గుజరాత్: ‘ఆయన చనిపోయాడు.. పిల్లలను ఎలా పోషించాలి?’ - రూ. 20 నాటు సారా 39 మంది ప్రాణాలు తీసింది

కుటుంబ సభ్యులను కోల్పోయి విలపిస్తున్న మహిళలు

ఫొటో సోర్స్, Sachin Pithva

ఫొటో క్యాప్షన్, కుటుంబ సభ్యులను కోల్పోయి విలపిస్తున్న మహిళలు
    • రచయిత, రాక్సీ గాగ్డేకర్ ఛారా
    • హోదా, బీబీసీ గుజరాతీ

ఆ గ్రామంలో మహిళలంతా తీవ్ర విషాదంలో ఉన్నారు. కొందరు భర్తలను పోగొట్టుకుంటే మరికొందరు కొడుకులను కోల్పోయారు. ఎన్నడూ ఆ ఊరి వైపు రాని పోలీస్ వాహనాలు, మీడియా బృందాలు ఇప్పుడు అక్కడే ఉన్నాయి.

గుజరాత్‌లోని రోజిద్ గ్రామంలో నాటు సారా తాగి 11 మంది మృతి చెందారు. మృతులంతా 30 ఏళ్లకు అటుఇటుగా ఉన్నవారే.

నాటు సారా తాగి మృతి చెందిన 11 మంది కోసం గుజరాత్‌లోని రోజిద్ గ్రామంలో ప్రజలు విలపిస్తున్నారు.

మృతదేహాలను ట్రాక్టర్ పై తీసుకుని వెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఇలా తీసుకుని వెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహించడం ఆ గ్రామంలో సాధారణంగా కనిపించే దృశ్యం కాదు.

ఒక వైపు దుఃఖంతో విలపిస్తున్న మహిళలు మరో వైపు చట్ట విరుద్ధంగా జరుగుతున్న నాటు సారా అమ్మకాలను నియంత్రించలేని, స్థానిక పరిపాలనాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బోతాద్‌ ప్రాంతంలోని మిగిలిన గ్రామాల కంటే కూడా రోజిద్‌లో నాటు సారా ప్రభావం తీవ్రంగా ఉంది. అహ్మదాబాద్ జిల్లాలోని రోజిద్ చుట్టుపక్కల గ్రామాల్లో సుమారు 8 మరణాలు నమోదయ్యాయి.

కల్తీసారా బాధితులు

ఫొటో సోర్స్, NANDAN DAVE

ఫొటో క్యాప్షన్, కల్తీసారా బాధితులు

30 ఏళ్ల వాశ్రమ్ వాఘేలా ఒక పారిశుద్ధ్య కార్మికుడు. ఆయన ఆదివారం సాయంత్రం నాటు సారా తాగిన తర్వాత అనారోగ్యం పాలయ్యారు.

ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్ద కొడుకుకు 11 ఏళ్లు. ఆయన రోజుకు రూ. 150 - రూ. 200 సంపాదించేవారని ఆయన భార్య సోనల్ బీబీసీకి చెప్పారు. ఆయన చనిపోయిన తర్వాత పిల్లలను పోషించడం చాలా కష్టంగా మారిందని ఆమె చెప్పారు.

ఈ చిన్న గ్రామంలో రోజు కూలి సంపాదించడం చాలా కష్టమని అన్నారు.

వాఘేలా సోదరి కాము బెహన్ ఈ మొత్తం సంఘటన పట్ల చాలా కోపంగా ఉన్నారు. గ్రామంలో చట్ట వ్యతిరేకంగా జరిగే నాటు సారా అమ్మకాలను అరికట్టలేకపోయినందుకు స్థానిక పోలీసులను నిందిస్తున్నారు. ఆమె సోదరుడు మురికిలో పని చేస్తారని, కాలువలు శుభ్రం చేసేటప్పుడు మత్తు మందు తీసుకోకపోతే పని చేయలేరని చెప్పారు. ఈ పని చేయకపోతే, కుటుంబాన్ని ఎలా పోషిస్తారని ప్రశ్నించారు.

