Nepali Hindus: నరేంద్ర మోదీని రాజులా, యోగిలా కొలిచిన నేపాలీ హిందువులు ఇప్పుడు ఏమంటున్నారు?

ఫొటో సోర్స్, YOUTUBE/PMOINDIA
- రచయిత, రజనీశ్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి, కాఠ్‌మాండూ నుంచి
నేపాల్ రాజధాని కాఠ్‌మాండూలోని బాగ్ బజార్‌లో 42ఏళ్ల పుష్పరాజ్ పౌడెల్ ఒక పుస్తకాల షాపును నడిపిస్తున్నారు. పుష్పరాజ్ సొంత ఊరు నేపాల్‌లోని చిత్వన్.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఒకప్పుడు పుష్పరాజ్ గట్టి మద్దతు పలికేవారు. కానీ, ఇప్పుడు ఆయన చాలా అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ‘‘2014 ఆగస్టులో నరేంద్ర మోదీ నేపాల్ వచ్చినప్పుడు ఆయన్ను మేం రాజుతో సమానంగా చూశాం. కానీ, 2015లో సరిహద్దుల వెంబడి రవాణా, వాణిజ్యంపై ఆంక్షలు విధించి మోదీ తన ప్రతిష్ఠను తానే దిగజార్చుకున్నారు’’అని పుష్పరాజ్ వ్యాఖ్యానించారు.
‘‘హిమాలయాల్లో మోదీ ధ్యానం చేశారు. ఆయన ఒక యోగి. ఇంకా తెలివైన వారు కూడా. చాలా సాధారణంగా కనిపిస్తారు. ఈ విషయాలన్నీ ఇప్పటికీ మేం గుర్తిస్తాం. కానీ, ఒకప్పటిలా ఇప్పుడు ఆయన్ను మేం స్తుతించలేం. ఎందుకంటే నేపాల్‌పై ఆయన విధించిన ఆంక్షలతో ఇక్కడ ఆయన ప్రజాదరణ చాలా తగ్గింది’’అని ఆయన వివరించారు.

భారత్‌కు ఇప్పటివరకు ప్రధాన మంత్రులుగా పనిచేసిన వారిలో మంచి నాయకులు ఎవరని మీరు అనుకుంటున్నారు? అనే ప్రశ్నకు పుష్పరాజ్ స్పందిస్తూ.. ‘‘నాకైతే ఇందిరా గాంధీనే మంచి నాయకురాలు అనిపిస్తోంది. ఆమె చాలా ధైర్యవంతురాలు. అంత ధైర్యం ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీకి లేదు. దక్షిణాసియా తలెత్తుకునేలా ఇందిరా గాంధీ చేశారు. ఇప్పటికీ నేపాల్ పర్వత ప్రాంతాల్లో ఆమెకు మంచి పేరుంది. కానీ, ఇక్కడి మైదానాల్లో ఉండే మధేసీలు మాత్రం మోదీనే మంచి వారని చెబుతున్నారు. అసలు మోదీని వెనకేసుకుని వచ్చేవారు నిజమైన నేపాలీలు కాదు. అప్పట్లో నేపాల్‌పై ఆంక్షలకు మధేసీలు మద్దతుపలికారు. వారే మోదీని కూడా వెనకేసుకొస్తుంటారు’’అని ఆయన వ్యాఖ్యానించారు.
పుష్పరాజ్ పుస్తకాల దుకాణానికి పక్కనే 35ఏళ్ల ధనా పోఖరేల్ పదేళ్లుగా టీ కొట్టును నడుపుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురించి ఆమెను అడిగినప్పుడు.. ‘‘మోదీతో భారత్‌కు మాత్రమే మేలు. నేపాల్‌కు కాదు. ఆయన విధించిన నిషేధం వల్ల మేం చాలా బాధలుపడ్డాం. అయితే, ఇక్కడ మంచి విషయం ఏమిటంటే.. పిల్లలు లేని నాయకులు దేశం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. అందుకే మోదీ భారత్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. అలానే మన కేపీ ఓలీ కూడా నేపాల్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు’’అని ఆమె అన్నారు.

మోదీ, ఓలీలతో పోలిక..
భారత్ పేరు చెప్పిన వెంటనే మీ మెదడులో ఏం అనిపిస్తుంది? అని ప్రశ్నించినప్పుడు ధనా పోఖరేల్ మాట్లాడుతూ.. ‘‘భారత్ ఒక అభివృద్ధి చెందిన దేశంలా మారుతోంది. నేపాల్ కంటే భారత్ చాలా ముందుంది’’అని ఆమె అన్నారు. అయితే, ఆమె ఎప్పుడూ భారత్‌లో పర్యటించలేదు.
