సల్మాన్ రష్దీపై దాడి మీద ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఎందుకు మౌనం వహిస్తున్నాయి, ముస్లిం నేతలు ఎందుకు స్పందించడం లేదు

ఫొటో సోర్స్, DAVID LEVENSON/GETTY IMAGES
- రచయిత, దీపక్ మండల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘ది సాటానిక్ వెర్సెస్’’, ‘‘మిడ్‌నైట్ చిల్డ్రన్’’ లాంటి పుస్తకాలను రచించిన సల్మాన్ రష్దీ ప్రస్తుతం తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అమెరికాలో గత శుక్రవారం ఓ సాహిత్య కార్యక్రమంలో ప్రసంగించేందుకు వెళ్లిన ఆయనపై ఓ వ్యక్తి కత్తితో దాడిచేశాడు. దాడిలో రష్దీ ఒక కన్ను, కాలేయం దెబ్బతిన్నాయి. వెంటనే ఆయనను వెంటిలేటర్‌పై పెట్టి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఆయన మాట్లాడగలుగుతున్నారు.
రష్దీ పుస్తకం ‘‘సాటానిక్ వెర్సెస్’’ 1988లో విడుదలైంది. అయితే, దీనిలో మహమ్మద్ ప్రవక్తపై తీవ్రమైన ఆరోపణలు చేశారని వివాదం రాజుకుంది.
ఈ పుస్తకం ప్రచురణకు ఏడాది తర్వాత, 1989లో రష్దీని హత్య చేయాలంటూ ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా రుహొల్లా ఖొమేనీ ఒక ఫత్వా జారీచేశారు. దీంతో దశాబ్ద కాలం పాటు రష్దీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ సమయంలో బ్రిటన్ భద్రతా సంస్థలు ఆయనకు రక్షణ కల్పించాయి.
అయితే, 1990ల చివర్లో మళ్లీ రష్దీ ప్రజల మధ్య తిరగడం మొదలుపెట్టారు. 1998లో రష్దీని హత్య చేసేందుకు ఎవరినీ తాము ప్రోత్సహించాలని అనుకోవడంలేదని ఇరాన్ కూడా చెప్పింది.
అయితే, రష్దీ పై తాజా దాడిని అమెరికాతోపాటు పశ్చిమ దేశాలు ఖండించాయి. మరోవైపు భావ ప్రకటన స్వేచ్ఛకు మద్దతు పలికే ప్రముఖ రచయితలు కూడా ఈ దాడిని తప్పుపట్టారు.
రష్దీ ఏళ్లపాటు అజ్ఞాతంలో గడపడానికి కారణమైన ఇరాన్ అత్యున్నత నాయకులు ఎవరూ ఈ దాడిపై మాట్లాడలేదు. కానీ, ఆదివారం ఇరాన్ విదేశాంగ శాఖ స్పందించింది. రష్దీపై దాడికి ఆయనతోపాటు ఆయన మద్దతుదారులే కారణమని వ్యాఖ్యానించింది.

ఫొటో సోర్స్, Getty Images
భారత విదేశాంగ శాఖ ఏమంది?
అయితే, తాజా దాడి విషయంలో భారత ప్రభుత్వం లేదా ఇక్కడి రాజకీయ పార్టీలు మౌనం వహిస్తున్నాయి. మరోవైపు ముస్లిం సంఘాలకు చెందిన ప్రముఖ నాయకులు కూడా దాడిపై మాట్లాడటం లేదు.
రష్దీపై దాడి మీద స్పందించాలని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌ను మీడియా కోరింది. ‘‘నేను కూడా ఆ ఘటన గురించి చదివాను. నాతోపాటు ప్రపంచం మొత్తం దీన్ని చూసి ఉంటుంది. దీనిపై చాలా మంది నుంచి స్పందనలు కూడా వస్తున్నాయి’’అని ఆయన అన్నారు.
