Pakistan debt crisis: చైనా రుణాలు మాఫీ చేసి పాకిస్తాన్‌ను గట్టెక్కిస్తుందా? లేక అమెరికాలాగే చేస్తుందా?

ఫొటో సోర్స్, REUTERS/Fayaz Aziz
- రచయిత, మొహమ్మద్ సుహైబ్
- హోదా, బీబీసీ ఉర్దూ ప్రతినిధి
చైనా నుంచి తీసుకున్న రుణాలను పాకిస్తాన్ తిరిగి చెల్లించే విషయంపై అమెరికా నుంచి ఇంతకు ముందే ప్రకటన వెలువడింది. అయితే, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో చేసిన తాజాగా చేసిన ప్రకటన మరోసారి దీనిపై అందరూ దృష్టి సారించేలా చేసింది.
'డాన్'వార్తాపత్రిక కథనం ప్రకారం, బిలావల్ భుట్టో 'ఫారిన్ అఫైర్స్' మేగజైన్ కు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. చైనాతో ఉన్న అప్పులను రీప్లాన్ చేయడం, వాయిదా వేయడం లేదా స్వాపింగ్ గురించి ఆ దేశంతో మాట్లాడలేదని, ఒకవేళ అది జరిగినా పాకిస్తాన్ కండీషన్ల ప్రకారమే జరుగుతుందని ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.
వరదల కారణంగా దెబ్బతిన్న ప్రస్తుత సంక్షోభం నుండి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను బయటపడేయడానికి పాకిస్తాన్‌కు అంతర్జాతీయ సమాజం నుండి సహాయం కావాలి.
అయితే, నిపుణుల అభిప్రాయం ప్రకారం, 2010 వరదల మాదిరిగా కాకుండా, ఈసారి మరింత విస్తృత స్థాయిలో విధ్వంసం జరగడంతో, అమెరికా, చైనాలు రెండింటినీ పాకిస్తాన్ సహాయం అడగాల్సి వచ్చింది. అయినా, తనకు అవసరమైనంత సాయం పొందలేకపోయింది.
2010లో మాదిరిగా కాక, ఈసారి తమ వద్ద వివిధ కారణాల వనరులు అందుబాటులో లేవని చెప్పిన అమెరికా, చైనా నుంచి తీసుకున్న రుణాలను మాఫీ చేయించుకోవాలని, లేదంటే రీస్ట్రక్చర్ చేసుకోవాలని పాకిస్తాన్ కు సూచించింది.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, ఈ వ్యవహారంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. వరదలతో దెబ్బతిన్న పాకిస్తాన్ కోసం అమెరికా అవసరమైన, ప్రయోజనకరమైన సాయం చేయాలని, పాకిస్తాన్-చైనా సంబంధాలపై అనవసరమైన విమర్శలు, వ్యాఖ్యలు చేయవద్దని ఒక ప్రకటనలో ఘాటుగా వ్యాఖ్యానించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
పాకిస్తాన్‌లో వరదల తరువాత, చైనా సుమారు $90 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 735 కోట్లు ) సహాయాన్ని ప్రకటించిందని, ఇది పాకిస్తాన్‌కు అతిపెద్ద సాయమని, పాకిస్తాన్‌లోని చైనా రాయబారి ఒక ప్రకటనలో తెలిపారు.
తనకు పాకిస్తాన్ ఇవ్వాల్సిన 130 మిలియన్ డాలర్ల (సుమారు రూ.వెయ్యి కోట్లు ) రుణం తిరిగి చెల్లింపును వాయిదా వేసుకునే అవకాశాన్ని అమెరికా కల్పించింది. పాకిస్తాన్‌కు వనరులు అందించడమే తమ లక్ష్యం అని అమెరికా పేర్కొంది.
గతంలో పాకిస్తాన్ పర్యటన సందర్భంగా, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ కూడా అప్పుల విషయంలో ఇలాంటివే కొన్ని సూచనలు చేశారు.

పాకిస్తాన్‌లో వరద బీభత్సం
- గత కొన్ని రోజులుగా, పాకిస్తాన్ తీవ్ర వరదలతో పోరాడుతోంది. వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది నష్టపోయారు.
- పాకిస్తాన్‌కు చైనా దాదాపు 90 మిలియన్ డాలర్ల(సుమారు రూ. 735 కోట్లు ) సాయం ప్రకటించింది.
- పాకిస్తాన్ తనకు ఇవ్వాల్సిన 130 మిలియన్ డాలర్ల (సుమారు రూ.వెయ్యి కోట్లు ) రుణాల చెల్లింపులను వాయిదా వేసుకునేందుకు అమెరికా అవకాశం కల్పించింది.
- ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) ప్రకారం చైనా నుంచి పాకిస్తాన్ $30 బిలియన్ డాలర్ల ( సుమారు 2.45 లక్షల కోట్లు) రుణం తీసుకుంది.
- ఇది ఆ దేశపు మొత్తం విదేశీ రుణంలో మూడింట ఒక వంతు.
- పారిస్ క్లబ్‌తో పాటు, చైనా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి కూడా పాకిస్తాన్ రుణాలు తీసుకుంది.

ఈ నేపథ్యంలో పాక్ నుంచి రుణాల వసూలు అప్పులిచ్చిన దేశాలు వెంటనే నిలిపేయాలని ఐక్యరాజ్యసమితి గత వారం ఒక పేపర్‌లో పేర్కొంది.
ఈ ఆర్థిక సంక్షోభం, వరదల వల్ల కలిగే నష్టాలను భర్తీ చేయడానికి చైనా నుంచి తీసుకున్న రుణాలను మాఫీ చేయించుకోవడం తప్ప పాకిస్తాన్‌కు వేరే మార్గం లేదని దీని అర్థమా? పాకిస్తాన్ అలా చేయడానికి వెనుకాడుతోందా?

