ప్రధాని మోదీ నేపాల్‌లోని గౌతమ బుద్ధ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఎందుకు దిగలేదు?

ఫొటో సోర్స్, ANI
- రచయిత, రాఘవేంద్ర రావ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
బుద్ధ జయంతి సందర్భంగా సోమవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్‌లోని గౌతమ బుద్ధుడి జన్మస్థలమైన లుంబినీలో పర్యటించారు. ఆయన భారతదేశంలోని ఖుషీనగర్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి, నేపాల్‌లోని లుంబినీలో ప్రత్యేకంగా నిర్మించిన హెలిప్యాడ్‌లో దిగారు.
అధికారిక పర్యటన సందర్భంగా మోదీ పవిత్ర మాయాదేవి ఆలయంలో ప్రార్థనలు చేసి బౌద్ధ సంస్కృతి, వారసత్వ కేంద్రం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.
మోదీ లుంబినీ చేరుకోవడానికి కొన్ని గంటల ముందు, నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్‌బా అక్కడికి 20 కిలోమీటర్ల దూరంలోని భైరహ్వాలో గౌతమ్ బుద్ధ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఇది నేపాల్‌లోని రెండో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్.
ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం, ఆ విమానాశ్రయంలో దిగకపోవడం వంటి కారణాలతో చాలా మంది దృష్టి అటువైపు మళ్లడం సహజం.
ఈ విషయమై నేపాల్ రాజధాని కాఠ్‌మాండూ లోని రాజకీయ విశ్లేషకుడు సీకే లాల్‌తో బీబీసీ మాట్లాడింది.
''పొరుగు దేశ ప్రధాని స్వయంగా వస్తున్నా, ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు అయిన ఈ ఎయిర్ పోర్టును ఉపయోగించుకోలేదు. అక్కడికి వచ్చే విమానాల్లో భారత ప్రధాని వచ్చే విమానం ఉంటే అది నేపాల్‌కు గర్వ కారణం అయ్యుండేది'' అని సీకే లాల్ అన్నారు.

చైనా కనెక్షన్
దాదాపు 70 మిలియన్ డాలర్ల (రూ. 540 కోట్లు) వ్యయంతో నిర్మించిన భైరహ్వా అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి దాదాపు ఏడేళ్లు పట్టింది. ఈ విమానాశ్రయం ఇండో-నేపాల్ సరిహద్దు నుండి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ విమానాశ్రయం లుంబినికి అంతర్జాతీయ గేట్‌వే గా భావిస్తున్నారు.
ఈ కొత్త విమానాశ్రయం నుండి అంతర్జాతీయ విమానాల నిర్వహణ కోసం నేపాల్ ప్రభుత్వం 42 దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది. సహజంగానే ఈ కొత్త విమానాశ్రయం ప్రారంభోత్సవం నేపాల్‌కు ఒక కీలకమైన ఘట్టం.
కానీ, ఈ విమానాశ్రయం ప్రారంభోత్సవం రోజున భారత ప్రధాని నరేంద్రమోదీ నేపాల్‌కు వచ్చి అక్కడ దిగకపోవడంపై అనేక వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విమానాశ్రయాన్ని చైనా కంపెనీ నిర్మించింది కాబట్టి, ఇక్కడ దిగకుండా నేపాల్‌కు దౌత్య సందేశం పంపడానికి భారత ప్రధాని ప్రయత్నిస్తున్నారని కొందరు వాదిస్తున్నారు.
భైరహ్వా కొత్త విమానాశ్రయంలో ఎక్కడ చూసినా చైనా ముద్ర కనిపిస్తుంది. మే 15న, బీబీసీ ఈ కొత్త విమానాశ్రయాన్ని పరిశీలించినప్పుడు, దాన్ని నిర్వహణలో ఉన్న కొన్ని వాహనాలకు చైనీస్, ఇంగ్లీషు భాషల్లో నిర్మాణ సంస్థ పేరు ఉన్నట్లు గుర్తించింది.
నేపాల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అధికారుల ప్రకారం, భైరాహ్వా దేశీయ విమానాశ్రయం భారత్ సహాయంతో సుమారు 5 దశాబ్దాల కిందటే నిర్మించారు.
బహుశా ఈ విమానాశ్రయంలో అంతర్జాతీయ టర్మినల్‌ను నిర్మిస్తున్నప్పుడు, నిర్మాణ పనులను చైనా కంపెనీకి అప్పగించడం భారత్‌కు సంతోషం కలిగించే విషయం కాదని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
భైరహ్వా విమానాశ్రయంలో మోదీ దిగకపోవడానికి కారణం ఈ ప్రాజెక్ట్‌లో చైనా ప్రమేయమేనని గత కొన్ని రోజులుగా నేపాల్, ఇండియా మీడియాలో ఊహాగానాలు ఉన్నాయి.
నేపాల్ పౌర విమానయాన అథారిటీ మాజీ అధిపతి ఈ వ్యవహారాన్ని నేపాల్ ''దౌత్య వైఫల్యం''గా పేర్కొన్నట్లు నేపాల్‌కు చెందిన కాఠ్‌మాండూ పోస్ట్ వార్తాపత్రిక వెల్లడించింది.

