Breakup: ప్రేమలో విఫలమయ్యారా? ఆ బాధ నుంచి కోలుకోవడం ఎలా

ఫొటో సోర్స్, SOMSARA REILLY
- రచయిత, మేఘ మోహన్
- హోదా, జెండర్ కరస్పాండెంట్
బ్రేకప్ అనే పదాన్ని తరచుగా వింటూ ఉంటాం. బాయ్ ఫ్రెండ్‌తో విడిపోవడం, గర్ల్ ఫ్రెండ్‌తో విడిపోవడం, వివాహ బంధంలోంచి బయటపడినప్పుడు కూడా బ్రేకప్ అనే మాట వినిపిస్తుంది.
ఈ బ్రేకప్ అనే పదం టిక్ టాక్‌లో 2,100 కోట్ల సార్లు ట్యాగ్ అయింది. బ్రేకప్ అయ్యే వారి సంఖ్య ఏ స్థాయిలో ఉందో ఇది చెప్పకనే చెబుతోంది. ఇలాంటి వారంతా బ్రేక్ అప్ గురించి బయట మాట్లాడాలనో, సలహా తీసుకోవాలనో అనుకుంటూ ఉండొచ్చు.
కొన్ని దేశాల్లో ఇలాంటి వారికి సలహా ఇచ్చేందుకు, వారు ఆ బాధలోంచి బయటపడి సాధారణ జీవితాన్ని గడిపేందుకు బ్రేకప్ కోచ్‌లు ఉంటారు.
అరోన్క్ ఒమామే కూడా బ్రేకప్ కోచ్‌గా పని చేస్తున్నారు.
1993లో ఆమె బ్రేకప్ గురించి నేర్చుకున్న పాఠం ఆమె జీవితాన్నే మార్చేసింది. అప్పటికి ఆమె వయసు 35ఏళ్లు. న్యాయవాద వృత్తిలో ఉన్నారు.
ఒకసారి ఆమె లాగోస్‌లోని ఒక కోర్టుకు ఆమె స్నేహితురాలు మేరీతో కలిసి వెళ్లారు. మేరీ తల్లితండ్రులు విడాకులు తీసుకుంటున్నారు. ఆమె న్యాయవాదిగా కాకుండా ఒక స్నేహితురాలిగా మేరీకి మద్దతిచ్చేందుకు ఆమెతో పాటు వెళ్లారు.
మేరీ తల్లి కోర్టులో ఆమెకవతల వైపు కూర్చుని ఉన్న ఆమె భర్త వైపు చూస్తున్నారు. ఆయన దృష్టి తన వైపు పడాలని ఆమె ప్రయత్నిస్తున్నారు.
కోర్టులో జడ్జ్ బ్రేక్ ఇచ్చినప్పుడు మేరీ, ఆమె తల్లి కలిసి తండ్రి ఉన్న వైపు వెళ్లారు. కోర్టు హాలు అంతా నిశ్శబ్దంగా ఉంది. కోర్టులో అందరూ వారి వైపే చూస్తున్నారు.
ఏమి జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.
మేరీ తల్లి, కూతురితో కలిసి ఆయన ముందు మోకాళ్లపై వంగి కూర్చున్నారు. ఇద్దరూ ఆయన ముందు తలలు దించుకుని దయ చేసి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయొద్దని బతిమాలుతున్నారు.
కానీ, ఆయన మాత్రం అందరి ముందు ఆమెపై అరవడం మొదలుపెట్టారు.
ఇదంతా అరోన్క్ తన నోట్స్‌లో రాసుకున్నారు.
1967లో తొమ్మిదేళ్ల అరోన్క్ ప్లే గ్రౌండ్‌లో స్నేహితులతో ఆడుకుంటున్నప్పుడు, స్కూలు హెడ్‌మిస్ట్రెస్ తన వైపు నడుచుకుంటూ వచ్చారు. ఆ సమయంలో ఆమె తన దగ్గరకు రావడం సరైన సంకేతాన్ని ఇవ్వలేదు. ఏదో జరగకూడనిది జరుగుతోందని అనిపించింది.
అరోన్క్ తండ్రి స్కూల్ గేటు దగ్గర ఆమె కోసం ఎదురు చూస్తున్నట్లు ఆమె చెప్పారు. ఆమెను తీసుకుని వెళ్లేందుకు ఆయన వచ్చారు. ఏదో జరిగిందని అర్ధమైంది.
