కేరళ: ప్రశ్న పత్రంలో ఇస్లాంను దూషించారంటూ టీజే జోసెఫ్ చేయి నరికారు, ఇప్పుడు ఆ ప్రొఫెసర్ ఎలా ఉన్నారు?

- రచయిత, సౌతిక్ బిస్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కేరళకు చెందిన ప్రొఫెసర్ టీజే జోసెఫ్ రూపొందించిన ప్రశ్న పత్రంలో ఇస్లాం దూషణకు పాల్పడ్డారనే ఆరోపణతో మత ఛాందసవాదులు ఆయనపై దాడి చేసి చేయిని నరికేశారు. పీఎఫ్‌ఐ సభ్యులు 2010లో చేసిన ఈ దాడి తర్వాత ఆ ప్రొఫెసర్ జీవితమే మారిపోయింది.
ఈ దాడికి పాల్పడిన వివాదాస్పద ముస్లిం సంస్థ 'పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా'ను భారత ప్రభుత్వం గత నెలలో నిషేధించింది.
ప్రొఫెసర్ చేతిని నరికిన తర్వాత నుంచి ఇప్పటి వరకు జరిగిన సంఘటనలను అర్ధం చేసుకునేందుకు బీబీసీ కేరళ వెళ్ళింది.
హెచ్చరిక: ఈ కథనంలో మనసును కలచివేసే విషయాలుంటాయి.
టీజే జోసెఫ్‌కు తనపై 12 ఏళ్ల క్రితం జరిగిన దాడి స్పష్టంగా గుర్తుంది. ఆ రోజు ఏం జరిగిందో ఆయన వివరించారు. అది జులై నెల. వర్షాకాలం. 52 ఏళ్ల ప్రొఫెసర్ జోసెఫ్ స్థానిక కాలేజీలో మలయాళం టీచర్.
ఆయన మువట్టుపుర ఆదివారం చర్చిలో ప్రార్ధనలకు హాజరైన తర్వాత తల్లి, సోదరితో కలిసి ఇంటికి తిరిగి వస్తున్నారు. ఆయన ఇంటికి 100 మీటర్ల దూరంలో ఉన్న సందులో నుంచి ఒక సుజుకీ వ్యాన్ దూసుకొచ్చి ఆయన కారుకు అడ్డంగా ఆగింది.
ఆ మినీ వ్యాన్ డోర్ తెరుచుకుంది. అందులోంచి ఆరుగురు వ్యక్తులు దిగారు. ఒక వ్యక్తి జోసెఫ్ కారు వైపు దూసుకుంటూ వచ్చారు. ఆ వ్యక్తి చేతిలో ఒక గొడ్డలి ఉంది.
డ్రైవర్ డోర్ దగ్గరకు వచ్చి తలుపు బలవంతంగా తెరవడానికి ప్రయత్నిస్తుండగా, మరో వ్యక్తి వెనుక నుంచి వచ్చి వెనుక వైపు డోర్ ను బద్దలుకొట్టారు. మరో ముగ్గురు ఆయన సోదరి కూర్చున్న వైపుకు దూసుకొచ్చారు.
జోసెఫ్ తన వాగన్ ఆర్ ఇంజన్‌ను ఆపారు. ఇంతలో డ్రైవర్ వైపు కిటికీని గొడ్డలితో బద్దలుకొట్టడంతో అది ముక్కలు ముక్కలుగా విరిగింది.
ప్రొఫెసర్ జోసెఫ్‌కు తన మీదకు దాడికి వచ్చారనే విషయం అర్ధమయింది.

గొడ్డలి పట్టుకుని వచ్చిన వ్యక్తి కారు లోపలికి చేయి పెట్టి తలుపు తెరిచారు. జోసెఫ్‌ను కారు నుంచి బయటకు లాగి, వర్షంతో తడిసిన రోడ్డు మీదకు ఈడ్చుకుంటూ వెళ్లారు.
"నన్ను చంపకండి, దయ చేసి నన్ను చంపకండి" అని ప్రొఫెసర్ జోసెఫ్ వారిని వేడుకున్నారు. కానీ, వారు ఆయన "చేతులు, కాళ్ళను గొడ్డలితో చెక్కను నరికినట్లుగా నరికారు."
