మహిళలపై నేరాలు మోదీ పాలనలో పెరిగాయా, తగ్గాయా? 5 చార్టుల్లో అసలు నిజాలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ
మహిళల పట్ల 'మెంటాలిటీ మారాల'ని, స్త్రీ వివక్షకు వ్యతిరేకంగా దేశ ప్రజలు పోరాడాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ గత నెలలో భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ప్రసంగంలో పిలుపునిచ్చారు.
''మన ప్రవర్తనలో లోపం ఉంది. కొన్నిసార్లు మనం మహిళలను అవమానిస్తాం. మన ప్రవర్తనలో దీనిని తొలగించుకుంటామని మనం ప్రతిజ్ఞ చేద్దామా. మహిళలను రోజువారీ జీవితంలో అవమానించే ప్రతి అంశాన్నీ వదిలించుకుందామని ప్రతిజ్ఞ చేయండి'' అని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
లింగ సమానత్వం గురించి, మహిళా గౌరవం గురించి మోదీ మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు.
ప్రధానమంత్రిగా 2014లో తన తొలి స్వతంత్ర దినోత్సవ ప్రసంగంలో ఆయన భారతదేశంలో మహిళల మీద అత్యాచారలను ఖండించారు. ''ఈ అత్యాచారాల గురించి మనం విన్నపుడు మన తలలు సిగ్గుతో వంగిపోతాయి'' అని అప్పుడు వ్యాఖ్యానించారు.
అయితే, ఆయన నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ఎనిమిదేళ్ల పాలనలో మహిళల మీద నేరాలు ఏమాత్రం తగ్గటం లేదని గణాంకాలు చూపుతున్నాయి.
పైగా ఈ నేరాలు కోవిడ్ మహమ్మారి వల్ల దేశవ్యాప్తంగా నెలల తరబడి లాక్‌డౌన్లు విధించిన 2020లో తప్ప ఏటేటా పెరుగుతూ వచ్చాయి. ఈ లాక్‌డౌన్లు కూడా గణాంకాల సేకరణ మీద ప్రభావం చూపాయని నిపుణులు అంటారు.
2021 సంవత్సరంలో మహిళల మీద రికార్డు స్థాయిలో అత్యధిక నేరాలు నమోదయ్యాయి. దేశంలో ఆ ఏడాదికి సంబంధించిన నేరాల గణాంకాలను కేంద్ర ప్రభుత్వం గత వారంలో విడుదల చేసింది.
మహిళల మీద నేరాలు ఇలా పెరుగుతూ పోవటం తీవ్ర ఆందోళనకర విషయమని నిపుణులు అంటారు.
జనం మరింత ఎక్కువగా పోలీసుల దగ్గరకు వెళ్లి ఫిర్యాదులు చేస్తుండటం వల్ల నమోదవుతున్న నేరాల సంఖ్య పెరిగిందని అధికార యంత్రాంగం చెప్తోంది.
మహిళల మీద నేరాలకు సంబంధించి మేం గత ఆరేళ్ల నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదికలను అధ్యయనం చేశాం. అందులో మేం గుర్తించిన విషయాలు ఐదు చార్టుల్లో వివరిస్తున్నాం.
పెరుగుతున్న నేరాలు

భారతదేశంలో గత ఏడాది జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకూ పోలీసులు నమోదు చేసిన 60 లక్షల నేరాల్లో.. 4,28,278 కేసులు మహిళలపై నేరాలకు సంబంధించినవి.
మహిళలపై నేరాల కేసుల సంఖ్య 2016లో 3,38,954 గా ఉన్నాయి. అంటే.. ఈ కేసుల సంఖ్య గత ఆరేళ్లలో 26.35 శాతం పెరిగాయి.
2021లో ఈ కేసుల్లో అత్యధికం.. అపహరణ, అత్యాచారం, గృహ హింస, వరకట్న మరణాలు, దాడుల కేసులే.
అలాగే.. 107 మంది మీద యాసిడ్ దాడులు జరిగాయి. 1,580 మందిని అక్రమంగా రవాణా చేశారు. 15 మంది బాలికలను అమ్మేశారు. 2,668 మంది మహిళల సైబర్ నేరాల బాధితులు.
దేశంలో 24 కోట్ల జనాభా గల అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్.. 56,000 కేసులతో మహిళలపై నేరాల్లో మరోసారి అగ్ర స్థానంలో నిలిచింది.
ఆ తర్వాత 40,738 కేసులతో రాజస్థాన్ రెండో స్థానంలో, 39,526 కేసులతో మహారాష్ట్ర మూడో స్థానంలో ఉన్నాయి.
రేప్ రాజధాని

