ట్రిపుల్ తలాక్ నిషేధం: ‘ఇప్పుడు విడాకులు ఇవ్వకుండానే వదిలేస్తున్నారు’ - కనీస హక్కులూ కోల్పోతున్న ముస్లిం మహిళలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నియాజ్ ఫరూఖి
- హోదా, బీబీసీ న్యూస్
ట్రిపుల్ తలాక్.. రాజ్యాంగ వ్యతిరేకమని, ఇకపై ఇలా విడాకులు ఇవ్వడానికి వీల్లేదని 2017లో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఆ పిటిషన్ దాఖలుచేసిన వారిలో అఫ్రీన్ రెహమాన్ కూడా ఒకరు.
అప్పటికి కొన్ని నెలల ముందు అఫ్రీన్‌కు ఆమె భర్త ఏకపక్షంగా ట్రిపుల్ తలాక్‌తో విడాకులు ఇచ్చారు. సుప్రీం కోర్టు తీర్పుతో ఆమె చాలా సంబరపడ్డారు.
అయితే, ఐదేళ్ల తర్వాత కూడా పరిస్థితులు ఏమీ మారలేదని అఫ్రీన్ బాధపడుతున్నారు. ఇప్పటికీ ఆమెను వెనక్కి తీసుకునేందుకు ఆమె భర్త నిరాకరిస్తున్నారు. తన పెళ్లి ఇంకా చెల్లుతుందో లేదా తానకు విడాకులు ఇచ్చారో అసలు తెలియడంలేదని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.
ఇలా తమ పరిస్థితి ఏమిటో తెలియక ఆందోళనలో ఉన్న మహిళలు భారత్‌లో చాలా మంది ఉన్నారు. చరిత్రాత్మక ట్రిపుల్ తలాక్ కేసుపై సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన ఆ ఐదుగురు మహిళలను ఇప్పటికీ ‘‘విడాకులు’’ పొందినవారిగానే పరిగణిస్తున్నారని మహిళా హక్కుల ఉద్యమకారులు చెబుతున్నారు.
ఇప్పుడు ట్రిపుల్ తలాక్‌కు బదులుగా.. అసలు ఏమీ చెప్పకుండానే మహిళలను వదిలేస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని మహిళా హక్కుల ఉద్యమకారులు వివరిస్తున్నారు.
హైదరాబాద్‌లో మహిళల కోసం ‘‘షహీన్ విమెన్స్ రిసోర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్స్’’ పేరుతో ఒక సంస్థను జమీలా నిశాత్ నడుపుతున్నారు. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత హైదరాబాద్‌లోని 20 బస్తీల నుంచి వచ్చిన విడాకుల కేసులను ఆమె విశ్లేషించారు.
‘‘మేం మొత్తంగా 2,106 కేసులను పరిశీలించాం. వీటిలో 683 కేసుల్లో అసలు ఏమీ చెప్పకుండానే భార్యలను భర్తలు వదిలేశారు’’ అని జమీలా చెప్పారు.

ఫొటో సోర్స్, AFP
ఏమీ చెప్పకుండా వదిలేస్తే..
ముస్లిం మహిళల (ప్రొటెక్షన్ ఆఫ్ మ్యారేజ్) యాక్ట్-2019తో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయని మహిళా హక్కుల ఉద్యమకారులు చెబుతున్నారు.
2017లో ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేసిన తర్వాత, కేంద్రం ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది.
ట్రిపుల్ తలాక్ చెప్పడం నేరమని ఈ చట్టంలో పేర్కొన్నారు. ఒకవేళ ఇప్పటికీ ట్రిపుల్ తలాక్ చెబితే, ఆ భర్తను మూడేళ్లు జైలులో పెట్టేలా నిబంధనలు తీసుకొచ్చారు. దీంతో చాలా మంది అసలు సాధారణ తలాక్ కూడా చెప్పకుండానే మహిళలను వదిలిపెట్టేస్తున్నారు. ఫలితంగా మహిళలకు ఇవ్వాల్సిన భరణాన్ని కూడా ఇవ్వకుండా తప్పించుకుంటున్నారు.
