‘భారత్ జోడో’: ఈ పాదయాత్రతో కాంగ్రెస్‌కు రాహుల్ గాంధీ పూర్వ వైభవాన్ని తీసుకురాగలరా

ఫొటో సోర్స్, EPA
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారతదేశంలో మరొక పాదయాత్రకు తెరలేచింది.
కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తున్నారు. ఈ యాత్రకు 'భారత్ జోడో' అని పేరు పెట్టుకున్నారు.
1983లో జనతా పార్టీ నేత చంద్రశేఖర్ తరువాత దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న రెండో రాజకీయనేత రాహుల్ గాంధీ. 5 నెలలపాటు సాగే ఈ యాత్ర 12 రాష్ట్రాల మీదుగా సాగుతుంది. 100 మందికిపైగా కాంగ్రెస్ నాయకులు ఆయనతో కలిసి నడవనున్నారు.
ఈ యాత్రలో రాహుల్ గాంధీ వివిధ వర్గాల ప్రజలతో మమేకం కానున్నారు. ఈ పాదయాత్రను లైవ్ టెలికాస్ట్ కూడా చేస్తారు.

ఫొటో సోర్స్, Facebook/BharatJodo
'భారత్ జోడో' అనేది ఒక రాజకీయపరమైన యాత్ర. దాని లక్ష్యం భారతీయ జనతా పార్టీ, దాని బలమైన నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ.
'ఇప్పుడు అనేక రకాలుగా మనం ఉనికి కోసం పోరాడుతున్నాం. భారతదేశ ఆత్మ రాజ్యాంగంలో ఉంది. దాన్ని కాపాడేందుకు మేం పోరాటం చేస్తున్నాం.
భారతదేశాన్ని ఏకం చేసి ఉంచే పార్టీ మాదే అని చెప్పడమే ఈ యాత్ర ద్వారా మేం ఇవ్వాలనుకుంటున్న సందేశం. మతం, కులం, భాషల పరంగా దేశాన్ని అధికార పార్టీ విభజిస్తున్న తీరును అడ్డుకోవాలన్నదే మా ఉద్దేశం’’ అని కాంగ్రెస్ నేత శశిథరూర్ నాతో అన్నారు.
సంక్షోభంతో కొట్టు మిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఈ పాదయాత్రతో పూర్వవైభవాన్ని తీసుకురావాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. అలాగే పడిపోతున్న తన ఇమేజ్‌ను కూడా పెంచుకోవాలని చూస్తున్నారు.
'మేం ప్రజలు చెప్పేది వినడానికి పోతున్నాం తప్ప వారికి ఉపన్యాసాలు ఇవ్వడానికి కాదు' అని మరొక కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ అన్నారు.

ఫొటో సోర్స్, AFP
ప్రజలు ఏమనుకుంటున్నారో వారి ఆలోచనలు ఏమిటో తెలుసుకోవడమనేది మంచిదే. 2014లో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ దిగజారి పోతూనే ఉంది. 2019 ఎన్నికల్లోనూ బీజేపీ చేతిలో ఓడిపోయింది. అనేక రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాలను మాత్రమే పాలిస్తోంది.
లౌకిక భారతదేశమే తమ లక్ష్యమని చెబుతున్న కాంగ్రెస్ పార్టీకి ఒక స్పష్టమైన సిద్ధాంతం, విధానం ఉన్నట్లుగా కనిపించదు. కాంగ్రెస్ భవిష్యత్తుగా భావించే రాహుల్ గాంధీ సైతం ఆ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు విముఖంగా ఉన్నారు.
అంగబలం, అర్థబలం, అధికార అండ పుష్కలంగా ఉన్న బీజేపీని అంతులేని అగాథంలో కూరుకుపోయిన కాంగ్రెస్ ఢీకొట్టడమనేది అంత సులభం కాదు. దేశంలో బాగా ఆదరణ ఉన్న నేత ఇలాంటి యాత్ర చేపట్టి ఉంటే, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి అది కేంద్రబిందువై ఉండేదని చాలా మంది భావిస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
రాహుల్ గాంధీ ఇమేజ్ బలంగా ఉందని చెప్పే పరిస్థితులు లేవు. ఇటీవల జరిగిన ఒపీనియన్ పోల్స్‌లో లక్షా 20వేల మందిలో 9శాతం మంది మాత్రమే ఆయనను ప్రధానిగా చూడాలని అనుకుంటున్నట్లు తెలిపారు.
