World Patient Safety Day: ఆస్పత్రికి వెళ్ళిన రోగులు 17 రకాల హక్కులను వినియోగించుకోవచ్చు, అవి ఏంటో మీకు తెలుసా

రోగులకుండే హక్కులేంటి?

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, పద్మ మీనాక్షి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

విజయవాడకు చెందిన 45ఏళ్ల అంజనికి 2017లో హిస్టరెక్టమీ శస్త్ర చికిత్స జరిగింది. ఈ శస్త్ర చికిత్సకు ముందు ఆమె ఒక గైనకాలజిస్ట్‌ను సంప్రదించారు. ఆమెకు వెంటనే శస్త్ర చికిత్స చేయాలని సూచించారు. అయితే, ఆమె సర్జన్ కాకపోవడంతో, మరొక సర్జన్‌ను, శస్త్ర చికిత్స చేయించుకునేందుకు ఆస్పత్రిని కూడా ఆమె సూచించారు.

కానీ, అంజనికి శస్త్ర చికిత్స చేయాల్సిన డాక్టర్ ఒకరు కాగా, చేసింది మరొకరు. ఆఖరు నిమిషంలో డాక్టర్లను మార్చిన విషయం ఆమెకు తెలియదు. ఆమెను డిశ్చార్జ్ చేస్తున్న సమయంలో ఇచ్చిన రిపోర్టుల ద్వారా డాక్టర్‌ను మార్చిన విషయం తెలుసుకుని ఆమె ఆశ్చర్యపోయారు. శస్త్ర చికిత్స జరిగిన తర్వాత కూడా గైనకాలజిస్ట్ మాత్రమే తనను చూసేందుకు వచ్చేవారని అంజని బీబీసీతో చెప్పారు.

ఆపరేషన్ విజయవంతం అయి ఉంటే ఆమె ఈ విషయం గురించి పెద్దగా పట్టించుకుని ఉండేవారు కాదు. ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడం మొదలుపెట్టింది. దీంతో, ఆమె మరో వైద్యున్ని సంప్రదించారు. స్కానింగ్‌లో ఆమెకు చిన్న పేగు చీలినట్లు తెలిసింది.

శస్త్ర చికిత్స చేస్తున్న సమయంలో పేగు చీరుకుపోయి శస్త్ర చికిత్స విఫలమవ్వడమే కాకుండా ప్రాణాంతక పరిస్థితులు తలెత్తాయి.

శరీరంలో వ్యర్ధ పదార్ధాలు రక్తంలో కలిసిపోయి ఇన్ఫెక్షన్ మొదలవ్వడంతో నియంత్రణ లేకుండా మూత్రవిసర్జన మొదలయింది.

దీంతో, ఆమెకు మరోసారి ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారు. మొదటిసారి జరిగిన చికిత్సకు ఆమెకు సుమారు రూ.3లక్షలు ఖర్చయింది. ఈ ఖర్చుకు ఇన్సూరెన్సు లభించింది.

రోగులకుండే హక్కులేంటి?

ఫొటో సోర్స్, Getty Images

"ఆపరేషన్ సక్రమంగా జరిగి ఉంటే మూడు రోజుల్లో ఇంటికి రావల్సిన నేను రెండు నెలల పాటు ఆస్పత్రిలోనే రకరకాల చికిత్సలు, పరీక్షలు చేయించుకుంటూ వైద్యం తీసుకోవాల్సి వచ్చింది" అని అంజని నాతో చెప్పారు.

"ఈ మొత్తం ప్రక్రియలో నేను, నా కుటుంబ సభ్యులు భరించిన శారీరక, మనో వేదన నరకాన్ని తలపించింది. ఒక విధమైన భయంలోకి నెట్టేసింది" అని అన్నారు.

ఈ మొత్తం వ్యవహారం ఆమెను ఆలోచింపచేసేలా చేసింది.

"స్త్రీ హక్కులు, మానవ హక్కుల గురించి వేదికలెక్కి ప్రసంగాలిచ్చే నేను ప్రాణం దక్కిందని మౌనం వహించాలా, వైద్యుల అజాగ్రత్తను ప్రశ్నించాలా?" అని ఆలోచించాను.

ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నా మెడికల్ డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకుని లాయర్‌ను సంప్రదించాను. 2017 డిసెంబరులో చికిత్స చేసిన డాక్టర్‌‌తో పాటు శస్త్ర చికిత్స చేసిన డాక్టర్‌కు కూడా లీగల్ నోటీసు పంపించినట్లు చెప్పారు.

