'మూత్రాన్ని నోటితో శుభ్రం చేయించేవారు' ... పనిమనిషిని వేధించిన ఆరోపణలతో బీజేపీ నేత సీమా పాత్రా అరెస్ట్

సీమా పాత్రా

ఫొటో సోర్స్, FACEBOOK/SEEMA PATRA

ఫొటో క్యాప్షన్, సీమా పాత్రా
    • రచయిత, ఆనంద్ దత్
    • హోదా, బీబీసీ కోసం

ఇంట్లో పనిమనిషిని చిత్రహింసలకు గురిచేసిన కేసులో బీజేపీ నాయకురాలు సీమా పాత్రాను అరెస్టు చేశారు. బుధవారం రాంచీలోని ఆమె ఇంటి నుంచి పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

అదే రోజు మధ్యాహ్నం సీమా పాత్రాను పోలీసులు రాంచీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆమెను సెప్టెంబర్ 14 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.

ఆ పనిమనిషి సునీత ఖాఖా ఆదివాసీ మహిళ కావడంతో సీమా పాత్రాపై ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేశారు. దానితో పాటు, ఐపీసీ సెక్షన్లు 323 (ఉద్దేశపూర్వకంగా గాయపరచడం), 325 (ఉద్దేశపూర్వకంగా హింసించడం), 346 (ఇంట్లో బంధించి ఉంచడం), 374 (బలవంతంగా పని చేయించడం) కింద కేసులు నమోదు చేశారు.

అయితే, తాను నిర్దోషినని, కావాలని తనను ఈ కేసులో ఇరికించారని, దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని సీమా ఆరోపించారు.

ఈ విషయంలో సీమా పాత్రా భర్త, కొడుకు, కూతురుతో మాట్లాడేందుకు ప్రయత్నించాం. కూతురు మాత్రమే ఫోన్ ఎత్తారు. కానీ, మమ్మల్ని మేం పరిచయం చేసుకోగానే, రాంగ్ నంబర్ అంటూ ఫోన్ పెట్టేశారు.

సీమా పాత్రా భర్త మహేశ్వర్ పాత్రా ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఆగస్టు 22న రాంచీ పోలీసుల బృందం ఆ గిరిజన యువతిని సీమా పాత్రా ఇంటి నుంచి బయటకు తీసుకువచ్చి రక్షించింది.

రాంచీకి చెందిన వివేక్ ఆనంద్ బాస్కే అనే వ్యక్తి ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. ఆయన సీమా పాత్రా కుమారుడు ఆయుష్మాన్ పాత్రా స్నేహితుడు.

సునీత ఖాఖా

ఫొటో సోర్స్, ANAND DUTTA/BBC

ఈ విషయం బయటకు ఎలా వచ్చింది?

ఆయుష్మాన్ తన తల్లి చేసే పనుల గురించి వివేక్‌కు ఫోన్‌లో సమాచారం అందించారు. వివేక్ ప్రస్తుతం ఝార్ఖండ్ ప్రభుత్వంలో సిబ్బంది, పరిపాలనా సంస్కరణలు, అధికార భాష విభాగంలో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.

"గత ఎనిమిదేళ్లుగా సునీత ఖాఖా వేధింపులకు గురవుతున్నారు. ఆమె మరణం అంచున ఉన్నారు. ఇనుప రాడ్‌తో కొట్టడంతో ఆమె దంతాలు విరిగిపోయాయి" అని వివేక్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

వివేక్ ఈ మొత్తం వ్యవహారం గురించి బీబీసీకి వివరించారు.

‘‘సీమా పాత్రా వాళ్ల అబ్బాయి ఆయుష్మాన్ పాత్రా నా స్నేహితుడు. మేమిద్దరం కలిసి ఇంజనీరింగ్‌ చదువుకున్నాం. కొద్ది రోజుల క్రితం తను నాకు ఫోన్‌ చేసి 'మా ఇంట్లో పనిమనిషిగా ఉన్న గిరిజన యువతిని కాపాడు, మా అమ్మ ఆమెను చంపేస్తుంది’ అని చెప్పాడు.

