మగ ఖైదీలపై పురుషులతో అత్యాచారం, అక్కడి జైళ్లలో నేరాలను ఇలానే ఒప్పిస్తారా?

అలెక్సీ మకరోవ్‌
ఫొటో క్యాప్షన్, అలెక్సీ మకరోవ్‌
    • రచయిత, ఓల్గా ప్రొస్విరోవా, ఒలెగ్ బోల్డీరెవ్
    • హోదా, బీబీసీ న్యూస్

హెచ్చరిక: ఈ వార్తలో కలచివేసే చిత్రాలు, లైంగిక వేధింపుల వివరాలు ఉన్నాయి.

రష్యా జైళ్లలో అత్యంత దారుణంగా అత్యాచారాలు, చిత్రహింసలు ఎలా చేస్తుంటారో మాజీ ఖైదీలు బీబీసీతో మాట్లాడారు. గత ఏడాది ఒక ఖైదీ లీక్‌చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. అసలు అప్పుడు ఏం జరిగిందో, తాము న్యాయం కోసం ఎలా పోరాడుతున్నామో బాధితులు బీబీసీకి వెల్లడించారు.

నైరుతి రష్యాలోని సరటోవ్ ఖైదీల ఆసుపత్రికి సంబంధించిన కొన్ని ఘోరమైన లైంగిక వేధింపుల దృశ్యాలు గత ఏడాది ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి. ఇవి మొదట మానవ హక్కుల సంస్థల చేతికి వచ్చాయి. ఆ తర్వాత అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.

2018లో ఈ జైలుకు బదిలీ చేసినప్పుడే దీని గురించి అలెక్సీ మకరోవ్‌కు తెలుసు. ఆరు నెలల జైలు శిక్షలో భాగంగా ఆయనను ఇక్కడకు తీసుకొచ్చారు. అయితే, సరటోవ్‌తోపాటు ఈ ప్రాంతంలోని ఇతర జైళ్లలోని ఖైదీలు తరచూ ఫిర్యాదులు చేస్తుంటారు. వైద్యపరమైన చికిత్సల పేరుతో ఇక్కడకు తీసుకొచ్చి దారుణమైన చిత్రహింసలు పెడుతుంటారని ఆరోపిస్తుంటాయి.

రష్యాలో జైళ్లను స్వతంత్రంగా పర్యవేక్షించే వ్యవస్థ లేదు. మరోవైపు ఖైదీల ఆసుపత్రులు, వారి క్వారంటైన్ నిబంధనలు కూడా ఎవరూ పెద్దగా పట్టించుకోరు.

మకరోవ్‌కు నిజంగానే జబ్బు చేసింది. అంతకుముందే ఆయనకు క్షయ (టీబీ) సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఇక్కడ తనను వదిలిపెడతారని ఆయన భావించారు. అయితే, తనపై రెండుసార్లు దారుణంగా అత్యాచారం చేశారని ఆయన చెప్పారు.

ఈ లైంగిక హింస, వేధింపుల గురించి జైలు అధికారులకు తెలుసని బాధితులు చెబుతున్నారు. నేరాలను బలవంతంగా ఒప్పించేందుకు, బ్లాక్‌మెయిల్ చేసేందుకు, భయపెట్టేందుకు ఇలాంటి భయానకమైన విధానాలను కొందరు ఎంచుకుంటారని బాధితులు, నిపుణులు ఆరోపిస్తున్నారు.

వరుసగా ఈ లైంగిక వేధింపులు, చిత్రహింసల వీడియోలు లీక్ కావడంతో రష్యా ప్రభుత్వం దీనిపై స్పందించాల్సి వచ్చింది. రష్యాలోని 90 శాతం ప్రాంతాల్లో 2015 నుంచి 2019 మధ్య ఖైదీలను చిత్రహింసలు పెట్టారని రష్యా స్వతంత్ర మీడియా ప్రాజెక్ట్ ‘‘ప్రోయెక్ట్’’ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. అయితే, దీనిపై పెద్దగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

సరటోవ్ జైలులో ఖైదీ
ఫొటో క్యాప్షన్, సరటోవ్ జైలులో ఖైదీ

కోర్టులు విడుదల చేసిన వేల పత్రాలను బీబీసీ అధ్యయనం చేసింది. దీంతో ఖైదీల విభాగానికి చెందిన 41 మంది సిబ్బంది తీవ్రమైన వేధింపులకు పాల్పడినట్లు శిక్షలు పడ్డాయని తెలిసింది. అయితే, వీరిలో సగం మంది శిక్షలను రద్దు చేశారు. మకరోవ్‌తోపాటు ఇలా చిత్రహింసలు ఎదుర్కొన్న కొందరు బాధితులతో బీబీసీ మాట్లాడింది.

