నేపాల్: పులుల సంఖ్య పెరిగితే ఓ పక్క ఆనందం.. మరోపక్క భయం

ఫొటో సోర్స్, DEEPAK RAJBANSHI
- రచయిత, అణ్బరసన్ ఎతిరాజన్, రెబెకా హెన్ష్‌కే
- హోదా, బీబీసీ న్యూస్
నేపాల్‌లో గత పదేళ్లలో అసాధారణ రీతిలో పులుల సంఖ్య రెట్టింపు కన్నా ఎక్కువ పెరిగింది. నేపాల్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని, దాదాపు అంతరించిపోయే దశనుంచి వాటిని రక్షించింది. అయితే, దానికి స్థానికులు మూల్యం చెల్లిస్తున్నారు. పులుల దాడులు ఎక్కువైపోయాయి.
"పులి కనిపించగానే రెండు రకాల భావాలు కలుగుతాయి. ఆహా, ఏమి ఠీవి! అనిపిస్తుంది. మరో పక్క, దీనికి నేను ఆహారమైపోతానా అనే భయం కలుగుతుంది" అని కెప్టెన్ ఆయుష్ జంగ్ బహదూర్ రాణా అన్నారు. పులులను రక్షించే విభాగంలో ఆయన పనిచేస్తున్నారు.
నేపాల్‌లోని టెరాయ్ ప్రాంతంలో ఉన్న అతిపెద్ద నేషనల్ పార్క్ బర్దియాలో ఇప్పుడు తరచూ బెంగాల్ పులులు కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు. గస్తీ కాస్తున్నప్పుడు చాలా పులులు ఎదురవుతున్నాయని అన్నారు.
"పులులను రక్షించే పనిని నాకు అప్పగించడం గౌరవంగా భావిస్తాను. ఇంత పెద్ద కార్యక్రమంలో భాగం కావడం ఎంతో ప్రత్యేకం" అని కెప్టెన్ ఆయుష్ అన్నారు.
నేపాల్ అమలుచేసిన జీరో-పోచింగ్ విధానం పులుల రక్షణకు బాగా పనికివచ్చింది. పోచింగ్ అంటే దొంగతనంగా అడవి జంతువులను వేటాడడం.
ఆ దేశంలో నేషనల్ పార్క్‌ను సంరక్షించే బృందాలకు మిలటరీ సహాయం అందిస్తోంది. నేషనల్ పార్క్‌కు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కూడా అక్రమ వేటను నిరోధించే బృందాలు పహారా కాస్తుంటాయి.
అలాంటి ఒక ప్రాంతం ఖాతా కారిడార్. బర్దియా నేషనల్ పార్క్‌ను భారతదేశం సరిహద్దులో ఉన్న కతర్నియాఘాట్ వన్యప్రాణుల అభయారణ్యంతో కలుపుతుంది.

ఫొటో సోర్స్, DEEPAK RAJBANSHI
అడుగడుగునా భయం..భయం
పులుల సంఖ్య పెరగడం నేషనల్ పార్క్ చుట్టు పక్కల ప్రాంతాల్లోని ప్రజలకు ప్రాణాంతకంగా మారింది.
"అక్కడి స్థానికులు భయంతో బతుకుతున్నారు. పులులు, మనుషులు తిరిగే ఉమ్మడి ప్రాంతంలో పరిస్థితి తీవ్రంగా ఉంది. నేపాల్ పులుల సంఖ్యను రెట్టింపు చేసిందని ప్రపంచం ఆనందిస్తోందిగానీ, దానికి అక్కడి స్థానిక సమాజం మూల్యం చెల్లించింది" అని ఎకో-బిజినెస్ వ్యాపారవేత్త, పర్యావరణ పరిరక్షకుడు మనోజ్ గౌతం అన్నారు.
నేపాల్‌లో గత 12 నెలల్లో 16 మంది పులి పంజాకు బలయ్యారు. అంతకు ముందు, అయిదేళ్లల్లో మొత్తం 10 మంది మాత్రమే పులి దాడుల్లో చనిపోయారు.
చాలావరకు గ్రామస్థులు పశువులను మేపడానికి లేదా పండ్లు, పుట్టగొడుగులు, కలపను సేకరించేందుకు నేషనల్ పార్క్‌లోకి లేదా బఫర్ జోన్లోకి వెళ్లినప్పుడు పులి దాడులు ఎక్కువ జరిగాయి.