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, పార్టీ మీడియా చీఫ్ పవన్ ఖేడా, శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేది తదితరులు వ్యక్తిగతంగా ఈ దాడిని ఖండించారు. అయితే, ఇటు బీజేపీ లేదా అటు కాంగ్రెస్ నుంచి ఎలాంటి అధికారిక స్పందనా రాలేదు.

ఫొటో సోర్స్, Getty Images
రాజకీయ కారణాలు ఉన్నాయా?
భారత్‌లో జన్మించిన సల్మాన్ రష్దీ.. బ్రిటన్‌లో స్థిరపడ్డారు. ఆయనకు అమెరికా పౌరతస్వం ఉంది. అయితే, 1988లో ‘‘ది సాటానిక్ వెర్సెస్’’ పుస్తకం ప్రచురణ తర్వాత భారత్‌తో ఆయన సంబంధాలు దెబ్బతిన్నాయి. అప్పట్లో ఇక్కడ రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఉండేది. ఈ పుస్తకాన్ని నిషేధించాలని అప్పట్లో రాజీవ్ ప్రభుత్వం సూచించింది. ది సాటానిక్ వెర్సెస్‌పై నిషేధం విధించిన తొలి దేశం భారత్.
ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ రాజీవ్ గాంధీకి రష్దీ ఒక లేక రాశారు. ‘‘ముస్లిం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఈ పుస్తకంపై నిషేధం విధించాలని చూస్తున్నారు’’అని ఆయన వ్యాఖ్యానించారు. అప్పట్లో కాంగ్రెస్‌కు ముస్లింల ఓట్లు కీలకంగా ఉండేవి. వీటిని కోల్పోయే చర్యలను కాంగ్రెస్ తీసుకునేదికాదు.
సాటానిక్ వెర్సెస్‌పై నిషేధం విధించినప్పుడు భారత విదేశాంగ మంత్రిగా నట్వర్ సింగ్ ఉండేవారు. ఈ విషయంపై అప్పట్లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఆయన్ను ప్రశ్నించింది. ‘‘శాంతి, భద్రతల కారణాల వల్ల ఈ పుస్తకంపై నిషేధం విధించాం. ఇక్కడ ముస్లింల ఓట్ల కోసం బుజ్జగింపు రాజకీయాలు ఏమీలేవు’’అని ఆయన వ్యాఖ్యానించారు.
గతంలో కాంగ్రెస్ తీసుకున్న చర్యల వల్లే ప్రస్తుత దాడిపై కాంగ్రెస్ స్పందించడంలేదని స్పష్టంగా తెలుస్తోంది. లేకపోయుంటే, భావప్రకటన స్వేచ్ఛ హక్కులను ఉల్లంఘించేందుకు కారణం అవుతున్నారంటూ మోదీ ప్రభుత్వంపై పార్టీ విమర్శలు చేసేది.
సల్మాన్ రష్దీ పుస్తకం ‘‘మిడ్‌నైట్స్ చిల్డ్రన్’’ను హిందీలోకి సీనియర్ జర్నలిస్టు ప్రియదర్శన్ అనువదించారు. ‘‘నేడు మనకు కనిపిస్తున్న విద్వేషం నాణేనికి ఒక వైపు మాత్రమే. బీజేపీ, ఆ పార్టీ మిత్ర పక్షాలు ఇలాంటి దాడులను చూసీచూడనట్లుగా ఊరుకుంటాయి’’అని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘కనీసం రష్దీపై జరిగిన దాడినైనా ప్రభుత్వం ఖండించాల్సి ఉంది. కానీ, ఇక్కడ వ్యక్తిగత దాడులపై ప్రభుత్వం స్పందించబోదని విశ్లేషణలు వస్తున్నాయి’’అని ఆయన అన్నారు. అయితే, గీతాంజలి శ్రీకి బుకర్ ప్రైజ్ వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం స్పందించలేదని, కనీసం ఆమెకైనా ప్రభుత్వం అభినందనలు చెప్పుండాల్సిందని వ్యాఖ్యానించారు. ‘‘సాహిత్యం, సంస్కృతి లాంటి అంశాలకు ప్రభుత్వంతో సంబంధంలేదని భావిస్తున్నట్లు అనిపిస్తోంది’’అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, T.C. MALHOTRA
మోదీ ప్రభుత్వ వాదన ఏమిటి?