మోదీ, ఓలీలు అంటే ధనా పోఖరేల్ లాంటివారు ఎందుకు అంత అభిమానం వ్యక్తంచేస్తున్నారు? కేవలం పిల్లలు లేకపోవడం వల్లే ఈ ఇద్దరు నాయకులను నేపాల్‌లో కొన్ని వర్గాలు ఎక్కువగా ఇష్టపడుతున్నాయా? అనే అంశాలపై కాఠ్‌మాండూలోని మార్టిన్ చౌతారీ రీసెర్చ్ సెంటర్‌లోని సీనియర్ రీసెర్చర్‌గా పనిచేస్తున్న రమేశ్ పరాజులీ మాట్లాడారు.
‘‘మోదీ, ఓలీల రాజకీయాల్లో చాలా సారూప్యత ఉంటుంది. మోదీని రైట్‌వింగ్ నాయకుడిగా, ఓలీని కమ్యూనిస్టుగా చెప్పుకోవచ్చు. కానీ, వారిద్దరిలో చాలా పోలికలు కనిపిస్తాయి. మోదీ ప్రోత్సహించే జాతీయవాదంలో పాకిస్తాన్‌పై వ్యతిరేకత, మెజారిటేరియనిజం అంతర్భాగం. అలానే ఓలీ జాతీయవాదంలోనూ భారత్‌పై వ్యతిరేకత, నేపాలీ భాషా జాతీయవాదం స్పష్టంగా కనిపిస్తాయి. ఇలా ఇద్దరి రాజకీయాల్లోనూ చాలా సారూప్యతలు కనిపిస్తాయి’’అని రమేశ్ వివరించారు.

2014లో భారత ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి నేపాల్‌కు వచ్చినప్పుడు ఇక్కడి ప్రజలు ఆయన్ను చాలా ఆదరించారని రమేశ్ పరాజులీ అంగీకరించారు. ‘‘ఆ పర్యటన గురించి నేపాల్‌లో చాలా చర్చ జరిగింది. నేపాల్ పార్లమెంటు వేదికగా ఆయన నేపాల్ సార్వభౌమత్వం, స్వతంత్రత గురించి మాట్లాడారు. దీంతో ఆయనకు గట్టి మద్దతు లభించింది. బుద్ధుడి జన్మస్థలంగా ఆయన నేపాల్‌ను అభివర్ణించారు. కమ్యూనిస్టు నాయకులు కూడా మోదీని ప్రశంసలతో ముంచెత్తారు’’అని రమేశ్ అన్నారు.
మరోవైపు అప్పట్లో మోదీ పర్యటనకు వచ్చినప్పుడు సాధారణ ప్రజలు కూడా ఆయన్ను చూసేందుకు పెద్దయెత్తున వచ్చారని, ఆయనతో కరచాలనం చేసేందుకు ప్రజలు పోటీపడ్డారని నేపాల్ జర్నలిస్టులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, narendramodi.in
నేపాల్‌లో హిందూత్వ
అయితే, నేపాలీ హిందువుల్లో మోదీ క్రేజ్ తగ్గిందని తాను అసలు అనుకోవడంలేదని నేపాలీ సీనియర్ జర్నలిస్టు కిశోర్ నేపాల్ చెప్పారు. ‘‘నేపాల్ జనాభాలో హిందువుల వాటా 85 శాతం వరకు ఉంటుంది. హిందువులు పవిత్రంగా భావించే ముక్తినాథ్, పశుపతినాథ్, జనక్‌పుర్‌లలో మోదీ ధ్యానం చేశారు. ఇక్కడి హిందువులకు అది బాగా నచ్చింది. ఇలాంటి పనులు ఇక్కడి రాజకీయ నాయకులు చేయడం ప్రజలు చూడలేదు. కొంతమంది మోదీకి, ఓలీతో పోలిక పెడుతుంటారు. కానీ, నాకైతే పోలికేదీ కనిపించదు. ఓలీ ఒక అవకాశవాది. మోదీ ఒక హిందూ నాయకుడు’’అని కిశోర్ అన్నారు.
