నల్గొండ: ‘సిజేరియన్ చేయాలంటే మంత్రి హరీశ్ రావు నుంచి లెటర్ తెమ్మన్నారు, కాన్పు సమయంలో నా భార్య చనిపోయింది’

ఫొటో సోర్స్, UGC
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు సమయంలో తల్లి మరణించిన కేసులో డాక్టర్ల నిర్లక్ష్యంతో పాటు సిజేరియన్లు తగ్గించాలని ప్రభుత్వం చేస్తున్న ఒత్తిడే పరోక్ష కారణం అని ఆరోపణలు వస్తున్నాయి.
ప్రసవాలు సహజంగా చేయాలి తప్ప ఆపరేషన్లు చేయవద్దన్న ప్రభుత్వ ఒత్తిడి ఎక్కువ కావడంతో, ఈ కేసులో సర్జరీ చేయకుండా వైద్యులు ఆలస్యం చేయడమే తల్లి మృతికి కారణం అంటున్నారు మృతురాలి కుటుంబ సభ్యులు.
కడుపులో బిడ్డ నాలుగు కేజీల కంటే ఎక్కువ బరువు ఉన్నప్పటికీ, ప్రసవ సమయంలో ఇబ్బంది ఎదురైనప్పటికీ సర్జరీ చేసి బిడ్డను బయటకు తీయకపోవడం వల్లే తల్లి మరణించిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
ఈ ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వ వైద్య శాఖ ఉన్నతాధికారిని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కార్యాలయాన్నీ, నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంటునూ బీబీసీ సంప్రదించింది. కానీ, వారి నుంచి స్పందన రాలేదు.

ఫొటో సోర్స్, UGC
సిజేరియన్ ప్రసవాల్లో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానానికి చేరుతుండడంతో అనవసర సిజేరియన్లను తగ్గించాలని తెలంగాణ వైద్య శాఖ నిర్ణయించింది.
సిజేరియన్ వల్ల మహిళలకు దీర్ఘ కాలంలో చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి సహజ కాన్పులు ఎక్కువ చేయాలనేది ప్రభుత్వ విధానం. పైగా ప్రైవేటు ఆసపత్రులు డబ్బు కోసం, సమయం ఆదా చేయడం కోసం సర్జరీలు ఎక్కువ చేస్తున్నారని గతంలో అనేక సందర్భాల్లో వైద్య మంత్రి హరీశ్ రావు అన్నారు.
కానీ సహజ కాన్పులే చేయాలన్న ఒత్తిడితో క్లిష్టమైన ప్రసవాల విషయంలో కూడా వైద్యులు సర్జరీ చేయడం లేదన్నది కొందరు వైద్యుల మాట.

నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం చెరువు అన్నారం గ్రామానికి చెందని సతీశ్ తన భార్య అఖిలకు నెలలు నిండిన తరువాత, నడుం నొప్పి రావడంతో నల్గొండ జిల్లా ఆసుపత్రిలో ప్రసవం కోసం చేర్చారు. అప్పటి వరకూ ఆశ కార్యకర్త పర్యవేక్షణలోనూ, వరంగల్ ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఆమెకు వైద్యం చేశారు. ఆ రికార్డులు కూడా అడ్మిషన్ సమయంలో నల్గొండ ప్రభుత్వ వైద్యులకు ఇచ్చారు సతీశ్. వెంటనే అడ్మిట్ చేసిన వైద్యులు, రక్తం సమకూర్చుకోవాలని సూచించారు. రక్త పరీక్షలు చేయించారు. మరునాడు రక్త పరీక్షల ఫలితాలు వచ్చాయి.