మొత్తానికి ఈ దాడిపై మోదీ ప్రభుత్వం స్పందించాలని అనుకోవడం లేదా? అమెరికా, యూరోపియన్ దేశాలు దాడిని ఖండించినప్పటికీ, భారత ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటోంది? ఈ ప్రశ్నలపై కొన్ని విశ్లేషణలు వస్తున్నాయి. ముఖ్యంగా అరబ్ దేశాలకు ఆగ్రహం తెప్పించకుండా ఉండేందుకే భారత్ ఈ విషయంలో మౌనం వహిస్తోందని చెబుతున్నారు. నూపుర్ శర్మ వ్యాఖ్యల విషయంలో అరబ్ దేశాల స్పందనలే భారత్ మౌనానికి కారణమా?.
అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వం వీసా ఇవ్వడంతో 2000లో భారత్‌కు రష్దీ వచ్చారు. అయితే, ఈ విషయాన్ని బీజేపీ ఎక్కడా ప్రస్తావించడం లేదు. ఇప్పుడు దాడిని ఖండిస్తే, గతంలో తాము వీసా ఇచ్చిన విషయంపైనా చర్చ జరుగుతుందనే పార్టీ భావిస్తూ ఉండొచ్చు.
బీజేపీ మౌనంపై శివ్ నాడార్ యూనివర్సిటీకి చెందిన అంతర్జాతీయ వ్యవహారాల ప్రొఫెసర్ జబిన్ టీ జాకబ్ స్పందించారు. ‘‘ఇప్పుడు ప్రభుత్వం స్పందిస్తే.. గతంలో జరిగిన విషయాలపైనా చర్చలు వస్తాయి. ఇక్కడ మరోవిషయం ఏమిటంటే అసలు దీనిపై ప్రభుత్వం ఎందుకు స్పందించాలి? మత విద్వేషానికి తాము వ్యతిరేకమని ప్రభుత్వం చెబుతోంది. అది ముస్లింలపై విద్వేషమైనా, హిందువులపై విద్వేషమైనా ఒకేలా చూడాలి’’అని ఆయన అన్నారు.
‘‘ఇక్కడ మరొక విషయం ఏమిటంటే, ప్రస్తుతం అందరూ భారత స్వాతంత్ర్య దినోత్సవంపైనే దృష్టిసారిస్తున్నారు. ఒకవేళ ఏదైనా అంతర్జాతీయ అంశంపై దృష్టి సారించాలంటే.. అది తప్పకుండా శ్రీలంకలోని హంబన్‌టోటకు వస్తున్న చైనా నిఘా నౌకే అయ్యుంటుంది. అందుకే సల్మాన్ రష్దీ కేసు భారత అజెండాలో లేదు’’అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
మూడు కారణాలు..
రష్దీపై దాడి విషయంలో అమెరికా, యూరప్‌లతో పోల్చినప్పుడు భారత్‌లో ఇటు ప్రభుత్వ పరంగా లేదా రాజకీయ పార్టీల్లో పెద్దగా కదలికలు కనిపించడం లేదు. భావప్రకటన స్వేచ్ఛకు మద్దతు పలికే ప్రజాస్వామ్య దేశం ఇలా వ్యవహరించొచ్చా? అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి.
ఈ విషయంపై ‘‘ద ప్రింట్’’ పొలిటికల్ ఎడిటర్ డీకే సింగ్.. బీబీసీతో మాట్లాడారు.