పోలీసులు గత ఏడాది 31,878 రేప్ కేసులు నమోదు చేశారు. ఈ సంఖ్య గత ఏడాది (28,153) కన్నా చాలా పెరిగింది. అయితే.. 2016లో నమోదైన 39,068 రేప్ కేసులతో పోలిస్తే 18 శాతం తగ్గాయి.
ప్రతి ఏటా పదుల వేలల్లో రేప్ కేసులు నమోదవుతుండటంతో.. ''ప్రపంచ రేప్ రాజధాని''గా భారతదేశానికి మారు పేరు వచ్చింది.
అయితే.. చాలా ఇతర దేశాల్లో కూడా ఇదే సంఖ్యలో, ఇంతకన్నా ఎక్కువ సంఖ్యలో అత్యాచారాల కేసులు నమోదవుతున్నా.. భారతదేశానికి ఈ చెడ్డ పేరు రావటానికి కారణం రేప్ బాధితుల పట్ల వ్యవహరించే తీరేనని విమర్శకులు అంటారు.
ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాలో.. అత్యాచార బాధితులను సమాజం కళంకితులుగా పరిగిణిస్తుంది. వివక్ష చూపుతుంది. పోలీసులు, న్యాయ వ్యవస్థ కూడా బాధితులను అవమానించటం తరచుగా జరుగుతుంది.
2002 గుజరాత్ అల్లర్ల సమయంలో సామూహిక అత్యాచారానికి గురవటంతో పాటు.. తన కుటుంబ సభ్యులు 14 మందిని హత్య చేయటం చూసిన ఒక ముస్లిం మహిళ కేసులో.. దోషులందరికీ క్షమాభిక్ష పెట్టి జైలు నుంచి విడుదల చేశారు. వారు విడుదలవటం తనను నిలువునా దహించివేసినంత బాధను కలిగించిందని ఆ మహిళ చెప్పారు.
బిల్కిస్ బానో విషయంలో జరిగిన ఈ అన్యాయం ప్రపంచ వ్యాప్తంగా పతాక శీర్షికలకెక్కింది. మహిళల పట్ల ఇండియా నిర్దయగా వ్యవహరిస్తుందనే అభిప్రాయాన్ని అది బలోపేతం చేసింది.
ఎత్తుకెళ్లిపోతున్నారు

దేశవ్యాప్తంగా గత ఏడాది మహిళల కిడ్నాప్, అపహరణ కేసులు 76,263 నమోదైనట్లు తాజా గణాంకాలు చెప్తున్నాయి. 2016లో ఈ కేసుల సంఖ్య 66,544 గా ఉంది. అంటే ఆరేళ్లలో 14 శాతం పెరిగాయి.
ఈ నేరాల్లో కొన్ని హత్య, బలవంతపు డబ్బు వసూళ్లకు సంబంధించినవి కాగా.. చాలా మంది మహిళలను వేశ్యావృత్తిలో దించటానికి, ఇళ్ల పనుల్లో పెట్టటానికి అపహరించారు.
అయితే.. కిడ్నాపైన మహిళల్లో అత్యధికులను - అంటే 28,222 మందిని 'బలవంతపు పెళ్లిళ్ల కోసం' ఎత్తుకెళ్లారు.
ఈ కేసుల్లో చాలా వరకూ బూటకపు కేసులని, తల్లిదండ్రులు అంగీకరించకపోవటంతో ప్రేమికులతో పారిపోయిన మహిళల మీద వారి కుటుంబాలు పెట్టిన కేసులని నిపుణులు చెప్తున్నారు.
ఇంట్లోనే శత్రువు