''నార్మల్ డెలివరీ అవడం కోసం ఎదురు చూడాలని డాక్టర్లు అన్నారు. 11వ తేదీ రాత్రి ఉమ్మనీరు పడిపోయి, బ్లీడింగ్ అయింది. అప్పుడు మేం వెళ్లి సర్జరీ చేయమని అడిగాం. బాబు బరువు 4 కేజీల కంటే ఎక్కువ ఉంది. ఈమెకు నార్మల్ కష్టం అని గతంలో పరీక్షించిన వైద్యులు చెప్పారని గుర్తు చేశాం. అదే విషయం ఇక్కడ వైద్యులకు చెప్పి సర్జరీ చేయమని అడిగాం. నొప్పి తట్టుకోలేకపోతోందని చెప్పాం'' అని బీబీసీకి చెప్పారు అఖిల భర్త సతీశ్.
''ఆపరేషన్ చేయాలంటే వైద్య మంత్రి హరీశ్ రావు కానీ ఆసుపత్రి సూపరింటెండెంట్ నుంచి కానీ లెటర్ ఇస్తేనే చేస్తాం.'' అని సిబ్బంది చెప్పారు అని ఆరోపించారు సతీశ్.
తన భార్య నొప్పులతో అరుస్తుంటే సిబ్బంది మాత్రం అసభ్యంగా మాట్లాడారని ఆయన ఆరోపిస్తున్నారు.

12వ తేదీ అఖిలకు నార్మల్ డెలివరీ చేశారు. కానీ విపరీతమైన రక్తస్రావం జరగడంతో రెండు రోజులు ఐసీయూలో చికిత్స చేసి చివరకు గాంధీకి తరలించారు.
గాంధీ ఆసుపత్రిలో మరో రెండు రోజుల చికిత్స తరువాత తల్లి మరణించారు.

''12వ తేదీ నార్మల్ డెలివరీ సమయంలో కూడా కడుపు మీద నుంచి బలవంతంగా తోశారు. బాబును బయటకు తీసిన తరువాత వేరే పేషెంట్ దగ్గరకు వెళ్లిపోయారు. తల్లికి ఎక్కువ రక్తస్రావం అవుతుంది అని అక్కడే ఉన్న మా అమ్మమ్మ చెబితే, అది మామూలే అన్నారట వైద్యులు. వేరే పేషెంట్ దగ్గరకు వెళ్లి వచ్చేసరికి నా భార్య అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో అప్పుడు మేలుకొని రక్తం ఎక్కించాలని హడావుడి చేశారు. ఒక్క నిమిషంలో గర్భసంచి తీసేయకపోతే చనిపోతుందని నాకు చెప్పారు. దీంతో భార్యే ముఖ్యం, గర్భసంచి తీసేయమని నేను చెప్పాను. కానీ ఆ ఆపరేషన్ తరువాత ఏం అయిందో కూడా నాకు సమాచారం ఇవ్వలేదు. ఐసీయూలో రెండు రోజులు ఉంచారు. రక్తం ఎక్కించారు. ఇక తమ దగ్గర రక్తం అయిపోయిందనీ గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లాలనీ సూచించారు'' అన్నారు సతీశ్.
సతీశ్ చెబుతోన్న వివరాల ప్రకారం... ఈ కేసులో తప్పు జరిగినట్టు నల్గొండ ప్రభుత్వ వైద్యులు గుర్తించారు. తమ తప్పు సరిదిద్దుకునే క్రమంలో ప్రభుత్వ వైద్యులే స్వయంగా అంబులెన్సు ఏర్పాటు చేసి అందులో ఇద్దరు ప్రభుత్వ డాక్టర్లను తోడుగా ఇచ్చి గాంధీకి పంపినట్టు ఆయన చెబుతున్నారు. గాంధీ ఆసుపత్రికి పంపే సమయంలో కూడా స్వయంగా సూపరింటెండెంట్ తమతో మాట్లాడారని వివరించారు.
''మా వల్ల పొరపాటు జరిగింది. కానీ నీ భార్యకు ఏమీ కాకుండా చూస్తాం.'' అని ప్రభుత్వ వైద్యులు తనతో అన్నట్టు సతీశ్ చెబుతున్నారు.
