ప్రిజన్ క్యాంప్-120: ఈ జైలులో అసలేం జరిగింది... 50 మంది ఖైదీలు ఎలా కాలి బూడిదయ్యారు?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, ఝన్నా బెజ్పియాచుక్, పాల్ ఆడమ్స్
- హోదా, బీబీసీ న్యూస్
జులై 29 తెల్లవారుజామున రష్యా ఆధీనంలోని యుక్రెయిన్ ప్రాంతంలోనున్న ప్రిజన్ క్యాంప్ 120పై దాడి జరిగింది. దీనిలో 50 మందికిపైగా యుక్రెయిన్ సైనికులు మరణించారు. ఈ దాడి చేసింది నువ్వంటే నువ్వని రష్యా, యుక్రెయిన్ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అయితే, రష్యా చెబుతున్న వాదనలో నిజంలేదని ఫొరెన్సిక్ నిపుణులు బీబీసీతో చెప్పారు.
(నోట్: ఈ వార్తలో కలచివేసే అంశాలు ఉన్నాయి)
ఈ జైలు లోపల దృశ్యాలు షాక్‌కు గురిచేస్తున్నాయి.
ఇనుప మంచాలపై కాలిపోయిన మృతదేహాలు వీడియోల్లో కనిపిస్తున్నాయి. బయట కాంక్రీటు స్లాబుపై మరిన్ని మృతదేహాలు ఉన్నాయి.
యుద్ధ ఖైదీలుగా తీసుకున్న 50 మందికిపైగా యుక్రెయిన్ ఖైదీలు ఈ దాడిలో మరణించారు. మరో 73 మంది గాయపడ్డారు. ఈ దాడిపై యుక్రెయిన్‌తోపాటు విదేశాల్లోనూ నిరసన వ్యక్తం అవుతోంది.
స్వతంత్ర ప్రాంతంగా ప్రకటించుకున్న దోన్యస్క్ పీపుల్స్ రిపబ్లిక్ (డీపీఆర్)లో ఈ దాడి చోటుచేసుకుంది. 2014లో తూర్పు యుక్రెయిన్‌లో ఘర్షణ మొదలైనప్పటి నుంచీ డీపీఆర్‌లోని ఒలెనివ్కా గ్రామం రష్యా ఆధీనంలోనే ఉంది.

ఫొటో సోర్స్, Reuters
ఈ దాడికి సంబంధించిన చిత్రాలు రష్యా వర్గాల నుంచే బయటకు వచ్చాయి. వీటిపై ఆయుధ నిపుణులు, ఫొరెన్సిక్ సైన్స్ నిపుణులతో బీబీసీ మాట్లాడింది. అసలు ప్రిజన్ 120లో ఏం జరిగింది? ఏం జరగలేదు? అనే అంశాలు కనుక్కోనేందుకు ప్రయత్నించింది.
ఈ దాడికి కొన్ని వారాల ముందే ఒలెనివ్కా నుంచి కొంతమంది ఖైదీలు విడుదలయ్యారు. వారితోనూ మేం మాట్లాడాం. దాడికి ముందు అక్కడి పరిస్థితులు ఎలా ఉండేవో కనుక్కున్నాం.
అసలు దాడి ఎలా జరిగిందని బీబీసీ పంపిన మెయిల్‌కు రష్యా రక్షణ శాఖ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.
తీవ్రమైన నేరాలకు పాల్పడే ఖైదీల కోసం 1999లో ఈ జైలును ప్రారంభించారు. దీని అసలు పేరు వోల్నోవ్‌ఖా పీనల్ కాలనీ. దీనిలో వేల మంది ఖైదీలను ఉంచేవారు. సాధారణ పౌరుల దగ్గర నుంచి యుక్రెయిన్ సైనికుల వరకు రష్యా పట్టుకున్న చాలా మందిని ఇక్కడకు తీసుకొచ్చేవారు. డీపీఆర్‌తోపాటు దక్షిణ యుక్రెయిన్‌లో పట్టుకున్న యుక్రేనియన్లను కూడా ఈ జైలుకు తరలించేవారు.
ఇక్కడి ఖైదీల్లో వందల మంది అజోవ్ రెజిమెంట్ ఫైటర్లు కూడా ఉన్నారు. ఈ రెజిమెంట్‌ను 2014లో రష్యాతో పోరాడేందుకు ఏర్పాటుచేశారు. దీనిలో మార్పులు చేసి చాలా మందిని యుక్రెయిన్ నేషనల్ గార్డ్ దళంలోకి తీసుకున్నారు.