అయితే, పులులు గ్రామాల్లోకి ప్రవేశించిన సందర్భాలూ ఉన్నాయి. వన్యప్రాణులు, మనుషుల మధ్యకు రాకుండా కంచెలు వేసినప్పటికీ పులులు వాటిని దాటుకుని గ్రామల్లోకి ప్రవేశించగలిగాయి.

ఫొటో సోర్స్, KEVIN KIM/BBC
బధాయి తరు పులుల సంరక్షణలో సహాయం చేస్తున్నారు. ఆయన ఒంటిపై పులి పంజా గాయాలు చాలా ఉన్నాయి. 2004లో తన గ్రామానికి పక్కనే ఉన్న అడవిలో గడ్డి కోస్తుండగా పులి దాడి చేసింది. ఆయనకు ఒక కన్ను పోయింది.
"ఒక పెద్దపులి గాండ్రిస్తూ నా మీదకు దూకింది. నేను వెనక్కు పడిపోయాను. అది మళ్లీ నా మీదకు దూకింది. నా శక్తినంతా ఉపయోగించి గట్టిగా ఒక్క గుద్దు గుద్దాను. సహాయం కోసం కేకలు పెట్టాను" అని ఆనాటి సంఘటనను వివరించారు బధాయి.
ఆయన ఎప్పుడూ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంటారు. అవి తీస్తే ఆయన ముఖంపై గాయాల మచ్చలు కనిపిస్తాయి. ఇప్పుడు ఆయనకు ఒక్క కన్నే ఆసరా.
"నాకు చాలా బాధ, ఆక్రోశం కలిగింది. పులుల పరిరక్షకుడిగా నేనేం తప్పు చేశాను? కానీ, అవి అంతరించిపోయే దశలో ఉన్నాయి. వాటిని రక్షించడం మన బాధ్యత" అని బధాయి అన్నారు.
ఒక శతాబ్దం క్రితం ఆసియా అంతటా సుమారు 1,00,000 పులులు ఉండేవి. 2000 దశాబ్దం ప్రారంభానికి ఆ సంఖ్య 95 శాతం తగ్గిపోయింది. వేట, ఆవాసాలు కోల్పోవడం ప్రధాన కారణాలు.
ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ప్రకారం, ప్రస్తుతం 3,726 నుంచి 5,578 పులులు మిగిలి ఉన్నాయని అంచనా.
సుమారు 968 చదరపు కి.మీ (374 చదరపు మైళ్లు) విస్తీర్ణంలో ఉన్న బర్దియా ప్రాంతాన్ని 1988లో అంతరించిపోతున్న వన్యప్రాణులను రక్షించే ఉద్దేశంతో నేషనల్ పార్క్‌గా మార్చారు. ఈ ప్రాంతం ఒకప్పుడు రాజుల వేట కోసం నిర్దేశించినది.

ఫొటో సోర్స్, DEEPAK RAJBANSHI
పులుల సంఖ్య పెంచేందుకు చర్యలు
2022 నాటికల్లా తమ దేశాల్లోని పులుల సంఖ్యను రెట్టింపు చేస్తామని 13 దేశాలు 2010లో ప్రతిజ్ఞ పూనాయి. పులులు అంతరించిపోతే దశ నుంచి వాటిని రక్షిస్తామని హామీ ఇచ్చాయి. చైనీస్ క్యాలెండర్‌లో 2022 పులుల సంవత్సరం.
అయితే, ఒక్క నేపాల్ మాత్రమే ఈ లక్ష్యాన్ని చేరుకుంది.
నేపాల్‌లో పులుల సంఖ్య 2009లో 121 నుంచి 2022 నాటికి 355కి పెరిగింది. పెద్దపులులు ప్రధానంగా ఆ దేశంలోని అయిదు నేషనల్ పార్కులలో కనిపిస్తాయి. నేపాల్‌లో ఖడ్గమృగం, ఏనుగు, చిరుతపులి వంటి ఇతర జంతువుల సంఖ్య కూడా పెరిగింది.
పులుల సంఖ్య వృద్ధి చెందేందుకు నేషనల్ పార్క్ అధికారులు గడ్డి భూములను విస్తరించారు. అలాగే, పులుల ప్రధాన ఆహారం అయిన జింకలకు అనువైన ఆవాసాన్ని సృష్టించేందుకు నీటి గుంటలను పెంచారు.
ఇదిలా ఉండగా, పులులను వృద్ధి చేయడంలో మనుషుల జోక్యం ఎక్కువైపోతోందనే వాదన కూడా వినిపిస్తోంది.
బర్దియా నేషనల్ పార్క్ చీఫ్ వార్డెన్, బిష్ణు శ్రేష్ఠ ఈ వాదనలను ఖండించారు.