ఇది మహిళల్లో ఒకరకమైన సామాజిక, న్యాయపరమైన చిక్కులకు కారణం అవుతోంది.
‘‘మొదట్లో విడాకులు ఇవ్వకుండా భర్తలు తమను వదిలేస్తున్న కేసులు రెండు, మూడు వచ్చేవి. కానీ, 2019లో కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత.. ఇలాంటి కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి’’ అని జమీలా చెప్పారు.
ముస్లిం మహిళల హక్కుల కోసం పనిచేస్తున్న ‘‘ఇండియన్ ముస్లిం మహిళా ఆందోళన్’’ కో-ఫౌండర్ జాకియా సోమన్ కూడా ట్రిపుల్ తలాక్ కేసు వేసిన పిటిషనర్లలో ఒకరు. ‘‘కోర్టు తీర్పు, ఆ తర్వాత తీసుకొచ్చిన చట్టంతో మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి’’ అని ఆమె చెప్పారు.
‘‘ఎందుకంటే పిటిషన్ వేసిన ట్రిపుల్ తలాక్ బాధిత మహిళల్లో ఒక్కరిని కూడా తమ భర్తలు వెనక్కి తీసుకోలేదు’’ అని జాకియా వెల్లడించారు.
‘‘మొత్తం ఐదు కేసుల్లో నలుగురు భర్తలు వేరేవారిని పెళ్లి చేసుకున్నారు. కొంత మందికి పిల్లలు కూడా పుట్టారు. ప్రస్తుతం ఆ ట్రిపుల్ తలాక్ బాధిత మహిళలంతా ఒంటరిగానే మిగిలిపోయారు’’ అని ఆమె తెలిపారు.

ఫొటో సోర్స్, AFP
పరిస్థితులు ఎలా మారుతున్నాయి?
అయితే, సుప్రీం కోర్టు తీర్పు తర్వాత, గత ఐదేళ్లలో ట్రిపుల్ తలాక్ కేసులు గణనీయంగా తగ్గాయని సామాజిక కార్యకర్తలు, నిపుణులు విశ్లేషిస్తున్నారు.
‘‘భిన్న రాష్ట్రాల్లోని మా వలంటీర్లు ట్రిపుల్ తలాక్ కేసులు చాలా తగ్గినట్లు చెబుతున్నారు’’ అని జాకియా చెప్పారు.
‘‘మరోవైపు ఇటీవలి కాలంలో ట్రిపుల్ తలాక్‌పై ముస్లింలలోనూ అవగాహన పెరిగింది. ముఖ్యంగా ఒకేసారి మూడు తలాక్‌లు చెప్పడాన్ని వారు పాపపు చర్యగా పరిగణిస్తున్నారు’’ అని ఆమె అన్నారు.
ముస్లిం పురుషులతోపాటు మహిళల్లోనూ దీనిపై అవగాహన పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.
గత ఐదేళ్లలో పరిస్థితులు చాలా మారాయని వైవాహిక అంశాలపై పుస్తకం రాసిన, సీనియర్ జర్నలిస్టు జియావుస్సలాం చెప్పారు. తమ హక్కుల గురించి ముస్లిం మహిళల్లో చైతన్యం పెరిగిందని ఆమె అన్నారు.
‘‘ఈ తీర్పు తర్వాత హక్కుల కోసం ముస్లిం మహిళలు గళమెత్తడాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు. దీనికి ఉదాహరణగా మనం షహీన్‌బాగ్ ఉద్యమాన్ని చెప్పుకోవచ్చు’’ అని ఆమె అన్నారు.
‘‘అయితే, ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు పొందిన మహిళలను వెనక్కి తీసుకోవాలని కోర్టు సూచించలేదు. ఇప్పుడు ఆమె వివాహ బంధంలో ఉన్నట్లు కాదు. లేదా విడాకులు మంజూరు అయినట్లూ కాదు. ఐదేళ్ల తర్వాత కూడా వారి పరిస్థితి సుప్రీం కోర్టుకు వెళ్లినప్పటి పరిస్థితిలానే ఉంది’’ అని ఆమె చెప్పారు.