అప్పటికే, ఆయన ఎడమ చేయి విరిగి భుజానికి వేలాడుతోంది. కుడి చేయి విరిగి పడే స్థితిలో ఉంది.
అద్దాలు పగిలిన శబ్దం, ఆందోళనతో కూడిన అరుపులు విన్న ప్రొఫెసర్ జోసెఫ్ భార్య, కొడుకు ఇంట్లో నుంచి పరుగు పెట్టుకుంటూ బయటకు వచ్చారు. జోసెఫ్ కుమారుడు ఇంట్లో ఉన్న కొడవలిని ఊపుతూ పరుగు పెట్టుకుంటూ వచ్చి తండ్రిపై దాడి చేస్తున్న వ్యక్తిని ఎదుర్కోవడానికి ప్రయత్నించారు.
నిందితులు నాటు బాంబు పేల్చి, రక్తం కారుతున్న వ్యక్తిని రోడ్డు పై వదిలిపెట్టి వ్యాన్‌లో పారిపోయారు.
జోసెఫ్ పక్కింటి వాళ్ళు పరుగుపెట్టుకుంటూ వచ్చి ఆయనను ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. ఎండిన టేకు చెట్టు ఆకులా పక్కింటి వాళ్ళ తోటలో పడి ఉన్న తెగిన చేతిని ఒక సంచిలో పెట్టి ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు.
అక్కడి నుంచి 31 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రిలో జోసెఫ్ ను అత్యవసర విభాగంలో చేర్చారు.
ఆయనకు శస్త్ర చికిత్స చేసేందుకు ఆరుగురు డాక్టర్లు 16 గంటల సమయం తీసుకున్నారు. తెగిన చేతిని అతికించి శస్త్ర చికిత్స చేసేందుకు, ఆయన అర చేయి, మోచేతిని సరిచేసేందుకు 16 సీసాల రక్తం ఎక్కించాల్సి వచ్చింది.
ప్రొఫెసర్ జోసెఫ్‌కు శస్త్ర చికిత్స జరిగిన 18 గంటలకు తెలివి వచ్చింది. ఆస్పత్రికి మీడియా వెల్లువ మొదలయింది. టీచర్ పై జరిగిన దాడికి ప్రజల నుంచి ఆగ్రహం వెల్లువెత్తింది. ఆయనను 35 రోజుల తర్వాత ఆస్పత్రి నుంచి డిస్ ఛార్జ్ చేశారు. అందులో 11 రోజులు క్రిటికల్ కేర్ లో ఉన్నారు.
"విద్యార్థుల ప్రశ్నపత్రంలో చేర్చిన ఒక ప్రశ్న ఇస్లాంను అవమానపరిచేదిగా ఉందని కొందరు భావించడమే నేను చేసిన నేరం. వారి ఆలోచన నా జీవితాన్నే తలకిందులు చేసింది" అని జోసెఫ్ అన్నారు.

ఈ దాడి జరగడానికి సరిగ్గా నాలుగు నెలల ముందు మార్చి 26న ఒక ఫోన్ కాల్ తో జోసెఫ్ నిద్ర లేచారు. ఆ రోజు రాత్రి ఆయనకు సరిగ్గా నిద్రపట్టలేదు.
న్యూమన్ కాలేజీ ప్రిన్సిపల్ కాల్ చేసి కాలేజీ గ్రౌండ్స్‌లో పోలీసులు చేరుతున్నారని, కాలేజీకి దూరంగా ఉంటే మంచిదని హెచ్చరించారు.
జోసెఫ్ 25 ఏళ్ల టీచింగ్ కెరీర్‌లో ఇది మూడవ ఉద్యోగం. ఆయన ఈ ఉద్యోగంలో చేరి అప్పటికి రెండేళ్ళయింది. ఈ కాలేజీ రోమన్ క్యాథలిక్ చర్చి అధీనంలో ఉంది.
