భారతదేశంలో ముస్లిం వ్యతిరేక విద్వేష సంగీతం ఎలా పెరుగుతోంది?

వీడియో క్యాప్షన్, మత విద్వేష వ్యాప్తికి మాధ్యమంగా సంగీతాన్ని వాడుకుంటున్న హిందూ రైట్ వింగ్ సమర్థకులు
    • రచయిత, రాఘవేంద్రరావు
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సంగీతం విద్వేషాన్ని వ్యాపింపజేసే మాధ్యమంగా మారిపోతోందా? దేశంలో ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషాన్ని ఎగజిమ్మే పాటలు సోషల్ మీడియాలో కుప్పలుతెప్పలుగా వైరల్ అవుతున్నాయి. హిందూ రైట్ వింగ్ భావజాల సమర్థకులు వీటిని రూపొందిస్తున్నారు. ఈ పాటల్లో వాడుతున్న భాష అవమానకరంగా, బెదిరింపులతో కూడుకుని ఉంటోంది.

మరోవైపు... చరిత్ర పుటలను మతం రంగు పులిమిన కళ్లద్దాలతో చూసేవాళ్లు... ఉత్తుత్త పుకార్లను చరిత్రగా నమ్మేవాళ్లు.. చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ విద్వేష రాగాల వ్యాపారం ఇంతగా పెరిగిపోతుండటానికి కారణాలేంటి?

''శరీరంలోకి చాలా ఎనర్జీ వస్తుంది. ఒకప్పుడు మాపైన ఏమేం జరిగాయో కదా అనిపిస్తుంది.... ఒకప్పుడు మాపైన ఎన్నో జరిగాయి. అది అప్పటి కాలం... ఇప్పుడు మేం ఏ స్టేజ్‌కి వచ్చి నిలబడ్డామో చూడండి...'' అని యూపీ ఘాజియాబాద్‌కు చెందిన విజయ్ యాదవ్ అన్నారు.

23 ఏళ్ల విజయ్ ఒక స్కెచ్ ఆర్టిస్ట్. లలిత కళా అకాడమీలో చదువుతున్నారు. ఇలాంటి సంగీతం వినడం తనకు చాలా ఇష్టమని ఆయనంటున్నారు.

భారతదేశంలో ముస్లిం వ్యతిరేక విద్వేష సంగీతం రోజురోజుకూ ఎలా పెరుగుతోంది?

ఆయన ఏ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నారో... బహుశా దాని ఒకానొక భయంకర రూపాన్ని మనం గత ఏప్రిల్‌లో చూశాం. రాజస్థాన్‌లోని కరౌలీ, మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్, దిల్లీలోని జహాంగీర్‌పురీ, ఉత్తరాఖండ్‌లోని రూడ్కీలో జరిగిన పరిణామాలు మనకు తెలుసు.

ఈ ప్రాంతాల్లో రామనవమి, హనుమాన్ జయంతి, హిందూ సంవత్సరాది సందర్భంగా హిందువులకు, ముస్లింలకు మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి.

ఈ హింసాత్మక ఘటనలను రెచ్చగొట్టడంలో ఇలాంటి అభ్యంతరకర పాటల పాత్ర కూడా ముఖ్యమైందేనన్న ఆరోపణలొచ్చాయి. హిందువుల మత ఊరేగింపుల్లో ఈ పాటలను మైకుల ద్వారా మోగించారు.

వీటిలో ఒక పాట ఇలా సాగుతుంది....

''హిందుత్వ మేల్కొన్న రోజున జరిగే పరిణామం ఇదే..

హిందుత్వ మేల్కొన్న రోజున జరిగే పరిణామం ఇదే..

(లాంగ్ బీప్..) కూడా జైశ్రీరామ్ అంటాడు..

(లాంగ్ బీప్..) కూడా జైశ్రీరామ్ అంటాడు..''

దీన్ని పాట అనడం కన్నా బెదిరింపు అనడం సరిగా ఉంటుంది. అందుకే ఇందులోని కొన్ని పదాలను మేం బీప్ చేయాల్సి వచ్చింది.

