డిప్రెషన్ విషయంలో అపోహల్లో ఉన్నామా.. తాజా అధ్యయనం అపార్థాలకు తావిచ్చిందా

మెదడులో ఉండే సెరోటోనిన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మెదడులో ఉండే సెరోటోనిన్
    • రచయిత, రాచెల్ ష్రేర్
    • హోదా, హెల్త్ అండ్ డిసిన్ఫర్మేషన్ రిపోర్టర్

మనలో ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపే హార్మోన్ సెరటోనిన్. మెదడులో సెరటోనిన్ తక్కువైతే డిప్రెషన్ వస్తుందన్నది సాధారణ అవగాహన. అయితే, అది నిజం కాదని ఇటీవల వచ్చిన ఒక పరిశోధన తెలిపింది. ఈ అధ్యయనం విస్తృతంగా షేర్ అయింది.

ఈ సిద్ధాంతం యాంటిడిప్రెసెంట్ డ్రగ్స్ గురించి తప్పుదారి పట్టించే వాదనలను రేకెత్తించింది. మెదడులో సెరటోనిన్ మోతాదును పెంచేందుకు డాక్టర్లు యాంటిడిప్రెసెంట్ డ్రగ్స్ సూచిస్తారు.

అయితే, ఈ మందులు ప్రభావం చూపవని తాజా పరిశోధన తెలుపలేదు. ఈ పరిశోధనకు వచ్చిన స్పందన చూస్తే, మానసిక ఆరోగ్యం గురించి మనమెలా ఆలోచిస్తున్నాం, దాన్ని ఎలా స్వీకరిస్తున్నాం అనే విషయాలు స్పష్టమవుతున్నాయి.

సారాకు 20 ఏళ్ల వయసులో మొదటిసారి డిప్రెషన్ వచ్చింది. డాక్టర్లు ఆమెకు మందులు సూచించారు. అవి డయాబెటిక్‌కు వాడే ఇన్సులిన్ లాంటివని, తప్పనిసరిగా వాడాలని, మెదడులో రసాయనాల సమతుల్యత సాధించడానికి అవి తోడ్పడతాయని చెప్పారు. వాటిని జీవితాంతం తీసుకోవాలని కూడా సూచించారు.

డాక్టర్ల సూచనలను సారా తూచ తప్పక పాటించారు. ఆ మందుల వల్ల అసౌకర్యం కలిగినా ఆమె వాటిని తీసుకోవడం ఆపలేదు. మందులు ఆమె కండిషన్‌ను మరింత దిగజార్చాయి. ఆత్మహత్య చేసుకోమని పురికొల్పే అజ్ఞాత స్వరాలు వినిపించేవి. దాంతో, తనకు ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీ (ఈసీటీ) ఇచ్చారని సారా చెప్పారు.

అయితే, సారాకు ఇచ్చిన మందులు అత్యవసరం అని, డయాబెటిక్‌కు ఇన్సులిన్ లాంటివని చెప్పిన వాదనలకు వైద్యపరమైన ఆధారాలు లేవు.

"మనం నమ్మినవాళ్లే మనల్ని మోసం చేస్తారు" అని సారా అన్నారు.

ఆ మందులు సారాపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయి. అయితే, "రసాయనాల అసమతుల్యత" గురించి సారాకు ఇచ్చిన సలహాలు డాక్టర్లు సాధారణంగా సూచించేవే.

తల్లితో సారా
ఫొటో క్యాప్షన్, తల్లితో సారా

డిప్రెషన్‌కు సెరొటోనిన్ తక్కువ స్థాయిలలో ఉండడం ప్రధాన కారణం కాదన్న సంగతి తమకు ఎప్పటి నుంచో తెలుసునని పలువురు సైకియాట్రిస్టులు చెబుతున్నారు. తాజా పరిశోధన కొత్తగా ఏం చెప్పలేదని అంటున్నారు.

అయితే, దీనికి సామాన్య ప్రజానీకం నుంచి వచ్చిన స్పందన చూస్తే చాలామందికి ఈ విషయం తెలీదని స్పష్టమవుతోంది. కొందరు యాంటీడిప్రెసంట్స్ అసలు పనిచేయవనే వాదనలు చేయడం ప్రారంభించారు.

