PFI: ఈ సంస్థపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు సోదాలు చేస్తున్నాయి, బ్యాన్ చేయాలన్న వాదన ఎందుకు వినిపిస్తోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, స్వామినాథన్ నటరాజన్, ఫైజల్ మొహమ్మద్ అలీ
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
వివాదాస్పద ముస్లిం గ్రూప్ ‘పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) శుక్రవారం కేరళలో ధర్నా చేపట్టింది. జాతీయ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని పీఎఫ్ఐ కార్యాలయాలు, సభ్యుల నివాసాల్లో గురువారం సోదాలు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థలు, పలువురిని అరెస్ట్ చేశాయి. దీంతో శుక్రవారం పీఎఫ్ఐ గ్రూప్ ధర్నా చేపట్టింది.
సోదాలు
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం ఉదయం 11 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి 106 మంది పీఎఫ్ఐ సభ్యులను అరెస్ట్ చేశాయని వార్తా ఏజెన్సీ పీటీఐ తెలిపింది.
కేరళ, తమిళనాడులో అరెస్టులకు వ్యతిరేకంగా పీఎఫ్ఐ సభ్యులు నిరసనలు చేశారు.
‘‘పీఎఫ్ఐ జాతీయ, రాష్ట్రస్థాయి, స్థానిక సభ్యుల ఇళ్లలో ఎన్‌ఐఏ సోదాలు చేస్తోంది. అసమ్మతి గళాలను అణచివేయడానికి కేంద్ర ఏజెన్సీలను వాడుకుంటున్నారు’’ అని ప్రభుత్వంపై పీఎఫ్ఐ ఆరోపణలు చేసింది.
అయిదు కేసులకు సంబంధించి 45 మందిని అరెస్ట్ చేసినట్లు ఒక పత్రికా ప్రకటనలో ఎన్ఐఏ చెప్పింది.
సోదాల సమయంలో పలు కీలక డాక్యుమెంట్లు, నగదు, పదునైన ఆయుధాలు, పెద్ద సంఖ్యలో డిజిటల్ పరికరాలు లభ్యమైనట్లు ఏజెన్సీ చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
పీఎఫ్ఐ అంటే ఏంటి?
పీఎఫ్ఐ 2006లో ఏర్పాటైంది. తమది ఒక సామాజిక, స్వచ్ఛంద సంస్థ అని, పేదలు, అణగారిక వర్గాల కోసం సేవలు అందించడం, దోపిడీపై పోరాడటం తమ లక్ష్యమని ఆ సంస్థ చెబుతోంది.
1992లో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం, కేరళకు చెందిన వివాదాస్పద నేషనల్ డెవలప్‌మెంట్ ఫ్రంట్ (ఎన్‌డీఎఫ్) ఏర్పాటైంది. దీనితోపాటు మరికొన్ని దక్షిణ భారత సంస్థలను కలిపి పీఎఫ్ఐను ఏర్పాటుచేశారు. మరికొన్ని సంస్థలు కూడా కలవడంతో పీఎఫ్ఐ పరిధి కూడా విస్తరించింది.
ప్రస్తుతం కేరళ, కర్నాటకల్లో పీఎఫ్ఐకు ప్రాతినిధ్యం ఉంది. దాదాపు 20కిపైగా రాష్ట్రాల్లో వేల మంది కార్యకర్తలు ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పీఎఫ్ఐ ఎందుకు వివాదాస్పదమైంది?
సంస్థ వెబ్‌సైట్‌లో పేర్కొన్న మిషన్ స్టేట్‌మెంట్ ప్రకారం.. ‘‘స్వేచ్ఛ, న్యాయం, భద్రతకు సంబంధించి అందరికీ సమాన హక్కులు అందేలా చూడటం’’తమ విధి అని పీఎఫ్ఐ చెబుతోంది. దళితులు, గిరిజనులు, మైనారిటీలకు హక్కులు అందేలా చూసేందుకు ఆర్థిక పరమైన విధానాల్లో మార్పులు చేయడం అవసరమని సంస్థ వివరిస్తోంది.
అయితే, సంస్థతోపాటు సంస్థ సభ్యులపై ప్రభుత్వం వరుస అభియోగాలు మోపుతోంది. రాజ్యద్రోహం, రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టడం, భారత్‌ను అస్థిర పరచడం లాంటి ఆరోపణలను సంస్థపై ఉన్నాయి.
గత జూన్‌లో రాజస్థాన్‌లో ఒక హిందూ వ్యక్తి తల నరికిన కేసులో సంస్థ సభ్యుల ప్రమేయముందని పోలీసులు ఆరోపణలు మోపారు.
కొన్ని నెలల క్రితం భారత్‌ను ఇస్లామిక్ దేశంగా మారుస్తామంటూ చెప్పే ఒక పత్రాన్ని బిహార్‌లో సంస్థ పంచినట్లు పోలీసులు కేసు నమోదుచేశారు. అయితే, ఆ పత్రంతో తమకు సంబంధంలేదని సంస్థ చెబుతోంది.