"నువ్వు కాలేజీకి వస్తే పరిస్థితులు విషమించవచ్చు" అని ప్రిన్సిపాల్ చెప్పారు.
"నేనేమి తప్పు చేయలేదు" అని జోసెఫ్ సమాధానమిచ్చారు.
"మహమ్మద్ ప్రవక్తను అవమానించినట్లు ఆరోపణలు వస్తున్నాయని, కాలేజీ గోడలపై పోస్టర్లను కూడా పెట్టినట్లు ప్రిన్సిపల్ చెప్పారు.
సినీ దర్శకుడు పీటీ కుంజు ముహమ్మద్ స్క్రీన్ ప్లేస్ మీద రాసిన పుస్తకంలోని ఒక సంభాషణను జోసెఫ్ వ్యాకరణ చిహ్నాలను సరిచేసే ప్రశ్నగా తీసుకున్నారు. అది "దేవుడు, ఓ పిచ్చివాడికి" మధ్య సాగినట్లుగా రాసిన ఒక ఊహాత్మక సంభాషణ.
ఆ పిచ్చివాడికి ఆయన ముహమ్మద్ అనే పేరు పెట్టారు. అది ఆ సినీ దర్శకుడి చివరి పేరు మీద పెట్టానని జోసెఫ్ చెప్పారు.
"ముస్లింలలో ముహమ్మద్ చాలా సాధారణమైన పేరు. ఆ పేరును మహమ్మద్ ప్రవక్తగా అర్ధం చేసుకుంటారనే ఆలోచన నాకు రాలేదు" అని ప్రొఫెసర్ జోసెఫ్ చెప్పారు.
"ఈ పరీక్షను 32 మంది విద్యార్థులు రాయగా అందులో నలుగురు ముస్లిం విద్యార్థులు ఉన్నారు. అయితే, ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. ఒకే ఒక్క అమ్మాయి మాత్రం ఈ ప్రశ్నకు అభ్యంతరం వ్యక్తం చేసింది" అని చెప్పారు.
"కాలేజీలో ఉద్రిక్తతలు పెరిగాయి. పోలీసులు నిరసనకారులను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. మరో వైపు రౌడీ మూకలు పట్టణంలో షాపులు మూసేయమని బెదిరించారు. కాలేజీ యాజమాన్యం జోసెఫ్‌ను విధుల నుంచి తొలగించింది.
"ముందస్తు హెచ్చరిక లేకుండా నన్ను బట్టలు విప్పి నడివీధిలో నిలబెట్టినట్లు అనిపించింది" అని అన్నారు.
ప్రొఫెసర్ జోసెఫ్, భార్య సలోమీని ఒక జత దుస్తులు ప్యాక్ చేయమని అడిగి పట్టణం విడిచి పెట్టి వెళ్లారు.
ఆ తర్వాత కొన్ని రోజుల పాటు చౌకబారు హోటళ్లలో తల దాచుకుంటూ, టీవీలో వస్తున్న వార్తలను చూస్తూ ఒక చోటు నుంచి మరొక చోటుకు ప్రయాణిస్తూనే ఉన్నారు. ఆయనను వెతికి పట్టుకునేందుకు పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడ్డారు. ఆఖరుకు ఆయన వివరాలు తెలుసుకునేందుకు 22 ఏళ్ల కొడుకును కూడా కస్టడీలోకి తీసుకున్నారు.
ఆరు రోజుల తర్వాత ప్రొఫెసర్ జోసెఫ్ పోలీసులకు లొంగిపోయారు.
ఆయనను హత్యా నేరం, అక్రమ మద్యం కేసుల్లో నిందితులైన మరో 15 మందితో కలిపి జైలులో బంధించారు. పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి పాస్ పోర్టు, బ్యాంకు పుస్తకాలు, అధికారిక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అన్నిటి కంటే ముఖ్యంగా ఆయన దైవ దూషణ చేశారని ఆరోపించారు.
