కృష్ణ వ్రింద విహారి రివ్యూ: 'అంటే...' ఎక్క‌డో చూసిన‌ట్టుందే

కృష్ణ వ్రింద విహారి

ఫొటో సోర్స్, @ira_creations

ఫొటో క్యాప్షన్, కృష్ణ వ్రింద విహారి సినిమాలో ఓ దృశ్యం

కొన్నిసార్లు చాలా మామూలు క‌థ‌లే గొప్ప‌గా అనిపిస్తాయి. కొన్ని సార్లు గొప్ప క‌థ‌లే మామూలుగా మిగిలిపోతాయి. దానికి కార‌ణం.. ఆ క‌థ చెప్పే విధాన‌మే.

రొటీన్ క‌థ‌లు సైతం సూప‌ర్ హిట్ట‌యిపోతున్నాయంటే ఇక్క‌డ గుర్తు పెట్టుకోవాల్సింది.. ఆ క‌థేమిట‌న్న‌ది కాదు. దాన్ని ఎలా చెప్పారు? అనేదే.

ప్రేమ‌క‌థ‌లు కుప్ప‌లు కుప్ప‌లుగా పుట్టుకొచ్చేస్తుంటాయి. అందులో ముడి స‌రుకు ప్రేమే. ఆ ప్రేమ‌ని ఎలా వ్య‌క్త‌ప‌రిచారు? ఎంత గాఢంగా చూపించారు? అనేదే విజ‌య సూత్రం అవుతుంది.

'కృష్ణ వ్రింద విహారి' సినిమా చూస్తుంటే.. 'ఇలాంటి క‌థ ఇంకెక్క‌డో చూశామే' అనిపిస్తుంది. నిజానికి అది అక్ష‌రాలా నిజం కూడా.

కాకపోతే, ఆ తెలిసిన క‌థే కొత్త‌గా చెబితే చాల‌న్న సూత్రం 'కృష్ణ వ్రింద విహారి' ఫాలో అయ్యిందా, లేదా? ఇంత‌కీ... 'కృష్ణ‌'ని చూస్తే ఏ సినిమా గుర్తొచ్చింది? ఏమా క‌థ‌..?

కృష్ణ వ్రింద విహారి

ఫొటో సోర్స్, @ira_creations

అంటే... కృష్ణ‌గాడికి..!

కృష్ణాచారి (నాగ‌శౌర్య‌)ది సంప్ర‌దాయ బ్రాహ్మణ కుటుంబం. అమ్మ (రాధిక‌) నిష్టాగ‌రిష్ఠురాలు. ఆ ఊరికి త‌నే ఓ శివ‌గామి. కృష్ణ‌ని చాలా ప‌ద్ధ‌తిగా పెంచుతుంది. ఉద్యోగం కోసం ప‌ట్నం పంపుతుంది.

అక్క‌డ వ్రింద (షెర్లీ) ప‌రిచ‌యం అవుతుంది. కృష్ణ‌కు త‌నే టీమ్ లీడ‌ర్‌. త‌ను నార్త్ ఇండియ‌న్‌. కొంచెం ఫాస్ట్‌గా ఉంటుంది. ఇండిపెండెంట్‌గా బ‌త‌కాలనుకొంటుంది. ప్ర‌పంచ‌మంతా తిరిగి.. ఇష్ట‌మైన దేశంలో స్థిర‌ప‌డాల‌న్న‌ది త‌న కోరిక‌. త‌న‌ని ప్రేమించ‌మ‌ని కృష్ణ వెంట ప‌డుతున్నా పట్టించుకోదు. లోప‌ల ఇష్ట‌మున్నా దాన్ని వ్య‌క్త ప‌ర‌చ‌దు. దానికంటూ ఓ బ‌ల‌మైన కార‌ణం ఉంది. అదేంటి? కృష్ణ ప్రేమ‌ని వ్రింద ఎప్పుడు ఒప్పుకొంది.? ఆ త‌ర‌వాత జ‌రిగిన ప‌రిణామాలేంటి? అనేది మిగిలిన క‌థ‌.