అరోన్క్ కొన్ని రోజుల పాటు అమ్మమ్మ ఇంట్లో ఉండాలని చెప్పారు. ఆమె అమ్మమ్మ ఇల్లు ఊరికి దూరంగా ఉండటంతో అరోన్క్ స్కూలుకు వెళ్లడం సాధ్యం కాదు. అరోన్క్‌కు సెలవులు దొరుకుతాయని ఆమె తండ్రి చెప్పారు.
నేను, మీ అమ్మ వచ్చి చూసి వెళుతూ ఉంటాం. మాట్లాడుకునేందుకు చాలా విషయాలు ఉన్నాయని చెప్పారు. వారిద్దరికీ వ్యక్తిగతంగా కొంత సమయం కావాలి. ఏదో జరుగుతుందని అనిపించింది కానీ, ప్రశ్నలు అడిగే సమయం కాదనిపించింది.
కొన్ని వారాల తర్వాత ఆమె తల్లి తండ్రులిద్దరూ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో ఏవో మాట్లాడుకుంటూ, చర్చించుకుంటూ ఉండేవారు.
ప్రతి రోజూ అరోన్క్ తోబుట్టువులను కూడా మామ్మ ఇంట్లో వదిలిపెట్టి తిరిగి ఇంటికి వెళ్లేవారు. కానీ, ఆ ఇల్లు కూలిపోయే దశలో ఉంది.

ఫొటో సోర్స్, SOMSARA REILLY
అరోన్క్ తోబుట్టువులతో ఆడుకుంటూ మామ్మతో కలిసి వంట గదిలో వంటలో సాయం చేస్తూ ఉండేది. ఒక రెండు వారాల పాటు స్కూలుకు వెళ్లకపోవడం బాగుండేది.
కానీ, ఒక నెల రోజులలో కుటుంబ పరిస్థితి మొత్తం మారిపోయింది.
"అప్పటికి మా కుటుంబం చాలా కలిసికట్టుగా ఉండేది. నేను అమ్మమ్మ, నానమ్మలు, అత్తమామలు, పిన్ని బాబాయిల చేతుల్లో పెరిగాను. నా తల్లితండ్రులకు కుటుంబం నుంచి చాలా సహకారం లభించింది" అని అన్నారు.
వారింటి నుంచి ఆమె తండ్రి బయటకు వెళ్లిపోయారు. అరోన్క్ తోబుట్టువులతో కలిసి తిరిగి ఇంటికి వెళ్లారు.
ఆమె తల్లితండ్రులు విడిపోయినా కూడా ఒకరితో ఒకరు సత్సంబంధాలతో ఉండేవారు. ఒకరి గురించి ఒకరు పిల్లల ముందు చెడుగా మాట్లాడేవారు కాదు. కుటుంబం కూలిపోలేదు. ఇంట్లో ఒక మనిషి తగ్గారు.
"కలిసి ఉండాలనుకున్నా కూడా సంబంధాలు కలకాలం ఉండవని నాకు తెలుసు. తగాదాలు పడుతూ కలిసి ఉండటం కంటే హుందాగా విడిపోవడం వల్ల భవిష్యత్తు బాగుంటుంది" అని అన్నారు.
ఆమె తల్లితండ్రులిద్దరూ ఎందుకు విడిపోయారో ఆమెకిప్పటికీ తెలియదు.
ఈ ఒక్క విషయం తప్ప మిగిలిన బాల్యం అంతా సంతోషకరంగానే గడిచింది. కానీ, ఆమె ప్రేమలో నేర్చుకున్న పాఠం మాత్రం ఆమెను గాయపరిచింది.

ఫొటో సోర్స్, SOMSARA RIELLY
అరోన్క్‌కు 18ఏళ్ళు ఉండగా లా స్కూలులో చేరారు. ఆమె బెస్ట్ ఫ్రెండ్‌తో ప్రేమలో పడ్డారు. వారిద్దరూ దగ్గరయ్యారు.
అరోన్క్ తొలిసారి ప్రేమలో పడ్డారు.
కానీ, ఒక సమస్య ఉండేది. ఆమె ప్రేమికుడు సెక్స్ కావాలని అడిగేవాడు. అది అరోన్క్‌కు ఇష్టం ఉండేది కాదు.
"పెళ్లికి ముందే సెక్స్ లో పాల్గొనడాన్ని నేను ఇష్టపడను" అని ఆమె చెప్పారు.
కానీ, తానెప్పుడూ ప్రేమగా ఉంటూ అన్ని వేళలా కావల్సిన సహాయం చేస్తూ ఉండేవారు. ఒక రోజు ఆ అబ్బాయి ఇంటికి వెళ్లేసరికి ఆ అబ్బాయి వేరే అమ్మాయిని ముద్దు పెట్టుకుంటూ ఇంట్లో కనిపించారు.