ఆమె కేసు పరిష్కారం అయిందా?

కేసు పరిష్కారం గురించి చెప్పే లోపు ఒక రోగి ఆస్పత్రికి వెళ్ళినప్పుడు రోగికుండే హక్కులేంటో తెలుసుకుందాం.

రోగులకు ఆరోగ్య భద్రత పట్ల అవగాహన కల్పించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సెప్టెంబరు 17 ప్రపంచ రోగుల భద్రతా దినంగా నిర్ణయించింది. దీనిని మొదటిసారి 2017లో నిర్వహించారు.

రోగులు చికిత్స తీసుకునేందుకు ఆస్పత్రికి వెళ్ళినప్పుడు వారికి హక్కులు ఉంటాయా? లేదా ఆస్పత్రి వర్గాలు చెప్పిన నిబంధనలకు తలవంచాల్సిందేనా?

రోగులకుండే హక్కులేంటి

ఫొటో సోర్స్, TWITTER/PTIOFFICIAL

రోగులకుండే హక్కులేంటి?

కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రోగుల హక్కులకు సంబంధించి 17 నిబంధనలతో కూడిన చార్టర్ ను విడుదల చేసింది.

ఈ చార్టర్ ఏంటి?

ఆస్పత్రులు, వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు ఒక రోగికి ఇవ్వాల్సిన ఆరోగ్య భద్రత గురించి రూపొందించిన నియమాలు ఈ చార్టర్‌లో ఉంటాయి.

రోగుల హక్కులను పరిరక్షించేందుకు, అందుకు సంబంధించిన పటిష్టమైన విధానాలను రూపొందించేందుకు ఈ నిబంధనలు మార్గదర్శకంగా పని చేస్తాయి. అనారోగ్యానికి గురైనప్పుడు వైద్యుల నుంచి ఆశించే చికిత్స గురించి అవగాహన కల్పించేందుకు తోడ్పడతాయి.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ (ప్రొఫెషనల్ కండక్ట్ అండ్ ఎథిక్స్) రెగ్యులేషన్స్ 2002, వినియోగదారుల హక్కుల చట్టం 1986, మాదకద్రవ్యాలు, సౌందర్య ఉత్పత్తుల చట్టం 1940

క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ 2010 చట్టాలలోని నిబంధనలు రోగుల హక్కులను పరిరక్షిస్తాయి.

రోగులకుండే హక్కులేంటి?

ఫొటో సోర్స్, Getty Images

భారతదేశంలో రోగులకుండే హక్కులేంటి?

భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం 2010 ను అనుసరిస్తుంటే, కొన్ని రాష్ట్రాలు రాష్ట్ర స్థాయిలో ఆస్పత్రులను నియంత్రించేందుకు నర్సింగ్ హోమ్స్ యాక్ట్ లాంటివి రూపొందించుకున్నాయి. మరి కొన్ని రాష్ట్రాలు ఈ తరహా నియమాలను రూపొందించుకునే ప్రక్రియలో ఉన్నాయి.

కేంద్ర వైద్య శాఖ రూపొందించిన చార్టర్‌లో రోగికి ప్రధానంగా 17 హక్కులను పొందుపరిచింది. ఏమిటవి?

1. సమాచార హక్కు

రోగి అనారోగ్యం, కారణం, లక్షణం, చికిత్స, వైద్య పరీక్షలు, నిర్వహణ, ఇతర సమస్యలను వైద్యున్ని అడిగి అర్ధమయ్యే భాషలో తెలుసుకునే హక్కు ఉంటుంది.

రోగికి చికిత్స చేసే డాక్టర్ అర్హతలను కూడా కూడా రోగి లేదా సంరక్షకులు, కుటుంబ సభ్యులకు అడిగి తెలుసుకునే అధికారం ఉంటుంది.

అంజని కూడా తనకు శస్త్ర చికిత్స చేసే డాక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కానీ, ఆమెకు శస్త్ర చికిత్సను వేరే డాక్టర్ చేశారు. శస్త్ర చికిత్స పూర్తయ్యేవరకు ఆమెకీ విషయం తెలియలేదు.