మొదటిసారి ఫిబ్రవరి 2020లో మకరోవ్‌కు చిత్రహింసలు పెట్టారు. అధికారులపై ఓ కుట్రకు సంబంధించి నేరం ఒప్పుకొనేందుకు నిరాకరించడంతో తనను తీవ్రంగా వేధించారని ఆయన చెప్పారు. ‘‘ముగ్గురు పురుషులు నాపై వరుసగా అత్యాచారాలు చేశారు’’అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

‘‘మొదట పది నిమిషాలపాటు నన్ను బాగా కొట్టారు. ఆ తర్వాత నా బట్టలను విప్పేశారు. ఆ తర్వాత రెండు గంటలపాటు నాపై అత్యాచారాలు జరిగాయి’’అని ఆయన చెప్పారు.

‘‘నేను నీరసంతో పడిపోయినప్పుడు.. చల్లని నీళ్లు ముఖంపై కొట్టేవారు. మళ్లీ టేబుల్‌పైకి తీసుకొచ్చి అత్యాచారం చేసేవారు’’అని ఆయన వివరించారు.

రెండు నెలల తర్వాత మళ్లీ తనపై అత్యాచారం జరిగిందని ఆయన వివరించారు. ‘‘నాపై దాడిచేసిన వారికే నేను 735 పౌండ్లు (రూ.71,405) ఇచ్చేలా బలవంతపెట్టారు. ఈ విషయాన్ని బయటకు చెప్పొద్దని బెదిరిస్తూ మరోసారి అత్యాచారం చేశారు’’అని మకరోవ్ చెప్పారు.

‘‘నాపై జరిగిన చిత్రహింసలను వీడియోలుగా చిత్రీకరించారు. అధికారులు చెప్పిన దానికి అంగీకరించకపోతే, ఈ వీడియోలను అందరికీ చూపిస్తామని బెదిరించేవారు’’అని ఆయన తెలిపారు.

‘‘ఇక్కడ అత్యాచారాలు చేసేవారు కూడా తోటి ఖైదీలే. జైలు అధికారులు చెప్పినట్లు వారు చేసేవారు’’అని ఆయన వెల్లడించారు.

అరుపులు బయటకు వినిపించకుండా ఉండేందుకు మ్యూజిక్ పెద్దగా పెడతారని మకరోవ్ తెలిపారు.

సెర్జీ సవెల్యేవ్
ఫొటో క్యాప్షన్, సెర్జీ సవెల్యేవ్

ఖైదీలంతా కలిసి

సరటోవ్‌లోని ఖైదీల సాయంతో కొన్ని మీడియా సంస్థలు గత ఏడాది జైలులో అకృత్యాల వివరాలను బయటపెట్టాయి. అలా ఫుటేజీని బయటకు తీసుకొచ్చిన వారిలో సెర్జీ సవెల్యేవ్ ఒకరు. పైఅధికారుల ఆమోదంతోనే చిత్రహింసలు పెడతారని ఆయన నమ్ముతున్నారు.

జైలు సెక్యూరిటీ విభాగంలో సెర్జీ పనిచేసేవారు. జైలు అధికారుల బాడీక్యామ్‌ల సాయంతో రికార్డయ్యే దృశ్యాలను ఆయన పర్యవేక్షించేవారు.

‘‘ఖైదీలతో అధికారులు దరిద్రమైన పనులన్నీ చేయిస్తుంటారు. తమ బాడీక్యామ్‌లను కూడా వేసుకొని చిత్రహింసలను రికార్డు చేయమని కొందరు ఖైదీలకు సూచిస్తుంటారు’’అని బీబీసీతో సెర్జీ చెప్పారు.

ఈ ఫుటేజీని సెక్యూరిటీ విభాగానికి చూపించేందుకు సేవ్ చేయాలని తనకు సూచించేవారని ఆయన చెప్పారు. కొన్నిసార్లు సీనియర్లకు చూపించేందుకు హార్డ్‌డ్రైవ్‌లో తీసుకొని వెళ్లేవారని తెలిపారు. అప్పుడే తను కూడా కొన్ని ఫైళ్లను కాపీ చేసినట్లు తెలిపారు.

కొన్ని వీడియోల్లో బేడీలు వేసుకున్న ఖైదీల శరీరంపై బాడీక్యామ్‌లు కనిపిస్తున్నాయి. వీటిని కేవలం జైలు సిబ్బందికి మాత్రమే ఇస్తారు.