ఆ తరువాత కొద్దిసేపటికి సీమా పాత్రా నుంచి ఫోన్ వచ్చింది. తన కొడుకు ఒక మానసిక రోగంతో బాధపడుతున్నాడని, ఇంట్లో చాలా గొడవ పెడుతున్నాడని, తనను మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలని చెప్పారు.

దాంతో, నేను ఆయుష్మాన్ మాటలు నమ్మలేదు. సీమా పాత్ర చెప్పినట్టు, ఆయుష్మాన్‌ను రాంచీలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీలో అడ్మిట్ చేయడానికి తీసుకెళ్లాను.

అడ్మిట్ చేస్తున్న సమయంలోనే, ఆయుష్మాన్ తన తల్లిపై బిగ్గరగా కేకలు వేశాడు. 'మీదెంత క్రూరమైన మనసు. సునీతను వికలాంగురాలిని చేశారు. ఆమె నడవలేక బట్టల్లోనే మూత్రవిసరజన చేస్తే, మీరు ఆమె నోటితో శుభ్రం చేయించారు' అంటూ అరిచాడు.

అది విని నేను షాక్ అయిపోయాను. తరువాత, సీమా పాత్రా ఇంట్లో పనిచేస్తున్న మిగతా పనివాళ్లతో మాట్లాడాను. వాళ్లు చెప్పిన మాటలు వింటే గుండె బద్దలైపోయింది" అని వివేక్ చెప్పారు.

సునీతకు చాలాసార్లు వేడి పెనంతో వాతలు పెట్టారు. తన పళ్లు ఊడగొట్టారు. చాలా రోజులు ఆమెను ఒక గదిలో బంధించి ఉంచారు. ఆ సమయంలో ఆమె మలమూత్ర విసర్జన బట్టల్లోనే చేసేవారు. అది చూసి సీమా పాత్రా ఆమెపై మరింత అరిచేవారు. సునీత నోటితోనే మూత్రాన్ని శుభ్రం చేయించేవారు.

సునీత గత మూడేళ్లుగా బయట వెలుతురును చూడలేదని మిగతా పనివాళ్లు చెప్పారు. ఈ విషయాలన్నీ వివేక్ ఎఫ్ఐఆర్‌లో జతచేశారు.

"ఇవన్నీ విన్నాక నా స్నేహితుడు చెప్పిన మాటలపై నమ్మకం కలిగింది. వెంటనే ఈ విషయాన్ని రాంచీ జిల్లా మేజిస్ట్రేట్ రాహుల్ సింగ్‌కి తెలియజేశాను. ఆయన ఎస్ఎస్‌పీతో మాట్లాడి ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆగస్టు 22న ఈ బృందం సునీతను రెస్క్యూ చేసింది. ఆ తరువాత ఆమెను వైద్యచికిత్స కోసం రిమ్స్‌లో చేర్పించారు" అని వివేక్ వివరించారు.

సునీత ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని రిమ్స్‌కు చెందిన డాక్టర్ శీతల్ మలువా బీబీసీకి తెలిపారు. ఆమె చాలా నీరసంగా ఉన్నారని, మందులు ఇస్తున్నారని, పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుందని చెప్పారు.

ఏళ్ల తరబడి వేధింపులకు గురికావడం వలన సునీత మానసికంగా కూడా బలహీనంగా ఉన్నారని డాక్టర్ మలువా చెప్పారు. ఆమె మానసికంగా కోలుకోవడానికి టైం పడుతుందని అన్నారు.

ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరచిన వివరాల ప్రకారం, సునీత దిల్లీలో ఉన్న సీమా పాత్రా కుమార్తె వత్సల ఇంట్లో కొంత కాలం పని చేశారు. అక్కడ కూడా ఆమెను ఇలాగే చిత్రహింసలు పెట్టేవారు. వత్సల ప్రస్తుతం రామ్‌గఢ్‌లోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ సెంటర్‌లో పనిచేస్తున్నారు.

అయితే, తల్లీ కూతుళ్ల అఘాయిత్యాలు ఇక్కడితో ఆగలేదు. ఇద్దరూ ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడల్లా సునీతని గదిలో పెట్టి తాళం వేసేవారు. వాళ్లు రెండు రోజులు ఇంటికి రాకపోతే సునీత ఆ గదిలోనే ఆకలితో, దాహంతో అలమటించేవారు.