వైద్యం అందించడంలో నిర్లక్ష్యం జరిగి రోగి ప్రాణాలు కోల్పోయినప్పుడు లేదా సరైన చికిత్స చేయలేనప్పుడు ఐపీసీ 1860 లోని 52, 80,81, 83, 88, 90, 91, 92, 304-ఏ, 337, 338 సెక్షన్లను అనుసరించి క్రిమినల్ కేసు నమోదు చేయవచ్చని సుప్రీం కోర్టు న్యాయవాది శ్రవణ్ కుమార్ చెప్పారు.

చికిత్స తీసుకుంటుండగా వైద్యపరమైన నిర్లక్ష్యం జరిగి రోగి మరణిస్తే ఐపీసీ సెక్షన్ 304 - ఏ ను అనుసరించి డాక్టరును అరెస్టు చేయవచ్చు. ఈ నేరానికి రెండేళ్లు జైలు శిక్ష లేదా జరీమానా, లేదా జైలు శిక్ష, జరీమానా కలిపి విధించే అవకాశముంది.

రోగి ప్రాణాలతో ఉంటే ఐపీసీ 337, 338 కింద కేసు నమోదు చేయవచ్చని శ్రవణ్ కుమార్ వివరించారు.

2. వైద్య నివేదికలు

రోగి లేదా రోగిని చూసుకునే సంరక్షకులకు అనారోగ్యానికి సంబంధించిన కేసు పత్రాలు, రికార్డులు, వైద్య పరీక్షల రిపోర్టులు అడిగే హక్కు ఉంటుంది. రోగి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 24 గంటలు నుంచి 72 గంటల లోపు వీటిని తీసుకోవచ్చు. తగిన ఫీజు చెల్లించిన తర్వాత వీటిని పొందే హక్కు ఉంటుంది.

రోగులకుండే హక్కులేంటి?

ఫొటో సోర్స్, Getty Images

3. అత్యవసర చికిత్స

సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్నీ ప్రమాదాల్లో గాయపడిన వారికి అత్యవసర చికిత్సను ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి సమయాల్లో రోగి నుంచి అడ్వాన్స్ చెల్లించమని డిమాండ్ చేయకూడదు.

రోగి ఫీజు చెల్లించే సామర్ధ్యానికి అతీతంగా ఈ సేవలను అందించాల్సి ఉంటుంది.

నోయిడాలో జూన్ 2020లో 8నెలల గర్భిణిని ఆస్పత్రిలో చేర్చుకునేందుకు కనీసం 6 ఆస్పత్రులు నిరాకరించడంతో ఆమె అంబులెన్సులోనే చనిపోయినట్లు వార్తలొచ్చాయి.

దేశవ్యాప్తంగా అత్యవసర సేవలు అందక ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు తరచుగా వింటూనే ఉంటాం. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఈ తరహా మరణాలు తరచుగా చోటు చేసుకుంటూనే ఉంటాయి.

ఈ అంశం పై విచారణ నిర్వహించాలని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా మేజిస్ట్రేట్ ఎల్‌వై సుహాస్ ఆదేశాలు జారీ చేశారు.

భారతదేశంలో ఒక గ్రామస్థులు ఒక పారాసెటమాల్ మాత్ర కోసం దగ్గర్లో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వెళ్లేందుకు సగటున 2.2 కిలోమీటర్లు, రక్త పరీక్ష కోసం 6 కిలోమీటర్లు, ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు కనీసం 20 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది" అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన నివేదిక పేర్కొంది.

అత్యవసర సేవలు అందించడం ద్వారా అల్పాదాయ, మధ్య తరహా ఆదాయం ఉన్న దేశాల్లో 50శాతానికి పైగా మరణాలు, 40% రోగాల భారాన్ని తగ్గించవచ్చనే అంచనా ఉందని భారతదేశంలో అత్యవసర సేవల గురించి జులై 22, 2021లో ఎయిమ్స్ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు.

రోగులకుండే హక్కులేంటి?

ఫొటో సోర్స్, AFP

4. రోగి అనుమతి

రోగికి చికిత్స ఇచ్చేందుకు, ముఖ్యంగా ప్రాణాంతక సమస్యలకు చికిత్స అందిస్తున్న సమయంలో రోగి అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా కీమోథెరపీ లాంటి చికిత్సల్లో రోగి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ అనుమతిని రాతపూర్వకంగా తీసుకుని చికిత్స మొదలుపెట్టాలి.

ఇలాంటి కేసును ఒకటి ఉదహరిస్తూ, "2016లో తెలంగాణాలో 22ఏళ్ల అబ్బాయి ఎత్తు పెరిగేందుకు చేయించుకున్న శస్త్ర చికిత్స విఫలం కావడంతో ఆ అబ్బాయి నడవలేని స్థితికి చేరుకున్నాడు" అని చెప్పారు.