వ్లాదిమిర్ నిర్బంధ కేంద్రం
ఫొటో క్యాప్షన్, వ్లాదిమిర్ నిర్బంధ కేంద్రం

‘‘ముఖ్యంగా తీవ్రమైన నేరాల్లో శిక్షలు పడినవారు, సుదీర్ఘ కాలం జైలులో ఉండేవారితో చిత్రహింసలు పెట్టిస్తుంటారు. వారు కూడా తమను అధికారులు మెరుగ్గా చూసుకుంటారని చెప్పినదంతా చేస్తుంటారు’’అని సెర్జీ చెప్పారు. ఇలాంటి ఖైదీలను ‘‘ప్రెస్సోవ్‌స్చికి’’గా పిలుస్తుంటారు.

ఈ వీడియోలను చూస్తుంటే, ఇలాంటి చిత్రహింసలను తరచుగా పెడుతున్నట్లు అర్థమవుతోందని మానవ హక్కుల కార్యకర్త వ్లాదిమిర్ ఓసెచ్కిన్ చెప్పారు. ఆయనకు చెందిన వెబ్‌సైట్ Gulagu.net గత ఏడాది ఈ వీడియోలను పబ్లిష్ చేసింది.

‘‘వారు ఒకరికి ఒకరు సంకేతాలు ఇచ్చుకుంటున్నారు. శబ్దం రాకుండా పనిముగిస్తున్నారు. మాట్లాడకుండానే ఒకరి మనసులో ఉండేది మరొకరికి అర్థమవుతుందంటే వారు చాలా ఏళ్ల నుంచి ఇలా పనిచేస్తున్నారు. ఒక వీడియోలో రెండు కాళ్లను ఎలా చాపి అత్యాచారం చేయాలో సంకేతాలు ఇస్తున్నట్లు కనిపిస్తోంది’’అని ఆయన వివరించారు.

సెర్జీ లీకుల తర్వాత ఆరుగురు సీనియర్ ఖైదీలను అరెస్టు చేశారు. అయితే, తాము ఎలాంటి నేరాలకూ పాల్పడలేదని వారు చెబుతున్నారు. రెండు నెలల తర్వాత సరటోవ్ ఖైదీల ఆసుపత్రి డైరెక్టర్, అతని కింద పనిచేసే వారిని కూడా అరెస్టు చేశారు. వీరు కూడా ఆ వేధింపులతో తమకేమీ సంబంధం లేదని అంటున్నారు.

ఈ ఆరోపణల నడుమ జాతీయ జైలు విభాగం అధిపతిని మారుస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు. చిత్రహింసలను అడ్డుకునేందుకు మార్పులు కూడా తీసుకొస్తామని ఆయన వివరించారు. అయితే, పుతిన్ ఇలా మాట ఇవ్వడం తొలిసారి కాదని మానవ హక్కుల కార్యకర్తలు అంటున్నారు. 2018లో తొలిసారి ఆరోపణలు వచ్చినప్పుడు కూడా ఆయన ఇలాంటి హామీలే ఇచ్చారని, కానీ చర్యలు తీసుకోలేదని చెబుతున్నారు.

ఆంటన్ రొమషోవ్‌
ఫొటో క్యాప్షన్, ఆంటన్ రొమషోవ్‌

‘‘ప్యాంటు విప్పగానే.. నేరం చేశానని ఒప్పుకున్నాను’’

ఖైదీలతో నిజాలు చెప్పించాలనే వంకతో ఇలాంటి దారుణమైన హింసలకు పాల్పడుతుంటారని, బాధితుల తరఫున పోరాడుతున్న న్యాయవాది యూలియా చవనోవా చెప్పారు.

‘‘ఖైదీలతో బలవంతంగా నేరాలు ఒప్పించడమే వారి తొలి ప్రాధాన్యం’’అని ఆయన అన్నారు.

2017లో చిత్రహింసలకు గురైన 22ఏళ్ల ఆంటన్ రొమషోవ్‌కు పరిహారం కోసం ఆమె పోరాడుతున్నారు.

వీడియో క్యాప్షన్, లండన్ చేరేనాటికి పటేల్ దంపతుల చేతిలో కేవలం 12 పౌండ్లున్నాయి.

గంజాయి దొరికిందని రొమషోవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, డ్రగ్స్ వ్యాపారులతో సంబంధాలు ఉన్నాయని ఒప్పుకోవాలంటూ తనపై తీవ్ర వేధింపులకు పాల్పడినట్లు ఆయన చెప్పారు. తను వాటిని ఒప్పుకొనేందుకు నిరాకరించడంతో, పశ్చిమ రష్యాలోని వ్లాదిమిర్‌లో నిర్బంధ కేంద్రానికి తరలించారు.