దక్షిణ యుక్రెయిన్ నగరం మారియుపూల్ రష్యా చేతుల్లోకి వెళ్లకుండా ఈ రెజిమెంట్ చాలా ప్రయత్నించింది. యుక్రెయిన్‌కు చెందిన శక్తిమంతమైన పోరాటయోధుల జాబితాలో వీరి పేర్లు మొదటి వరుసలో ఉంటాయి.

ఫొటో సోర్స్, Maxar
అజోవ్ ఫైటర్లే లక్ష్యమా?
ఈ జైలులో దహనమైన ఖైదీల జాబితాలో ఎక్కువ మంది అజోవ్ రెజిమెంట్ సైనికులే ఉన్నారని యుక్రేనియన్ అధికారులు చెబుతున్నారు.
అయితే, ఈ దాడిని చేపట్టిందని యుక్రెయిన్ సైన్యమేనని రష్యా సైన్యం ఆరోపిస్తోంది. అమెరికా నుంచి వచ్చిన హిమార్స్ రాకెట్లతో జైలుపై దాడిచేశారని వివరిస్తోంది.
‘‘ఈ దాడికి రాజకీయంగా, నైతికంగా బాధ్యత యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీదే. క్రూరమైన ఆయన చర్యలకు అమెరికా మద్దతు పలుకుతోంది’’అని రష్యా రక్షణ శాఖ లెఫ్టినెంట్ జనరల్ ఐగోర్ కొనాషెంకోవ్ ప్రభుత్వ టీవీ చానెల్‌లో చెప్పారు.
హిమార్స్ రాకెట్ ముక్కలను టీవీలో రష్యా అధికారులు చూపిస్తున్నారు. ఇవి ఘటన స్థలం నుంచి లభించాయని వారు చెబుతున్నారు.
తమ యుద్ధ నేరాలను కప్పిపుచ్చుకునేందుకు తమ సొంత సైన్యంపైనే యుక్రెయిన్ దాడి చేసుకుంటోందని దోన్యస్క్‌కు చెందిన రష్యా అనుకూల నాయకుడు డేనిస్ పుషిలిన్ వెల్లడించారు. ఈ దాడికి జెలియెన్‌స్కీనే ఆదేశాలు ఇచ్చారని ఆయన ఆరోపిస్తున్నారు.
‘‘జైలులో ఖైదీలు చెబుతున్న మాటలే మనకు సాక్ష్యాలు. అయితే, వాటిని తారుమారు చేసేందుకు యుక్రెయిన్ ప్రయత్నిస్తోంది’’అని పుషిలన్ అన్నారు.
దాడి తర్వాత ఒక భవనం పూర్తిగా దెబ్బతిన్నట్లు ఉపగ్రహ చిత్రాల్లో కనిపిస్తోంది.
‘‘ప్రస్తుతం దాడి జరిగిన భవనం ఒక పారిశ్రామిక ప్రాంతంలో ఉంది. మమ్మల్ని సమీపంలోని వేరొక భవనానికి తరలించారు’’అని మాజీ ఖైదీలు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Maxar
నిపుణులు ఏం చెబుతున్నారు?
ప్రస్తుతం కనిపిస్తున్న సాక్ష్యాలను పరిశీలించిన ఆయుధ, ఫొరెన్సిక్ నిపుణులతో బీబీసీ మాట్లాడింది. ఈ జైలుపై యుక్రెయిన్ దాడి చేసిందని రష్యా చెబుతున్న వాదనలో ఎంతవరకు నిజముందని ప్రశ్నించింది.
‘‘రాకెట్ల దాడి వల్ల ఈ భవనం దెబ్బతిన్నట్లు ఎలాంటి ఆధారాలు కనిపించడంలేదు’’అని బ్రిటిష్ సైన్యంలోని ఆయుధాల టెక్నికల్ నిపుణుడిగా పనిచేసిన బాబ్ షెడ్డన్ చెప్పారు.