సునీత పరిస్థితి మరీ విషమించడంతో ఆమెను ఏదో ఒక ఆశ్రమంలో విడిచిపెట్టాలనే ప్లాన్‌లో ఉన్నారు సీమ.

సీమా పాత్రా

ఫొటో సోర్స్, ANAND DUTTA/BBC

ఇంతకీ ఈ సీమా పాత్రా ఎవరు?

సీమా పాత్రాకు సినిమా నటి కావాలని కోరిక. జంషెడ్‌పూర్‌లో నివసిస్తున్న సీనియర్ జర్నలిస్టు రాకేశ్ కుమార్ సీమా పాత్రా గురించి కొన్ని వివరాలు అందించారు.

"అప్పట్లో నేను 'సమకాలీన్ తాప్‌మాన్' అనే పత్రికలో పనిచేసేవాడిని. ఇది పట్నా నుంచి ప్రచురితమయ్యేది. అప్పట్లో సీమా పాత్రాను 'డ్రీమ్ గర్ల్ ఆఫ్ బీహార్' అని పిలిచేవారు" అని రాకేశ్ చెప్పారు.

1998లో ఆ పత్రికలో సీమా పాత్రాపై ఓ కథనం వెలువడింది. 'పింకీ పాత్రా ఎక్కడ?' అనే శీర్షికతో ఆ కథనాన్ని ప్రచురించారు. సీమ ఇంటి పేరు పింకీ. ఆ సమయంలో దాణా కుంభకోణానికి సంబంధించిన వార్తలు జోరుగా నడుస్తున్నాయి.

"ఆర్జేడీ నేత ఆర్కే రాణా, సీమా పాత్రాను ముంబై తీసుకెళ్లి తిప్పినట్టు సీబీఐ విచారణలో వెల్లడైంది. ఆమె కోసం సుమారు రూ. 20 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు. ఈ వార్తల నడుమ, సీమా పాత్రా హఠాత్తుగా మాయమయ్యారు. అప్పుడే మేం 'పింకీ పాత్రా ఎక్కడ?' అనే హెడ్‌లైన్‌తో కథనాన్ని ప్రచురించాం" అని రాకేశ్ చెప్పారు.

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ అలోక్ ప్రకాష్ పుతుల్ సీమా గురించి కొన్ని విషయాలు చెప్పారు.

"ఆ రోజుల్లో నేను పట్నా నుంచి వచ్చే జనశక్తి వార్తాపత్రికలో పని చేసేవాడిని. 1991లో డాల్టెన్‌గంజ్ ఎన్నికలను కవర్ చేయడానికి వెళ్లాను. అక్కడ సీమా పాత్రాపై రంగురంగుల పోస్టర్లు, బ్యానర్లు చూశాం. ఆమె చంద్రశేఖర్ పార్టీ జనతాదళ్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు" అని చెప్పారు.

సీమా పాత్రా కొన్నాళ్లు ఆర్జేడీలో ఉండి, ఆ తరువాత కాంగ్రెస్‌లో చేరారు. అయిదేళ్ల క్రితం బీజేపీలో చేరి, అక్కడి జాతీయ కార్యవర్గంలో మహిళా మోర్చా సభ్యురాలిగా ఉన్నారు.

సీమా పాత్రా

ఫొటో సోర్స్, ANAND DUTTA/BBC

మొదటి నుంచి సీమా పాత్రా ఇలాగే ఉండేవారా?

రాంచీకి చెందిన బాలల హక్కుల కార్యకర్త వైద్యనాథ్ కుమార్ బీబీసీతో మాట్లాడుతూ, "మొదటిసారి బాల కార్మికుడిగా నేను సీమా పాత్రా ఇంటికే వెళ్లాను. ఆ సమయంలో అంటే 1994-95 సంవత్సరంలో ఆమె భర్త రాంచీలోని శ్రీ కృష్ణ లోక్‌సేవా ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో డిప్యూటీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు’’ అని తెలిపారు.

‘‘సీమా పాత్రాకు ఉదయం 11 గంటల తరువాత లేవడం అలవాటు. ఆమె ఎప్పుడు లేస్తారో నాకు తెలిసేది కాదు. లేస్తూనే నన్ను తిడుతూ వంటింట్లోకి వచ్చేవారు. నా జుట్టు పట్టుకుని, 'ఇప్పటివరకూ టీ ఎందుకు పెట్టలేదు' అని తిట్టేవారు.

