పీఎఫ్ఐ: ఇండియాలో ఈ ఇస్లామిక్ సంస్థపై ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? దీని వెనుక ఎవరున్నారు

పీఎఫ్ఐ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఫైజల్ మహమ్మద్ అలీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బిహార్ రాజధాని పట్నా పర్యటనకు కొన్ని గంటలు ముందుగా, జులై 12న రెండు దేశ వ్యతిరేక కుట్రలు బయటపడినట్లు బిహార్ పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ కేసుల విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించినట్లు కేంద్ర హోం శాఖ స్పష్టంచేసింది.

ఈ కుట్రల వెనుక నిధుల కేసులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ చేపడుతున్నట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.

పట్నాలోని ‘‘ఫుల్వారీ షరీఫ్’’ ప్రాంతంలో ఈ కేసులు బయటపడ్డాయని బీబీసీతో పట్నా సినియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎంఎస్ ఢిల్లోం చెప్పారు. ఇప్పటివరకు దీనికి సంబంధించి ఐదుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

నిషేధిత ఇస్లామిక్ అతివాద సంస్థ స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) కోసం పనిచేసిన వారితో ఒక రహస్య సంస్థను ఏర్పాటుచేసేందుకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) ప్రయత్నిస్తున్నట్లు ప్రాథమిక విచారణ నివేదికలో పోలీసులు పేర్కొన్నారు. ఆయుధాలపై శిక్షణ ఇవ్వడంతోపాటు ముస్లింలపై జరిగే దాడులకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఆ సంస్థను ఏర్పాటుచేయాలని చూసినట్లు పోలీసులు చెబుతున్నారు.

రెండు రోజుల తర్వాత పట్నాలోని ఫుల్వారీ షరీఫ్ ప్రాంతంలో మరో రెండు కేసులు కూడా నమోదయ్యాయి. రెండు వాట్సాప్ గ్రూప్‌ల్లో మెసేజ్‌లకు సంబంధించి ఈ కేసులు నమోదుచేసినట్లు పోలీసులు చెబుతున్నారు. వీటిలో ఒక గ్రూప్‌తో పాకిస్తాన్, యెమెన్ మరికొన్ని గల్ఫ్ దేశాలతోనూ సంబంధాలున్నట్లు తెలిపారు. మరో గ్రూప్‌లో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లకు చెందిన ఎనిమిది మంది సభ్యులున్నట్లు వెల్లడించారు.

పీఎఫ్ఐ

ఈ కేసులపై పట్నాలో ఎంఎస్ ఢిల్లోం విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి వివరాలు వెల్లడించారు. ఈ గ్రూపుల్లో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు కుట్ర జరుగుతున్నట్లు చెప్పారు. తాము అరెస్టు చేసిన మర్గూబ్ అహ్మద్ దానీశ్‌కు పాకిస్తాన్‌కు చెందిన అతివాద సంస్థ తెహ్రీక్-ఎ-లబ్బైక్‌తో సంబంధముందని తెలిపారు.

ప్రస్తుతం పీఎఫ్ఐపై కొన్ని తీవ్రమైన ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి. వీటిని ఎన్ఐఏ సహా కొన్ని దర్యాప్తు సంస్థలు విచారణ చేపడుతున్నాయి. కేరళలోని ఎర్నాకుళానికి చెందిన ఒక ప్రొఫెసర్‌పై దాడితోపాటు కూనూర్‌లో ఆయుధాల వినియోగంపై శిక్షణ, తమిళనాడు తంజావూరులోని రామలింగంలో ఊచకోత తదితర ఆరోపణలు పీఎఫ్ఐపై ఉన్నాయి.

ఈ ఆరోపణలకు సంబంధించి కొన్ని కేసుల్లో కొందరు దోషులుగా నిరూపితం అయ్యారు. వీరికి పీఎఫ్ఐతో సంబంధముందని పోలీసులు చెబుతున్నారు. పీఎఫ్ఐ నిధులకు సంబంధించిన కేసులనూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ చేపడుతోంది.

పీఎఫ్ఐ స్థావరంలో ‘‘ఇండియా 2047: టువార్డ్స్ రూల్ ఆఫ్ ఇస్లామిక్ ఇండియా’’ పేరుతో ఒక డాక్యుమెంట్ దొరికిందని పోలీసులు చెబుతున్నారు. భారత్‌ను ఇస్లామిక్ దేశంగా మార్చడమే లక్ష్యమని ఈ డాక్యుమెంట్‌లో ఉందని పేర్కొన్నారు. అయితే, పోలీసులు తమపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, ఆ డాక్యుమెంట్ నిజంకాదని పీఎఫ్ఐ చెబుతోంది.