కృష్ణ వ్రింద విహారి తొలి స‌గం చూస్తున్న‌ప్పుడు చాలా ప్రేమ‌క‌థ‌లు గుర్తొస్తాయి. వాటిని లెక్క‌పెట్ట‌లేం కూడా. కాక‌పోతే.. ద‌ర్శ‌కుడు అనీష్ కృష్ణ ఈ క‌థ‌ని చెప్పే విధానంలో త‌న టాలెంట్ చూపించాడు. క‌థ‌ని ఆసుప‌త్రిలో మొద‌లెట్టాడు. కోమాలో ఉన్న ఓ డాక్ట‌రు (వెన్నెల కిషోర్‌)...త‌న‌కు స‌ప‌ర్య‌లు చేస్తున్న హీరో (నాగ‌శౌర్య‌)ల‌ను చూపిస్తూ ఈ క‌థ మొద‌లెట్టాడు.

అనీష్ కృష్ణ‌కు కామెడీ పండించ‌డంలో మంచి గ్రిప్ ఉంది. ఈ విష‌యం త‌న తొలి సినిమా 'అలా.. ఎలా'తోనే అర్థ‌మైంది. అదే బ‌లాన్ని వాడుకొంటూ తొలి స‌న్నివేశాల్ని స‌ర‌దా స‌ర‌దాగా మొద‌లెట్టేశాడు.

పాత్ర‌ల్ని ప‌రిచ‌యం చేయ‌డంలోనూ, క‌థ‌ని ముందుకు న‌డ‌ప‌డంలోనూ ద‌ర్శ‌కుడి ప‌నిత‌నం క‌నిపిస్తుంది. ఆఫీసులో అడుగుపెట్టాక‌... వ్రింద‌తో ప్రేమాయ‌ణం సీన్ల‌లో మాత్రం.. ద‌ర్శ‌కుడు ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రించాడు. ఆఫీసు గోల‌... అక్క‌డి వ్య‌వ‌హారాలు మ‌రీ చ‌ప్ప‌గా సాగుతాయి.

మాక్ డ్రిల్ లో హీరో విన్యాసాలు చూస్తే ప్రేక్ష‌కుల‌కు న‌వ్వొస్తుంది. అక్క‌డ‌క్క‌డ కొన్ని కామెడీ పంచ్‌లు ప‌డుతూ.. సాదాసీదాగా బండిని న‌డిపేస్తాడు. ఇంటర్వెల్ ద‌గ్గ‌ర క‌థ స‌రైన చోటికి వచ్చి ఆగుతుంది. దర్శ‌కుడు ఈ క‌థ‌ని ప‌ట్టాలెక్కించ‌డానికి న‌మ్మిన పాయింట్ అది. హీరో నాగ‌శౌర్య కూడా బాగా ఎగ్జ‌యిట్ అయిన పాయింట్ ఇదే అయ్యుండొచ్చు. కాక‌పోతే.. సేమ్ టూ సేమ్ ఇలాంటి పాయింటే ఇటీవ‌ల విడుద‌లైన 'అంటే.. సుంద‌రానికి'లో క‌నిపిస్తుంది.

ఈ రెండు సినిమాల మ‌ధ్య పెద్ద‌గా ఎడం లేక‌పోవ‌డంతో...ప్రేక్ష‌కుల‌కు నాని సినిమా, అందులోని కాన్ఫ్లిక్ట్ క‌ళ్ల ముందు క‌ద‌లాడుతుంది. దాంతో రొటీన్ ఎక్స్‌ప్రెష‌న్స్ తో ఇంటర్వెల్ లో థియేట‌ర్‌ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తాడు ప్రేక్షకుడు.

కృష్ణ వ్రింద విహారి

ఫొటో సోర్స్, @ira_creations

ఫొటో క్యాప్షన్, షెర్లీ

కాపాడిన 'కోమా' డ్రామా

రెండో భాగంలో.. తొలి ప‌ది నిమిషాలూ హిలేరియ‌స్ గా సాగిపోతాయి. వెన్నెల కిషోర్ ని తీసుకొచ్చి అక్క‌డ కావ‌ల్సినంత ఫ‌న్ పండించారు. 'వికెట్ డౌన్‌', బంతి, వ‌చ్చీ రాని హిందీ వ‌ల్ల ఏర్ప‌డిన క‌మ్యునికేష‌న్ గ్యాప్, అందులోంచి పుట్టుకొచ్చిన క‌న్‌ఫ్యూజ‌న్ డ్రామా ఇవ‌న్నీ బాగా పండాయి. దాంతో సెకండాఫ్‌కి కూడా మంచి టేకాఫ్ ల‌భించింది.

