ మూడోసారి చైనా అధ్యక్ష పదవిని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు

1989లో మరింత రాజకీయ స్వేచ్ఛను కోరుతూ బీజింగ్‌లోని తియానన్‌మెన్ స్క్వేర్‌లో నిరసనలు ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో 35 ఏళ్ల జిన్‌పింగ్ దక్షిణ ఫుజియాన్ ప్రావిన్స్‌లోని నింగ్డే నగరంలో పార్టీ చీఫ్‌గా ఉన్నారు.

ఈ ప్రావిన్స్ రాజధానికి దూరంగా ఉన్నప్పటికీ, భారీ నిరసనలకు స్థానికంగా వస్తున్న మద్దతును చెదరగొట్టడానికి జిన్‌పింగ్, ఇతర అధికారులతో కలిసి చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది.

కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులలో చీలికను ప్రతిబింబిస్తూ చెలరేగిన నిరసనలు, దాన్ని అణచివేయడానికి జరిగిన హింస, రక్తపాతం చరిత్రను ఇప్పుడు ఆ దేశ చరిత్ర పుస్తకాల్లోంచి, అధికారిక రికార్డుల నుంచి పూర్తిగా తొలగించారు.

తియానన్‌మెన్ స్క్వేర్‌ నిరసనలలో మరణించినవారి సంఖ్య వందల నుంచి అనేక వేల వరకు ఉంటుందని అంచనా. అక్కడ చెలరేగిన హింస, అధికార దుర్వినియోగం కారణంగా, 2000 ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని చైనా కోల్పోయింది.

అయితే దాదాపు రెండు దశాబ్దాల తరువాత, బీజింగ్‌లో జరిగిన 2008 సమ్మర్ ఒలింపిక్స్‌ నిర్వహణ బాధ్యతలు జిన్‌పింగ్‌కు అప్పగించారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని చైనా.. అభివృద్ధి చెందుతున్న దేశంగా, ఆతిథ్యం ఇచ్చేందుకు అనువైన దేశంగా నిరూపించుకునేందుకు ప్రయత్నించింది.

జిన్‌పింగ్ విషయానికొస్తే, పార్టీలో ఆయన ప్రాబల్యం పెరిగింది. పార్టీ నిర్ణయాలు తీసుకునే అగ్రస్థానంలోకి ఎగబాకారు. 2012లో చైనా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

చైనా 'ప్రథమ దంపతులు'.. షీ జిన్‌పింగ్, ఆయన భార్య పెంగ్ లియువాన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, చైనా 'ప్రథమ దంపతులు'.. షీ జిన్‌పింగ్, ఆయన భార్య పెంగ్ లియువాన్

షీ జిన్‌పింగ్ భార్య పెంగ్ లియువాన్ ప్రముఖ గాయకురాలు. ఈ జంట ఫొటోలు రాష్ట్ర మీడియాలో తరచూ కనిపించడం మొదలైంది. చైనా 'ప్రథమ దంపతులు'గా వీరికి భారీ ప్రచారాన్ని కల్పించారు.

అంతవరకు చైనాలో అధ్యక్షుడి భార్య 'ప్రథమ మహిళ'కు ఇంత ప్రచారం ఎప్పుడూ జరగలేదు. వారి గురించి బయటకు ఎక్కువగా తెలిసేది కాదు.

జిన్‌పింగ్ దంపతులకు ఒక కుమార్తె ఉన్నారు. ఆమె పేరు షీ మింగ్‌జే. ఆమె హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదివిన విషయం మినహా మరే వివరాలు పెద్దగా తెలియవు.

ఇతర కుటుంబ సభ్యులు, వారి విదేశీ వ్యాపార వ్యవహారాల గురించి అంతర్జాతీయ పత్రికలలో నిశితంగా పరిశీలిస్తూ ఉంటారు.

చైనీస్ డ్రీమ్

షీ జిన్‌పింగ్ "చైనా దేశ గొప్ప పునరుజ్జీవనం" అనే తన కలను సాకారం చేసుకునే దిశగా బలంగా కృషి చేశారు.

ఆయన ఆధ్వర్యంలో, ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా మందగిస్తున్న వృద్ధిని ఎదుర్కోవడానికి సంస్కరణలను అమలు చేసింది. ప్రభుత్వ యాజమాన్యంలోని పరిశ్రమలను తగ్గించడం, కాలుష్యాన్ని తగ్గించడం, అలాగే చైనాతో ప్రపంచ వాణిజ్య సంబంధాలను విస్తరించే లక్ష్యంతో కోట్ల డాలర్ల 'వన్ బెల్ట్ వన్ రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్' ప్రాజెక్ట్ చెపట్టడం వంటి చర్యలు ఈ సంస్కరణలలో భాగం.