ఆమె వదినకు పని ఇప్పించాలని డిమాండ్ చేశారు. "ఈ నేరానికి ప్రభుత్వమే బాధ్యత వహించి బాధితుల కుటుంబాలు హుందాగా బతికేందుకు తగిన పరిహారం, ఉద్యోగాలు ఇప్పించాలి" అని ఆమె డిమాండ్ చేశారు.

వాశ్రమ్ వాఘేలా ఇంటికి కొన్ని మీటర్ల దూరంలో ఉన్న మరో ఇంట్లో కూడా నాటు సారా తాగి మరణించిన ఘటన చోటు చేసుకుంది. దీపక్ వాఘేలాకు ఒక భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. తమ భవిష్యత్ ఏమిటో అర్ధం కావడం లేదని దీపక్ భార్య మనీషా బీబీసీతో అన్నారు.

"ఆదివారం సాయంత్రం పని నుంచి ఇంటికి వచ్చిన తర్వాత దగ్గర్లో ఉన్న సారా దుకాణంలో రూ. 20 సారా కొనుక్కున్నారు.

రాత్రికి ఒంట్లో బాలేదని చెప్పినా ఆస్పత్రికి తీసుకుని వెళ్లలేకపోయాం. మరుసటి రోజు ఉదయం అందరూ పొలంలో పనికి వెళ్లిపోయాం. ఆ రోజు ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఆయనకు వాంతులు అయి, కంటి చూపు కోల్పోవడంతో, ఆస్పత్రికి తీసుకుని వెళ్లాం. కానీ, ఆస్పత్రికి తీసుకుని వెళ్లిన కొన్ని గంటల్లోనే ఆయన చనిపోయారు" అని మనీషా తన భర్త మరణం గురించి వివరించారు.

అక్కడ నాటు సారా తాగి మరణించిన వారి అందరి ఇళ్ళల్లో ఇదే దృశ్యం కనిపించింది. ఆ ఇళ్ల చుట్టూ అంబులెన్సులు తిరుగుతున్నాయి. ఆస్పత్రి సిబ్బంది పరుగులు పెడుతున్నారు. బర్వాలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులను భావ్ నగర్ సివిల్ హాస్పిటల్ లేదా అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రికి పంపిస్తున్నారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

మద్య నిషేధం ఉన్నా

ఇప్పటి వరకు నాటు సారా తాగి 39 మంది మరణించినట్లు పోలీసులు చెబుతున్నారు. 88 మంది భావ్‌నగర్, అహ్మదాబాద్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటుండగా, అందులో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది.

భావ్‌నగర్‌లోని సర్ టీ హాస్పిటల్‌లో చేరిన వారిలో ఆరుగురు వెంటిలేటర్ పై ఉన్నట్లు భావ్‌నగర్ రేంజ్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ అశోక్ యాదవ్ బీబీసీకి చెప్పారు.

ఈ ఘటనకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో 11 మందికి వ్యతిరేకంగా కేసును నమోదు చేయగా, ఇప్పటి వరకు పోలీసులు 8 మందిని అరెస్టు చేశారు. ఈ సంఘటన తర్వాత మద్య నిషేధం అమలులో ఉన్న గుజరాత్ లో చట్ట వ్యతిరేకంగా మద్యాన్ని అమ్మడం పట్ల గుజరాత్ పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాన్ని మొదలుపెట్టారు.

ఆశిష్ భాటియా

ఫొటో సోర్స్, FACEBOOK/AHMEDABAD POLICE

పోలీసులు ఏమంటున్నారంటే

బోతాద్ పోలీస్ సూపరింటెండెంట్ కరణ్ రాజ్ వాఘేలాతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ, ఆయన స్పందించలేదు.

అహ్మదాబాద్‌లోని గ్రామీణ ప్రాంతంలో నాటు సారా తాగి కనీసం 8 మంది మరణించినట్లు అహ్మదాబాద్ జిల్లా రేంజ్ ఐజీ వి.చంద్ర శేఖర్ చెప్పారు.