‘‘చిత్రాల్లో కనిపిస్తున్న విధ్వంసం అంతా ఒకే చోట జరిగినట్లు కనిపిస్తోంది. రాకెట్ల దాడికి గురైన ఆనవాళ్లు ఆ భవనంపై కనిపించడం లేదు. హమార్స్ రాకెట్ల వ్యవస్థతో దాడిచేస్తే విధ్వంసం మరింత తీవ్రంగా ఉంటుంది’’అని ఆయన వివరించారు.
మరోవైపు రష్యా మీడియా విడుదలచేసిన దృశ్యాల్లో మృతదేహాలు కూడా అన్ని ఒకచోటే కనిపిస్తున్నాయని, రాకెట్‌తో దాడి జరిగితే అన్ని చెల్లాచెదురై పోతాయని లండన్ ఇంపీరియల్ కాలేజీలోని మేజర్ ట్రామా డైరెక్టర్ డాక్టర్ షేహన్ హెట్టియరక్చీ చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
ఇక్కడ వేరే విస్ఫోటక పదార్థాలతో పేలుడు జరిపి ఉండొచ్చని కల్లోలిత ప్రాంతాల్లో పనిచేసిన నైపుణ్యమున్న బ్రిటిష్ డాక్టర్ సలెయా అహసన్ తెలిపారు.
‘‘విస్ఫోటక పదార్థాలకు భారీగా చమురును జోడించి ఈ పేలుడు జరిపి ఉండొచ్చు’’అని బ్రిటన్‌లోని డిఫెన్స్ అకాడమీ లెక్చరర్ పేట్ నార్టన్ అన్నారు.
‘‘మరోవైపు ఫోరెన్సిక్ ఆధారాలను కూడా ధ్వంసం చేసే ప్రయత్నాలు జరిగాయి’’అని విస్ఫోటక పదార్థాలపై వార్తలు ప్రచురించే సీఏటీ-యూఎక్స్‌వో వెబ్‌సైట్ పేర్కొంది.
యుక్రెయిన్ నిఘా వ్యవస్థలు రికార్డు చేసినట్లుగా చెబుతున్న ఒక రహస్య ఫోన్ కాల్ వైరల్ అవుతోంది. దాడి జరిగిన కొన్ని గంటలకే యుక్రెయిన్ వీటిని విడుదల చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, దీనిలోని అంశాలను బీబీసీ ధ్రువీకరించడానికి వీలుపడలేదు.
200 మంది అజోవ్ ఫైటర్లను ఒక భవనానికి తరలిస్తున్నారని ఆ ఫోన్ కాల్‌లో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. రష్యాకు చెందిన గ్రాడ్ క్షిపణులతో దాడి చేశారని వీరిలో ఒక వ్యక్తి చెబుతున్నారు. దీనిపై యుక్రెయిన్ అధికారులు స్పందించలేదు.

ఫొటో సోర్స్, Reuters
ఏం జరిగిందో తెలియడం లేదు..
దాడి జరిగిన ప్రాంతానికి ఎవరినీ అనుమతించడం లేదు. దీంతో ఆ రోజు అక్కడ ఏం జరిగిందో స్పష్టంగా తెలియడం లేదు. అయితే, వైరల్ అవుతున్న ఫోటోలను గమనిస్తే, ఖైదీలను లోపల దయనీయ స్థితిలో ఉంచినట్లు తెలుస్తోంది.
‘‘భవనం వెలుపల కనిపిస్తున్న మృతదేహాలను గమనిస్తుంటే, మంటలు చెలరేగకముందే, వారు మరణించినట్లు అనిపిస్తోంది’’అని మెక్‌కెంజీ ఇంటెలిజెన్స్ సర్వీస్‌కు చెందిన నిపుణులు చెబుతున్నారు. ‘‘కొన్ని మృతదేహాలు చూస్తుంటే సదరు ఖైదీలు బాగా సన్నంగా, పోషకాహార లోపంతో బాధపడినట్లు తెలుస్తోంది’’అని అన్నారు.
మరోవైపు ఈ దాడిపై జర్నలిస్టులకు యుక్రెయిన్ అధికారులు వివరాలు వెల్లడించారు. ‘‘ఉపగ్రహ చిత్రాలను గమనిస్తుంటే జైలుకు సమీపంలో భారీగా సమాధులు తవ్వినట్లు కనిపిస్తోంది’’అని వారు చెప్పారు. అయితే, ఆ చిత్రాలను చూసి ఆ విషయాన్ని ధ్రువీకరించడం కాస్త కష్టం.