పీఎఫ్ఐపై వస్తున్న ప్రధాన ఆరోపణల్లో నిషేధిత ఇస్లామిస్ట్ సంస్థ – స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమీ)తో సంబంధాలు కూడా ఒకటి. మరో నిషేధిత సంస్థ ఇండియన్ ముజాహిదీన్‌తోనూ పీఎఫ్ఐకు సంబంధాలున్నాయని ఆరోపణలు వచ్చాయి.

ఫొటో సోర్స్, PFI
పీఎఫ్ఐ వ్యవస్థాపకుల్లో ప్రొఫెసర్ పి. కోయా ఒకరు. ఈ ఆరోపణల్లో ఎలాంటి నిజమూలేదని ఆయన బీబీసీతో చెప్పారు. 1981లో సిమీతో తాను సంబంధాలు తెంచుకున్నానని, ఆ తర్వాత 1993లో ఎన్‌డీఎఫ్‌ను తాను ఏర్పాటుచేశానని ఆయన చెప్పారు.
కొన్ని రాజకీయ హింస కేసులతోనూ పీఎఫ్ఐకు సంబంధమున్నట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు.
కేరళలో ప్రొఫెసర్ టీజే జోసెఫ్‌పై దాడి అనంతరం 2010లో తొలిసారి పీఎఫ్ఐ పేరు వార్తల్లో మార్మోగింది. పరీక్షల్లో మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర ప్రశ్నలు అడిగారంటూ ఆయనపై కొన్ని ముస్లిం సంస్థలు ఆరోపణలు చేశాయి.
ఈ దాడికి సంబంధించి కొందరు పీఎఫ్ఐ సభ్యులను కోర్టు దోషులుగా నిర్ధారించింది. అయితే, ఆ దోషులకు తమకు ఎలాంటి సంబంధంలేదని పీఎఫ్ఐ చెప్పింది.
2018లో కేరళలోని ఎర్నాకుళంలో పీఎఫ్ఐ కార్యకర్తలు వామపక్ష విద్యార్థి సంస్థ ఎస్ఎఫ్ఐ నాయకుడిని కత్తితో పొడిచి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి.
పీఎఫ్ఐకు ఏ మేరకు ప్రజాదరణ ఉంది?
పీఎప్ఐ నాయకులు తమ ప్రసంగాలు, రెచ్చ గొట్టే వ్యాఖ్యలతో మీడియా దృష్టిని ఆకర్షిస్తుంటారు.
తమకు భారీగా ప్రజాదరణ ఉందని సంస్థ చెబుతోంది. అయితే, రాజకీయంగా సంస్థ ఎలాంటి ఫలితాలను కనబరచలేదు. సంస్థకు చెందిన సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ) కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసింది. ఒక మోస్తరు ఫలితాలు సాధించింది. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేదు.
‘‘పీఎఫ్ఐ అనేది ఒక పెద్ద రాజకీయ లేదా సామాజిక సంస్థ కాదు. సంస్థ ప్రభావం కేరళ, కొన్ని దక్షిణాది రాష్ట్రాలకు మాత్రమే పరిమితం. భారత్‌లోని మిగతా ప్రాంతాల ముస్లింలకు సంస్థ గురించి పెద్దగా తెలియదు’’అని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీకి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ ఆదిల్ హెహ్దీ చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఈ ఏడాది మొదట్లో కర్నాటకలో హిజాబ్ వివాదం అనంతరం ఘర్షణలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించిందని పీఎఫ్ఐపై కర్నాటక ప్రభుత్వం ఆరోపణలు మోపింది. మరోవైపు పీఎఫ్ఐకు చెందిన మహిళ, విద్యార్థి సంఘాలు హిజాబ్ అనుకూల నిరసనల్లో పాల్గొన్నాయని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి.
పీఎఫ్ఐపై పూర్తిగా నిషేధం విధించాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) డిమాండ్ చేస్తోంది. మరోవైపు ఈ సంస్థను కేరళ హైకోర్టు కూడా ఒకసారి అతివాద సంస్థగా వ్యాఖ్యానించింది.
పీఎఫ్ఐ మాత్రం ఈ అతివాద కార్యకలాపాల్లో తమ ప్రమేయం లేదని పదేపదే చెబుతూ వస్తోంది.
ఇవి కూడా చదవండి:
- లీటర్ రూ. 200.. బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లు తాగుతున్న ఈ నీటి వల్ల వయసు కనిపించదా
- పుట్టగానే ఆసుపత్రిలో తారుమారయ్యారు.. ఇరవై ఏళ్ల తరువాత వాళ్లిద్దరే పెళ్లి చేసుకున్నారు
- ఆంధ్రప్రదేశ్: వాట్సాప్‌లో పోస్టుకు సీనియర్ జర్నలిస్ట్ అరెస్ట్, సీఐడీ కుట్ర కేసు ఎందుకు పెట్టింది
- కృష్ణ వ్రింద విహారి రివ్యూ: ఎక్కడో చూసినట్లుందే అనిపించే సినిమా
- 'నా కూతురు శవాన్ని కూడా నన్ను చూడనివ్వలేదు. ఆమె గురించి అధికారులు చెబుతున్నవన్నీ అబద్ధాలు'-మహసా తండ్రి ఆవేదన
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