సందీప్ చతుర్వేది పాటకు రిహార్సల్స్

సంగీతం.. విద్వేషాన్ని వ్యాపింపజేసే మాధ్యమం కాగలదా? ఈ ప్రశ్నకు సమాధానం వెతికేందుకు మేం ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకు చేరుకున్నాం.

మేం కలవబోతున్న వ్యక్తి... మొదట్లో భజనలు రూపొందించేవారు. కానీ ఇప్పుడాయన తన దారిని మార్చుకున్నారు.

''నా పేరు సందీప్ చతుర్వేది. నేను శ్రీ అయోధ్య ధామానికి చెందిన వాణ్ని. నా వయసు 26 ఏళ్లు. నేను జాతీయవాద విప్లవ గేయాల రంగంలో దాదాపు ఎనిమిదేళ్లుగా పని చేస్తున్నా. రామమందిరం కావచ్చు, జాతీయవాద అంశం కావచ్చు, హిందుత్వ అంశం కావచ్చు, లేదా మతం లేదా సమాజం కావచ్చు... వీటిపైనే నేను గీతాలు రూపొందిస్తుంటాను. నా పాటల ద్వారా సమాజంలో జనజాగృతి తెచ్చే ప్రయత్నం చేస్తుంటాను''.

ఇందాక మేం బీప్ చేసి వినిపించిన వివాదాస్పద మాటలు, సందీప్ చతుర్వేది రాసిన పాటల్లోనివే.

జాతీయవాదం, హిందూ మతాలకు ఈయన చెప్పే నిర్వచనం, అందులోని అసంబద్ధతపై ఎన్నో విభేదాలు, ప్రశ్నలు ఉన్నాయి.

''భారత్‌లో అన్ని మతాల వాళ్లున్నారు.... ఒకవేళ మేం మా ఆరాధ్య దైవాన్ని... జై శ్రీరామ్ అనాలని అంటే అందులో ఇబ్బందేంటి? మేం ఎవరినీ తిట్టలేదు కదా? జై శ్రీరామ్ అనండి... సహోదరత్వాన్ని ప్రదర్శించండి... అంటున్నాం, అంతే'' అని సందీప్ చతుర్వేది అన్నారు.

భారతదేశంలో ముస్లిం వ్యతిరేక విద్వేష సంగీతం రోజురోజుకూ ఎలా పెరుగుతోంది?

ఒకవేళ ఎవరైనా జై శ్రీరామ్ అనలేదనుకోండి... దానర్థం వాళ్లు మీ మతానికి వ్యతిరేకులనేం కాదు కదా? అని ప్రశ్నించగా..

''నేను బలవంత పెట్టడం లేదు. బలవంతంగా అనాలనడం లేదు... మెడపైన కత్తి పెట్టి అడగటం లేదు... హిందుత్వం మేల్కొంది అనేదే నేను సూటిగా, స్పష్టంగా చెప్తున్న మాట'' అని సందీప్ బదులిచ్చారు.

సందీప్ చతుర్వేది ఒక ఉదాహరణ మాత్రమే.

యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలపైన చూపు సారిస్తే... ఇలాంటి పాటలు డజన్ల కొద్ది కనిపిస్తాయి. వీటిలో హిందూ రైట్ వింగ్ భావజాలాన్ని సమర్థించేవాళ్లు ముస్లింలకు వ్యతిరేకంగా చేసే విద్వేషం నిండిన వ్యాఖ్యలు కనిపిస్తాయి. వీటిలో వాడే భాష అవమానకరంగా, బెదిరింపులతో కూడుకొని ఉంటుంది. ఇలాంటి ఎన్నో పాటల్ని జనం ఇప్పటికే లక్షలాది సార్లు చూశారు.

గత కొద్ది నెలల్లో రెండు సముదాయాల మధ్య జరిగిన హింసాత్మక ఘటనల్లో ఇలాంటి పాటల పాత్ర గురించి చాలా సార్లు చర్చ జరిగింది. రచయిత, రాజకీయ విశ్లేషకుడు నీలాంజన్ ముఖోపాధ్యాయ... ఇవి పాటలు కావని, యుద్ధ నినాదాలని అంటారు.