గాంధీ ఆసుపత్రిలో రెండు రోజుల వైద్యం తరువాత 17వ తేదీ అఖిల మరణించారు. అయితే అఖిల డెడ్ బాడీ ఇచ్చే విషయంలో ప్రొసీజర్ సరిగా ఫాలో కాలేదని ఆమె భర్త చెబుతున్నారు. అంతేకాదు, తన భార్య పాత మెడికల్ రికార్డులు, నల్గొండ ఆసుపత్రి రికార్డులు, గాంధీ ఆసుపత్రి రికార్డులు.. ఏవీ తమకు ఇంకా ఇవ్వలేదని సతీశ్ బీబీసీతో చెప్పారు.
మరోవైపు అఖిలకు పుట్టిన బాబుకు ఫిట్స్ వస్తున్నాయి. దీంతో నల్గొండలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు.
వాస్తవానికి వేరే ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్తే ప్రభుత్వ వైద్య అధికారులు ఆ ఆసుపత్రి యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి అడ్మిషన్ ఆపించారని సతీశ్ సన్నిహితులు ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వ విధానమే కారణం
''సిజేరియన్ చేయాలా వద్దా అనేది అక్కడ కూర్చున్న డాక్టర్ గర్భిణి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటాడు. ఇప్పుడు సమాజంలో మహిళలకు నొప్పులు భరించే శక్తి తగ్గిపోయింది. అందరిలో ఒకేలా యుటెరస్ కాంట్రాక్ట్ కాదు. అది బయట రూల్స్‌తో చెప్పేది కాదు. అఖిల విషయంలో కూడా అదే జరిగింది. ఆపరేషన్ చేయబోమంటూ 9న అడ్మిట్ అయితే, 12 వరకూ నొప్పులు తెప్పించి ఆపి, సడెన్ గా రక్తస్రావం జరగగానే అక్కడ నుంచి తరలించి, నిష్కారణంగా ఒక గర్భిణిని బలి చేశారు. ఇది కేవలం హరీశ్ రావు అవలంబించే విధానం వల్ల జరిగింది.. మెడికల్, మాతా శిశు విధానాలతో సంబంధం లేకుండా ఏదో అద్భుతం చేసేద్దాం అనుకుంటున్నారు వాళ్లు.'' అని ఆరోపించారు స్వయంగా డాక్టర్ అయిన నల్గొండకు చెందిన నాయకుడు చెఱకు సుధాకర్. ఆయన ప్రస్తుతం తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు.
నార్మల్ డెలివరీల విషయంలో ప్రభుత్వ ఒత్తిడి సరికాదని ఆయన వాదిస్తున్నారు.
''నార్మల్ డెలివరీలు చేయడానికి సరిపడా మౌలిక వసతులు లేవు. నార్మల్ డెలివరీ చేయాలంటే డెలివరీ అయ్యే వరకూ ఎన్ని షిప్టులు అయినా అంత మంది నర్సులు, డాక్టర్లు అక్కడే కూర్చుని ఉండాలి. ఒక్కరి కోసమే అందరు ఉండాలి. భారతదేశం వంటి వసతులు, సిబ్బంది కొరత ఉన్న చోట్ల అది ఎంతవరకు సాధ్యమనేది కూడా చూడాలి. ఇలాంటి కేసుల్లో డాక్టర్ ఒక రౌండ్ తిరిగి వచ్చే సరికి గర్భిణికి బ్లీడింగ్ ఎక్కువ అయిపోయింది. బహుశా రప్చర్ యుటెరస్ అయ్యుంటుంది. అందుకే అప్పటికప్పుడు గర్భసంచి తొలగించాల్సి వచ్చింది. పేషెంట్ పరిస్థితిని బట్టి కడుపులో పాప పెద్దగా ఉన్నప్పుడు, పెల్విస్ కోపరేట్ చేయనప్పుడు ఆపరేషన్ చేసి ఉంటే ఆ అమ్మాయి మంచిగా ఇంటికి వెళ్లుండేది. సెక్షన్ ఆపరేషన్ చేయాలా అనేది అక్కడి డాక్టర్ డెసిషన్. ఆసుపత్రులు, నర్సింగు హోములపై అనవసర ప్రెజర్ పెట్టకండి. దానివల్ల ఎందరో చనిపోతున్నారు. సిద్ధిపేటలో, కరీంనగర్ లో కూడా ఇలా జరిగింది'' అన్నారు సుధాకర్.