‘‘నన్ను గది నంబరు 26కు తీసుకెళ్లారు. అది ఎలాంటి గదో నాకు తెలుసు. చాలా రోజుల నుంచి ఆ గది నుంచి నాకు అరుపులు వినిపించేవి’’అని రొమషోవ్ చెప్పారు.

‘‘అక్కడ నా కోసం ఇద్దరు మగవారు ఎదురుచూస్తున్నారు. నేను రాగానే నన్ను నేలపై బలవంతంగా కూలదోశారు. చేతులు, కాళ్లను కట్టేశారు. ఆ రోజంతా నన్ను కొడుతూనే ఉన్నారు. నా ప్యాంటును విప్పిన వెంటనే, మీరు చెప్పింది చేస్తానని ఒప్పుకున్నాను. ఆ తర్వాత నాకు ఐదేళ్ల శిక్ష వేశారు. జైలులో నన్ను చిత్రహింసలు పెట్టారని చెప్పినప్పటికీ కోర్టు పట్టించుకోలేదు’’అని ఆయన వివరించారు.

యూలియా చవనోవా
ఫొటో క్యాప్షన్, యూలియా చవనోవా

‘‘అది అత్యంత దారుణం’’

దేశంలోని జైళ్లలో పాశవిక చిత్రహింసల్లో ఇర్కుట్స్‌క్‌లో చోటుచేసుకున్న ఘటనలు అత్యంత భయానకమైనవిగా మీడియా పేర్కొంది.

ఆంగర్సెక్‌లోని ప్రిజన్ 15లో 2020లో నిరసనలు చోటుచేసుకున్నాయి. దీంతో రియాట్ స్క్వాడ్‌ను అధికారులు పంపించారు. మొదట వందల మంది ఖైదీలను చుట్టుముట్టి రెండు నిర్బంధ కేంద్రాలకు తరలించారు.

అలా నిర్బంధ కేంద్రానికి వెళ్లి చిత్రహింసలను అనుభవించిన వారిలో డేనిస్ పోకుసేవ్ ఒకరు. ఆర్థిక మోసానికి సంబంధించి ఆయన మూడేళ్ల జైలు శిక్షను అనుభవించేవారు.

‘‘నువ్వు ఆ ఆర్థిక నేరం చేశావో లేదో మేం పట్టించుకుంటామని అనుకుంటున్నావా? నువ్వు నిరసనలు జరిగిన ప్రాంతం నుంచి వచ్చావు. ఆ నిరసనలకు మూల్యం చెల్లించుకోకతప్పదు’’అని అధికారులు తనతో చెప్పినట్లు డేనిస్ వివరించారు. ఆ తర్వాత తనను చిత్రహింసలు పెట్టారని తెలిపారు.

డేనిస్ పోకుసేవ్
ఫొటో క్యాప్షన్, డేనిస్ పోకుసేవ్

అసలు ఈ చిత్రహింసలు ఎలా మొదలవుతాయో న్యాయవాది యూలియా చెప్పారు.

‘‘ఎవరిని విచారించాలో మొదట కోర్టులో నిర్ణయిస్తారు. ఆ తర్వాత జైలు అధికారులకు సమాచారం ఇస్తారు. ఆ వ్యక్తి నుంచి నేరం ఒప్పుకున్నట్లుగా నాకు వాంగ్మూలం కావాలని చెబుతారు’’అని ఆమె వివరించారు.

విచారణ చేపట్టేందుకు అనుసరించే మార్గాలు చాలా దారుణంగా ఉంటాయని పోకుసేవ్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, ఆభరణాల తయారీతో సెక్స్ వర్కర్ల కొత్త జీవితం

‘‘మూడు నెలలపాటు నన్ను రోజూ చిత్ర హింసలు పెట్టేవారు. కేవలం వారాంతంలోనే సెలవు ఉంటుంది. జైలు సిబ్బందికి కూడా ఈ చిత్రహింసల్లో ప్రమేయం ఉంటుంది’’అని ఆయన తెలిపారు.

‘‘వారు నవ్వేవారు.. పళ్లు తినేవారు.. అత్యాచారాలు చేసేవారు తమ చేతిలో చాలా వస్తువులను పెట్టుకుంటారు. వాటితోనే అకృత్యాలకు పాల్పడుతూ నవ్వుతుంటారు’’అని ఆయన వివరించారు.

ఈ ఆరోపణలపై స్పందించాలని రష్యా జైలు సేవల విభాగాన్ని బీబీసీ కోరింది. కానీ, ఎలాంటి స్పందనా రాలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)