కృష్ణంరాజు: మొగల్తూరు నుంచి మొదలై దిల్లీ దాకా సాగిన రెబెల్ స్టార్ ప్రయాణం

ఫొటో సోర్స్, Krishnam Raju/fb
తెలుగు సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు సెప్టెంబరు 11 తెల్లవారుజామున హైదరాబాద్‌లో మరణించారు.
పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో 1940, జనవరి 20న జన్మించిన కృష్ణంరాజు పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు.
ఆయనకు చిన్నప్పటి నుంచి ప్రత్యేకంగా నటన పై ఆసక్తి లేదు కానీ, కొంత మంది నిర్మాతలు, స్నేహితులు ఆయన సినిమాల్లో నటిస్తే బాగుంటుందనే సూచనతో ఆయన సినీ రంగ ప్రస్తానం మొదలయింది.
సినిమాల్లో పాత్రల కోసం పెద్దగా కష్టపడలేదని అంటూ, సినిమాల్లో ప్రవేశానికి ముందు జరిగిన ఒక సంఘటనను 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్‌కే' లో షేర్ చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Prabhas/fb
ఆయన జీవన శైలిని చూసిన ఒకరు ఆయన తండ్రికి ఒకరు లేఖ రాస్తే, ఆయన తండ్రి తిరిగి రెండే రెండు వ్యాక్యాలతో తనకు లేఖ రాసినట్లు చెప్పారు.
"నువ్వు నా కొడుకువి, నీ మీద నాకు నమ్మకముంది. కానీ, ఇలాంటి లేఖలను రాసిన స్నేహితులను దూరంగా పెట్టుకో" అని రాసి అవతలి వ్యక్తి రాసిన లేఖను కూడా జత చేశారని చెప్పారు.
కృష్ణంరాజు 1966లో చిలకా గోరింక సినిమాతో సినిమాల్లోకి ప్రవేశించారు. ఈ సినిమాకు ఉత్తమ చలన చిత్రం విభాగంలో వెండి నంది కూడా లభించింది.
ఆయన 150కు పైగా సినిమాల్లో హీరోగా, విలన్‌గా, తండ్రి పాత్రల్లో నటించారు. అనేక పౌరాణిక పాత్రల్లో కూడా నటించారు.
ఇటీవల విడుదల అయిన రాధేశ్యాం చిత్రంలో పరమహంస పాత్ర పోషించారు. ఇదే ఆయన నటించిన చివరి సినిమా.

ఫొటో సోర్స్, KRISHNAMRAJU/FACEBOOK
కృష్ణంరాజు నటించిన సినిమాల్లో భక్త కన్నప్ప, అమరదీపం, కటకటాల రుద్రయ్య, తాండ్ర పాపారాయుడు రంగూన్ రౌడీ, బొబ్బిలి బ్రహ్మన్న, త్రిశూలం లాంటి సినిమాలు ఆయనకు పేరు తెచ్చి పెట్టాయి.
ఆయన చాలా సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు.
కృష్ణంరాజు ఐదు ఫిల్మ్ ఫేర్ అవార్డులు, మూడు నంది అవార్డులను గెలుచుకున్నారు. అమరదీపం (1977) చిత్రంలో ఆయన నటనకు ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నారు. 2006లో ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు కూడా లభించింది.
హీరో ప్రభాస్‌కు ఆయన పెదనాన్న. వీరిద్దరూ కలిసి రెబెల్, రాధేశ్యాం, బిల్లా సినిమాల్లో కూడా నటించారు.
కృష్ణంరాజుకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

ఫొటో సోర్స్, KRISHNAMRAJU/FACEBOOK
రాజకీయ జీవితం
కృష్ణంరాజు 1991లో క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు.
1992లో మొదటి సారి కాంగ్రెస్ తరుపున నర్సాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.
తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరి 1998లో కాకినాడ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన భారీ విజయం సాధించారు. 13వ లోక్ సభ ఎన్నికల్లో నరసాపురం నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు.
వాజపాయ్ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో విదేశాంగ వ్యవహారాలు, రక్షణ శాఖలో సహాయ మంత్రిగా పని చేశారు. అనేక పార్లమెంటరీ కమిటీల్లో సభ్యునిగా ఉన్నారు.

ఫొటో సోర్స్, Krishnam Raju/fb
తెలుగు ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు 18ఏళ్ళు అధ్యక్షునిగా పని చేశారు. సంఘ్ పరివార్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు.
2009లో ఆయన సినీ నటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009 సాధారణ ఎన్నికల్లో రాజమండ్రి నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కూడా ఆయన ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగానే ఉన్నారు.
2017లో ఆయనకు తమిళనాడు గవర్నర్ హోదా కల్పిస్తారనే వార్తలు కూడా వచ్చాయి.