బిడ్డను బయటకు తీసే సమయంలో ఆలస్యం జరిగితే పాపాయి మెదడుకు రక్తం అందక సెలిబ్రల్ పాల్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ''ఇటీవల తెలంగాణలో ఇలాంటి కేసులు పెరుగుతున్నాయి. ఇప్పుడు అఖిల కొడుకు కూడా ఫోకల్ ఫిట్స్ వస్తున్నాయి. గతంలో ఇలాంటి కేసులు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ప్రభుత్వ నిర్వాకం వల్ల తెలంగాణ మళ్లీ అలాంటి కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వం కాస్త అందర్నీ సంప్రదించి సెన్సిబుల్ నిర్ణయాలు తీసుకోవాలి.'' అన్నారు సుధాకర్.

ఫొటో సోర్స్, BBC Sport
బిడ్డను మార్చేశారు
నల్గొండ ఆసుపత్రిలో తమకు మరో సమస్య కూడా ఎదురైందని సతీశ్ కుటుంబ సభ్యులు చెప్పారు. ముందుగా తమ బిడ్డను మార్చేశారని, మగ బిడ్డ పుడితే ఆడపిల్లను చూపించారనీ ఆయన ఆరోపించారు.
'ప్రసవం సమయంలో మా అమ్మమ్మ మగ బిడ్డ అని చూసింది. నేను బాబును చూడ్డానికి వెళితే మీకు పాప పుట్టిందని వేరే వాళ్ల పాపను చూపించారు. నేను గట్టిగా అడిగితే నన్ను దౌర్జన్యంగా బయటకు గెంటేశారు. తరువాత నేను ఐడి నంబర్లు చూపించారు. 7036 నంబర్ 3088 అని మార్చేశారు. అప్పుడు వాళ్లు మళ్లీ ఫీమేల్ కొట్టేసి, ట్యాగ్ వేసి ఉన్న బాబును చూపించారు. పొరపాటు జరిగింది అని చెప్పారు.'' అన్నారు సతీశ్.
బాధితులు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఆందోళన చేస్తే, ప్రభుత్వం తరపున పరిహారం ప్రకటించారు. డబుల్ బెడ్ రూం ఇల్లు, భర్తకు సెక్యూరిటీ ఉద్యోగం ఇస్తామని చెప్పారు అధికారులు.
దీనిపై తెలంగాణ ప్రభుత్వ వైద్య శాఖ ఉన్నతాధికారిని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కార్యాలయాన్నీ, నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంటునూ బీబీసీ సంప్రదించింది. వారి నుంచి స్పందన రావాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
- ట్రాక్టర్ కొనడానికి మహీంద్రా ఫైనాన్స్ నుంచి రుణం తీసుకున్న తండ్రి.. రికవరీకి వచ్చి గర్భిణిని కారుతో తొక్కించిన ఏజెంట్లు - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- మిథాలీ రాజ్: ‘క్రికెట్ కిట్ పట్టుకుని వెళ్తే.. హాకీ ప్లేయర్వా? అని అడిగేవారు’
- యూనివర్సిటీలో విద్యార్థినుల బాత్రూమ్ వీడియోలు లీక్.. 8 మంది అమ్మాయిల ఆత్మహత్యాయత్నం
- ఆంధ్రప్రదేశ్: 16 ఊళ్ళు ఏకమై ప్రభుత్వం చేయలేనిది చేసి చూపించాయి
- మ్యూచువల్ ఫండ్స్: ఎలాంటి ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