ఈ క‌థ‌ని అదే మూడ్‌లో చివ‌రి వ‌ర‌కూ తీసుకెళ్లిపోతే బాగుండేది. కానీ... మ‌ధ్య‌లో అత్తా - కోడ‌ళ్ల డ్రామా ఒక‌టి మొద‌లెట్టారు. రాధిక అనుభ‌వ‌జ్ఞురాలు. త‌న చేతిలో మామూలు సీన్ పెట్టినా ఆమె దాన్ని మ‌రో స్థాయికి తీసుకెళ్తుంది. రాధిక కూడా త‌న వంతు ప్ర‌య‌త్నం తాను చేసింది. కానీ ఈ అత్తా కోడ‌ళ్లు, అనుమానాల డ్రామా స‌రిగా పండ‌లేదు. స‌రిక‌దా..అప్ప‌టి వ‌ర‌కూ ఆ సినిమాపై ఏమైనా ఆశ‌లు పెట్టుకొంటే, అవి కూడా ప‌టాపంచ‌లు అయిపోతుంటాయి.

బ‌ల‌వంత‌పు ఎమోష‌న్లూ, సెంటిమెంట్ డైలాగులూ... క‌థ‌ని క్లైమాక్స్ వ‌ర‌కూ నెట్టుకు రావ‌డానికి చాలా పాట్లు ప‌డ్డాయి.కానీ వ‌ర్క‌వుట్ కాలేదు. ప్రీ క్లైమాక్స్‌కి ముందు న‌డిచే స‌న్నివేశాలు ఏ సినిమాకైనా చాలా కీల‌కం. అవే సినిమా భ‌విష్య‌త్తుని నిర్ణ‌యిస్తాయి. కీల‌క‌మైన ఆ ఎపిసోడ్ ద‌గ్గ‌ర ద‌ర్శ‌కుడు రాణించ‌లేక‌పోయాడు. ఆ ఎఫెక్ట్ సినిమా ఫ‌లితంపై ప‌డింది. 'ఈ సినిమా ఇక ఇంతేనా' అని ఆవులిస్తున్న త‌రుణంలో.. వెన్నెల కిషోర్ కోమా డ్రామా మొద‌ల‌వుతుంది.

వెన్నెల కిషోర్ కోమాలోకి వెళ్లిన సంద‌ర్భం, ఆ స‌న్నివేశం బ‌ల‌వంతంగా ఇరికించిన‌ట్టు ఉన్న‌ప్ప‌టికీ.. ఆ ట్రాక్ ట్రాక్ మొత్తం న‌వ్విస్తుంది. వెన్నెల కిషోర్‌ని కోమా నుంచి బ‌య‌ట‌కు తీసుకురావ‌డానికి హీరో, అత‌ని మిత్ర‌బృదం ప‌డే పాట్లు వ‌ర్క‌వుట్ అయ్యాయి.

సెకండాఫ్‌లో మ‌ళ్లీ కాస్త వినోదం పంచ‌డానికి త‌గిన అవ‌కాశాన్ని ఈ ఎపిసోడ్ క‌ల్పించింది. దాంతో.. సెకండాఫ్‌లో భారమైన ఎమోష‌న్‌తో ప్రేక్ష‌కుడు కోమాలోకి వెళ్లాల్సిన ప‌రిస్థితి నుంచి..ఈ కోమా డ్రామా కాపాడింది. ఆ త‌ర‌వాత మళ్లీ రొటీన్ ట్రాక్ ఎక్కేసిన ద‌ర్శ‌కుడు ఓ సాదా సీదా క్లైమాక్స్ తో క‌థ‌ని ముగించాడు. క‌థ‌ని బాగా మొద‌లెట్టి త‌న నేర్ప‌రిత‌నం చూపించిన ద‌ర్శ‌కుడు.. అదే స్థాయిలో ముగించ‌ లేక‌పోవ‌డంతో..'కృష్ఱ వ్రింద‌' రొటీన్ సినిమాగా మిగిలిపోయింది.

కృష్ణ వ్రింద విహారి

ఫొటో సోర్స్, @ira_creations

శౌర్య క్లాస్ - షెర్లీ మాస్‌!

త‌న ప్ర‌తీ సినిమాలోనూ నూటికి నూరుపాళ్లు క‌ష్ట‌ప‌డుతుంటాడు నాగ‌శౌర్య‌. ఈసారీ అంతే. త‌న కామెడీ టైమింగ్ ఇంకాస్త ఇంప్రూప్ అయిన‌ట్టు క‌నిపిస్తుంది. ప‌ద్ధ‌తైన కుర్రాడి పాత్ర‌లో, క్లాస్ లుక్ లో ఇమిడిపోయాడు. త‌న కాస్ట్యూమ్స్ కూడా బాగున్నాయి. ఓ ఫైట్ సీన్‌లో చొక్కా విప్పి - సిక్స్ ప్యాక్ చూపించి యాక్ష‌న్ విష‌యంలోనూ లోటు చేయ‌లేద‌ని అనిపించుకొన్నాడు.