అంటే హఖ్-ఎ-మెహర్ రూపంలో వారి భర్తల నుంచి వారికి ఎలాంటి భరణమూ దక్కడంలేదని గమనించాలి.

ఫొటో సోర్స్, EPA
వాస్తవం ఏమిటి?
కొన్ని షరియా చట్టాల ప్రకారం.. విడాకులు ఇచ్చేందుకు తలాక్-ఎ-అహసన్, తలాక్-ఎ-హసన్ రెండు మార్గాలు ఉన్నాయి. వీటి ద్వారా మూడు నెలల కాలంలో పూర్తిగా విడాకులు ఇవ్వొచ్చు. కానీ, వీటి ద్వారా కూడా పురుషులు ఏకపక్షంగా విడాకులు ఇచ్చేందుకు అవకాశం ఏర్పడుతోంది.
ఇస్లాంలో ఖులా పేరుతో మహిళల అంగీకారంతో భర్త నుంచి ఏకపక్షంగా విడిపోయే మార్గం కూడా ఉంది. మరోవైపు ఇద్దరి అంగీకారంతో ‘‘ముబారత్’’ ద్వారా విడాకులు తీసుకోవచ్చు.
ఇక్కడ ముస్లిం మహిళలు ఏకపక్షంగా విడాకులు ఇచ్చే మార్గంలోనూ వారిపైనే వివక్ష ఉంటోందని సుప్రీం కోర్టు న్యాయవాది షారుఖ్ ఆలమ్ చెప్పారు.
‘‘ఒకవేళ ఖులా ద్వారా భార్య విడాకులు పొందాలని భావిస్తే, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని మొదట ఖాజీ సూచిస్తారు. చివరగా ఇక్కడ భర్తల అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. అయినప్పటికీ మహిళలు తమ అన్ని హక్కులనూ కోల్పోవాల్సి ఉంటుంది’’ అని షారుక్ వివరించారు.
‘‘చాలాసార్లు మహిళలు లీగల్ నోటీసులు ఇచ్చినప్పుడు భర్తలు సమాధానం ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు’’ అని షారుఖ్ అన్నారు. చాలా మంది మహిళలతో మాట్లాడిన తర్వాత తనకు కూడా అలానే అనిపించిందని జమీలా కూడా చెప్పారు.
‘‘కేంద్రం చట్టం తీసుకొచ్చిన తర్వాత, ఒకవేళ ట్రిపుల్ తలాక్ చెబుతే తమను నేరస్థులుగా పరిగణిస్తారని భర్తలకు తెలుసు. అసలు ఎలాంటి విడాకులు ఇవ్వకపోతే.. తాము చెప్పిన షరతులకు భార్యలు అంగీకరిస్తారని భర్తలు ఎదురుచూస్తున్నారు’’ అని ఆమె అన్నారు.
‘‘మొత్తానికి మహిళలే ఖులా ద్వారా విడాకులకు వెళ్లేలా భర్తలు చేస్తున్నారు. అప్పుడు మహిళలకు రావాల్సిన కనీస హక్కులు కూడా ఉండవు. ఇది మరింత దారుణం’’ అని ఆమె చెప్పారు.
23 ఏళ్ల ఆశ్రియా బేగమ్‌కు 2021 అక్టోబరులో వివాహమైంది. వేధింపుల నడుమ ఆమె విడాకులను ఆశ్రయించాల్సి వచ్చింది. అయితే, విడాకులు ఇచ్చేందుకు ఆమె భర్త నిరాకరించారు. ముందు నువ్వే విడాకులకు వెళ్లాలని ఆమెకు సూచించారు.
‘‘ఖులాకు వెళ్లేందుకు నేను అంగీకరించాను. కానీ, ఒక షరతు పెట్టాను. నాపై, నా కుటుంబంపై మీరు పెట్టిన వేధింపుల వల్లే నేను ఖులాకు వెళ్తున్నాననే పేపర్‌పై మీరు సంతకం పెడితేనే నేను ముందుకు వెళ్తానని తెగేసి చెప్పాను’’ అని ఆమె వివరించారు.