‘‘నేపాల్‌లోని హిందూ సెంటిమెంట్‌ను మోదీ అవకాశంగా మలచుకున్నారు. చాలా మంది మైదానాల్లోని మధేసీల్లో మాత్రమే మోదీకి అభిమానులు ఉన్నారని అంటారు. అయితే, ఇక్కడ మైదానాలతోపాటు పర్వత ప్రాంతాల్లోనూ ఆధిక్యం హిందువులదేననే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి’’అని కిశోర్ విశ్లేషించారు.
సుదీర్ఘ పోరాటం తర్వాత 2008లో నేపాల్ రాచరికానికి ముగింపు పలికి ప్రజాస్వామ్యం దిశగా అడుగులు వేసింది. 2015 సెప్టెంబరులో కొత్త రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకొచ్చింది. దీంతో హిందూ దేశం నుంచి సెక్యులర్ దేశంగా నేపాల్ మారింది. అయితే, నేపాల్ హిందూ దేశం అనే మార్కు నుంచి పక్కకు వెళ్లిపోవడానికి భారత్‌లోని అధికారంలోనున్న నరేంద్ర మోదీకి చెందిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి అసలు ఇష్టం లేదు.
2006, మే 26న అప్పటి బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘హిందూ దేశం అనే గుర్తింపు నుంచి నేపాల్ బంధం విడదీయరానిది. ఈ గుర్తింపు పోకుండా జాగ్రత్త వహించాలి. మావోయిస్టుల ఒత్తిడి వల్ల నేపాల్ తమ ఉనికిని కోల్పోతుండటంతో బీజేపీ చాలా అసంతృప్తితో ఉంది’’అని ఆయన వ్యాఖ్యానించారు.
మరోవైపు 2020లో అప్పటి నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ జ్ఞావాలీ బీబీసీతో మాట్లాడారు. ‘‘భారత్, నేపాల్‌లలోని హిందువులు ఆధిక్యంలో ఉన్నప్పటికీ, ద్వైపాక్షిక సంబంధాల్లో మతం, సంస్కృతులను అసలు కలపకూడదు’’అని అభిప్రాయపడ్డారు.

అఖండ భారత్
నేపాల్ మాజీ ప్రధాని పుష్ప కమల్ దాహాల్ ప్రచండకు చెందిన నేపాల్ కమ్యూనిస్టు పార్టీ విద్యార్థి నాయకుడు శిశిర్ విశ్యాల్.. కాఠ్‌మాండూలోని త్రిభువన్ యూనివర్సిటీ రత్న రాజ్యలక్ష్మీ క్యాంపస్‌లో ఎకనమిక్స్‌లో మాస్టర్స్ చేస్తున్నారు.
మోదీ గురించి శిశిర్ మాట్లాడుతూ.. ‘‘మోదీతో భారత్‌కే మంచి జరగలేనప్పుడు.. నేపాల్‌కు మాత్రం ఆయనతో ఏం మేలు జరుగుతుంది. భారత్ తరహాలోనే నేపాల్‌లోనూ మత రాజకీయాలకు పునాదులు వేయాలని మోదీ భావిస్తున్నారు. అయితే, ఇక్కడ మత సహనం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ, బీజేపీ, ఆరెస్సెస్ మాత్రం తమ ప్రయత్నాలు చేస్తున్నాయి’’అని శిశిర్ అన్నారు.
‘‘మోదీ, ఆరెస్సెస్ విధానాల్లో అఖండ భారత్ కూడా ఒకటి. నేపాల్ కూడా భారత్‌లో భాగమని వారు అనుకుంటున్నారు. కానీ, నేపాల్ స్వతంత్ర, సార్వభౌమ దేశం. మేం ఎందులోనూ తక్కువకాదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి’’అని శిశిర్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, narendramodi.in
2015లో విధించిన ఆంక్షల వల్ల నేపాల్‌లో నరేంద్ర మోదీ ప్రజాదరణ తగ్గిందనే వార్తలను నేపాల్ మాజీ విదేశాంగ మంత్రి ఉపేంద్ర యాదవ్ తోసిపుచ్చారు. ‘‘అసలు అలాంటిదేమీ లేదు. రాజ్యాంగంలో వివక్ష వల్లే 2015లో ఆ ఆంక్షలు విధించారు. మధేసీలపై నేపాల్ రాజ్యాంగంలో కనిపించిన వివక్ష విషయంలో నరేంద్ర మోదీ కూడా సంతోషంగా లేరు. ఆయనకు ప్రజల్లో ఆదరణ ఏమీ తగ్గలేదు. పర్వత ప్రాంతాలు లేదా మైదానాలు ఎక్కడైనా చూడండి.. మోదీకి అభిమానులు ఉన్నారు. భారత వ్యతిరేక కమ్యూనిస్టులకు మాత్రమే మోదీ నచ్చరు’’అని ఉపేంద్ర యాదవ్ వ్యాఖ్యానించారు.