మాజీ ఖైదీలు ఏం అంటున్నారు?
ప్రిజన్ 120లో గడిపిన ఏడుగురు మాజీ ఖైదీలతోనూ బీబీసీ మాట్లాడింది. వీరిని కొన్ని వారాల ముందే ఇక్కడి నుంచి బయటకు పంపించారు. అయితే, అసలు తమ లాంటి చాలా మందిని ఎందుకు ఒక్కసారిగా విడుదల చేశారో తెలియడంలేదని వారంటున్నారు.
అయితే, ఆ జైలులో ఖైదీలు కిక్కిరిసిపోయి ఉంటారని, పారిశుధ్యం కూడా సరిగా ఉండదని మాజీ ఖైదీలు చెప్పారు. గార్డులు అందరినీ భయపెడుతుంటారని వివరించారు. ‘‘మొదటి కొన్ని వారాల్లో అక్కడి సిబ్బంది మాతో మాట్లాడటానికి పిలుస్తారు. అప్పుడు చాలా కష్టంగా ఉంటుంది’’అని వారు అన్నారు.
‘‘ఖైదీలను కొడుతున్న శబ్దాలు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. అదే సమయంలో అరుపులు బయటకు వినిపడకుండా సంగీతం పెడతారు’’అని మారియుపూల్ నుంచి ప్రజలు బయటపడేందుకు సాయం చేయడంతో జైలులో చిక్కుకున్న కొన్స్‌టంట్యన్ వివరించారు.
‘‘మమ్మల్ని బానిసలుగా చూసేవారు’’
‘‘మీరంతా మా బానిసలు అని ప్రిజన్ హెడ్ మాతో అనేవారు’’అని మారియుపూల్‌లో యుక్రెయిన్ పౌరులకు సాయంచేసినందుకు అరెస్టైన ఇంజినీరు రుస్లాన్ అన్నారు.
ఆహారం చాలా తక్కువగా ఇచ్చేవారని మాజీ ఖైదీలు చెబుతున్నారు. ‘‘సగం గ్లాసు మంచి నీళ్లు, ఒక రొట్టె, కొన్ని స్పూన్ల పప్పు మాత్రం పెట్టేవారు’’అని వారు తెలిపారు. అయితే, అజోవ్ ఫైటర్ల పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని వారు చెప్పారు.
‘‘ఒక అజోవ్ ఫైటర్‌ను కొడుతూ లోపలకు తీసుకొచ్చారు. ఆయన మోకాళ్లపై కూడా ఆయన నిలబడలేకపోయారు’’అని యుక్రెయిన్ పోలీసు అధికారి విక్టర్ చెప్పారు.
‘‘అజోవ్ ఫైటర్లు అందరినీ ఒకే భవనానికి మార్చాలని రష్యా సైనికులు, డీపీఆర్ సిబ్బంది మాట్లాడుకోవడం నేను చాలాసార్లు విన్నాను’’అని ఆయన వివరించారు.
ఇప్పటికి దాడి జరిగి నెల రోజులు గడుస్తోంది. అయితే, రష్యా విడుదలచేసిన మృతుల జాబితాపై తమకు నమ్మకంలేదని బాధితుల కుటుంబ సభ్యులు అంటున్నారు.
మరోవైపు ఘటన జరిగిన ప్రాంతాన్ని ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు పరిశీలించేందుకు వెంటనే అనుమతించాలని యుక్రెయిన్ డిమాండ్ చేస్తోంది.
ఇవి కూడా చదవండి:
- ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న నలుగురు మహిళలు మృతి, అసలేం జరిగింది?
- భారత్ ఉత్పత్తులపై నిషేధాన్ని పాకిస్తాన్ ఎత్తివేయక తప్పదా?
- మిఖాయిల్ గోర్బచెవ్: సోవియెట్ యూనియన్ చివరి అధినేత మృతి
- అమెరికా డ్రోన్లు పాకిస్తాన్ గగనతలం నుంచి అఫ్గానిస్తాన్‌లోకి ప్రవేశిస్తున్నాయా?
- గోర్బచెవ్ కథ ఎలా ముగిసింది, అమెరికాను సవాలు చేసిన అత్యంత శక్తిమంతమైన దేశం ఎలా పతనమైంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













