PFI: ఐదేళ్ల నిషేధంతో ఈ ఇస్లామిక్ సంస్థ కథ ముగుస్తుందా

పీఎఫ్ఐపై నిషేధం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఇమ్రాన్ ఖురేషి
    • హోదా, బీబీసీ కోసం

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)తోపాటు సంస్థకు అనుబంధంగా ఉండే కొన్ని ఇస్లామిక్ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా ఐదేళ్లపాటు నిషేధం విధించింది. దక్షిణ భారత దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో పీఎఫ్ఐ ప్రాబల్యం ఉంది. ముఖ్యంగా కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ సంస్థకు పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు.

2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ పీఎఫ్ఐపై నిషేధం విధిస్తారనే మాట వినిపిస్తూ ఉండేదని రాజకీయ విశ్లేషకులు, పీఎఫ్ఐ అనుబంధ సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ) నాయకులు బీబీసీతో చెప్పారు.

‘‘ఒక మతపరమైన అతివాద సంస్థగా ముద్రవేసి ఈ సంస్థను అణచివేయలేరు. ఎందుకంటే మైనారిటీలు, ఓబీసీ, ఎస్సీ-ఎస్టీల కోసం సంస్థ గళమెత్తుతోంది. సంస్థపై నేడు చాలా వర్గాలు ఆధారపడి ఉన్నాయి’’అని రాజకీయ విశ్లేషకుడు ఎన్‌పీ చేకుట్టీ అన్నారు.

అయితే, ఈ ఐదేళ్ల నిషేధంతో సంస్థ కథను పూర్తిగా నిర్మూలించడం అంత తేలికకాదని చేకుట్టీ అన్నారు. ‘‘వారికి స్పష్టమైన రాజకీయ, ఆర్థిక అజెండా ఉంది. ఇస్లాంకు పొంచివున్న ముప్పులను చెప్పడంతోపాటు ముస్లిమేతర, సెక్యులర్ అజెండాలతో వారు ప్రజల్లోకి చొచ్చుకెళ్లారు’’అని ఆయన వివరించారు.

పీఎఫ్ఐపై నిషేధం

ఫొటో సోర్స్, Getty Images

రాజకీయ కారణాలతోనే నిషేధం విధించారా?

నిషేధం వెనుక బీజేపీకి రాజకీయ లక్ష్యాలు ఉన్నాయని ఎస్‌డీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి తస్లీమ్ అహ్మద్ రహమానీ అన్నారు. ‘‘ఇది కేవలం ఒక సింబాలిక్ నిషేధం. ఇది బీజేపీకి రాజకీయ లబ్ధి చేకూరుస్తుంది. ప్రస్తుతం గుజరాత్, కర్ణాటకల్లో పార్టీకి చాలా సవాళ్లు ఎదురవుతున్నాయి. అందుకే ఇలాంటి చర్యలతో కొంత లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఇవి కేవలం ఐడెంటిటీ రాజకీయాలు. పీఎఫ్ఐతో దేశ భద్రతకు ముప్పు ఉందని చెప్పడంలో ఎలాంటి అర్థమూలేదు’’అని ఆయన వ్యాఖ్యానించారు.

ఆరెస్సెస్ భావజాలానికి చెక్ పెట్టేందుకే పీఎఫ్ఐను ఏర్పాటుచేశారని అప్పట్లో చాలా విశ్లేషణలు వచ్చేవి. అయితే, దీనిలో ఎలాంటి నిజమూలేదని సంస్థ చెప్పేది. కొన్ని సంవత్సరాల క్రితం యోగాను కూడా చేయాలంటూ సంస్థ ప్రోత్సహించింది. ముస్లింలతోపాటు భిన్న వర్గాలకు తాము ప్రాతినిధ్యం వహిస్తున్నామని సంస్థ వివరించింది. అయితే, గత కొన్ని రోజులుగా సంస్థకు చెందిన ప్రధాన నాయకులను కేంద్రం అరెస్టులు చేస్తూ వస్తోంది.

‘‘కేరళ, కర్నాటక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్‌డీపీఐ మంచి ఫలితాలు కూడా కనబరిచింది. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ప్రభావం చూపలేకపోయింది. కానీ, సంస్థ అభ్యర్థులకు 2,000 నుంచి 3,000 ఓట్లు వచ్చాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఈ ఓట్లు ఫలితాలు నిర్ణయించే స్థాయిలో ఉండేవి’’అని చేకుట్టి అన్నారు.

పీఎఫ్ఐపై నిషేధం

ఫొటో సోర్స్, Getty Images

ఎన్నికల్లో ఎంతమేరకు సంస్థ ప్రభావం చూపగలదు?

కర్నాటక రాజకీయాల్లో ఎస్‌డీపీఐ ప్రభావాన్ని రాష్ట్రంలో 2004లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఫలితాలతో పోల్చొచ్చు. అప్పట్లో బీఎస్పీకి కొన్నిచోట్ల 1500 నుంచి 2000 ఓట్లు వచ్చాయి. ఇవే ఓట్ల తేడాలతో కాంగ్రెస్ దాదాపు 23 సీట్లు కోల్పోయింది. ఈ ఓట్లు జేడీఎస్, బీజేపీ లాంటి పార్టీకి వచ్చాయి.

