ఈ బియ్యాన్ని మీ ఇంట్లో వండితే ఆ సువాసన పక్కింట్లోకి కూడా వెళ్తుంది... దీనికీ బుద్ధుడికీ సంబంధం ఏంటి?

బియ్యం

ఫొటో సోర్స్, Sollina Images

    • రచయిత, అశోక్ పాండే
    • హోదా, బీబీసీ కోసం

‘‘గోవింద్ భోగ్’’ బియ్యాన్ని మీ వంటింట్లో వండితే ఆ సువాసన పక్కింట్లోకి కూడా వస్తుంది. చిన్న చిన్న ముత్యాల్లా కనిపించే ఈ బియ్యానికి ప్రత్యేకమైన సువాసన ఉంటుంది.

పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు వర్థమాన్ జిల్లాలోని దామోదర్ బేసిన్‌లో ఈ బియ్యం ఎక్కువగా పండుతాయి. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లోని హూగ్లీ, బీర్‌భూమ్, బంకురా, పురులియా జిల్లాలతోపాటు పొరుగునున్న బిహార్‌లోని కైమూర్, ఛత్తీస్‌గఢ్‌లోని సుర్‌గుజా జిల్లాల్లోనూ ఈ బియ్యం పండిస్తున్నారు.

సువాసనలో గోవింద్ భోగ్ బియ్యంతో పోటీ పడేవి ‘‘కాలా నమక్’’. నేపాల్‌లోని కపిలవస్తు, తూర్పు ఉత్తర్ ప్రదేశ్‌లోని తరాయీ మైదానాల్లో ఈ బియ్యం పండుతాయి. ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్‌ (ఎఫ్ఏవో) ప్రపంచ ప్రత్యేక వరి వండగాల జాబితాలోనూ కాలా నమక్‌కు చోటు దక్కింది.

జ్ఞానోదయం తర్వాత లుంబినీలోని అడవుల గుండా గౌతమ బుద్ధుడు వెళ్లినప్పుడు ఈ వరి వంగడాన్ని స్థానిక గ్రామాల ప్రజలకు ఇచ్చినట్లు కథలుకథలుగా చెప్పుకుంటారు. ‘‘ఈ బియ్యం నుంచి వచ్చే సువాసన నన్ను గుర్తు చేస్తుంది’’అని బుద్ధుడు చెప్పినట్లుగా కథల్లో వివరిస్తుంటారు.

బహుశా ఈ వరి వంగడాలతో బుద్ధుడికి విడదీయరాని అనుబంధం ఉండొచ్చు. ఎందుకంటే ఆయన తండ్రి పేరు శుద్ధోధన. అంటే స్వచ్ఛమైన వరిని పండించేవారని అర్థం.

బియ్యం

ఫొటో సోర్స్, Getty Images

చాలా కథల్లో...

జపాన్, థాయిలాండ్, కొరియా, చైనా, భారత్‌లలోని చాలా జానపద కథల్లో వరికి ప్రత్యేక స్థానం ఉంటుంది. వీటిలో ముఖ్యంగా జపాన్ సూర్య దేవత అమాతెరాసూ, ఆహార దేవత ఊకెమోచీల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

అమాతెరాసు తన సోదరుడైన త్సుకోయోమీని భూమికి వెళ్లి ఊకెమోచీని కలవాలని సూచిస్తారు. త్సుకోయోమీకి ఆహ్వానం పలికేందుకు తను తినగా మిగిలిన అన్ని రకాల ఆహారాలను తీసుకొని ఊకెమోచీ వెళ్తుంది. అయితే, మిగిలిపోయిన ఆహారాన్ని తనకు తీసుకొచ్చినందుకు ఆగ్రహంతో ఊకెమోచీని త్సుకోయోమీ హతమారుస్తారు.

దీంతో ఆగ్రహోక్తుడైన అమాతెరాసూ తన సోదరుడితో సంబంధాలను తెగదెంపులు చేసుకుంటారు. దీంతో పగలు, రాత్రి వేరుపడ్డాయని చెప్పుకొంటారు. ఆ తర్వాత మరో దేవతను అమాతెరాసూ భూమిపైకి పంపిస్తారు. అదే సమయంలో ఊకెమోచీ శరీరం నుంచి పుట్టిన అగ్ని ద్వారా భిన్న ఆహార ధాన్యాలు భూమిపైకి వచ్చాయని చెబుతారు. తల నుంచి తృణధాన్యాలు, కడుపు నుంచి బియ్యం ఇలా ఒక్కో శరీర భాగం నుంచి ఒక్కో ఆహార ధాన్యాలు వచ్చినట్లుగా కథల్లో ఉంటుంది.