ప్రొఫెసర్ జోసెఫ్ పని చేసిన కాలేజీ యాజమాన్యం నిరసనకారులకు బహిరంగ క్షమాపణ చెప్పింది. పోలీసులు ఆయనను ప్రశ్న పత్రం నిందితుడు అని పిలిచారు. కాలేజీ ఆయనపై, "వివిధ మతాలు, ముఖ్యంగా ఇస్లాం మతస్థుల మనోభావాలను గాయపరిచారని" అంటూ అనేక ఆరోపణలు చేసింది.
జైలులో వారం రోజులు గడిపిన తర్వాత ప్రొఫెసర్ జోసెఫ్‌కు బెయిల్ లభించింది. ఆయన అత్తగారింట్లో ఉండటం మొదలుపెట్టారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు కూడా భయపడేవారు.
"మత చాందసవాదులు నన్ను చంపేస్తారేమోనని మనసులో భయం వెంటాడుతుండేది" అని చెప్పారు.

వివిధ గ్రూపులకు చెందిన వ్యక్తులు ఆయనను వెతుక్కుంటూ ఆయన ఇంటికి మూడు సార్లు వచ్చారు. ఒక సారి వారు వచ్చేసరికి ఆయన ఇంట్లో లేరు.
కాలేజీ మ్యాగజైన్ కోసం ప్రొఫెసర్ అనుభవాలు రాయమని అడిగేందుకు వచ్చామని చెబుతూ ఆరుగురు వ్యక్తులు విద్యార్థుల పేరుతో ఇంటికి వచ్చారు.
రెండో సారి ఆ బృందంలో ఒకరి కూతురి కిడ్నీ వైద్యం కోసం విరాళాలు సేకరించడానికి వచ్చామని చెప్పారు. వాళ్లొక రిఫరెన్స్ లేఖను కూడా అయన చేతిలో పెట్టారు.
"నేను గేటు నుంచి రెండు అడుగులు వెనక్కి వేసాను. ఆ కవర్ పై నా పేరు ఉంది. అది బాంబు అయి ఉండవచ్చని అనుకున్నాను. దీంతో, దానిని తిరిగి ఇచ్చేసి తలుపు వేసుకున్నాను" అని జోసెఫ్ గుర్తు చేసుకున్నారు.
"వాళ్ళు బైకులపై వెనక్కి వెళ్లిపోయారు. వాళ్ళ ముఖాలలో ఎటువంటి భావం కనిపించలేదు" అని అన్నారు.
"వాళ్ళు నాపై దాడి చేసేందుకు తిరిగి వస్తారని తెలుసు. నా పొరుగింటి వారికి చెబితే, నన్ను అక్కడి నుంచి మారిపోమని సలహా ఇచ్చారు. నా వృద్దురాలైన తల్లి, కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళలేను. నేను ఆందోళనకు గురయ్యాను" అని చెప్పారు.
ప్రొఫెసర్ జోసెఫ్ పోలీసు భద్రత కోరారు. అయితే, వాళ్ళు రాత్రి పూట మాత్రం కాపలాకు వచ్చి వెళ్లిపోయారు.
మే నెలలో మధ్యాహ్న సమయంలో ఆ మనుషులు తిరిగి మళ్ళీ వచ్చారు.. అందులో ఇద్దరు డోర్ బెల్ కొట్టి బ్యాంకు నుంచి వచ్చామని చెప్పారు. ఒకరు లోపలికి దూసుకొచ్చి పోలీసునని చెప్పారు. వాళ్ళు జోసెఫ్ కోసం వెతుకుతూ గదులన్నీ తిరిగారు. అప్పుడు ఆయన పక్కింట్లో ఉన్నారు.
వాళ్ళు ఇళ్లంతా తిరిగి చూసుకుని బైకులపై వెళ్లిపోయారు. ఈ సారి కూడా జోసెఫ్ తృటిలో తప్పించుకున్నారు.
అప్పటి నుంచి ఆయన ఇంటి తలుపులను గట్టిగా బిగించుకోవడం, తాళాలు వేయడం లాంటివి చేయడం మొదలుపెట్టారు.
ఇంటి లోపలి నుంచి ఎవరో ఒకరు నిరంతరం రోడ్డు పై వెళుతున్న వారిని గమనించేవారు.