"నా గుండె పగిలిపోయింది. తను నా గురించి ఆలోచిస్తూ నా వెంట వస్తాడని అనుకుంటూ ఉండేదానిని" అని అన్నారు.
"కానీ, తను రాలేదు".
కొన్ని రోజుల పాటు నిశ్శబ్దం అలుముకున్న తర్వాత ఆమెకొక ఉత్తరం అందింది.
"ఆయనకొక వజ్రంలాంటి అమ్మాయి దొరికిందని ఇకపై తాను ఆయన జీవితంలో లేనని ఆ ఉత్తరంలో రాశారు".
ప్రేమించిన వ్యక్తి తిరస్కారం అరోన్క్‌ను తీవ్ర వేదనకు గురిచేసింది..
"నాకు చాలా సిగ్గుగా అనిపించింది. నా ముందున్న ప్రపంచం అంతా కూలిపోతున్నట్లు అనిపించింది".
రెండు వారాల పాటు క్లాసులకు వెళ్ళలేకపోయాను. మంచం మీద పడుకుని ఏడుస్తూ ఉండిపోయేదానిని. కాలేజీలో ఆ అబ్బాయిని ఎదురు పడేందుకు భయం వేసేది. దీంతో గదిలోనే ఉండిపోయేవారు.
ఆమె స్నేహితులు వచ్చి చూసి వెళుతూ ఉండేవారు. బయట ప్రపంచంలో ఆమె కోసం మరింత మెరుగైన అవకాశాలు ఎదురు చూస్తున్నాయని చెబుతూ ఉండేవారు.
ఒక రోజు ఏదో మాయ జరిగినట్లుగా ఆమె మూడ్ మారింది. బయటకు వెళ్లాలని అనిపించింది. ఆమెకు లా డిగ్రీ పూర్తి చేయాల్సి ఉంది. పార్టీలకు వెళ్లేందుకు స్నేహితులు ఉన్నారు. ఆమె తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నారు.
ఆ రెండు వారాల ఒంటరితనం ఆమెకు చాలా మేలు చేసింది. తిరిగి ఆ అబ్బాయితో స్నేహితురాలిలా ఉండటం మొదలుపెట్టారు.
"నేను ఏడ్చేందుకు ఆ సమయం తీసుకోవడం మంచిదైంది. నాకది మంచి పాఠం నేర్పింది" అని అన్నారు.

ఫొటో సోర్స్, SOMSARA RIELLY
17 ఏళ్ల తర్వాత.. లాగోస్‌లోని కోర్టు హాలులో కూర్చున్న అరోన్క్... మేరీ తల్లి ఆమె తండ్రి ముందు మోకరిల్లడాన్ని చూశారు.
"ఆయన మాట్లాడిన మాటలను నేను గుర్తు కూడా చేసుకోలేకపోతున్నాను. నా మనసులోంచి వాటిని చెరిపేశాను. కానీ, ఆ మాటలు మాత్రం దారుణంగా ఉన్నాయి" అని అన్నారు.
అంత కంటే ముందు ఆమె కూడా విడాకులు తీసుకున్నారు. కానీ, ఆమె విడిపోవడం నలుగురిలో అవమానమేమీ కాదు.
60 ఏళ్ల మహిళ భర్త ముందు మోకరిల్లి బతిమాలడం, అవతలి వ్యక్తి ఆమెను అవమానించడం ఆమెను ఆలోచింపచేసేలా చేసింది.
"భార్య భర్తకు అణిగిమణిగి ఉండాలనే సంస్కృతిని సమాజం కూడా ప్రోత్సహిస్తుంది. నేనా విషయాన్ని గమనించాను" అని అని అరోన్క్ అన్నారు.

బ్రేకప్ సెర్చ్
* గూగుల్‌లో గత ఐదేళ్లలో ‘గెట్ ఓవర్ బ్రేకప్’ అనే పదాన్ని సెర్చ్ చేయడం ఎక్కువైంది. 2012 నుంచి చూస్తే ఈ సెర్చ్ మూడు రెట్లు పెరిగింది.
* గత పదేళ్లలో ఐర్లాండ్‌లో.. బ్రేకప్ తర్వాత బయట పడటం ఎలా? అనే విషయాన్ని ఎక్కువగా సెర్చ్ చేసినట్లు వివిధ ఆన్‌లైన్ మాధ్యమాల్లో సెర్చ్ టర్మ్స్‌ను అంచనా వేసే కీ వర్డ్ టూల్. ఐఓ తెలిపింది.