భారత సైన్యంలోని గూర్ఖా రెజిమెంట్‌లో సైనికుడిగా పనిచేసి పదవీ విరమణ చేసిన కుల్ బహాదుర్ కేసీ ప్రస్తుతం నేపాల్‌లోని బుట్వల్‌లో ఉంటున్నారు. యునైటెడ్ ఎక్స్‌సర్వీస్‌మెన్ వెల్ఫేర్ ఫెడరేషన్‌కు ఆయన అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.
నరేంద్ర మోదీ ప్రజాదరణపై మాట్లాడుతూ.. ‘‘విశ్రాంత సైనికుల్లో ఇప్పటికే మోదీకి మంచి పేరుంది. హిందూమతాన్ని ఆయన రక్షిస్తారనే నమ్మకముంది. ఆయన ఇక్కడకు వచ్చినప్పుడు కూడా ముక్తినాథ్, పశుపతినాథ్, జనక్‌పుర్ లాంటి ప్రాంతాలకు వెళ్లి ధ్యానం చేస్తారు. మోదీ భక్తిభావన అంటే ఇక్కడి హిందువులకు చాలా ఇష్టం’’అని బహాదుర్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
సందేహాలు ఎందుకు?
ఏప్రిల్ 2015లో నేపాల్‌ను విధ్వంసక భూకంపం కుదిపేసినప్పుడు భారత్ వెంటనే సాయం అందించింది. ఆరు గంటల్లోనే భారత సైనిక విమానాలు నేపాల్ చేరుకుని సహాయక చర్యలు మొదలుపెట్టాయి. మొత్తంగా 65 మిలియన్ డాలర్లు (రూ.519.18 కోట్లు) ఆర్థిక సాయం కూడా భారత్ అందించింది.
అయినప్పటికీ, భారత ఉద్దేశాలు, లక్ష్యాలపై నేపాల్‌లో ప్రశ్నలు ఉత్పన్నం అయ్యాయి. కాఠ్‌మాండూలోని భారత దౌత్యకార్యాలయం రాయబారిగా పనిచేసిన రంజీత్ రాయ్ 2015లో ‘‘కాఠ్‌మాండూ డైలమా రీసెటిలింగ్ ఇండియా-నేపాల్ టైస్’’ఒక పుస్తకం రాశారు. దీనిలో భారత సైన్యం కేవలం భారతీయులకు మాత్రమే సాయం చేసిందని, నేపాలీలను పట్టించుకోలేదని నేపాలీ మీడియాలో వార్తలు వచ్చాయని ఆయన వివరించారు. మరోవైపు భారత్ అందించిన సహాయక సామగ్రి కూడా ఉపయోగించదగిన రీతిలో లేదని కొందరు ఆరోపణలు చేశారని ఆయన వెల్లడించారు.
‘‘ఇండియన్ మీడియా గో బ్యాక్’’, ‘‘బ్యాక్ ఆఫ్ ఇండియన్ మీడియా’’ లాంటి హ్యాష్‌ట్యాగ్‌లు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.
‘‘నేపాల్‌కు మేం చాలా సాయం చేశాం. కానీ, ఇలాంటి స్పందనలు ఎందుకు వస్తున్నాయి? అసలు వారికి మేం ఎందుకు నచ్చడం లేదు?’’అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనను ప్రశ్నించినట్లు రంజీత్ రాయ్ వివరించారు.
నేపాల్ నాయకులు తనతో మాట్లాడిన మాటలను కూడా తన పుస్తకంలో రంజీత్ వివరించారు. ‘‘నేపాల్ రాయబారిగా ఇక్కడకు వచ్చిన తొలి నాళ్లలో నేను నేపాల్ కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకుడు మాధవ్ కుమార్‌ను కలిశాను. భారత్ ఎప్పుడూ అన్నాదమ్ముల సంబంధం గురించి ఎందుకు మాట్లాడుందని ఆయన నన్ను ప్రశ్నించారు. తాము స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటున్నామని, వీటిలో సమానత్వం ఉంటుందని ఆయన అన్నారు. ఇక్కడ ఒకరు పెద్ద, మరొకరు చిన్న అనే విభేదాలు లేవని చెప్పారు’’అని రంజీత్ రాయ్ తన పుస్తకంలో రాసుకొచ్చారు.