ప్రొఫెసర్ జోసెఫ్ కూడా రెండు కొడవళ్లను తయారు చేయించి ఇంట్లో పెట్టుకున్నారు. ఆయన లివింగ్ రూమ్ లో కర్టెన్ల వెనుక వాటిని దాచిపెట్టి ఉంచారు. ఆయన ఇంట్లోనే ఉండేవారు.
కానీ, ఆ జూలై ఉదయం జరిగిన హింసాత్మక దాడితో ఆయన జీవితమే మారిపోయింది.

ఫొటో సోర్స్, PTI
ఈ దాడికి సంబంధించి 31 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్లంతా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు చెందిన వారు. ఈ వివాదాస్పద ముస్లిం సంస్థ 2006లో ఏర్పడింది. దీనికి తీవ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయనే ఆరోపణతో ఇటీవల భారత ప్రభుత్వం అయిదేళ్ల పాటు నిషేధం విధించింది. అయితే, ఆ సంస్థ ఈ ఆరోపణలను ఖండించింది.
ఈ దాడిలో 13 మందికి శిక్ష విధించారు. 10 మంది 8 ఏళ్ల పాటు జైలులో ఉన్నారు. నిందితులకు చాలా తక్కువ శిక్ష విధించారని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు అప్పీలు చేశారు. ఈ కేసు కోర్టులో ఉంది.
తర్వాత మరో 11 మందిని అరెస్టు చేశారు. వీరంతా ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో సుమారు 400 మంది సాక్ష్యం చెప్పాలి. ఈ ఘటన జరిగి ఒక దశాబ్దం గడుస్తున్నా ప్రొఫెసర్ జోసెఫ్‌కు కోర్టు ఆదేశించిన 8 లక్షల రూపాయల పరిహారం అందలేదు.
"నేను విచారించిన కేసుల్లో ఇది అత్యంత పకడ్బందీ ప్రణాళికతో చేసిన దాడి" అని జాకబ్ పున్నూజ్ బీబీసీతో చెప్పారు. దాడి జరిగిన సమయంలో ఆయన కేరళ పోలీసు చీఫ్‌గా ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
"ఈ దాడి కోసం చాలా ప్రణాళిక జరిగింది. దాడి చేయాల్సిన వారిని గుర్తించారు. అందుకోసం ప్రదేశాన్ని ఎంపిక చేసుకున్నారు. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మూడు వాహనాలు, పారిపోయేందుకు రెండు కార్లను వాడారు" అని ఆయన చెప్పారు.
"ఈ దాడి చేసేందుకు వాళ్ళు నాలుగు సార్లు సమావేశమై ప్రతి చిన్న విషయాన్ని గమనించారు. ఆయనను ఇంట్లో దాడి చేయాలనుకున్న ప్రయత్నాలు విఫలమవ్వడంతో వాళ్ళు వ్యాన్ నంబర్ ప్లేట్లను కూడా మార్చేశారు."
ఆయన చర్చికి వెళ్లే దారి తెలుసుకునేందుకు మోటర్ సైకిల్‌పై ఒక వ్యక్తి వారిని వెంబడించారు.
"దోషులు చాలా తెలివితేటలుగా కొత్త సిమ్ కార్డులను వాడారు. అయితే, ఒక వ్యక్తి మాత్రం చిన్న పొరపాటు చేశారు. ఒక కొత్త సిమ్ కార్డును కొత్త ఫోన్ లో వేసి ఒక ర్యాండమ్ నంబర్‌కు కాల్ చేసి డిస్‌కనెక్ట్ చేశారు. ఆ నంబర్ మేము పట్టుకున్నాం" అని వివరించారు.
"ఇది మాఫియా తరహా దాడి. ఈ కేసును తొందరగా చేధించగలిగాం" అని చెప్పారు.
కానీ, జోసెఫ్ అసలైన కష్టాలు మొదలయ్యాయి.

ఫొటో సోర్స్, Professor Joseph
జోసెఫ్ ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన ఒక నెలలో ఆయన పని చేసే కాలేజీ ఆయనను విధుల నుంచి తొలగించింది.