ఈ ఆహార ధాన్యాలను అమాతెరాసూ సేకరించి, భూమిపై మానవుల కోసం ఇచ్చారని కథల్లో చెబుతారు. మరోవైపు ఒక పక్షికి కొన్ని వరి విత్తనాలను అమాతెరాసూ బహుమతిగా ఇచ్చారని కూడా కథల్లో ఉంటుంది.

అమాతెరాసూ ఇచ్చిన విత్తనాల నుంచి వచ్చిన వరి జపాన్ మొత్తం విస్తరించిందని కూడా కథల్లో చెబుతుంటారు.

మరోవైపు భూమిపై ఉండే మనుషులకు వ్యవసాయం ఎలా చేయాలో నేర్పించాలని వరుణ దేవుడికి విష్ణుమూర్తి సూచించినట్లు థాయ్‌లాండ్‌లోని కొన్ని హిందూ కథల్లో చెబుతారు.

బియ్యం

ఫొటో సోర్స్, Getty Images

హరిత విప్లవానికి ముందు..

హరిత విప్లవానికి ముందు 1960ల్లో 300కుపైగా భిన్న వరి వంగడాలను భారత్‌లో పండించేవారు. వీటిలో కొన్ని రకాలకు ప్రత్యేకమైన సువాసన ఉండేది. అయితే, గత కొన్ని దశాబ్దాలుగా భారత్‌కు చెందిన సువాసనలు వెదజల్లే అంతర్జాతీయ బ్రాండ్‌గా బాస్మతిని మాత్రమే ప్రోత్సహిస్తున్నారు. నిజానికి ప్రత్యేక, రుచి కలిగిన కొన్ని బాస్మతి వంగడాలు నేడు పూర్తిగా కనుమరుగు అయ్యాయి.

నా బాల్యం ఉత్తరాఖండ్‌ తరాయీ మైదానాల్లోని రామ్‌నగర్‌లో గడిచింది. అక్కడ ఉండే చాలా మంది బియ్యాన్ని దుకాణాల నుంచి కాకుండా.. బంజారాల నుంచి కొనుగోలు చేస్తారు. జస్పుర్-కాశీపుర్‌ బాస్మతితోపాటు బిందులీ, తిలక్ చందన్‌ బాస్మతిలను కూడా బంజారాలు తీసుకొస్తుంటారు.

ఆ బంజారాల దగ్గర ఖరీదైన ‘‘దూన్ మలాయీ’’ బాస్మతి కూడా ఉంటుంది. ఇవి ప్రతి శీతకాలంలో దేహ్రాదూన్‌లో పండుతాయి. వీటిని స్థానికులు తమ ఇళ్లలో నిధిలా కాపాడుకుంటారు. మరోవైపు సింధ్-బలూచిస్తాన్‌లలో పండే వరిని కూడా వారు తీసుకొచ్చేవారు.

రెండేళ్ల క్రితం నేను బెంగాల్ వెళ్లినప్పుడు.. ఇప్పటికీ అక్కడ 200కుపైగా వరి వంగడాలను పండిస్తున్నట్లు తెలిసింది. గోవింద్ భోగ్‌తోపాటు అసలు ముందెన్నడూ పేరు కూడా వినని కొత్త బియ్యాన్ని అక్కడ నేను రుచిచూశాను.

తులాయీపంజీ, జలప్రభా, రాధాతిలక్, తులసీకమల్, చినియాతోపే, మాలీఫూలో, బహురూపీ, కార్తికసాల్.. ఇలా ఆ పేర్లు చెప్పుకుంటూ పోతే అన్నీ కొత్తగానే ఉంటాయి. భారత్‌లోని ప్రతి రాష్ట్రానికీ ఇలా సంప్రదాయ వరి వంగడాలు ఉండొచ్చని అనుకుంటున్నాను.

బియ్యం

ఫొటో సోర్స్, Getty Images

వరి అభివృద్ధి ఇలా..