ప్రపంచ వేదికపై చైనా మరింత ధృడంగా మారింది. దక్షిణ చైనా సముద్రంలో ప్రాబల్యాన్ని పెంచుకోవడం నుంచి ఆసియా, ఆఫ్రికాలలో కోట్ల పెట్టుబడులు పెట్టడం వరకు వివిధ దేశాల్లో తన బలన్ని పెంచుకుంటోంది.

అయితే, గత కొన్ని దశాబ్దాలుగా చైనా సాధించిన ఈ ఆర్థికాభివృద్ధి ఇప్పుడు గణనీయంగా మందగించింది. రాజీలేని "జీరో కోవిడ్" పాలసీతో మరింత కుంటుపడింది. కోవిడ్ మహమ్మారి మొదలైన దగ్గర నుంచి పలు లాక్‌డౌన్ల కారణంగా వాణిజ్య వ్యాపారాలు నెమ్మదించాయి.

చైనాలో ఒకప్పుడు విపరీతంగా వృద్ధి చెందిన ప్రోపర్టీ మార్కెట్ ఇప్పుడు తిరోగమనంలో ఉంది. మరోవైపు, గత కొన్ని నెలలుగా ప్రపంచ ఆర్థికవ్యవస్థ బాగా బలహీనపడింది. చైనాకు అమెరికాతో కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించట్లేదు.

చైనా

ఫొటో సోర్స్, Getty Images

'మావో తరువాత అత్యంత నిరంకుశనాయకుడు'

షీ జిన్‌పింగ్ పార్టీలో అగ్రస్థానానికి చేరుకున్నప్పటి నుంచి, పార్టీ శ్రేణులలో అత్యున్నత స్థాయి వరకు విస్తరించిన అవినీతిని అణిచివేసే చర్యలు చేపట్టారు. విమర్శకులు దీనిని రాజకీయ ప్రక్షాళనగా అభివర్ణిస్తారు.

ఆయన పాలనలో చైనాలో స్వేచ్ఛకు సంకెళ్లు వేయడం పెరిగింది. షిన్‌జియాంగ్‌ ప్రాంతంలో గత కొన్నేళ్లల్లో పది లక్షలకు పైగా వీగర్ ముస్లింలను నిర్బంధ శిబిరాల్లో ఉంచారని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. అవి "పునర్విద్యా శిబిరాలని" చైనా ప్రభుత్వం చెబుతోంది. అక్కడ మారణహోమం జరుగుతోందని అమెరికా సహా పలు దేశాలు ఆరోపిస్తున్నాయి. అయితే, అవన్నీ అవాస్తవాలని చైనా కొట్టిపారేసింది.

షీ జిన్‌పింగ్ నాయకత్వంలో హాంగ్‌కాంగ్‌పై చైనా పట్టు బిగించింది.

జిన్‌పింగ్ 2020లో జాతీయ భద్రతా చట్టంపై సంతకం చేయడం ద్వారా ప్రజాస్వామ్య అనుకూల నిరసనలకు ముగింపు పలికారు. ఈ చట్టం కింద వేర్పాటువాదం, విదేశీ శక్తులతో చేతులు కలపడం మొదలైనవాటిని విద్రోహ చర్యలుగా పరిగణిస్తూ అధికంగా జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది.

ఈ చట్టం ద్వారా భారీ సంఖ్యలో ప్రజాస్వామ్య అనుకూలురు, యాక్టివిస్టులు, రాజకీయనాయకులను అరెస్ట్ చేశారు. అలాగే, ఆపిల్ డైరీ, స్టాండ్ న్యూస్ లాంటి ప్రముఖ మీడియా సంస్థలపై వేటుపడింది.

జిన్‌పింగ్ నాయకత్వంలో చైనా తైవాన్‌పై దృష్టి సారించింది. ఆ ద్వీపాన్ని తమ భూభాగంలో కలుపుకుంటామని శపథం పట్టింది. అవసరమైతే బలప్రయోగం చేయడానికి వెనుకాడమని ప్రకటించింది. అధికారికంగా స్వతంత్రం ప్రకటించుకునే దిశలో అడుగులు వేస్తే సైనిక చర్యలు చేపడతామని బెదిరించింది.

ప్రపంచ వేదికపై చైనా బలం, ప్రభావం దృష్ట్యా షీ జిన్‌పింగ్ మూడో పాలనను ప్రపంచం నిశితంగా గమనిస్తుంది.

69 ఏళ్ల షీ జిన్‌పింగ్‌కు స్పష్టమైన రాజకీయ వారసులు లేకపోయినప్పటికీ, ఆయన్ను చైనాలో మావో జెడాంగ్ తరువాత అవతరించిన అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా విమర్శకులు పరిగణిస్తారు.

వీడియో క్యాప్షన్, తైవాన్ ఉత్పత్తులపై చైనా విధించిన నిషేధంతో తైవాన్ ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో పడిందా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)