ఈ గందరగోళంలో రోగులు మందులు వేసుకోవడం మానేస్తే, మరింత ప్రమాదంలో పడతారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ మందులను అకస్మాత్తుగా ఆపేయకూడదని, మెల్లగా వాటిని తగ్గించుకుంటూ పోతే ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయని బ్రిటన్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ కేర్ ఎక్సలెన్స్ (ఎన్ఐసీఈ) చెబుతోంది.

ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీ తీసుకున్న తరువాత సారాకు మాట, కండరాల కదలిక సమస్యలు తలెత్తాయి
ఫొటో క్యాప్షన్, ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీ తీసుకున్న తరువాత సారాకు మాట, కండరాల కదలిక సమస్యలు తలెత్తాయి

తాజా పరిశోధన ఏం చెబుతోంది?

తాజా పరిశోధనలో 17 అధ్యయనాలను పరిశీలించారు. డిప్రెషన్‌తో బాధపడుతున్న వారిలో సెరొటోనిన్ స్థాయిలు, ఆరోగ్యవంతులైన వారిలో సెరొటోనిన్ స్థాయిల కంటే భిన్నంగా లేవని కనుగొన్నారు.

యాంటీడిప్రెసెంట్ మందులు రసాయానాల లోపాలను సరిచేయగలవన్న వాదనను తోసిపుచ్చడానికి ఈ పరిశోధన ఉపయోగపడవచ్చు.

"పారాసిటమాల్ తీసుకుంటే తలనొప్పి తగ్గుతుందని మనలో చాలామందికి తెలుసు. అయితే, శరీరంలో పారాసిటమాల్ పాళ్లు తగ్గడం వలన తలనొప్పి వచ్చిందని మాత్రం ఎవరూ అనుకోరు" అని డాక్టర్ మైఖేల్ బ్లూమ్‌ఫీల్డ్ అన్నారు.

వీడియో క్యాప్షన్, కళ్ళు ఎందుకు అదురుతాయి? కళ్ళు చెప్పే ఆరోగ్య రహస్యాలివే..

ఇంతకీ యాంటీడిప్రెసెంట్ మందులు పనిచేస్తాయా?

యాంటీడిప్రెసెంట్స్, ప్లాసెబో (డమ్మీ మందులు) కంటే కాసింత నయంగా పనిచేస్తాయని రిసెర్చ్ చెబుతోంది. ఆ వ్యత్యాసమెంత అన్న దానిపై పరిశోధకుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి.

యాంటీడిప్రెసెంట్స్ కొంతమంది మీద బాగా పనిచేస్తాయని కొందరు భావిస్తున్నారు. అయితే, ఎవరి మీద బాగా పనిచేస్తాయన్నది తెలుసుకోవడం డాక్టర్లకు కష్టమే.

తీవ్ర వేదనలో ఉన్నప్పుడు "యాంటీడిప్రెసెంట్స్ కొంతమందికి వెంటనే ఉపశమనం కలిగిస్తాయని" రాయల్ కాలేజ్ ఆఫ్ సైకియాట్రిస్ట్‌లో ప్రొఫెసర్ లిండా గాస్క్ అన్నారు.

అయితే, మందులు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడానికి డ్రగ్ కంపెనీలు చేసే పరిశోధన లేదా పరిశీలన స్వల్పకాలికమని ప్రొఫెసర్ జోవన్నా మోన్‌క్రిఫ్ అన్నారు. మొదటి కొన్ని నెలలు ఈ డ్రగ్స్ ఎలా ప్రభావం చూపుతాయో పరిశీలిస్తారు. ఆ తరువాత రోగులపై ఈ మందుల ప్రభావం ఎలా ఉందో మనకు తెలీదని ఆయన అన్నారు. తాజా అధ్యయనం పరిశోధకుల్లో ప్రొఫెసర్ జోవన్నా మోన్‌క్రిఫ్ ఒకరు.

"ఈ మందులు ఎలా పనిచేస్తున్నాయో ఎప్పటికప్పుడు పరీశీలిద్దాం. అవసరం లేకపోతే ఆపేద్దాం" అని డాక్టర్లు రోగులకు చెప్పాలి. కానీ, తరచూ అలా జరగదు అని ప్రొఫెసర్ మోన్‌క్రిఫ్ అన్నారు.