కేరళ స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌లకు కూడా ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. 2013 కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో మైసూర్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన కాంగ్రెస్ అభ్యర్థిని ఎస్‌డీపీఐ అభ్యర్థి దాదాపుగా ఓడించారు. మరోవైపు కొన్ని ఉత్తర, తూర్పు రాష్ట్రాల్లోని లోక్‌సభ ఎన్నికల్లోనూ పార్టీ పోటిచేసింది.

వీడియో క్యాప్షన్, ప్రభుత్వంపై తమకు భరోసా లేదంటున్న స్థానిక ముస్లింలు

‘‘2014లో మళప్పురం ఎన్నికల్లో ఐయూఎంఎల్ అభ్యర్థి అతికష్టం మీద గెలిచారు. ముస్లిం మెజారిటీ గల ఉత్తర మలబార్ ప్రాంతంలో ఎస్‌డీపీఐ అభ్యర్థి గట్టిపోటీ ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ దళితులు, వెనుకబడిన వర్గాల సంస్థలతో కలిసి పీఎఫ్ఐ పనిచేసింది’’అని చేకుట్టి అన్నారు.

మరోవైపు పీఎఫ్ఐకు క్షేత్రస్థాయిలో మంచి నెట్‌వర్క్ ఉందని రాజకీయ విశ్లేషకుడు, జర్నలిస్టు సీ దావూద్ అన్నారు. ‘‘ఇటీవల మళప్పురంలో నార్త్ కేరళ కాన్ఫెరెన్స్‌తో కలిసి సంస్థ భారీ ర్యాలీ ఏర్పాటుచేసింది. మరోవైపు అలప్పుళలోనూ ఇలాంటి ర్యాలీ రెండు నెలల క్రితం నిర్వహించారు. ఎందుకంటే ఉత్తర కేరళలో ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉంటారు. వారికి సంబంధించిన అంశాలపై పీఎఫ్ఐ తరచూ మాట్లాడుతుంటుంది’’అని దావూద్ వ్యాఖ్యానించారు.

పీఎఫ్ఐపై నిషేధం

ఫొటో సోర్స్, Getty Images

సంస్థ నిధులపై ఎలాంటి ప్రభావం పడుతుంది?

పీఎఫ్ఐ నేతృత్వంలో పనిచేసే సంస్థలు ఓబీసీ రిజర్వేషన్ల కోసం గతంలో విస్తృతంగా ప్రచారం చేపట్టాయని చేకుట్టి వివరించారు. 2000 నుంచి 2006 మధ్య సంస్థ చేపట్టిన ప్రచారాల వల్ల చాలా ప్రభుత్వ ఉద్యోగాలను కేరళ ప్రభుత్వం నింపాల్సి వచ్చింది. ఓబీసీలు, దళితులు, ఇతర వెనుకబడిన వర్గాలతో కలిసి పనిచేయడం వల్ల సంస్థ ప్రాతినిధ్యం కూడా పెరిగింది.

‘‘పీఎఫ్ఐపై నిషేధం విధించడంతో ఎస్‌డీపీఐ నిధులపై ఎలాంటి ప్రభావం ఉండబోదు. ముస్లింలలో అభద్రతా భావం పెరగడంతో నిధులను సమీకరించడం మరింత తేలిక అవుతుంది’’అని దావూద్ అన్నారు.

వీడియో క్యాప్షన్, భారత్-పాకిస్తాన్ విభజన సమయంలో ఈ పచ్చబొట్లే ఎంతో మంది ప్రాణాలు కాపాడాయి

అదే సమయంలో పీఎఫ్ఐ నాయకులకు హింస, అతివాద కార్యకలాపాలతో ముడిపెట్టడం తగదని దావూద్ అంటున్నారు. ఈ నిషేధాన్ని తట్టుకొని గట్టి రాజకీయ పార్టీగా సంస్థ నిలబడుతుందని ఆయన వివరించారు.

మరోవైపు నిషేధంతో పీఎఫ్ఐపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని రహమానీ అన్నారు. ‘‘ఎందుకంటే 60 శాతం మంది పీఎఫ్ఐ నాయకులు ఎస్‌డీపీఐలో ఉన్నారు. మిగతా 40 శాతం మంది గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎస్‌డీపీఐపై కేంద్రం నిషేధం విధించాలని అనుకోదు. ఎందుకంటే ఆ పార్టీపై నిషేధం విధిస్తే, వారికే నష్టం’’అని ఆయన అన్నారు.

అయితే, పీఎఫ్ఐ తరహాలోనే ఈ ఎస్‌డీపీఐపైనా నిషేధం విధించాలని కర్నాటక మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు కేఎస్ ఈశ్వరప్ప వ్యాఖ్యానించారు. ‘‘దీని కోసం ఎన్నికల సంఘాన్ని కేంద్రం సంప్రదించి ఉండాల్సింది’’అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)