'నాయకుని మీద విశ్వాసం లేని ఏ ప్రజా ఉద్యమం కూడా విజయం సాధించలేదు. గత రెండు దశాబ్దాలలో ప్రజలు తన మీద విశ్వాసం కోల్పోయారనే విషయాన్ని పదేపదే రాహుల్ గాంధీ నిరూపించుకున్నారు' అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ జే పండా నాతో అన్నారు.
'భారత్ జోడో' యాత్ర ద్వారా రాహుల్ గాంధీ ఇమేజ్ పెరుగుతుందని పార్టీ ఆశిస్తోంది. రాహుల్ గాంధీ తనను తాను జాతీయ నాయకునిగా మరొకసారి చూపించుకోవాలని చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఈ యాత్ర అని రాజకీయ విశ్లేషకురాలు జోయా హసన్ అన్నారు.
'భారతదేశ సమాజం వర్గాలుగా విడిపోయి ఉన్న తరుణంలో ప్రజలను ఏకం చేసేందుకు యాత్ర చేపట్టడమనేది ఒక గట్టి సందేశాన్ని ఇస్తుంది' అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే గతంలో అంటే 1983లో జనతా పార్టీ నేత చంద్రశేఖర్ ఇలాగే దేశవ్యాప్తంగా పాదయాత్ర చేశారు. 6 నెలలపాటు సుమారు 4వేల కిలోమీటర్లు తిరిగారు. నాడు ఆయను అందరూ 'మారథాన్ మ్యాన్' అని పిలిచే వారు. కానీ ఆ పాదయాత్ర వల్ల ఆయనకు ఎటువంటి రాజకీయ ప్రయోజనం కలగలేదు. ఇందిరా గాంధీ హత్య అనంతరం జరిగిన 1984 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది.
భారతదేశ రాజకీయాల ముఖచిత్రాన్ని మార్చివేసిన యాత్రల్లో ఎల్‌కే అడ్వాణీ రథయాత్ర ఒకటి. బీజేపీ నాయకుడైన ఆయన 1990లో అయోధ్య నుంచి ఈ యాత్ర మొదలు పెట్టారు. అయోధ్యలో బాబ్రీ మసీదు ఉన్న చోట రామాలయం కట్టడానికి మద్దతు సమీకరించాలన్నది ఆ యాత్ర ప్రధాన ఉద్దేశం.
రథయాత్ర మొదలైన సుమారు నెల రోజుల తరువాత బిహార్‌లో నాటి లాలు ప్రసాద్ యాదవ్ ప్రభుత్వం అడ్వాణీని అరెస్టు చేసింది. మొత్తానికి అడ్వాణీ చేసిన ఆ యాత్ర వల్ల హిందుత్వమనేది బీజేపీ కార్యక్రమాలకు ప్రధాన కేంద్రంగా మారింది.
1930లో ఉప్పు సత్యాహగ్రంలో భాగంగా మహాత్మా గాంధీ 380 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. నాడు 61 ఏళ్ల గాంధీకి ప్రతి ఊరిలోనూ ప్రజలు ఆతిథ్యం ఇచ్చారు. గాంధీ మధ్యలో నడవలేక పోతే ఆయనను తీసుకెళ్లడానికి ఒక గుర్రాన్ని కూడా వెంట పెట్టుకుని వెళ్లారు. కానీ గాంధీ చివరి వరకు నడిచారు. నాడు దాన్ని ఒక చరిత్రగా చెప్పుకున్నారు.