డిప్రెషన్‌కు వైద్యం చేయకపోతే ప్రమాదమే. కానీ, యాంటీడిప్రెసెంట్ మందుల వల్ల కొందరిలో తీవ్రమైన సైడ్ ఎఫెక్టులు ఉంటాయి. వాటి గురించి రోగులకు వివరంగా చెప్పాలని తాజా అధ్యయనం పరిశోధకులు అంటున్నారు.

ఆత్మహత్య చేసుకోవాలనిపించడం, ప్రయత్నించడం, శృంగారానికి దూరం కావడం, భావోద్వేగాలు గడ్డకట్టుకుపోవడం, నిద్రలేమి మొదలైన సైడ్ ఎఫెక్టులు ఉంటాయని ఎన్ఐసీఈ చెబుతోంది.

డిప్రెషన్ మరీ అంత తీవ్రంగా లేనివారికి మందులు సూచించకుండా, థెరపీ, వ్యాయామం, ధ్యానం మొదలైన వాటితో చికిత్స ప్రారంభించాలని గత ఏడాది బ్రిటన్‌లో డాక్టర్లకు సూచించారు.

డిప్రెషన్

ఫొటో సోర్స్, Getty Images

తాజా పరిశోధన ఎలాంటి అపార్థాలకు తావిచ్చింది?

ఈ అధ్యయనం వల్ల, "అపోహల మీద ఆధారపడి" యాంటీడిప్రెసెంట్లను సూచిస్తున్నారనే తప్పుడు వాదన తెర పైకి వచ్చింది.

అయితే, తాజా పరిశోధనలో యాంటీడిప్రెసెంట్ల గురించి మాట్లాడనేలేదు.

మన మూడ్ బాగుండడానికి, బాగోలేకపోవడానికి సెరటోనిన్ ఒక కారణం అని మనకు తెలుసు. కాబట్టి, సెరటోనిన్ స్థాయిని కాస్త అటూఇటూ మార్చితే, ఆనందాన్ని కలిగించవచ్చు. కనీసం స్వల్పకాలంలో ఫలితం చూపించవచ్చు. సెరొటోనిన్ అతి తక్కువ స్థాయిలలో లేనప్పటికీ, మెదడులో కొత్త కనక్షన్లు పుట్టడానికి సహాయపడవచ్చు.

మరి కొంతమంది తాజా పరిశోధనను అపార్థం చేసుకుంటూ, డిప్రెషన్‌కు కారణం మెదడులో జరిగే ప్రక్రియలు కావని, పరిస్థితులే డిప్రెషన్ కలిగిస్తాయని భావించడం ప్రారంభించారు.

"రెండూ నిజమే. ఒత్తిడిని ఎంతవరకు తీసుకోగలరనేది ఒక్కొక్కరి జెనెటిక్స్‌పైన ఆధారపడి ఉంటుంది" అని తాజా అధ్యయనం పరిశోధకుల్లో ఒకరైన డాక్టర్ మార్క్ హోరోవిట్జ్ అన్నారు.

వ్యక్తులు గందరగోళంలో ఉన్నప్పుడు, మందుల కన్నా "రిలేషన్ షిప్ కౌన్సెలింగ్, ఆర్థిక సలహాలు లేదా ఉద్యోగాల మార్పు" మొదలైనవాటి వలన మార్పు రావచ్చు అని ఆయన అన్నారు.

అయితే సామాజిక సమస్యల వల్లే డిప్రెషన్ వస్తుంది అని చెప్పడం, దాని తీవ్రతను తగ్గించడమేనని ఆస్ట్రేలియాకు చెందిన జోయ్ అంటున్నారు. జోయ్ తీవ్రమైన డిప్రెషన్‌తో, సైకోసిస్‌తో బాధపడుతున్నారు.

డిప్రెషన్ ఒక్కోసారి తీవ్ర మనస్తాపం కలిగిస్తుందని, అది భరించడం కంటే మందుల వల్ల కలిగే సైడ్ ఎఫెక్టులు భరించడం సులువని జోయ్ అంటున్నారు.

ఇదే మాటను చాలామంది నిపుణులు అంగీకరిస్తున్నారు. రోగులకు అన్ని రకాల సమాచారం అందించాలి. అప్పుడు వాళ్లే జోయ్‌లా తమకు ఏది కావాలో నిర్ణయించుకుంటారని వారు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)