ఇంటి లోపల జరిగే హింసకు సంబంధించిన కేసులను ఎక్కువగా చట్టపరమైన పదం 'భర్త, అతడి బంధువుల క్రూరత్వం' కింద నమోదు చేస్తుంటారు. భారతదేశంలో మహిళల మీద హింసాత్మక నేరాల్లో చాలా కాలంగా అత్యధికంగా నమోదవుతున్న కేసు ఇదే.
2021లో పోలీసులకు దేశవ్యాప్తంగా 1,37,956 మంది మహిళల నుంచి గృహ హింస ఫిర్యాదులు అందాయి. అంటే సగటున ప్రతి నాలుగు నిమిషాలకు ఒక గృహ హింస కేసు నమోదైనట్లు. ఈ కేసులు గత ఆరేళ్లలో 27 శాతం పెరిగాయి. 2016లో 1,10,434 మంది మహిళలు గృహ హింస నేరాలపై ఫిర్యాదు చేశారు.
ఇలాంటి హింస భారతదేశానికి పరిమితం కాదని, ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు లింగ వివక్ష హింసను ఎదుర్కొంటున్నారని, భారతదేశంలోనూ అవే తరహా గణాంకాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది.
అయితే.. గృహ హింస విషయంలో పాటించే మౌనం, దానికి లభించే ఆమోదం.. భారత్‌లో కనిపించే తేడా.
ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన ఒక సర్వేలో.. ఒక మహిళ తన అత్తమామల కుటుంబాన్ని అవమానించినా, ఇంట్లో తన పిల్లలను నిర్లక్ష్యం చేసినా, తనకు చెప్పకుండా బయటకు వెళ్లినా, సెక్స్‌కు తిరస్కరించినా, సరిగ్గా వండకపోయినా.. ఒక పురుషుడు తన భార్యను కొట్టటం సరైనదేనని 40 శాతం మందికి పైగా మహిళలు, 38 శాతం మందికి పైగా పురుషులు చెప్పారు.
వరకట్నం వేధింపులు

భారతదేశం.. పెళ్లికూతురు కుటుంబం పెళ్లి కొడుకు కుటుంబానికి డబ్బు, బంగారం, ఇతర ఖరీదైన వస్తువులు ఇచ్చే వరకట్నాలను 1961లోనే నిషేధించింది. కానీ.. శతాబ్దాల నాటి ఆచారం దేశంలో ఇంకా సర్వత్రా కొనసాగుతూనే ఉంది.
గ్రామీణ భారతదేశంలో జరిగే వివాహాల్లో 95 శాతం పెళ్లిళ్లలో వరకట్నం చెల్లించారని ప్రపంచ బ్యాంకు ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనం చెప్తోంది.
తగినంత కట్నం తేలేదని కొత్త పెళ్లికూతుర్లను వేధించటం పరిపాటిగా మారిందని ఉద్యమకారులు చెప్తున్నారు. ఈ కారణంతో ప్రతి ఏటా భర్త, అత్తమామల కుటుంబం చేతుల్లో వేలాది మంది నవవధువులు హత్యకు గురవుతున్నారు.
ఈ క్రమంలో చాలా మంది మహిళలను సజీవంగా తగులబెట్టి.. ఆ హత్యలను 'వంటింట్లో ప్రమాదం'గా మాయ చేస్తుంటారు.
వరకట్న మరణాలను అణచివేయటానికి భారతదేశం 1983లో ఐపీసీ సెక్షన్ 498ఎ ప్రవేశపెట్టి కఠిన చట్టం చేసింది. కానీ ప్రతి ఏటా వేలాది మంది వధువులు హత్యకు గురవుతూనే ఉన్నారు.
భారతదేశంలో గత ఏడాది పోలీసులు 6,795 వరకట్న మరణాలను నమోదు చేశారు. అంటే సగటున ప్రతి 77 నిమిషాలకు ఒక వరకట్న మరణం సంభవిస్తోంది.
2016తో పోలిస్తే ఈ కేసుల సంఖ్య 10.92 శాతం తగ్గింది. ఆ ఏడాది 7,628 వరకట్న మరణాలు సంభవించాయి.
సమాచార విశ్లేషణ, గ్రాఫిక్స్ బీబీసీ షాదాబ్ నజ్మీ
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ఈ గ్రామంలో మగవాళ్లు ఎక్కువగా చనిపోతున్నారు. ఎందుకు? ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోంది?
- సింగిల్ షేమింగ్: ఒంటరిగా జీవించే వ్యక్తులను ఎందుకు జడ్జ్ చేస్తుంటారు? ఒంటరిగా బతికితే తప్పా?
- బెంగళూరు వరదలు: సంపన్నులకు కూడా తప్పని కష్టాలు... ఇళ్లను ముంచెత్తిన వరదనీటితో ఇబ్బందులు
- ఏమిటీ ‘స్మోకింగ్ పనిష్మెంట్’ టెక్నిక్.. ఇలా చేస్తే సిగరెట్లు మానేయవచ్చా
- మీరు డార్క్ చాక్లెట్‌ను ఇష్టంగా తింటారా, అది ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