కుమావూ-గఢ్‌వాల్ పర్వత ప్రాంతాల్లో పండించే ఎర్ర బియ్యం నేడు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. చిన్నప్పుడు మా ఊరు వెళ్లినప్పుడు ఈ బియ్యం తినేవాణ్ని. ఉలవ పప్పులో నెయ్యి కలుపుకొని ఈ అన్నం తింటుంటే భలే ఉంటుంది. ఆ అనుభూతిని అసలు మాటల్లో వర్ణించలేం.

కొన్ని రోజుల క్రితం మా ఊళ్లో ఉండే ఒక స్నేహితుడికి ఎర్ర బియ్యం గురించి అడిగాను. అసలు అలాంటివి ఇక్కడ పండించడం లేదని ఆయన నాతో అన్నారు. ఒకవేళ ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో పండించినా.. ఆ వడ్ల నుంచి సంప్రదాయ పద్ధతిలో ఎలా బియ్యం తీయాలో ప్రజలు మరిచిపోతున్నారని మా మాటల్లో చర్చ జరిగింది.

ఎర్ర బియ్యాన్ని మీరు మిల్లుకు పంపిస్తే, అక్కడ మెషీన్లు పైపొరలను పూర్తిగా తీసేస్తాయి. దీంతో అసలు ఎరుపు రంగే కనిపించదు. ఇంక రుచేం ఉంటుంది?

మరోవైపు ఝంగోరా లేదా ఝంగరా పేరుతో మరో బియ్యం ఉండేవి. వీటితో పాయసం చేస్తారు. వీటి నుంచి వచ్చే వాసన చాలా మథురంగా ఉంటుంది. అయితే, నేడు మిల్లుల నుంచి మార్కెట్‌లోకి వస్తున్న బియ్యంలో ఆ సువాసన కనిపించడం లేదు.

వరి వంగడాల అభివృద్ధికి మానవ పరిణామక్రమంతో విడదీయరాని అనుబంధం ఉంటుంది. ఈ బియ్యాన్ని మొదట చైనా, ఉత్తర భారత దేశం, ఇండోనేసియా, బర్మా, జపాన్‌లలో ఐదేళ్ల నుంచి ఎనిమిదేళ్ల క్రితమే పండించినట్లు ఆధారాలు ఉన్నాయి.

ఆఫ్రికాలోనూ వరికి 3000ఏళ్ల చరిత్ర ఉంది. ముఖ్యంగా నౌకా యాత్రలు, బానిసల విక్రయాల వల్ల అమెరికా, యూరప్‌లకూ ఈ బియ్యం విస్తరించాయి. నేడు ప్రపంచంలో బియ్యం వండని వంటగది లేదని చెప్పడం అతిశయోక్తి కాదేమో.

బియ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఎంత తింటారు?

ఫిలిప్పీన్స్‌కు చెందిన ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ 2010లో విడుదల చేసిన సమాచారం ప్రకారం, ప్రపంచంలోని ప్రతి మూడో వ్యక్తి ఒక పూట భోజనంలో భాగంగా అన్నం తింటున్నారు.

అన్నం ఎక్కువగా ఆహారంగా తీసుకోవడంలో బ్రూనై ముందుంటుంది. ఇక్కడ ఒక మనిషి వార్షిక తలసరి బియ్యం వినియోగం 245 కేజీలు. ఆ తర్వాత స్థానాల్లో వియాత్నాం, లావోస్ ఉంటాయి. అయితే, ఎక్కువగా బియ్యం పండించే భారత్, చైనాలు తొలి 20 దేశాల జాబితాలో లేవు.

1850లలో కాలిఫోర్నియా గోల్డ్ రష్ సమయంలో కనీసం 40 వేల మంది చైనా కూలీలు సాక్రమెంటోకు వలస వెళ్లారు. అయితే, వీరికి రెండు పూటలా ఆహారంగా అన్నమే కావాలి. కానీ, అక్కడ వరి పండేది కాదు. దీంతో వారు చైనా నుంచి బియ్యాని దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టారు. 40-50ఏళ్ల తర్వాత కాలిఫోర్నియాలోనూ వరి పంట మొదలైంది.