"మాకు ఇప్పుడు నేషనల్ పార్క్‌లో తగినంత చోటు, పులుల ఆహార వేటకు అనువైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పులుల నిర్వహణ స్థిరంగా ఉంది" అని ఆయన వివరించారు.
బర్దియా నేషనల్ పార్క్ సమీపంలో నివసించే ప్రజలు పులుల పరిరక్షణకు ఎంతో సహకరించారు. అయితే, పులుల సంఖ్య పెరిగేకొద్దీ వారి భయం కూడా పెరిగింది.
పులులతో కలిసి జీవనం
"టూరిస్టులు పులులు చూడడానికి వస్తారు. కానీ, మేం వాటితో పాటు కలిసి జీవిస్తున్నాం" అని సంఝన చెప్పారు. గత ఏడాది పులి దాడిలో సంఝన అత్తగారు చనిపోయారు. నేషనల్ పార్క్ సరిహద్దులు దాటి లోపలికి వెళ్లి గడ్డి కోస్తుండగా పులి ఆమెపై దాడి చేసింది.
"నా తల్లి కన్నా ఆమెను ఎక్కువగా ప్రేమించాను. భవిష్యత్తులో అనేక కుటుంబాలు నాలాగే బాధపడతాయి. పులి బాధితుల సంఖ్య పెరిగిపోతుంది" అని కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పారు సంఝన.
పులులు గ్రామాల్లోకి చొరబడిన సంఘటనలు కూడా ఇటీవల పెరుగుతున్నాయి.
ఈ ఏడాది మార్చిలో సైనాబాగర్ గ్రామానికి చెందిన లిల్లీ చౌదరి తన ఇంటి సమీపంలోనే పులి పంజాకు బలైంది. బర్దియా నేషనల్ పార్క్ అంచున ఉంది ఈ గ్రామం. లిల్లీ చౌదరి ఇంటి పక్కనే పందులను మేపుతూ ఉండగా పులి దాడి చేసింది.
ఒంటి నిండా గాయాలతో, కాళ్లు తెగిపడి ఉన్న లిల్లీని గ్రామస్థులు చూశారు. ఆమె వెంటనే చనిపోయింది.
"అప్పటి నుంచి పందులను, పశువులను పెరట్లో మేపడానికి కూడా భయపడుతున్నాం. ఒంటరిగా వెళ్లాలంటే భయం" అని లిల్లీ చెల్లి చెప్పారు.

ఫొటో సోర్స్, KEVIN KIM/BBC
స్థానికులు నిరసనలు
పులి దాడులతో ఇబ్బందులు గురవుతున్న స్థానికులు నిరసనలు చేపట్టారు.
జూన 6న బధాయి తరు వాళ్ల గ్రామానికి చెందిన అస్మిత తరు, ఆమె భర్తపై చిరుతపులి దాడి చేయడంతో గ్రామస్థులంతా నిరసనలకు దిగారు. అంతకు ముందు వారం, పక్కనే ఉన్న కమ్యూనిటీ అడవిలో పెద్దపులి ఒక వ్యక్తిని చంపేసింది.
సుమారు 300 మంది గ్రామస్థులు వీధుల్లోకి వచ్చి, పులుల నుంచి తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
కమ్యూనిటీ ఫారెస్టు ఆఫీసును తగలబెట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. దాంతో, భద్రతా దళాలు గ్రామస్థులపై తుపాకీలు ఎక్కుపెట్టాయి. ఈ కాల్పుల్లో నబీనా చౌదరి అనే యువతి ప్రాణాలు కోల్పోయారు. చిరుతపులి బారిన పడ్డ అస్మిత తరుకు నబీనా మేనకోడలు అవుతుంది.
ఈ ఘటన జరినప్పుడు నబీనా సోదరుడు నబీన్ తరు పక్కనే ఉన్నారు.
"నేను తన మృతదేహాన్ని రోడ్డు నుంచి పక్కకు తీయాలనుకున్నాను. కానీ, పోలీసులు జనాన్ని కొడుతూనే ఉన్నారు. మా చెల్లి ఏ తప్పు చేయలేదు. రక్షణ కల్పించమని డిమాండ్ చేయడం తప్పా? భద్రత కోరడం తప్పా?" అని ప్రశ్నించారు నబీన్.