కేరళలో నిరసనలు చోటు చేసుకున్నాయి. ఆయన చికిత్స కోసం కొంత మంది టీచర్లు విరాళాలు సేకరించారు. చాలా మంది ఆయనకు సానుభూతి పలుకుతూ ఉత్తరాలు రాశారు. సాహిత్యవేత్తలు ఈ దాడిని ఖండించారు.
ఇద్దరు మద్దతుదారులు కాలేజీ వెలుపల నిరసన చేశారు.
"ఇలాంటి పరిస్థితులలో, ఒక కుటుంబానికి ఆధారంగా ఉన్న వ్యక్తిని మానవత్వం లేని వారు మాత్రమే విధుల నుంచి తొలగిస్తారు" అని ఒక స్థానిక వార్తాపత్రిక సంపాదకీయం రాసింది.
ప్రొఫెసర్ జీవితం తిరిగి కోలుకోలేని స్థితికి చేరుకుంది.
ఆయనకు గాయమైన కాలు, అరచేయి, వేళ్ళు సరిచేసుకోవడం కోసం 2010లో 2011లో వరుసగా శస్త్ర చికిత్సలు చేయించుకోవాల్సి వచ్చింది. జోసెఫ్ భార్య సలోమీ ఇంటిని నిర్వహించేందుకు షాపుల్లో పని చేశారు.
అయితే, 2013లో కోర్టు జోసెఫ్ పై దైవ దూషణ కేసును కొట్టేసింది. ఈ ప్రశ్నను తప్పుగా అర్ధం చేసుకున్న ముస్లింలు వివాదం సృష్టించారని కోర్టు పేర్కొంది.
నాలుగేళ్లుగా ఉద్యోగం లేకుండా ఉన్న జోసెఫ్ కోర్టు తీర్పు పెద్ద ఊరట నిచ్చింది.

ఫొటో సోర్స్, JOSEPH
కానీ, 48 ఏళ్ల ఆయన భార్య మాత్రం ఒత్తిడిలోకి జారిపోయి మార్చి 2014లో ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె మరణానికి కాలేజీ కారణమని నిందిస్తూ ప్రజల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుబికింది.
ఆమె మరణించిన మూడు రోజుల తర్వాత ప్రొఫెసర్ జోసెఫ్‌ను విధుల్లోకి తీసుకున్నారు. అప్పటికి ఆయన రిటైర్ అయ్యేందుకు మూడు రోజులు మాత్రమే సమయం ఉంది.
స్థానిక రోమన్ క్యాథలిక్ చర్చి మాత్రం తన అభిప్రాయానికి కట్టుబడే ఉంది. ప్రొఫెసర్ జోసెఫ్ ప్రశ్న దైవ దూషణ, మతాన్ని అవమానించడం కిందకే వస్తుందని పేర్కొంది. అది ఒక మతానికి చెందిన విద్యార్థులను బాధపెట్టిందని అంది.
ఆయన పై జాలి చూపించి మానవతా దృక్పధంతో విధుల్లోకి తీసుకున్నట్లు పాస్టర్ రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఆయనను విధుల్లోకి తీసుకోవడంతో ఆయనకు జీతం బకాయిలు, పదవీ విరమణ ప్రయోజనాలు లభిస్తాయి.
ఆయనకు మరో క్రైస్తవ మత సంస్థ నుంచి మద్దతు లభించింది.
"నా జీవితాన్ని వెనక్కి నెట్టేసిన ఈ దాడిని పోరాట స్పూర్తితో తీసుకున్నాను" "కానీ, సలోమి మరణం నన్ను వెంటాడుతూనే ఉంటుంది" అని అని జోసెఫ్ అన్నారు.

జోసెఫ్ జీవితం తిరిగి మొదటికి వచ్చింది. ఆయన ఒక రచయితగా పునర్జన్మ పొందానని అంటారు. ఆయన ఎడమ చేతితో 700 పేజీల జీవితానుభవాలను "ఏ థౌజండ్ కట్స్ " అనే పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకం గత ఏడాది విడుదల అయి 30,000 కాపీలు అమ్ముడయింది.