ఫొటో సోర్స్, AFP/Getty Images
పాకిస్తాన్ చైనా నుంచి ఎంత రుణం తీసుకుంది?
పాకిస్తాన్ తీసుకున్న విదేశీ రుణాలను పరిశీలిస్తే, ఈ నెల ప్రారంభంలో ఐఎంఎఫ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, పాకిస్తాన్ చైనా నుండి 30 బిలియన్ డాలర్ల( సుమారు 2.45 లక్షల కోట్లు) రుణాన్ని తీసుకుంది. ఇది దాని మొత్తం విదేశీ రుణాలలో మూడింట ఒక భాగం.
ఆర్థిక వ్యవహారాలను పరిశీలించే జర్నలిస్ట్ ఖుర్రం హుస్సేన్ దీని గురించి మాట్లాడుతూ చైనా నుండి రుణాల విషయంలో పాకిస్తాన్ చాలా ఇబ్బందుల్లో ఉందని చెప్పారు.
''పాకిస్తాన్ చైనా నుంచి తీసుకున్నది ఒక్క రుణం కాదు. అది భిన్న రూపాల్లో ఉంది. ఇదే సమస్యకు కారణం. అందుకే దీన్ని రీస్ట్రక్చర్ చేయడం చాలా క్లిష్టమైన వ్యవహారం'' అని ఖుర్రం హుస్సేన్ అన్నారు.
థింక్ ట్యాంక్ ఎస్‌డీపీఐ అధినేత అబిద్ ఖయ్యూమ్ దీనిపై బీబీసీతో మాట్లాడారు. పాకిస్తాన్ విదేశీ రుణాలలో ఎక్కువగా పారిస్ క్లబ్ సభ్యుల నుండి తీసుకున్న రుణాలు ఉన్నాయని, తర్వాతే చైనా ఉందని చెప్పారు.
"పాకిస్తాన్ చైనాకు చాలా రుణపడి ఉంది. అయితే, చైనా అప్పులు దీర్ఘకాలికంగా ఉంటాయి. వాటిని త్వరగా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు" అని ఆయన అన్నారు.
అయితే, "ఒక సంస్థ లేదా దేశం రుణం ఇచ్చే సమయంలో గతంలో ఆ దేశం తీసుకున్న ఇతర రుణాల గురించి అడగడం సాధారణ విషయం" అని కూడా ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, AFP
రుణాలను రీస్ట్రక్చర్ చేయడం ఎందుకంత కష్టం?
రుణాల చెల్లింపుల్లో రీస్ట్రక్చర్ సదుపాయాన్ని పొందడం పాకిస్తాన్‌కు ఎందుకంత కష్టంగా మారుతోందన్న ప్రశ్న ఇక్కడ తలెత్తుతోంది. దీనికి కారణం రుణాలు ఇచ్చే సామర్థ్యం ఉన్న దేశాల సంఖ్య పెరగడమేనని ఖుర్రం హుస్సేన్ అన్నారు.
"పాకిస్తాన్ గతంలో అప్పుల విషయంలో రీస్ట్రక్చర్ చేసింది, కానీ ఇప్పుడు రుణం కోసం సింగిల్ విండోకు వెళ్లి క్లబ్‌తో మాట్లాడవలసి ఉంటుంది. ఎందుకంటే, అప్పులిచ్చిన దేశానికి అక్కడ ప్రాతినిధ్యం ఉంటుంది'' అన్నారు హుస్సేన్.
2002 తరువాత, అఫ్గానిస్తాన్ యుద్ధ సందర్భంలో పాకిస్తాన్ తనకు లభించిన రుణాలను పెద్ద మొత్తంలో రీస్ట్రక్చర్ చేసుకుంది. ఆ సమయంలో పాకిస్తాన్‌కు పెద్ద మొత్తంలో రుణం సమకూరింది. కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది.
పారిస్ క్లబ్‌తో పాటు చైనా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి దేశాలు రుణాలు ఇచ్చే స్థానంలో ఉన్నాయి.
"పాకిస్తాన్ పారిస్ క్లబ్‌కి వెళ్తే, వాళ్లు ముందు చైనాతో మాట్లాడమంటారు. చైనాకు వెళ్తే ముందు పారిస్ క్లబ్ అడగమంటుంది. సౌదీ అరేబియాకు వెళ్తే ఐఎంఎఫ్ నుంచి కాన్ఫిడెన్స్ ఇవ్వమంటుంది. అందువల్ల ఈ రీస్ట్రక్చరింగ్ చాలా క్లిష్టమైన ప్రక్రియ'' అని ఖుర్రం హుస్సేన్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- చైనా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉంది.. ఈ ‘విధ్వంసానికి’ 5 కారణాలు..
- తెలంగాణ: ‘చూపు పోయింది.. వరంగల్‌లో అడుక్కుని బతకమన్నారు.. 50 ఏళ్లుగా నేను ఏం చేస్తున్నానంటే..’
- జనాభా నియంత్రణ గురించి ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు.. టార్గెట్ ముస్లింలు, క్రైస్తవులేనా?
- శ్రీకాకుళం జిల్లా: బట్టలు ఉతకం అన్న రజకులు.. ఇతర కులాల సహాయ నిరాకరణ.. ఏం జరిగింది? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- మెక్సికోలో అగంతకుల కాల్పులు, మేయర్ సహా 18మంది మృతి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