ఆమె భర్త సాదాసీదా వ్యక్తి. మేధావి. ఆయన మాతో పాటు నేలపై కూర్చొని భోంచేసేవారు. తన భర్త ఇలా చేయడం చూసినప్పుడల్లా ఆమె తిట్టేవారు" అని వైద్యనాథ్ చెప్పారు.

వివేక్ ఆనంద్ బాస్కే కూడా సీమ భర్త సాదాసీదా వ్యక్తి అని చెప్పారు.

‘‘సీమా పాత్రా గురించి నేను పోలీసులకు ఫిర్యాదు చేయగానే ఆమె భర్త, కూతురు మా ఇంటికి వచ్చారు. 'ఆంటీని కాపాడు' అంటూ ఆయన నన్ను వేడుకున్నారు. కానీ, నేను అందుకు అంగీకరించలేదు. వెళుతూ, వెళుతూ 'సునీతను జాగ్రత్తగా చూసుకో ' అని నాతో చెప్పారు" అని వివరించారు.

సీమా పాత్రా

ఫొటో సోర్స్, ANAND DUTTA/BBC

సీమా పాత్రాను సస్పెండ్ చేసిన బీజేపీ

ఈ విషయం వెలుగులోకి రాగానే బీజేపీ సీమా పాత్రాను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఎస్సీ, ఎస్టీలపై అఘాయిత్యాలను తమ పార్టీ సహించదని చెప్పింది.

"ఇది చాలా ఘోరమైన అపరాధం. దీన్ని క్షమించలేం. ఇలాంటి వికృతమైన మనస్తత్వం ఉన్నవారికి బీజేపీలో స్థానం లేదు. పార్టీ తక్షణమే ఆమెను సస్పెండ్ చేసింది. ఒక విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. రిపోర్ట్ వచ్చాక, ఆమెను పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించే అవకాశం ఉంది" అని బీజేపీ అధికార ప్రతినిధి ప్రతుల్ షాదేవ్ చెప్పారు.

సస్పెన్షన్‌కు ముందు సీమా పాత్రా బీజేపీ రాష్ట్రీయ మహిళా పరిషత్ సభ్యురాలిగా ఉన్నారు. అలాగే ఝార్ఖండ్ రాష్ట్రంలో 'బేటీ బచావో బేటీ పఢావో' ప్రచారానికి కన్వీనర్ కూడా.

గిరిజన యువతులపై హింస మొదటిసారి కాదు

ఝార్ఖండ్‌లో చాలా ఏళ్లుగా గిరిజన యువతుల అక్రమ రవాణా జరుగుతోంది.

2014-15 సంవత్సరంలో సాహెబ్‌గంజ్‌కు చెందిన ఒక గిరిజన యువతిని వందన ధీర్ అనే కార్పొరేట్ లైజనింగ్ ఆఫీసర్ ఇంట్లో నుంచి రక్షించారు. వందన ఆ పిల్లని తన పెంపుడు కుక్కతో కరిపించేవారని బాలల హక్కుల కార్యకర్త వైద్యనాథ్ కుమార్ చెప్పారు.

2012లో లాతేహార్‌కు చెందిన మరొక యువతిని దిల్లీ నుంచి రక్షించారని వైద్యనాథ్ తెలిపారు. ఆమెను కూడా రాంచీ నుంచే దిల్లీ తీసుకువెళ్లారని చెప్పారు.

ఆ ఇంట్లో పసిపిల్లను చూసుకోవడానికి ఈ గిరిజన యువతిని పెట్టుకున్నారు. ఒకసారి పొరపాటున పసిబిడ్డ చేతిలోంచి జారిపోయింది. ఆ తరువాత ఆ ఇంటి యజమానులు గిరిజన యువతి చేతిపై అనేకమార్లు కత్తి గాట్లు పెట్టారని వైద్యనాథ్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, ముంబయి: కిడ్నాప్ అయిన పూజ 9 ఏళ్ళ తరువాత ఎలా తిరిగి వచ్చిందంటే...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)