ఫొటో సోర్స్, KRISHNAMRAJU/FACEBOOK
పని పట్ల అంకిత భావం
"ఇంటి దగ్గరి నుంచి షూటింగ్ వెళ్లి మేక్ అప్ వేసుకున్న తర్వాత నేను కృష్ణంరాజును కాదు. షూటింగ్ లో ఉన్నప్పుడు వేరే ప్రపంచం గురించి ఆలోచించేవాడిని కాదు" అని ఆయన ఆర్ కే తో ఇంటర్వ్యూలో చెప్పారు.
మాంసాహారం అంటే ఇష్టం
కృష్ణంరాజుకు మాంసాహారం అంటే ప్రీతి అని, పెసరట్టు అంటే ఇష్టమని ఆయన భార్య శ్యామలాదేవి సాక్షి పత్రికకు 2019లో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జంతు వేట పై నిషేధం విధించేవరకు వేటకు వెళ్లేవాడినని ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఆయన షూటింగ్‌లో ఉంటే సెట్‌లో ఉన్నవారందరికీ ఆయన ఇంటి నుంచే భోజనం వెళుతుందని చాలా ఇంటర్వ్యూలలో వెల్లడించారు.
అమితాబ్ బచ్చన్ కూడా కృష్ణంరాజు ఇంట్లో భోజనాన్ని ఇష్టపడతారని శ్యామలా దేవి సాక్షికిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. బిల్లా షూటింగ్ సమయంలో మలేషియాకు హైదరాబాద్ నుంచే వంట మనిషిని తీసుకుని వెళ్లి సెట్ లో అందరికీ భోజనం వండించి పెట్టేవారని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, KRISHNAMRAJU/FACEBOOK
‘‘పెద్ద పులిని కూడా మచ్చిక చేశా’’
పులిని మచ్చిక చేసుకున్న వైనాన్ని ఆయన వివరించారు. 'కటకటాల రుద్రయ్య' అనే సినిమా కోసం ఆ పులిని తీసుకొచ్చారు. అది గాండ్రించడం మొదలుపెట్టింది. నేను దాని మెడ దగ్గర మెల్లిగా అలా నిమురుతూ మచ్చిక చేసుకున్నాను. ఆ పులితో నాకు ఫైట్‌సీన్ ప్లాన్ చేశారు. అంతకుముందు నేను దాని మెడ పట్టుకుంటే విసిరి కొట్టింది. అంతదూరం పడ్డాను. అయితే, మచ్చిక చేసుకున్న తర్వాత ఫ్రెండ్లీ అయిపోయింది" అని ఆయన సాక్షి ఇంటర్వ్యూలో చెప్పారు.

ఫొటో సోర్స్, Krishnam Raju/fb
ప్రభాస్‌తో అనుబంధం
కృష్ణం రాజు కాలికి శస్త్ర చికిత్స జరిగినప్పుడు ప్రభాస్ చాలా జాగ్రత్తగా చూసుకున్నట్లు ఆయన భార్య శ్యామలాదేవి ఒక యూ ట్యూబ్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. కృష్ణంరాజు, ప్రభాస్ కు అనుబంధం బాగుంటుందని చెప్పారు. కృష్ణంరాజుకు పిల్లలంటే ఇష్టమని చెప్పారు. ఆయన స్నేహితుల పిల్లలంతా ఆయన దగ్గరే పెరిగారని ఆయన అన్నారు. ఆయన ఇంట్లో పిల్లలందరి పేర్లు 'ప్ర' అనే అక్షరంతో మొదలవుతాయని, కృష్ణంరాజుగారే ఈ పేర్లను ఎంపిక చేశారని ఆమె వివరించారు.
పవర్ ఫుల్ డైలాగ్స్
కృష్ణంరాజు ముక్కులో నుంచి పొగలు వచ్చేంత పవర్‌ఫుల్ డైలాగ్స్ చెబుతారు అని అంటూ ప్రసాద్ ల్యాబ్స్ ఉద్యోగి శివశంకర్ బీబీసీ ఫేస్ బుక్ పేజీలో తన అభిమానాన్ని చాటుకున్నారు.
"ఆజానుబాహుడు కావడంతో ఆయన ఏ పాత్ర చేసినా, ఆ పాత్రకే ఒక నిండుదనం వచ్చేది. తెరపై ఆయనను విలన్ గ్యాంగ్ చుట్టుముడితే అభిమానులు కంగారుపడేవారు కాదు. తమ హీరో వాళ్లను చితగ్గొట్టేస్తాడనే నమ్మకంతో కూల్‌గానే కూర్చునేవారు. పర్సనాలిటీ. స్థిరంగా, గంభీరంగా ఉండే ఆయన డైలాగ్ డెలివరీ ఆయన పాత్రలకు ప్రాణం పోసిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు" అని కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