* నైజీరియా, సింగపూర్, ఇండియా, కెన్యా, ఆస్ట్రేలియా, యూఎస్, యూకే కూడా ఈ సెర్చ్ చేసిన టాప్ 10 దేశాల్లో ఉన్నాయి.
* టిక్ టాక్‌లో #breakupకు 2,100 కోట్లకు పైగా ట్యాగ్‌లు కనిపించగా #GettingOverBreakupకు 87 లక్షల హ్యాష్‌ట్యాగ్స్ కనిపించాయి.
* బ్రేకప్ కోచింగ్ మార్కెట్ ప్రస్తుతం ఏడాదికి 100 కోట్ల డాలర్ల వ్యాపారం అని ఇంటర్నేషనల్ కోచింగ్ ఫెడరేషన్ తెలిపింది.

అరోన్క్ తన కెరీర్ పై దృష్టి పెట్టడం వల్లే తన పెళ్లి విఫలం అవ్వడానికి కారణమేమోనని అన్న వారి మాటలను గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఈ మాటలను ఆమె పట్టించుకోలేదు. కానీ, ఈ మాటలు ఆమెను బాధ పెట్టాయి.
ఆమె తల్లితండ్రులు విడిపోయినప్పుడు అందరూ ఆమె తల్లినే ప్రశ్నలు అడిగారు. భర్తకు ఆమెపై ఆసక్తి తగ్గిపోయేలా ఏమి చేసిందని ప్రశ్నించారు. సాఫీగా లేని హింసాత్మక వైవాహిక బంధాల్లో కొనసాగమని మహిళలకు సమాజం చెబుతూ ఉంటుంది. కానీ. ఆ బంధాలలోంచి బయటపడి సంతోషకరమైన జీవితం గడిపేందుకు తగిన మార్గం చూపించదు.
మేరీని కోర్టు హాలులో చూసిన తర్వాత బయటకు వస్తూ అరోన్క్ ఒక నిర్ణయం తీసుకున్నారు. బంధాలలోంచి బయటపడాలనుకునేవారికి హుందాగా బయటపడేలా సహాయపడాలని ఆమె నిర్ణయించుకున్నారు.
ఆ తర్వాత ఆమె ఫ్యామిలీ లా, రిలేషన్ షిప్ కోచింగ్ పూర్తి చేశారు. ఆమె స్నేహితులు ఆమెను "సిసి లాయర్" అని పిలుస్తారు.
ఇప్పుడామెను బ్రేకప్ కోచ్ అని పిలుస్తున్నారు.
2022లో ఆమె ఒక పేరున్న న్యాయవాది. 40 ఏళ్ల పాటు న్యాయవాద వృత్తి, 10 ఏళ్లకు పైగా రిలేషన్ షిప్ కోచ్‌గా పని చేసిన ఆమె ప్రతి రోజూ ఫేస్ బుక్ లో రిలేషన్ షిప్ లో సమస్యలను చెబుతూ మహిళల నుంచి వచ్చే సందేశాలతో నిద్ర లేస్తారు.
రిలేషన్ షిప్ కోచ్‌లు బంధంలోంచి విడిపోతున్నప్పుడు కలిగే బాధ నుంచి బయటపడేందుకు తగిన సహాయం చేస్తారు.
"గర్వంగా, బాధలు లేని జీవితం గడిపిన సమయాన్ని తరచి చూసుకునేందుకు వీరు సహాయపడతారు. ఇంకొకరు మిమ్మల్ని ప్రేమించడం మాత్రమే కాకుండా మిమ్మల్ని మీరు ప్రేమించుకునేలా చేస్తారు". అని చెప్పారు.
ఈ పనిని చాలా మంది రహస్యంగా చేస్తున్నారు.
"సోషల్ మీడియాలో నన్ను ఫాలో కానివారి దగ్గర నుంచి మెసేజీలు వస్తూ ఉంటాయి. అంటే, బంధాలను ముగించుకోవడాన్ని సిగ్గుపడే విషయంగా చూస్తున్నారని అర్ధమవుతోంది" అని అన్నారు.
కానీ, హార్ట్ బ్రేక్‌ల నుంచి బయటపడేందుకు ఇస్తున్న కోచింగ్‌కు మార్కెట్ అయితే ఉంది.