‘‘పాపులర్ ఫ్రంట్‌పై కావాలనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు’’అని సంస్థ జాతీయ కార్యదర్శి మహమ్మద్ షకీఫ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇదంతా ఒక రాజకీయ కుట్రలో భాగంగా జరుగుతోందని ఆయన ఆరోపించారు.

తమ కార్యాలయంలో దొరికిన డాక్యుమెంట్‌.. సచ్చర్ కమిషన్-మిశ్ర కమిషన్ మార్గదర్శకాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలి? అనే అంశంపై తయారుచేసినదని పీఎఫ్ఐ చెబుతోంది.

పీఎఫ్ఐ

ఫొటో సోర్స్, VISHNU NARYAN/BBC

15ఏళ్లు క్రియాశీలంగా..

2007లో మొదలైనప్పటి నుంచి పీఎఫ్ఐపై అధికారులు దృష్టిసారిస్తున్నారు. 2008లో ఏర్పాటైన జాతీయ దర్యాప్తు సంస్థ... పీఎఫ్ఐ కార్యకలాపాలను ఒక కంట కనిపెడుతూ వస్తోంది.

ఎర్నాకుళానికి చెందిన మలయాళ ప్రొఫెసర్ టీజే జోసెఫ్‌పై దాడి కేసును కూడా 2011లో ఎన్ఐఏకు అప్పగించారు.

‘‘నేను చర్చి నుంచి వస్తున్నప్పుడు నా కుడి చేతిపై గొడ్డలితో దాడి చేశారు. ఇలా నాపై దాడి చేయడం అది మూడోసారి’’అని నాటి ఘటనపై బీబీసీతో జోసెఫ్‌ చెప్పారు.

మహమ్మద్ ప్రవక్తకు సంబంధించి కాలేజీ పరీక్షల్లో ఒక ప్రశ్న అడగడమే ఆ దాడికి కారణమని ఆయన చెప్పారు.

‘‘ద థౌసండ్ కట్స్, ఏన్ ఇన్నోసెంట్ క్వశ్చన్, డెడ్లీ ఆన్సర్స్’’ పేరుతో ఆయన ఒక పుస్తకం కూడా రాశారు.

పీఎఫ్ఐ

ఫొటో సోర్స్, PFI

పీఎఫ్ఐతో సంబంధముందా?

ఈ కేసులో 31 మందిపై ఆరోపణలు మోపారు. దీనిలో 13 మందిని దోషులుగా ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు నిచ్చింది. 18 మందిని విడుదల చేశారు. మరో ముగ్గురు ఇప్పటికీ పరారీలో ఉన్నారు.

ప్రొఫెసర్‌పై దాడితో తమ సంస్థకు చెందిన కొందరికి సంబంధం ఉండి ఉండొచ్చని పీఎఫ్ఐ అప్పట్లో అంగీకరించింది. అయితే, అవన్నీ స్థానిక గొడవలని చెప్పింది.

ఈ అంశంపై బీబీసీతో పీఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి అనీస్ అహ్మద్ మాట్లాడారు. ‘‘ఈ కేసుపై మేం దిల్లీ విలేకరుల సమావేశం ఏర్పాటుచేశాం. ఆ దాడిని ఖండించాం. అంతేకాదు.. దానితో సంబంధమున్న వారిని సంస్థ నుంచి బహిష్కరించాం’’అని చెప్పారు.

అయితే, ఇలాంటి హింసకు సంబంధించి మరికొన్ని కేసుల్లోనూ పీఎఫ్ఐ పేరు వార్తల్లో నిలిచింది.

మరోవైపు పీఎఫ్ఐపై వస్తున్న ఆరోపణల్లో చాలావరకు అసత్యాలే ఉన్నాయని తిరువనంతపురానికి చెందిన సోషియాలజిస్టు జే రఘు చెప్పారు. హీడెల్‌బెర్గ్ యూనివర్సిటీకి చెందిన ఆర్నెట్ వాల్టెర్ ఎమిరిక్ ప్రకారం ఈ విషయంలో ఒక నిర్ధారణకు రావడం చాలా కష్టమని చెప్పారు.

భారత్‌లో ముస్లింలో రాజకీయాలపై వాల్టెర్ ఎమిరిక్ డాక్టరేట్ చేశారు. ‘‘ఇస్లామిక్ మూవ్‌మెంట్స్ ఇన్ ఇండియా, మోడరేషన్ అండ్ డిస్‌కంటెంట్’’ పేరుతో ఆయన ఒక పుస్తకం కూడా ప్రచురించారు.