షెర్లీ చూడ్డానికి బాగుంది. ఇండిపెండెంట్ క్యారెక్ట‌ర్ గా.. హీరోయిన్‌ని పాత్ర‌ని డిజైడ్ చేయ‌డం బాగుంది. అయితే... షెర్లీ త‌న‌కు తానే డ‌బ్బింగ్ చెప్పుకోవ‌డం కుద‌ర్లేదు. వాయిస్ కాస్త ఇబ్బంది పెట్టింది. తెలుగు ప‌దాల‌ను బ‌ట్టీపట్టి చెబుతున్న‌ట్టు అనిపించింది.

రాధిక త‌న అనుభ‌వాన్ని రంగ‌రించారు. ఆమె పాత్ర హుందాగా సాగిపోయింది. అయితే ఈసినిమాని నిల‌బెట్టింది ఎవ‌రైనా ఉన్నారు అంటే అది వెన్నెల కిషోర్ పాత్రే. త‌ను క‌నిపించిన రెండు మూడు సంద‌ర్భాల్లోనూ ప్రేక్ష‌కుల‌కు కావ‌ల్స‌నంత సాంత్వన దొరికింది.

బ్ర‌హ్మాజీ కూడా ఓకే. కాక‌పోతే.. ఆ పాత్ర‌ని ప్ర‌ధాన క‌థ‌లోకి లాక్కుని రావాల్సింది. స‌త్య, రాహుల్ రామ‌కృష్ణ‌... వీరి కాంబో కూడా టైమ్ పాస్ అందించింది.

కృష్ణ వ్రింద విహారి

ఫొటో సోర్స్, @ira_creations

టైటిల్ సాంగ్ చాలా జోరుగా సాగిపోయింది. తొలి పాట‌లో... కొరియోగ్ర‌ఫీ నీట్ గా ఉంది. థియేట‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చాక కూడా గుర్తు పెట్టుకొనేలా ఒక్క పాట కూడా లేదు. కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకొంటుంది.

తొలిస‌గంలో అక్క‌డ‌క్క‌డ ట్రిమ్ చేయాల్సిన సీన్లు కొన్ని ఉన్నాయి. ద్వితీయార్థం అంతా ఓ ఫ్లోలో సాగిపోయింది. అనీష్ కృష్ణ బ‌లం కామెడీ. త‌న బ‌లాన్ని ప్ర‌ద‌ర్శించిన ప్ర‌తీ చోటా.. ఈ సినిమా బాగానే ఉన్న‌ట్టు అనిపిస్తుంది. కొన్ని డైలాగులు పేలాయి. ముఖ్యంగా 'తీరం - తుఫాను' డైలాగ్ అయితే క్లాప్ కొట్టిస్తుంది.

ఎమోష‌న్ సీన్స్‌, ల‌వ్ ట్రాక్‌. అత్తా కోడ‌ళ్ల ఎపిసోడ్ విష‌యాల్లో మాత్రం ద‌ర్శ‌కుడు దొరికిపోయాడు. పైగా...'అంటే సుంద‌రానికి' సినిమా రిఫ‌రెన్సులు ఎక్కువైపోవ‌డంతో, ద‌ర్శ‌కుడు ఎంచుకొన్న పాయింట్ సైతం తేలిపోయింది.

కాక‌పోతే ఒక‌టి.. ఇలాంటి పాయింట్లు చాలా సున్నిత‌మైన‌వి. గీత‌పై నిల‌బ‌డే చెప్పాలి. దాన్ని దాటితే... అస‌లు వ్య‌వ‌హారం, చెప్పాల‌నుకొన్న విష‌యం ప‌క్క‌దారి ప‌ట్టేస్తాయి. బూతు ధ్వ‌నిస్తుంది. దాన్ని స‌వ్య‌మైన రీతిలో, సామాన్య ప్రేక్ష‌కుడికి తెలిసేలా, కుటుంబ ప్రేక్ష‌కులు చూడ‌గ‌లిగేలా ద‌ర్శ‌కుడు మ‌లిచాడు. ఈ విష‌యంలో.. చిత్ర‌బృందాన్ని అభినందించాల్సిందే.

వీడియో క్యాప్షన్, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో బ్రేక్‌డాన్స్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)