''ఇందులోని సంగీతం సంగీతం కాదు. వార్ క్రై. యుద్ధాన్ని గెలవడం కోసం మ్యూజిక్‌ను వాడుకుంటున్నారు. ఓ రకంగా ఇది సంగీతాన్ని దుర్వినియోగం చేయడమే'' అని రచయిత, రాజకీయ విశ్లేషకుడు నీలాంజన్ ముఖోపాధ్యాయ అన్నారు.

ఇలాంటి రెచ్చగొట్టే సంగీతానికి మరో పార్శ్వం కూడా ఉంది. ఒక సముదాయం పట్ల విద్వేషాన్ని వెదజల్లడమే కాదు, చరిత్ర పుటలను కూడా మతం పులిమిన కళ్లద్దాలతో చూడటం వీటిళ్లో కనిపిస్తుంది.

ఉపేంద్ర రాణా, సందీప్ చతుర్వేది
ఫొటో క్యాప్షన్, ఉపేంద్ర రాణా, సందీప్ చతుర్వేది

దిల్లీకి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉత్తరప్రదేశ్‌లోని దాద్రీలో నివసించే ఉపేంద్ర రాణా అనే గాయకుడు.. ఈ ప్రాంతంలో గత రెండు, మూడేళ్లుగా చర్చల్లో నిలిచారు.

ఎందుకంటే, ఈయన రూపొందించిన పాటలు యూట్యూబ్‌లో బాగా ప్రాచుర్యం పొందాయి.

ఉపేంద్ర రాణా యూట్యూబ్ చానెల్‌కు దాదాపు 4 లక్షల మంది సబ్‌స్క్రైబర్లున్నారు.

ఆయన చాలా పాటలే రూపొందించారు కానీ, ముఖ్యంగా చరిత్రకు సంబంధించిన పాటల ద్వారా ఆయనకు గుర్తింపు వచ్చింది. వాటిలో హిందూ యోధులను హీరోలుగా, ముస్లిం పాలకులను విలన్లుగా ఆయన వర్ణిస్తారు.

''మేం చరిత్రకు సంబంధించిన పాట రూపొందిస్తే, ఎవరైనా చారిత్రక యోధుడి పాట రూపొందిస్తే... అందులో రాముడికి వ్యతిరేకంగా రావణుడి ప్రస్తావన వస్తుంది. బప్పా రావల్‌ను తీసుకుంటే మహమ్మద్ బిన్ ఖాసిమ్ వస్తాడు. బాబర్‌ను తీసుకుంటే రాణా సాంఘా ప్రస్తావన రావాల్సిందే. మహారాణా ప్రతాప్ పేరెత్తుకుంటే అక్బర్ ప్రస్తావన వస్తుంది. అమర్ సింగ్ పేరు తీస్తే జహాంగీర్ ప్రస్తావన వస్తుంది'' అని యూపీ దాద్రీకి చెందిన ఉపేంద్ర రాణా అన్నారు.

ఉపేంద్ర రాణా చరిత్రకారుడు కాదు. ఇక్కడా, అక్కడా విన్న మాటలనే చరిత్ర అనుకునే ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు తాము చరిత్రను సరిదిద్దే పని చేస్తున్నామంటున్నారు.

ఒక మతాన్ని ప్రచారం చేస్తూ, విద్వేష రాగాన్ని ఆలాపించే ఈ పాటలు మరో మతానికి అభ్యంతరకరంగా ఉంటున్నాయి. వీరి వ్యాపారం, ఇలాంటి వారి సంఖ్య పెరిగిపోతూనే ఉంది. తమ ఉద్దేశం జనాల్లో హిందూ మతం పట్ల, సోకాల్డ్ జాతీయవాదం పట్ల ఆవగాహన పెంచడం మాత్రమేనని ఈ పాటల రూపకర్తలంటున్నారు. కానీ ఇలాంటి పాటల అసలు ఉద్దేశాలపై తలెత్తున్న ప్రశ్నలను మాత్రం వీరు తప్పించుకోలేరు.

వీడియో క్యాప్షన్, రామేశ్వరం: మందిరమైనా.. మసీదైనా చూడ్డానికి ఒకేలా కనిపించే ప్రాంతం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)