ఇవి గుర్తింపు రాజకీయాలా?
‘‘బహుశా అప్పటి భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వ్యాఖ్యలను మాధవ్ కుమార్ తప్పుగా అర్థం చేసుకున్నారు. భారత పెద్దన్నయ్యలా సాయం చేసిందని సుష్మా స్వరాజ్ చాలా అప్యాయంగా చెప్పారు. కానీ, నేపాల్ ఆ వ్యాఖ్యలను నెగిటివ్‌గా తీసుకుంది’’అని రంజీత్ చెప్పారు.
మరోవైపు ఆగస్టు 2020లో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్.. బుద్ధుడిని గొప్ప భారతీయుడిగా అభివర్ణించారు. అయితే, దీనిపై నేపాల్‌లో చాలా నిరసన వ్యక్తమైంది. నేపాల్ మేధావులు, సీనియర్ అధికారులు, మాజీ ప్రధానులు ఇలా చాలా మంది జైశంకర్ వ్యాఖ్యలను ఖండించారు. ‘‘గౌతమ బుద్ధుడు లుంబినిలో జన్మించారు. ఆ లుంబిని నేపాల్‌లో ఉంది. ఈ విషయం అందరికీ తెలుసు’’అని నేపాల్ విదేశాంగ శాఖ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.
‘‘బుద్ధుడు, లేదా ఎవరెస్టును భారత్ తమ సంపదగా చెబితే, నేపాలీలు చాలా ఆగ్రహం వ్యక్తంచేస్తారు. నేపాల్‌కు మూడు వైపులా భారత్ ఉన్నప్పటికీ, భారత్‌పై ఆధారపడటానికి నేపాలీలు ఒప్పుకోరు. హిందీ విషయంలోనూ ఇక్కడ ఇలాంటి వ్యతిరేకతే వ్యక్తం అవుతుంది. నేపాల్‌లోని రాజకీయ నాయకులందరికీ హిందీ వచ్చే ఉంటుంది. కానీ, వారు హిందీలో మాట్లాడరు. హిందీ సినిమాలు, టీవీ కార్యక్రమాలు చూస్తారు.. కానీ, హిందీ వల్ల తమ గుర్తింపు తగ్గిపోతోందని వారు బాధపడతారు’’అని రంజీత్ తన పుస్తకంలో వివరించారు.
నరేంద్ర మోదీ అధికారంలోకి వస్తే, రెండు దేశాల సంబంధాలు మెరుగుపడతాయని నేపాలీల్లో ఆశాభావం ఉండేదని దేశ మాజీ అధ్యక్షుడు పరమానంద్ ఝా ఇదివరకు చెప్పారు. కానీ, మోదీ వచ్చినా పరిస్థితులు మారలేదని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక నేపాల్‌లో మైక్రోమేనేజ్‌మెంట్ చాలా తగ్గింది. అయితే, ఇక్కడ వామపక్ష రాజకీయాలతో భారత్‌పై వ్యతిరేకత పెరుగుతోంది. దీంతో భారత నాయకులు ఎవరైనా ఇక్కడ వ్యతిరేకత ఎదుర్కోక తప్పడం లేదు’’అని భారత్‌కు నేపాల్ రాయబారిగా పనిచేసిన దీప్ కుమార్ ఉపాధ్యాయ్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- 'వీగర్ ముస్లింలపై చైనా ప్రభుత్వానిది మారణహోమం.. కళ్లుమూసుకుని కూర్చోకండి’
- ఏమిటీ ‘స్మోకింగ్ పనిష్మెంట్’ టెక్నిక్.. ఇలా చేస్తే సిగరెట్లు మానేయవచ్చా
- మీరు డార్క్ చాక్లెట్‌ను ఇష్టంగా తింటారా, అది ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా?
- ప్రేమలో విఫలమయ్యారా? ఆ బాధ నుంచి కోలుకోవడం ఎలా
- నిరుద్యోగం పెరుగుతున్న వేళ, జీవనోపాధికి భరోసా ఇస్తున్న ‘గిగ్ వర్క్’
- వేలంలో కొన్న సూట్‌కేసులు, ఇంటికి తెచ్చి చూస్తే అందులో మానవ అవశేషాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