ఫొటో సోర్స్, DEEPAK RAJBANSHI
నేపాల్ ప్రభుత్వం నబీన్ కుటుంబానికి 16,000 డాలర్ల (సుమారు రూ. 12,67,976) నష్టపరిహారం ప్రకటించింది. గ్రామంలో నబీనా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. కానీ, ఆమె మరణంపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
నిరసనల తరువాత, గ్రామస్థులకు రక్షణ పెంచే దిశగా మరిన్ని కంచెలు వేస్తామని, గోడలు పెంచుతామని అధికారులు మాటిచ్చారు. ఆ మేరకు ఒప్పంద పత్రాలపై సంతకం చేశారు.
నేపాల్‌లో మనుషులను చంపే పులులను వెంటనే పట్టుకుని బంధిస్తారు. ఇప్పటివరకు అలా ఏడు పులులను బోనులో బంధించారు.
"పులుల సంరక్షణ మా బాధ్యత. అదే సమయంలో ప్రజల రక్షణ మా కర్తవ్యం" అని కెప్టెన్ ఆయుష్ జంగ్ బహదూర్ రాణా అన్నారు.
"పెద్ద సంఖ్యలో పులులు, ఎక్కువ మంది మనుషులు ఉన్నప్పుడు కచ్చితంగా ఘర్షణలు జరుగుతాయి. పులులు, మనుషుల మధ్య శాంతి, సామరస్యం సాధించడం పెద్ద సవాలే" అన్నారాయన.
కలప, పుట్టగొడుగులు, పశువులకు గడ్డి కోసం నేషనల్ పార్కులోకి వెళ్లే గ్రామస్థులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలు అన్వేషించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు.
స్థానికులు చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి, పర్యటక రంగంలో పనిచేయడానికి కావలసిన నైపుణ్యాలను వృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఫొటో సోర్స్, NABIN THARU
"ఇష్టమైన జంతువు పులి"
స్థానికంగా పులుల రక్షణలో సహాయం చేస్తున్న తన బృందాన్ని సమావేశపరిచారు బధాయి తరు.
"అపార్థాలు మనుషులను, వన్యప్రాణులను విడదీస్తాయి. మన అడవి పులులకు ఇల్లు. వాటి ఆవాసాల్లోకి మనం ప్రవేశిస్తే వాటికి కోపం వస్తుంది. మనం మేకలను గడ్డి కోసం అడవిలోకి తోలితే అవి దాడి చేస్తాయి" అంటూ బధాయి తరు వారికి నచ్చజెప్పారు.
నేషనల్ పార్క్ ప్రాంతంలో గడ్డి భూములు పెంచేందుకు ఆయన బృందం కృషి చేస్తోంది. వాటివల్ల జింకల సంఖ్య పెరిగి పులులకు ఆహార కొరత ఉండదు.
వారు తమ తరువాతి తరాలకు కూడా ఈ అంశంలో శిక్షణ ఇస్తున్నారు. పులుల సంఖ్య పెరిగే కొద్దీ తరువాతి తరాలు కూడా వాటితో కలిసి జీవించాల్సి ఉంటుంది.
పులుల ప్రవర్తన గురించి పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు. అడవిలోకి ఒంటరిగా వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు.
మీకు ఇష్టమైన జంతువు ఏది? అని అక్కడి పిల్లలను అడిగితే, "పులి" అని చెబుతారు.
"పులులకు ఇక్కడ నివసించే హక్కు ఉందని ప్రజలకు వివరించి చెప్పే ప్రయత్నం చేస్తుంటాను" అని బధాయి అన్నారు.
అదనపు రిపోర్టింగ్: రమా పరాజులి, కెవిన్ కిమ్, రాజన్ పరాజులి, సురేంద్ర ఫూయల్
ఫొటోలకు కాపీరైట్ ఉంది.
ఇవి కూడా చదవండి:
- అధీర్ రంజన్ చౌదరి: ద్రౌపది ముర్మును 'రాష్ట్రపత్ని' అంటారా... సోనియాగాంధీ క్షమాపణ చెప్పాల్సిందే అంటున్న బీజేపీ
- హర్ ఘర్ తిరంగా: ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేసే కార్యక్రమానికి ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఎంత... ఇదో కుంభకోణమా?
- పీఎఫ్ఐ: ఇండియాలో ఈ ఇస్లామిక్ సంస్థపై ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? దీని వెనుక ఎవరున్నారు
- సంపన్న మహిళల జాబితాలో 12 మంది హైదరాబాద్ నుంచే
- క్యాన్సర్‌కు చికిత్స చేస్తే ఎయిడ్స్ పూర్తిగా తగ్గిపోయింది.. ప్రపంచంలోనే హెచ్ఐవీ నుంచి విముక్తి పొందిన నాలుగో రోగి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