ఈ శస్త్ర చికిత్స చేసేందుకు ఆస్పత్రి వర్గాలు తల్లితండ్రుల అనుమతి తీసుకోలేదు. అబ్బాయి మేజర్ కావడంతో తల్లితండ్రుల అనుమతి తీసుకోలేదని ఆస్పత్రి వర్గాలు వాదించాయి.

ఈ కేసులో తెలంగాణ రాష్ట్ర మెడికల్ కమీషన్ ఈ శస్త్ర చికిత్స చేసిన డాక్టర్ ను బాధ్యుని చేసి రెండేళ్ల సస్పెన్షన్ విధించింది.

"కానీ, ఈ సస్పెన్షన్లు, జరీమానాలు తాత్కాలికమే" అని శ్రవణ్ అభిప్రాయపడ్డారు.

5. వ్యక్తిగత గోప్యత, విశ్వాసం

రోగులందరికీ తమ వివరాలను గోప్యంగా ఉంచమని అడిగే హక్కు ఉంటుంది. ప్రజా ప్రయోజనం ఉన్నప్పుడు తప్ప వేరే ఎటువంటి పరిస్థితుల్లోనూ డాక్టర్లు రోగి ఆరోగ్య పరిస్థితి గురించి బహిరంగంగా వెల్లడి చేయకూడదు.

ఒక స్త్రీకి పురుష డాక్టర్ చికిత్స అందిస్తున్న సమయంలో మరొక మహిళను తన పక్కనే ఉండమని చెప్పే హక్కు కూడా రోగికి ఉంటుంది.

6. మరొక డాక్టర్ అభిప్రాయం

ప్రతీ రోగి చికిత్స అందిస్తున్న డాక్టర్‌తో పాటు, మరొక డాక్టర్‌ను సంప్రదించే హక్కు ఉంటుంది. ఆస్పత్రి యాజమాన్యం రోగికుండే ఈ హక్కును గౌరవించాలి.

ఇలాంటప్పుడు యాజమాన్యాలు రోగికి అవసరమైన వైద్యపరమైన రికార్డులన్నిటినీ ఎటువంటి జాప్యం చేయకుండా ఇవ్వాలి. ఆస్పత్రి వివక్ష చూపిస్తే అది మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది.

రోగులకుండే హక్కులేంటి?

ఫొటో సోర్స్, Getty Images

7. ఆస్పత్రి వసూలు చేసే చార్జీల్లో పారదర్శకత

ఆస్పత్రి యాజమాన్యం వివిధ రోగాల చికిత్సకు తీసుకునే చార్జీల విషయంలో పారదర్శకత ఉండాలి. ఆస్పత్రిలో లభించే సౌకర్యాలు డిస్‌ప్లే బోర్డు, బ్రోచర్‌లో ఉంచాలి. ఫీజు చెల్లిస్తున్నప్పుడు ఆస్పత్రి అందించిన ప్రతీ సేవకు వివరంగా బిల్లు ఉండాలి.

ఆస్పత్రి వసూలు చేసే చార్జీల వివరాల పట్టిక అందరికీ కనపడే చోట ఉంచాలి. ఒక బుక్‌లెట్ కూడా ఇవ్వాలి.

ఈ విషయంలో ఆస్పత్రి వివక్షతో ప్రవర్తిస్తే అది మానవహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది.

8. వివక్షారహిత చికిత్స

రోగికి రోగం, స్థాయి, మతం, కులం, లింగం, వయసు, భాష, ప్రాంత బేధాలు చూపించకుండా చికిత్సను అందించాలి.

అయితే, డబ్బు, హోదా ఉన్నవారికి ఆస్పత్రుల్లో లభించే శ్రద్ధ ప్రత్యేకంగా ఉంటుందని చాలా మంది ఆరోపిస్తుంటారు. ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రైవేటు ఆస్పత్రుల మధ్య ఉండే తేడాలనే ఉదాహరణగా చెప్పొచ్చు.

వీడియో క్యాప్షన్, ఉస్మానియా హాస్పిటల్‌ దుస్థితికి కారణం ఎవరు?