అహ్మదాబాద్‌లోని నరోల్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఒక ఫ్యాక్టరీ నుంచి ఈ మరణాలకు కారణమైన మిథనాల్‌ను అక్రమంగా రవాణా చేసినట్లు గుజరాత్ డీజీపీ ఆశిష్ భాటియా విలేఖరుల సమావేశంలో తెలిపారు.

రాష్ట్ర హోమ్ మంత్రిత్వ శాఖ సీనియర్ ఐపీఎస్ అధికారి సుభాష్ త్రివేది, స్టేట్ మానిటరింగ్ సెల్ డీఐజీ నిర్లిప్త్ రాయ్‌తో నియమించిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కేసును విచారణ చేస్తుందని తెలిపారు.

జిగర్ దుంగ్రానీ

‘ఫిర్యాదు చేసినా ఫలితం లేదు’

రోజిద్ గ్రామ సర్పంచ్ జిగర్ దుంగ్రానీతో బీబీసీ మాట్లాడింది. ఇక్కడ జరుగుతున్న అక్రమ మద్య వ్యాపారం గురించి బర్వాలా పోలీస్ స్టేషన్‌లో మార్చిలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

"ఒక 15 ఏళ్ల అబ్బాయి నాటు సారా తాగడం చూసి నేను పోలీసుల దగ్గరకు వెళ్లాను. కానీ, సారాయి తయారీలో మిథనాల్ వాడతారని నాకు తెలియదు. నా దరఖాస్తుపై పోలీసులు స్పందించి ఉండి ఉంటే ఈ సంఘటన జరగకుండా ఆపగలిగేవాళ్ళం". అక్రమ వ్యాపారం చేసేవారి నుంచి లంచాలు తీసుకుని పోలీసులే ఈ వ్యాపారానికి అనుమతులు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు.

"ఈ విషయాన్ని తాలూకా సమావేశాల్లో కూడా లేవనెత్తినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు" అని బోటాడ్ నియోజకవర్గం శాసన సభ్యుడు రాజేష్ గోహిల్ అన్నారు.

బోతాద్ మాజీ ఎంఎల్‌ఏ, బీజేపీ నాయకుడు లాల్జీ మెర్‌తో కూడా బీబీసీ మాట్లాడింది. "ఈ నేరానికి కారకులైన వారిని పట్టుకునేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు. నేను శాసన సభ్యునిగా ఉన్న సమయంలో ఇలాంటి సారా అమ్మే రహస్య డెన్‌లు లేవు. కాంగ్రెస్ శాసన సభ్యుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటివన్నీ మొదలయ్యాయి" అని అన్నారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

విషాదం వెనుక రాజకీయాలు

మృతుల కుటుంబాలను గుజరాత్‌లోని కొంత మంది రాజకీయ నాయకులు పరామర్శించారు. "అక్రమ వ్యాపారం చేస్తున్న వారితో రాష్ట్ర ప్రభుత్వం చేతులు కలిపిందని గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ జగదీశ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు. ఈ అక్రమ వ్యాపారుల నుంచి సేకరించిన డబ్బును బీజేపీ ఎన్నికల ఖర్చులకు వాడుకుంటోందని ఆరోపించారు. ఈ చట్ట వ్యతిరేక డెన్‌లను పోలీసులు, స్థానిక బీజేపీ నాయకుల సహకారంతోనే నిర్వహిస్తున్నారని అన్నారు.

అక్రమ మద్య విక్రయం ద్వారా వచ్చిన డబ్బును ఎలా ఉపయోగిస్తారో అందరికీ తెలిసిన విషయమేనని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

వీడియో క్యాప్షన్, గుజరాత్: ఈ దుకాణానికి తాళం ఉండదు, ఓనరూ ఉండరు... మీకు కావల్సింది తెచ్చుకోవచ్చు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)