అయితే, దీనికి ఆశ్రియా భర్త అంగీకరించలేదు. దీంతో పేపర్‌లో వేధింపులు అనే ప్రస్తావన తీసేయాలని, అప్పుడు తేలిగ్గానే ఆయన అంగీకరించొచ్చని ఆమెకు ఆమె తల్లి సూచించారు.
‘‘కానీ, నేనెందుకు ఇలా చేయాలి? నా భర్త, ఆయన కుటుంబ సభ్యులు చేసిన దానికి నేను ఎందుకు బాధ్యత తీసుకోవాలి. ఇప్పటికీ వారు సమాజంలో మంచి వారిగానే చెలామణీ అవుతున్నారు. కానీ, నేనే చెడ్డదాన్ని అయిపోయాను’’ అని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.

ఫొటో సోర్స్, BBC/Shibshankar Chatterjee
‘‘కష్టాలు తప్పడం లేదు’’
‘‘విడాకులు వద్దని భావించే అమ్మాయిలు, కొత్తగా జీవితాన్ని ఎలా మొదలుపెట్టాలో తెలియనివారు ఎక్కడికి వెళ్లిపోతారు?’’ అని జమీలా ప్రశ్నించారు.
‘‘కొంతమంది మహిళలకు సొంతంగా నిర్ణయాలు తీసుకొనే శక్తి ఉన్నప్పటికీ, సమాజం, పురుషాధిక్య వ్యవస్థ వారిపై చాలా ఒత్తిడికి కారణం అవుతున్నాయి’’ అని ఆమె అన్నారు.
సమస్యలు, వేధింపుల నడుమ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అఫ్రిన్ భావిస్తున్నారు. కానీ, పరిస్థితులు ఆమెకు అనుకూలించడం లేదు.
అఫ్రిన్ కోర్టు వరకు వెళ్లడంలో మహిళా హక్కుల ఉద్యమకర్త నసీమ్ అఖ్తర్ సాయం చేశారు. ‘‘ఆ కేసు తర్వాత అఫ్రీన్ పేరు వార్తల్లో మార్మోగింది. ఇప్పుడు ఆమె పేరు చెబితేనే చాలా మంది భయపడుతున్నారు’’ అని నసీమ్ అన్నారు.
‘‘ట్రిపుల్ తలాక్ తీర్పు సుప్రీం కోర్టు వెల్లడించినప్పుడు, అన్ని టీవీ చానళ్లలోనూ అఫ్రీన్ ఫోటోలు కనిపించాయి. అది చూసిన పైఅధికారులు ఆమెను ఉద్యోగం నుంచి కూడా తొలగించారు’’ అని నసీమ్ చెప్పారు.
కొన్నిసార్లు సమాజంలో పలుకుబడి ఇలా ప్రతికూలంగానూ ప్రభావం చూపొచ్చని ఆమె వివరించారు.
‘‘ఉదాహరణకు అఫ్రీన్ భర్తను తీసుకోండి. ఆయన బాగా చదువుకున్నారు. ఆయన తండ్రి కూడా ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు. అయినప్పటికీ ట్రిపుల్ తలాక్ చెప్పారు. ఇక బస్తీలు, చదువుకోని వారి పరిస్థితి ఏమిటి మీరే ఊహించుకోండి’’ అని నసీమ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
చట్టం ఉన్నప్పటికీ ఎందుకు కష్టాలు?
ఈ కష్టాలకు కొన్ని రాజకీయ, సామాజిక కోణాలు ఉన్నాయని షారుఖ్ వివరించారు.
‘‘ప్రస్తుతం తీసుకొచ్చిన సంస్కరణలకు సమాజంలోని పరిస్థితులకు పొంతన ఉండటం లేదు. చాలా మంది ఈ చట్టాన్ని తమ వ్యక్తిగత విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడంగా పరిగణిస్తున్నారు’’ అని ఆయన చెప్పారు.
ముస్లింలలో చాలా మంది ఈ చట్టానికి మద్దతు పలకడం లేదు. తమ వ్యక్తిగత అంశాల్లోనూ ప్రభుత్వం జోక్యం చేసుకున్నట్లుగా వారు భావిస్తున్నారు.