9. నాణ్యమైన చికిత్స

ఆస్పత్రిలో రోగులకు కల్పించే భద్రత, రక్షణ గురించి అడిగే హక్కు రోగులకుంటుంది. ఆస్పత్రిలో పాటించే పరిశుభ్రత, ఇన్ఫెక్షన్లు సోకకుండా తీసుకునే చర్యలు గురించి తెలుసుకోవడంతో పాటు, పరిశుభ్రమైన నీరు అడిగే హక్కు కూడా ఉంటుంది.

కొన్ని ఆస్పత్రుల్లో పరిశుభ్రమైన బెడ్లు, టాయిలెట్లు లేవని, అపరిశుభ్రంగా ఉండే పరిసరాలు, పని చేయని వైద్య పరికరాలు, ఔషధాల కొరత గురించి ఫిర్యాదులు, వార్తలు వింటూనే ఉంటాం.

కోవిడ్ మహమ్మారి ప్రబలిన సమయంలో ఆక్సిజన్, ఔషధాల కొరతతో పాటు వైద్య వ్యవస్థలోని అనేక లోపాలు చర్చకు వచ్చాయి.

10. ప్రత్యామ్నాయ చికిత్స

రోగి ఆస్పత్రిలో తీసుకుంటున్న చికిత్సతో పాటు ప్రత్యామ్నాయ చికిత్సను అడిగే హక్కు కూడా ఉంటుంది. అయితే, ఇందుకు పూర్తి బాధ్యతను రోగి, బంధువులు లేదా కుటుంబ సభ్యులు వహించాల్సి ఉంటుంది. ఔషధాలు, వైద్య పరీక్షలకు వెళ్లాల్సిన కేంద్రాన్ని ఎంపిక చేసుకునే అధికారం కూడా రోగులకుంటుంది.

ఆస్పత్రిలో మందులు రాసినప్పుడు అవి రిజిస్టర్డ్ సంస్థల నుంచి కొనుక్కునే అధికారం రోగికి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images

11. ఔషధాలను, వైద్య పరీక్షలను చేయించుకునే హక్కు

ఆస్పత్రిలో వైద్యులు రోగులకు ఔషధాలను సూచించినప్పుడు అవి రిజిస్టర్డ్ సంస్థల నుంచి కొనుక్కునే అధికారం రోగికి ఉంటుంది.

కానీ, చాలా కార్పొరేట్ ఆస్పత్రులు తమ ఆస్పత్రి డిస్పెన్సరీలోనే ఔషధాలు కొనుక్కోవాలని లేదా ఆస్పత్రి ల్యాబ్‌లలో మాత్రమే వైద్య పరీక్షలు చేయించుకోవాలని కచ్చితంగా చెబుతూ ఉంటారు.

"చాలా సార్లు ఒక డాక్టర్ సూచించిన మందులు ఆస్పత్రి లేదా చుట్టు పక్కల ఉన్న డిస్పెన్సరీలలో తప్ప బయటెక్కడా దొరకవు" అని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఒక రోగి బీబీసీకి చెప్పారు. దీంతో, రోగికి వేరే మార్గం ఉండదు. డాక్టర్లు చెప్పినట్లు వినాల్సిందే. అనారోగ్యంతో బాధపడుతూ హక్కుల కోసం పోరాడే శక్తి ఎవరికుంటుంది? ఇదే ఆస్పత్రుల పాలిట వరం" అని అన్నారు.

12. ఆస్పత్రి బదిలీ

రోగి చికిత్స పొందుతున్న ఆస్పత్రి నుంచి వేరే ఆస్పత్రికి మారినా కూడా ముందు చేరిన ఆస్పత్రి నుంచి చికిత్సను పొందే హక్కు ఉంటుంది.

13. క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొంటున్న రోగులకు ప్రత్యేక భద్రత

క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొంటున్న రోగులకు ప్రత్యేక భద్రత కల్పించాలి. క్లినికల్ ట్రయల్స్ ను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నిబంధనల కనుగుణంగా నిర్వహించాలి.

14. బయోమెడికల్ , హెల్త్ రీసెర్చ్‌

బయోమెడికల్ , హెల్త్ రీసెర్చ్‌లో పాల్గొంటున్న వారికి కూడా తగిన భద్రత కల్పించాలి.

రోగులకుండే హక్కులేంటి?

ఫొటో సోర్స్, Getty Images

15. మృతులను ఆస్పత్రి నుంచి తీసుకుని వెళ్లే హక్కు

ఆస్పత్రిలో ఫీజు చెల్లించలేదని రోగులను ఆస్పత్రిలో బంధించి ఉంచేందుకు వీలు లేదు.