అరోన్క్ మూడు సెషన్లకు సుమారు రూ.29,000 వసూలు చేస్తారు. మొదట జీవితాన్ని తిరిగి తమ చేతిలోకి తెచ్చుకునేందుకు సహాయపడతారు. మొదటి రెండు వారాలు చాలా కీలకం. ఆమె దగ్గరకు వచ్చే వారు తమ బాధ చెప్పుకుని పూర్తిగా ఏడవనిస్తారు. సోషల్ మీడియాలో వాళ్ళ మాజీ సహచరులను మ్యూట్ లేదా అన్ ఫాలో చేసేందుకు ప్రోత్సహిస్తారు. అవతలి వాళ్లకు ఫోన్ చేయాలనిపించే ఆలోచనను విరమించుకునేందుకు ఒక ఫ్రెండ్ సహాయం తీసుకోమని చెబుతారు.
"అవతలి వాళ్లకు కాల్ చేయాలనిపించేలా మనసు ట్రిక్ చేస్తూ ఉంటుంది. మనసు మాట వినకండి. అది మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటుంది. మీ ఫోన్‌ను మీ ఫ్రెండ్ చేతిలో పెట్టేయండి" అని అన్నారు.
'ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా చేయండి'
"ఒక బంధం విఫలమవడం గుండెలను పిండేస్తుంది. ఈ బాధను భరించడం చాలా కష్టం. ముఖ్యంగా మొదటిసారి ఇలా జరిగిన వారికి బాధ మరీ ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు మీ స్నేహితులు, కుటుంబంతో కలిసి ఉండటం తప్ప వేరే పనులేవీ చేయకండి.
ఇది చాలా ఉపయోగపడుతుంది. మీ బాధను ఒంటరిగా భరించాల్సిన అవసరం లేదు. కాలమే గాయాలను మాన్చుతుంది. కష్టకాలం ముగుస్తుంది. నెమ్మదిగా మీ గాయాలు మానుతాయి".
హాలీ రాబర్ట్స్, కౌన్సెలర్
"మీ మాజీ సహచరుని గురించి ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు వారి పేరు మార్చి మాట్లాడుతూ ఉండండి. ఇది చాలా అసాధారణమైన చిట్కా".
అరోన్క్ తన క్లయింట్‌లకు దీర్ఘకాల ప్రణాళికలను కూడా సూచిస్తూ ఉంటారు.
"చాలా సార్లు ఈ బంధాల్లో ఆస్తులు, డబ్బు ముడిపడి ఉంటాయి. వీటన్నిటినీ పంచుకోవాల్సి వస్తుంది. ఇవాన్నీ చాలా సంక్లిష్టంగా తయారవుతాయి. ఇలాంటి వాటితో ఎవరైనా సహాయం అవసరం" అని అన్నారు.
మహిళలు తమ ఆర్ధిక వ్యవహారాలు నిర్వహించుకునేందుకు కూడా ఆమె సహాయపడతారు.
అయితే, ఆమె చేస్తున్న పనికి ఆమె విమర్శలు కూడా ఎదుర్కొంటూ ఉంటారని చెప్పారు.
"ఈమె కుటుంబాలను విడగొట్టే పనిలో ఉన్నారు. ఆమెకు విడాకులు అయ్యాయి" లాంటి మాటలు వినాల్సి వస్తుందని చెప్పారు.
కానీ, ఇవన్నీ ఆమె పట్టించుకోరు. ఆమెకొక సహచరుడు ఉన్నారు. ఆమె ఒంటరిగా ఉన్నా కూడా ఈ మాటలను ఆమె పట్టించుకోరు.
"నేను ఎలా ఉన్నా సంతోషంగానే ఉంటాను. అదే కదా ముఖ్యం. సొరంగం చివర వెలుగు కనిపిస్తుంది. భవిష్యత్తులో దృఢమైన బంధాలు ఏర్పర్చుకునేందుకు బంధాలను కోల్పోవడం ఒక మేల్కొలుపులా పనిచేస్తాయి" అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ప్రధాన మంత్రి పదవికి నితీశ్ కుమార్ బరిలో ఉన్నారా? ఆయన సొంత ఊరి ప్రజలు ఏం అంటున్నారు?
- దువ్వూరి సుబ్బమ్మ: స్వాతంత్ర్య పోరాటంలో జైలు పాలయిన తొలి తెలుగు నాయకురాలు
- ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీల నిర్వహణకు కార్పొరేట్ కంపెనీల నుంచి విరాళాలు ఎందుకు కోరుతున్నారు?
- విశాఖపట్నం: “ఇంజినీరింగ్ చదివినా ఉద్యోగం రాలేదు.. పానీపూరీ వ్యాపారంతో సక్సెస్ అయ్యా”
- కార్తికేయ 2 రివ్యూ: శ్రీకృష్ణుడి కాలి కడియం కథను నమ్ముకున్న నిఖిల్ సీక్వెల్ సినిమా హిట్టవుతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