సుదీర్ఘ పాదయాత్రలు ఒకప్పుడు బలమైన సింబాలిక్ ఇమేజ్‌ను ఇస్తూ ఉండేవి. 1934లో మావో 86వేల మంది రెడ్ ఆర్మీ సైనికులతో సుమారు 10 వేల కిలోమీటర్లు మార్చ్ చేశారు. నవ చైనా నిర్మాణ సంకల్పానికి ఆ లాంగ్ మార్చ్ ఒక ప్రతీక అని మావో అన్నారు.
కానీ నేడు కాలం మారిందని బీజేపీ నేత బైజయంత్ పండా అంటున్నారు. 'నేడు మీడియా, సోషల్ మీడియా ద్వారా సందేశాలు ప్రజలకు చేరుతున్నాయి. నాయకునికి ప్రజలతో దగ్గరి సంబంధాలు ఉండి వారి నమ్మకాన్ని పొందినప్పుడే ఇటువంటి సుదీర్ఘ యాత్రలు ఫలిస్తాయి' అని పండా అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
రాహుల్ గాంధీ చేస్తున్న ఈ పాదయాత్ర కాంగ్రెస్‌కు పోయిన కళను తీసుకొస్తుందని చెప్పడం కష్టమే అవుతుంది. ‘‘ఈ యాత్రతోనే భారతీయ ఆత్మను కాపాడలేం. ఆ తరువాత కూడా ఆ పోరాటం సాగుతుంది’’ అని శశి థరూర్ అన్నారు.
ఇటీవల జరిగిన ఒపీనియన్ పోల్స్‌లో 35శాతం మంది తమ ఆర్థికపరిస్థితులు దిగజారాయని చెప్పినప్పటికీ దేశంలో మోదీ పాపులారిటీ మాత్రం తగ్గలేదు. 'గణాంకాలు చూడండి. మోదీకి ఎక్కడలేని పాపులారిటీ ఉంది. ఓటర్లు ఆయన్ను నమ్ముతున్న తీరు మన లాజిక్‌కు అందదు' అని ఒపీనియన్ పోల్స్ విశ్లేషకుడు యశ్వంత్ దేశ్‌ముఖ్ అన్నారు.
మోదీకి ఉన్న ఈ పాపులారిటీ రాహుల్ గాంధీ పనిని కష్టతరం చేస్తుందని చాలా మంది భావిస్తున్నారు.
'ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు. కానీ తమ కష్టాలకు కారణం ప్రభుత్వమని ప్రజలు నమ్ముతున్నారా? మరొకపార్టీకి అవకాశం ఇచ్చేంతంగా ప్రస్తుత అధికార పార్టీ వల్ల వారు నష్టపోయారా?' అనేది చూడాలని అశోక యూనివర్సిటీ ప్రొఫెసర్ మహేశ్ రంగరాజన్ అంటున్నారు.
ఈ యాత్ర ద్వారా రాహుల్ గాంధీ ఇమేజ్ పెరుగుతుందో లేదో కాలమే చెప్పాలి.
ఇవి కూడా చదవండి:
- సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదం: ఇండియాలో ఇక కారు వెనుక సీట్లో కూర్చున్న వారికి కూడా సీట్ బెల్ట్ తప్పనిసరి చేస్తారా?
- తమిళులను చూసి తెలుగు ప్రజలు ఎందుకు దాక్కుంటున్నారు?
- కండోమ్ వాడకంపై ఏపీ, తెలంగాణ పురుషులు ఏమంటున్నారు?
- ‘రాజ్‌పథ్’ పేరును ‘కర్తవ్యపథ్’గా మారుస్తారా... అసలు దాని చరిత్ర ఏంటి
- ప్రేమలో పడిపోవడం సరే, మరి బయటపడడం ఎలా? 18వ శతాబ్దికి చెందిన ఓ సన్యాసి చెప్పిన రహస్యాలు
- ఆంధ్రప్రదేశ్-గుర్రగరువు: నెలల పసికందులు నిద్రలోనే ఊపిరి వదిలేస్తున్నారు... ఏమిటీ డెత్ మిస్టరీ?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