1950ల నాటికి సాక్రమెంటో లోయలో వరి పంట బాగా విస్తరించింది. ప్రస్తుతం ఇక్కడ పండే వరిలో 50 శాతం జపాన్, ఉజ్బెకిస్తాన్, టర్కీ, కొరియాలకు ఎగుమతి అవుతోందని 2008లో ఒక నివేదిక వెల్లడించింది.

సాక్రమెంటోకు వచ్చిన చైనా కార్మికులు అమెరికాలో తొలి చైనీస్ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని ఉదయం ‘‘ఫ్రైడ్ రైస్’’ పేరుతో మెనూలో పెట్టేవారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని రెస్టారెంట్‌లలోనూ ఫ్రైడ్ రైస్ కనిపిస్తోంది.

ఉత్తర భారత దేశం, అఫ్గానిస్తాన్‌లలో 5000 ఏళ్ల క్రితం వరి పంట మొదలైనట్లు ఆధారాలు ఉన్నాయి. ఇవి క్రమంగా పశ్చిమాన సింధూ లోయ, దక్షిణాన భారత పీఠభూమికి విస్తరించాయి. ఆ తర్వాత, అంటే 2500 ఏళ్ల ప్రాంతంలో గంగా మైదానాలకూ వచ్చాయి.

బియ్యం

ఫొటో సోర్స్, Getty Images

నల్ల బియ్యం

సింధూ లోయకు ఉత్తరాన జీవించేవారు సంచార మానవులు. వీరు జంతువులను వేటాడం, చేపల వేటతోపాటు సారవంతమైన భూముల కోసం అన్వేషించేవారు. మరోవైపు మధ్య ఆసియా నుంచి మంగోలుల దండయాత్ర భయం కూడా వారిని వెంటాడేది.

అలా వారు మొదట అఫ్గాన్, పాకిస్తాన్‌లలో ప్రాంతాలకు వచ్చి స్థిరపడ్డారు. ఆ తర్వాత పంజాబ్, దిల్లీ పరిసరాల్లోని ప్రాంతాలకూ వచ్చారు. వారి దగ్గర భిన్న రకాల వరి వంగడాలు ఉండే అవకాశముంది.

భారత్ నుంచి ఈ వరి వంగడాలు అఫ్గానిస్తాన్ గుండా పశ్చిమ ఆసియాకు చేరుకున్నాయి. అక్కడ నుంచి గ్రీస్, ఉత్తర ఆఫ్రికాలకు వెళ్లాయి. ఆ తర్వాత ఐరోపాలోని స్పెయిన్‌పై ఉత్తర ఆఫ్రికా నాయకులు దండెత్తడంతో ఇవి అక్కడకు కూడా విస్తరించాయి.

మరోవైపు ఆఫ్రికా-బియ్యం మధ్య సంబంధంపై మరో కథ కూడా ప్రచారంలో ఉంది. వేల ఏళ్ల క్రితం పశ్చిమ ఆఫ్రికా తీరంలో నల్లని బియ్యం పండేవి. స్థానికులు వీటిని ఆహారంగా తీసుకునేవారు. అయితే, నల్లజాతి బానిసల వ్యాపారం మొదలైనప్పుడు.. వారితోపాటు ఈ ఆఫ్రికా నల్ల బియ్యాన్ని కూడా తీసుకెళ్లేవారు.

ఆ నల్ల బియ్యం తినేటప్పుడు బానిసలకు వారి మాతృభూమితో అనుబంధం గుర్తుకు వచ్చేదని చెప్పేవారు.

ఆఫ్రికా నల్ల బియ్యంతో పోల్చినప్పుడు ఆసియా మూలాలున్న తెల్లబియ్యం రుచి, పోషకాల్లో కాస్త తక్కువగా ఉంటాయి.

బియ్యం

ఫొటో సోర్స్, Getty Images

రుచి అలా..

స్థానికంగా లభించే మసాలా దినుసులను పక్కనపెడితే, భారత్‌లో బిర్యానీ, ఇరాన్‌లో పులావ్, ఇటలీలో రిసాటో, స్పెయిన్‌లో పాయెయ్యా ఇలా అన్ని ప్రధాన వంటకాల్లో బియ్యం కనిపిస్తాయి. ఇస్లామిక్ వ్యాపారులు, మొఘల్ చక్రవర్తులు వీటిని భిన్న ప్రాంతాలకు విస్తరించేలా చేశారు.