భద్రతా కారణాలు
ప్రధాని మోదీ కొత్త విమానాశ్రయానికి వెళ్లకుండా ఖుషీ నగర్ నుంచి హెలీకాప్టర్‌లో లుంబినీకి ఎందుకు వెళుతున్నారని ఈ పర్యటనకు ముందు ఇండియన్ మీడియా ప్రతినిధులు భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రాను ప్రశ్నించారు.
''ప్రధానమంత్రి పర్యటన కోసం రవాణా ఏర్పాట్లకు సంబంధించిన ప్రశ్నలకు సంబంధించినంత వరకు, నేను లేదా మరెవరైనా వ్యాఖ్యానించడం సరైనదని నేను అనుకోను. ఇందులో భద్రతతో సహా అనేక అంశాలు ఉన్నాయి'' అని క్వాత్రా అన్నారు.
డిఫెన్స్లో నేపాల్
ఈ మొత్తం పరిణామాన్ని నేపాల్ ప్రభుత్వ అధికారులు ఎలా చూస్తున్నారో తెలుసుకోవాలని బీబీసీ ప్రయత్నించింది. చైనాతో భాగస్వామ్యం వ్యవహారంపై నేపాల్ ఆత్మరక్షణ ధోరణిలో వ్యవహరించింది.
‘‘చైనా కంపెనీ విషయానికొస్తే, ఇక్కడ ప్రతి ఒక్కరికీ వారి వారి సొంత పనులు ఉన్నాయి. మా విమానాశ్రయ పనుల్లో అమెరికా, థాయిలాండ్ కంపెనీలు సహా అనేక దేశాలకు చెందిన కంపెనీలు పాలు పంచుకున్నాయి. చైనా కంపెనీ సివిల్ పనలు చేసింది. టెర్మినల్ బిల్డింగ్‌ను కూడా చైనాయే నిర్మించింది. ఇందులో చైనా పెట్టుబడులు లేవు. ఈ ప్రాజెక్ట్ కోసం మేము ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) నుంచి నిధులు తీసుకున్నాం. మా నిధులను కూడా ఉపయోగించాం'' అని నేపాల్ పౌర విమానయాన శాఖ ప్రతినిధి డీసీఎల్ కర్ణ వెల్లడించారు.
''ఈ ఎయిర్‌పోర్ట్‌ను చైనాతో లింక్ పెట్టడం, ప్రధాని మోదీ కార్యక్రమాన్ని ఎయిర్‌పోర్ట్ ప్రోగ్రామ్‌తో ముడిపెట్టడం సరికాదని నా అభిప్రాయం. అదీ, ఇదీ వేర్వేరు కార్యక్రమాలు '' అని ఆయన అన్నారు.

గగనతల సమస్య
భైరహ్వా విమానాశ్రయం నుండి అంతర్జాతీయ విమానాల నిర్వహణ కోసం నేపాల్ తనవైపు నుండి గగనతలాన్ని తెరవాలని భారతదేశాన్ని అభ్యర్థిస్తోంది. అయితే, భద్రతా కారణాలను చూపుతూ భారత్ ఇంకా అనుమతించలేదు.
ఈ పరిస్థితిలో భైరహ్వా విమానాశ్రయానికి ప్రధాని మోదీ రావడం దౌత్యపరమైన సమస్యను సృష్టించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు.
''ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత భద్రతా సలహాదారుల సలహాలకు విరుద్ధంగా వెళ్లకూడదని అనుకోవచ్చు. విమానాశ్రయంలో దిగడం వల్ల కొంత ఇబ్బంది ఉండవచ్చు'' అని రాజకీయ విశ్లేషకుడు సీకే లాల్ అన్నారు.

''ఈ ఎయిర్‌పోర్టు కోసం తన గగనతలాన్ని తెరవడానికి భారతదేశం ఒప్పుకోలేదు. అలాంటప్పుడు మోదీ ఈ మార్గాన్ని ఉపయోగించినట్లయితే, రెండు దేశాల మధ్య గగనతలం తెరిచినట్లవుతుంది. ఇది వివాదాస్పదం కావచ్చు'' అని సీకే లాల్ అన్నారు.
గత కొన్నేళ్లుగా భారత్, చైనాలు నేపాల్‌లో తమ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో భైరహ్వా విమానాశ్రయానికి సంబంధించిన ఈ తాజా పరిణామం రాబోయే కాలంలో భారత్, నేపాల్ సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తుందన్నది ఆసక్తికరంగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- ‘వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు ఇచ్చేప్పుడు జాగ్రత్త.. ఉత్తర కొరియా వాళ్లు జాబ్‌లు కొట్టేస్తున్నారు’ - ఐటీ సంస్థలకు అమెరికా హెచ్చరిక
- చేతనా రాజ్: ప్లాస్టిక్ సర్జరీ తర్వాత మరణించిన కన్నడ నటి, అసలేం జరిగింది?
- నరేంద్ర మోదీ 75 ఏళ్లకు రిటైర్ అవ్వరా? మూడోసారి కూడా ప్రధాని కావాలనుకుంటున్నారా?
- ఇల్లు కొనడం మంచిదా లేక అద్దెకు ఉండటం మంచిదా.. సొంతిల్లు కొనే ముందు ఇవి తెలుసుకోండి
- సంపూర్ణ చంద్రగ్రహణం: ఎందుకు, ఎలా ఏర్పడుతుంది.. ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