ఈ విషయంలో తనకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయని వాల్టెర్ ఎమిరిక్ చెప్పారు. ‘‘ఇస్లాంకు అండగా నిలవడంలో పీఎఫ్ఐ విఫలం కావడం వల్లే తాము హింసా మార్గాన్ని ఎంచుకున్నట్లు కొందరు మాజీ పీఎఫ్ఐ కార్యకర్తలు చెప్పారు. దీనికి సంస్థకు చెందిన ప్రధాన నాయకులతో సంబంధమున్నట్లు నాకు ఎలాంటి ఆధారాలు కనిపించలేదు’’అని ఆయన చెప్పారు.

‘‘కొంతమంది హింసా మార్గాన్ని ఎంచుకొని ఉండొచ్చు. అయితే, ఆ సంస్థ మరీ అంత చెడ్డది కాదు’’అని జే రఘు వ్యాఖ్యానించారు.

పీఎఫ్ఐ

ఫొటో సోర్స్, PFI

ఫొటో క్యాప్షన్, పీఎఫ్ఐ ప్రధాన నాయకులు (మధ్యలో అనీస్ అహ్మద్)

ఆరెస్సెస్‌తో పోలిక ఏమిటి?

గతంలో పీఎఫ్ఐ రాజకీయ విభాగంగా చెప్పే సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యదర్శి కేఎస్ ఖాన్‌ను హత్య చేసిన కొన్ని గంటలకే, భారతీయ జనతా పార్టీకి ఓబీసీ మోర్చా కేరళ కార్యదర్శి రంజిత్ శ్రీనివాస్ కూడా హత్యకు గురయ్యారు.

కేరళలో ఆ తర్వాత ఆరెస్సెస్, సీపీఎం, పీఎఫ్ఐ, ఎస్‌డీపీఐ లాంటి పార్టీలు, సంస్థలకు చెందిన రాజకీయ నాయకుల హత్యలు కలకలం రేపాయి.

ఇప్పుడు కేరళకు వందల కిలోమీటర్ల దూరంలోని బిహార్‌లోనూ పీఎఫ్ఐపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. అయితే, తాము ఆయుధాల వినియోగంపై తాము ఎలాంటి శిక్షణా ఇవ్వడంలేదని పీఎఫ్ఐ చెబుతోంది.

వీడియో క్యాప్షన్, కన్నయ్యలాల్:ఉదయ్‌పూర్‌లో టైలర్‌ను ఎందుకు హత్య చేశారు, రాజస్థాన్ పోలీసులు ఏం చెప్పారు?

ప్రస్తుతం అరెస్టైంది ఎవరు?

ప్రస్తుతం ఫుల్వారీలో అరెస్టైన ఆతహర్ పర్వేజ్‌ను సిమీ మాజీ కార్యకర్తగా పోలీసులు చెబుతున్నారు. వివిధ కేసుల్లో జైలుకు వెళ్లిన సిమీ సభ్యుల కోసం ఆయన నిధులు సమకూర్చేందుకు ప్రయత్నిస్తున్నాడని వివరిస్తున్నారు.

మరోవైపు సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా యాక్టివిస్టు నూరుద్దీన్ జంగీని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

బిహార్‌లోని దర్భంగ జిల్లాలో ఎస్‌డీపీఐ టికెట్‌పై అసెంబ్లీ ఎన్నికల్లో నూరుద్దీన్ పోటీ చేశారు. అయితే, ఆయనకు చాలా తక్కువ ఓట్లు వచ్చాయి.

వీడియో క్యాప్షన్, ఆమె ఒక్కసారిగా శరీర బరువు పెరగడంతో తండ్రి రెజ్లింగ్‌లో చేర్చారు, కానీ

గత ఏప్రిల్‌లో పీఎఫ్ఐను నిషేధించే యోచనలో కేంద్రం ఉన్నట్లు సుప్రీం కోర్టులోని ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనానికి సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పినట్లు పీటీఐ వార్తా సంస్థ ఒక కథనం ప్రచురించింది.

‘‘ఈ విషయంలో ఎన్ఐఏ నుంచి కేంద్ర హోం శాఖకు ప్రతిపాదన వచ్చింది, అయితే, దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు’’అని ఆ కథనంలో పేర్కొన్నారు.

పీఎఫ్ఐను నిషేధించే అంశంపై ప్రొఫెసర్ కోయ మాట్లాడుతూ.. ‘‘నిషేధం అనేది పూర్తి రాజకీయ నిర్ణయం. అలా నిషేధించడంలో ఎలాంటి అర్థమూ లేదు. గతంలో కమ్యూనిస్టు పార్టీని, ఆరెస్సెస్‌లనూ ఇలానే బ్యాన్ చేశారు. కానీ, తర్వాత ఏమైంది’’అని అన్నారు. పీఎఫ్ఐ వ్యవస్థాపకుల్లో ఆయన కూడా ఒకరు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)