ఇదే నిబంధన చనిపోయిన వారికి కూడా వర్తిస్తుంది. రోగి మృతదేహాన్ని ఆస్పత్రిలో బంధించి ఉంచేందుకు లేదు.

కోవిడ్ సమయంలో మృతులను వారి కుటుంబాలకు అప్పగించాలని, వారి అంత్యక్రియలు మాత్రం కోవిడ్ నిబంధనలకనుగుణంగా నిర్వహించాలని సూచిస్తూ కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ జులై 2020లో ఆదేశాలు జారీ చేసింది.

16. అవగాహన

రోగికున్న హక్కులు, వైద్యం, ఇన్సూరెన్సు పథకాలు గురించి రోగికి, కుటుంబ సభ్యులకు తెలియచేయాల్సిన అవసరముంది.

17. రోగి సమస్యల పరిష్కారం

రోగి చికిత్స పొందిన ఆస్పత్రి గురించి ఫీడ్ బ్యాక్ ఇవ్వడం, ఫిర్యాదులు కామెంట్ చేసే హక్కు ఉంటుంది.

దీనికి సంబంధించిన వివరాలను కూడా ఆస్పత్రి అందించాల్సి ఉంటుంది.

"కేసుల్లో రోగికి లభించే పరిహారం గురించి చెబుతూ, "వైద్య నిర్లక్ష్యం వల్ల మరణం ఏర్పడితే, సదరు వ్యక్తి బ్రతికి ఉండగా సంపాదించే ఆదాయం, ఆర్ధిక పరిస్థితిని ఆధారంగా చేసుకుని కోర్టులు పరిహారాన్ని నిర్ణయిస్తాయి" అని శ్రవణ్ చెప్పారు.

"ఈ కేసులు పరిష్కారం అయ్యేందుకు కనీసం 10 -20 ఏళ్ళు కూడా పడుతూ ఉంటాయి. చాలా మందికి వ్యవస్థతో పోరాడే ఓపిక, ఆర్ధిక వనరులు ఉండవు. దీంతో, చాలా కేసులు వెలుగులోకి కూడా రావు" అని అభిప్రాయపడ్డారు.

రోగులకు హక్కులతో పాటు కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి.

ఫొటో సోర్స్, S Bhatia

అయితే, రోగులకు హక్కులతో పాటు కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి.

  • రోగులు తమ ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్నంతటినీ దాచిపెట్టకుండా వైద్యులకు తెలియచేయాలి.
  • రోగులు చికిత్స తీసుకుంటున్న సమయంలో డాక్టర్ కు సహకరించి, వైద్యుల సూచనలను పాటించాలి.
  • ఆస్పత్రి నియమాలు పాటిస్తూ, తోటి రోగులకు, సిబ్బందికి ఇబ్బంది కలిగించకుండా ప్రవర్తించాలి. ఆస్పత్రి పరిసరాలను అపరిశుభ్రం చేయకూడదు.
  • డాక్టర్ , వైద్య సిబ్బందితో మర్యాదగా ప్రవర్తించాలి. సమస్య ఎటువంటిదైనా డాక్టర్, ఆస్పత్రి సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించడం, హింసకు పాల్పడడం, అల్లరి చేయడం లాంటి పనులు చేయకూడదు.
  • రోగులు చికిత్సను నిరాకరిస్తే అందుకు బాధ్యతను వారే వహించాలి.
వీడియో క్యాప్షన్, వైద్య కోసం విదేశీయులు హైదరాబాద్ ఎందుకు వస్తున్నారు

అంజని వైద్యులకు పంపించిన నోటీసుకు ఎటువంటి సమాధానం రాలేదు. తిరిగి ఈమెను కేసును వెనక్కి తీసుకోమని మాత్రం అభ్యర్ధనలు పంపారు.

కేసు ముందుకు కదలకపోవడంతో ఆమె 2021లో లాయర్‌ను కూడా మార్చారు. ఈ సారి వైద్యులకు నోటీసు పంపకుండా నేరుగా విజయవాడ జిల్లా కోర్టులో కేసు నమోదు చేశారు. ఈ కేసు ఇంకా విచారణకు రాలేదు.

ఇప్పటికే ఇదంతా జరిగి ఐదేళ్లు అవుతోంది. అంజని మాత్రం మధ్యలో వచ్చిన ఒత్తిళ్లకు తలవంచకుండా కోర్టు నిర్ణయం కోసం పట్టుదలతో వేచి చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)