అయితే, ఈ చట్టానికి గట్టి మద్దతు పలుకుతున్న వారిలో జాకియా ఒకరు. ‘‘ఇదేమీ అంత గొప్ప చట్టం కాదు. దీన్ని ఇంకా మెరుగ్గా తీసుకురావొచ్చు. ముఖ్యంగా మూలాల నుంచి సమస్యను పరిష్కరించడంపై దృష్టిపెట్టొచ్చు’’ అని ఆమె అన్నారు.
‘‘విడాకుల తర్వాత మహిళలకు ఎలాంటి హక్కులు ఉంటాయో స్పష్టంగా చట్టంలో పేర్కొనాల్సి ఉంది. చట్టం ఇలానే ఉంటే పెద్దగా ఫలితం కనిపించకపోవచ్చు’’ అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, EPA
బీజేపీ పాత్ర ఏమిటి?
ముస్లిం హక్కుల పరిరక్షణ పేరుతో.. ఈ చట్టాన్ని బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. అయితే, ఇది వారికి ఒక రాజకీయ అస్త్రం లాంటిదని, తమకు వ్యతిరేకంగా ఓట్లు కూడగట్టడానికి దీన్ని వారు ఉపయోగిస్తారని చాలా మంది ముస్లింలు భావిస్తున్నారు.
‘‘ముస్లింలు కాస్త సంప్రదాయ ధోరణితో ఉండేటప్పటికీ మార్పుకు ఎప్పుడూ వారు స్వాగతం పలుకుతారు’’ అని జాకియా చెప్పారు.
2000 నుంచి ముస్లిం మహిళల కోసం జాకియా పనిచేస్తున్నారు. ‘‘తప్పులు చేయడం వల్ల ఇస్లామోఫోబియా పెరుగుతుంది.. మరోవైపు హిందూత్వ రాజకీయాలకు కూడా పరోక్షంగా మద్దతు పలుకుతున్నట్లు అవుతుంది.. ఈ వాస్తవాన్ని ముస్లింలు కూడా గ్రహిస్తున్నారు’’ అని జాకియా చెప్పారు.
ముస్లింలలో వస్తున్న మార్పులకు జియావుస్సలాం ఒక ఉదాహరణ కూడా చెప్పారు. ‘‘గత ఏడాది దేశ వ్యాప్తంగా 16 నగరాల్లోని మసీదుల్లో ముస్లిం మహిళలు ప్రార్థనలు చేశారు. అల్లా తమకు ప్రసాదించిన హక్కులను వారు ఉపయోగించుకోగలిగారు’’ అని జియావుస్సలాం అన్నారు.
అయితే, ఖురాన్‌లో సందేశాలను కొందరు తప్పుదోవ పట్టించినప్పుడు.. మహిళలంతా ఎందుకు బాధపడాలి? అని జియవుస్సలాం ప్రశ్నించారు.
‘‘ఇప్పుడు హక్కుల కోసం పోరాటం జరుగుతోంది. ఇది ఇప్పుడే మొదలైంది. నెమ్మదిగా మాకు రావాల్సిన హక్కులన్నీ సాధించుకుంటాం’’ అని ఆమె వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- ఆఫ్రికా చీతాలను తెచ్చి భారత్‌లో సింహాల మనుగడను ప్రమాదంలో పడేస్తున్నారా
- 'పండిట్ జీ, మేం ఇప్పటివరకూ ఐదుగురిని చంపాం’ - రాజస్థాన్ మాజీ బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్... కేసు నమోదు
- ఆండ్రాయిడ్ ఫోన్లపై డేటా ఖర్చులను తగ్గించుకోవడమెలా?
- కాఫీ, రెడ్ వైన్: ఇవి ఎంత తాగితే ఆరోగ్యానికి హానికరం
- 5 నెలల గర్భంతో ఉండగా అత్యాచారం చేశారు, మూడేళ్ల కూతురినీ చంపేశారు, 20 ఏళ్లకైనా ఆమెకు న్యాయం దొరికిందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