‘‘ఈ అంశంపై స్పందించకపోవడానికి నాకు మూడు కారణాలు కనిపిస్తున్నాయి. వీటిలో మొదటిది భారత్‌లోని విపక్షాలు సిద్ధాంతాల విషయంలో చాలా గందరగోళంలో ఉన్నాయి. అసలు సెక్యులరిజం అంటే ఏమిటో చాలా మంది మరచిపోయారు. ముస్లింలకు ఎవరు కోపం తెప్పిస్తారు? హిందువులకు ఎవరు కోపం తెప్పిస్తారో తెలియదు. కాబట్టి, సిద్ధాంతాల పరంగా ఒక వాదనకు కట్టుబడి ఉండటం కనిపించడం లేదు. ఇప్పుడు వారు గందరగోళంలో ఉన్నారు’’అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, HORATIOGATES3/BBC
‘‘ఇక అధికారంలోని మోదీ ప్రభుత్వం విషయానికి వస్తే, నూపుర్ శర్మ వార్తల వివాదం తరహాలో మరో వివాదాన్ని సృష్టించాలని బీజేపీ అనుకోవడం లేదు. ఇక మూడో విషయం ఏమిటంటే.. ఈ వివాదం చాలా పాతది. ఇప్పటికే మూడు దశాబ్దాలు గడిచిపోయాయి. నేటి యువతకు దీనిపై పెద్దగా ఆసక్తి లేదు. దీని నుంచి ఎలాంటి రాజకీయ ప్రయోజనాలూ రావు. కాబట్టి స్పందన కూడా ఉండదు’’అని ఆయన వ్యాఖ్యానించారు.
రాజకీయ పార్టీలే కాదు.. దేశంలోని ముస్లిం సంస్థలు కూడా రష్దీపై దాడి మీద స్పందించడం లేదు. దీనిపై స్పందిస్తే, తమపై అతివాదులనే ముద్ర వేస్తారని వారు భయపడుతున్నారని వార్తలు వస్తున్నాయి.
‘‘ముస్లింలలోని కొన్ని అతివాద భావజాలముండే వర్గాలు మాత్రమే దీనిపై స్పందిస్తుంటాయి. మిగతవారు ఏమైనా మాట్లాడితే, తమను లక్ష్యంగా చేసుకుంటారనే ఆందోళనతో ఉంటారు’’అని డీకే సింగ్ అన్నారు.
ఇలాంటి మౌనం సరైనదేనా?
అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన, భారత్‌లో జన్మించిన రచయితపై దాడి విషయంలో భారత్‌లాంటి ప్రజాస్వామ్య దేశం మౌనంగా ఉండొచ్చా?
ఈ ప్రశ్నపై చరిత్రకారుడు పురుషోత్తమ్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘‘ఫర్వాలేదు. అరబ్ దేశాలతో సంబంధాలు నేడు మరింత దిగజారకూడదు. అందుకే మోదీ ప్రభుత్వం మాట్లాడటం లేదు. అయితే, అన్ని వేళలా మౌనం సరికాదు. కొన్ని విషయాల్లో మనం ఏదోఒక వాదనకు కట్టుబడి ఉండాలి, దాన్ని స్పష్టంచేయాలి’’అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్: తన కమాండర్ మాట కాదని తాలిబాన్లకు హెలికాప్టర్ అప్పగించిన పైలట్
- వాజ్‌పేయి మాటల్ని నెహ్రూ ఎందుకంత శ్రద్ధగా వినేవారు?
- పాకిస్తాన్ పాలిత కశ్మీర్లో హింసాత్మక నిరసనలు ఎందుకు జరుగుతున్నాయి?
- పీరియడ్ రోజుల చార్టులను ఈ అమ్మాయిలు ఇంటి తలుపులపై ఎందుకు పెడుతున్నారు?‘నువ్వొక బాంబర్వి’ అంటూ ఆ యువకుడికి వచ్చిన మెసేజ్‌తో విమానం ఆరుగంటలు ఆగిపోయింది...
- సల్మాన్ రష్దీ: ‘సైతాన్ ఒక కన్ను పోగొట్టుకుంది’- రష్దీ మీద దాడిపై ఇరాన్ మీడియాలో కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