మరోవైపు 12వ శతాబ్దంలో చాలుక్య రాజు సోమేశ్వర్-3 రాసిన సంస్కృత గ్రంథం ‘‘మానసోల్లాస్’’లో తనను అన్నం ప్రియుడిగా రాజు వర్ణించుకున్నారు. శాలిరక్త, మహాశాలి, గంథశాలి, కలింగక్, ముండశాలి, స్థూలశాలి, సూక్ష్మశాలి, సషాష్టిక్.. పేరుతో భిన్న రకాల వరి వంగడాల గురించి ఆయన ప్రస్తావించారు.

ఎర్రని బియ్యాన్ని శాలిరక్తగా, పెద్ద బియ్యాన్ని మహాశాలిగా, సువాసనలు వెదజల్లే బియ్యాన్ని గంధశాలిగా, కలింగలో పండే బియ్యాన్ని కలింగక్‌గా, దొడ్డు బియ్యాన్ని స్థూలశాలిగా, చిన్నబియ్యాన్ని సూక్ష్మశాలిగా ఆయన అభివర్ణించారు.

మరోవైపు మహాభారత కాలంనాటి ఆహారం గురించి రాజు నల చక్రవర్తి.. ‘‘నల్ పాక్‌దర్పణ్’’ పుస్తకంలో వివరించారు. ఆహారాన్ని వండే ముందుకు వేడి నీటిలో బియ్యాన్ని కడగాలని దీనిలో సూచించారు.

మరోవైపు బియ్యాన్ని వండేప్పుడు పాలు కలపడం గురించి కూడా ఆ పుస్తకంలో వివరించారు. ఇది అమృతంలా ఉంటుందని పేర్కొన్నారు.

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్‌లోనే అరుదైన పంట జాపత్రి

బియ్యం, వినోదం

ఉత్తరాఖండ్‌లోని కుమావూలో వరి నాట్ల సమయంలో ఒక సంప్రదాయాన్ని అనుసరిస్తారు. ఇక్కడ నాట్లను అందరూ కలిసి ఒకేసారి వేస్తారు. తమ పొలాల్లో మహిళలంతా ఒకరి తర్వాత ఒకరుగా నాట్లు వేయడం మొదలుపెడతారు. ఇది కాస్త కష్టమైన పనే. అందుకే దీనికి వినోదాన్ని జోడిస్తారు.

అలా నాట్లు వేసేటప్పుడు జానపద గాయకులు హుడ్‌కాగా పిలిచే వాయిద్య పరికరంతో పొలాల దగ్గరకు వస్తారు. కథలు, పాటలతో వీరు పనిచేసే వారిలో ఉత్సాహం రెట్టింపు చేస్తారు. కుమావూ రాజుల కథలు, గిరిజన దేవతల కథలు కూడా వారు చెబుతుంటారు.

వీడియో క్యాప్షన్, ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏమిటి, ఈ బియ్యం తింటే ఆరోగ్యానికి మంచిదా?

దీన్ని హుడ్‌కియా బౌల్‌గా పిలుస్తారు. ఇప్పటికీ కుమావూ సోమేశ్వర్ లోయలోని గ్రామాల్లో ఈ సంప్రదాయం కనిపిస్తుంటుంది. ఈ లోయలో రెండు డజన్లకుపైగా వరి వంగడాలను పండిస్తారు. ఇక్కడి విత్తనాలను వచ్చే పంట కాలం కోసం జాగ్రత్తగా భద్రపరుస్తారు.

ఇలా వరి చరిత్ర గురించి ఎన్నో కథలు, సంప్రదాయాలు ప్రచారంలో ఉన్నాయి. వీటి రుచి, సువాసనలపై చాలా పరిశోధనలు కూడా జరుగుతున్నాయి.

ఒకప్పుడు మన పూర్వీకులు బియ్యం రుచి, వాసనను ఆస్వాదించేవారు. నేడు ఆధునిక సమాజంలో మనకు రెండు రకాల బియ్యం మాత్రమే కనిపిస్తాయి. వీటిలో మొదటి పేదవాడి బియ్యం.. రెండోది ధనికుల బియ్యం.

అయితే, ఈ రెండింటి నుంచీ నేడు సువాసనలు రావడం లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)