ఆయన ప్రస్తుతం చిన్న కథలతో పుస్తకాన్ని రాయాలని అనుకుంటున్నారు. ఆయన ఇంటికి మొదటి అంతస్తును కట్టుకున్నారు.
ఆయన 95 ఏళ్ల తల్లి, 35 ఏళ్ల కుమారునితో కలిసి ఆ ఇంట్లో ఉంటున్నారు. ఆయన కొడుకు ఒక స్టాక్ బ్రోకింగ్ సంస్థలో ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా పని చేస్తున్నారు. ఆయన కోడలు ఇంజనీర్.
ఆయన కూతురు ఐర్లాండ్‌లో నర్సుగా పని చేస్తున్నారు. దాడి జరిగినప్పుడు కారులో ఆయనతో పాటు ఉన్న సోదరి క్రైస్తవ సన్యాసి. ఆమె అప్పుడప్పుడూ ఇంటికి వస్తూ ఉంటారు.
ప్రొఫెసర్ జోసెఫ్ ప్రస్తుతం ప్రశాంతంగా కనిపిస్తున్నారు.
ఆయన పై దాడి చేసిన వారు ఒక పెద్ద ఆటలో పావులు మాత్రమేనని అంటూ వారిని క్షమించానని ప్రొఫెసర్ జోసెఫ్ చెప్పారు.
పీఎఫ్‌ఐ పై విధించిన నిషేధాన్ని ఆయన స్వాగతించారు.
కానీ, న్యాయ ప్రక్రియలో జరిగే జాప్యం ఆయనకు అలసట తెప్పిస్తోంది. "ఈ కేసుకు సంబంధించిన వారిని అరెస్టు చేసిన ప్రతి సారీ నేను జైలుకు వెళ్లి వాళ్ళను గుర్తించాల్సి వస్తోంది. కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. కోర్టుకు వెళ్ళినప్పుడు సంఘటన మొత్తాన్ని గుర్తు తెచ్చుకోవాల్సి వస్తోంది" అని అన్నారు.
ఈ భయానక ఘటన తర్వాత దుష్టశక్తి బారి నుంచి తప్పించుకున్నట్లు అనిపించిందా అని ప్రశ్నించినప్పుడు, ఆయన తనదైన ధోరణిలో సమాధానమిచ్చారు. "కొన్నేళ్ల క్రితం కేరళలో ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు నా విద్యార్థి ఒకరు తన 8 ఏళ్ల కూతురితో ఎదురయ్యారు. ఈయన జోసెఫ్ సర్. ఆ రోజు దురదృష్టకరమైన సంఘటనను ఎదుర్కొన్నారని ఆమె తన కూతురితో చెప్పింది. దానికి ఆమె కూతురు, 'ఆయన చేతిని నరికారని తెలియగానే భోరున ఏడ్చావు. ఆయనేనా ఈయన' అని తన తల్లిని అడిగింది" అని గుర్తు చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- PMBJP-జనరిక్ మందులు: కీళ్ల నొప్పుల నుంచి క్యాన్సర్ చికిత్స దాకా ఏ మందులైనా 50 నుంచి 90 శాతం తక్కువ ధరకే.. అయినా వీటిని ఎందుకు కొనట్లేదు?
- ‘హిందీని రుద్దుతున్నారు’ అంటూ ఎందుకు విమర్శలు పెరుగుతున్నాయి,అమిత్ షా కమిటీ సిఫారసుల్లో ఏముంది?
- కేరళలో నరబలి వివాదం: 'మంత్రగాడి సలహాతో' ఇద్దరు మహిళలను హత్య చేసిన దంపతులు.. ఏం జరిగింది?
- దగ్గు మందు వివాదం: ఈ సిరప్ ఇండియా నుంచి గాంబియా వరకూ ఎలా వెళ్లింది?
- ఆ ఊర్లో రాత్రి ఏడు కాగానే గంట మోగుతుంది, అందరూ ఫోన్లు, టీవీలు ఆపేస్తారు, ఎందుకు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












