సెక్స్ అంటే అరబ్ కుర్రాళ్ళు ఎందుకు భయపడుతున్నారు, వయాగ్రాకు అక్కడ ఎందుకంత డిమాండ్?

Man taking Viagra (file photo)

ఫొటో సోర్స్, Getty Images

సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకునే సంప్రదాయ ఔషధాలను వాడటం అరబ్ ప్రపంచానికి కొత్త కాదు. శృంగార ఉద్దీపనలు కలిగించే ఆహారం, పానీయాలు, మూలికలు తీసుకోవడం పురాతన కాలం నుంచే వస్తోంది.

సాధారణంగా అరబ్ దేశాల్లో కాస్త వయసు ఎక్కువగా ఉన్న మగవారు సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు సంప్రదాయ ఔషధాలు లేదా పిల్స్ తీసుకుంటూ ఉంటారు. కానీ, గత కొంత కాలంగా ఈ ట్రెండ్ మారుతోంది.

రబియా అల్-హబాషీ
ఫొటో క్యాప్షన్, ఈజిప్టులో మూలికలు అమ్ముతుంటారు రబియా అల్-హబాషీ

‘వయాగ్రా’కుయువకుల్లో పెరుగుతున్న డిమాండ్

పశ్చిమ దేశాలు తయారు చేసే వయాగ్రా వంటి సెక్స్ సామర్థ్యాన్ని పెంచే బ్లూ పిల్స్‌ను అరబ్ యువకులు ఎక్కువగా వాడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం సెక్స్‌లో బాగా చేయాలనే ఒత్తిడి వారి మీద ఉండటమేనని పరిశోధనలు చెబుతున్నాయి.

యువకులు సిల్డెనాఫిల్(వయాగ్రా), వర్డెనాఫిల్(లెవిట్రా), టడలాఫిల్(సియాలిస్) వంటి బ్లూ పిల్స్‌ను వాడటం గణనీయంగా పెరుగుతున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి.

ఈజిప్టు రాజధాని కైరోలోని బాల్ అల్-షరియాలో మూలికల దుకాణాన్ని నడుపుతుంటారు రబియా అల్-హబాషీ. సెక్స్ సామర్థ్యాన్ని పెంచే అనేక సంప్రదాయ మూలికలు, ఔషధాలు విక్రయించే వ్యక్తిగా రబియా కైరోలో గుర్తింపు పొందారు. కానీ కొద్ది సంవత్సరాలుగా కస్టమర్ల అభిరుచుల్లో మార్పులు వస్తున్నాయని ఆయన చెబుతున్నారు.

'పశ్చిమ దేశాలు తయారు చేసే బ్లూ పిల్స్‌ను ఎక్కువగా మగవారు కొనుగోలు చేస్తున్నారు.' అని రబియా తెలిపారు.

వీడియో క్యాప్షన్, హిమాలయన్ వయాగ్ర: కిలో రూ.70 లక్షలు మాత్రమే

యెమెన్‌లో 20 ఏళ్లకే వాడుతున్నారు

యెమెన్‌లోనూ సెక్స్ సామర్థ్యం పెంచే డ్రగ్స్ వాడకం పెరుగుతోంది. ప్రధానంగా 20 నుంచి 45 ఏళ్ల వయసు ఉన్న మగవారు వీటిని ఎక్కువగా తీసుకుంటున్నట్లు యెమెన్ వైద్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి.

యెమెన్‌లో 2015లో అంతర్యుద్ధం మొదలైన నాటి నుంచి వయాగ్రా వంటి డ్రగ్స్‌ను మానసిక ఆనందం కోసం యువకులు వాడటం ప్రారంభించారు. పార్టీలలో వయాగ్రా, సియాలిస్ వంటి బ్లూ పిల్స్‌ను యువత వాడుతోంది.

నైలు నది తీరంలో కూర్చొని ఉన్న ముస్లిం జంట

ఫొటో సోర్స్, Getty Images

'సెక్స్ బాగా చేయాలనే ఒత్తిడి'

మిడిల్ ఈస్ట్‌లో సెక్స్ చుట్టూ అలుముకున్న కొన్ని రకాల సామాజిక భావనల వల్ల అక్కడి యువత శృంగార సామర్థ్యాన్ని పెంచే మెడిసిన్‌ను ఆశ్రయిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.

'సెక్స్‌లో బాగా పెర్‌ఫాం చేయాలనే ఒత్తిడి అబ్బాయిల మీద ఎక్కువగా ఉంటుంది. మగవాళ్ల శక్తికి సెక్స్ సామర్థ్యాన్ని ఒక కొలమానంగా చూస్తారు. అందుకే సెక్స్ సామర్థ్యం గురించి అబ్బాయిలు ఎప్పుడూ భయపడుతూ ఉంటారు.' అని సెక్స్ అండ్ ది సిటాడెల్: ఇంటిమేట్ లైఫ్ ఇన్ ఏ చేంజింగ్ అరబ్ వరల్డ్ అనే పుస్తకం రాసిన షెరీన్ ఎల్ ఫెకీ అన్నారు.

అంతేకాదు, నీలి చిత్రాలు చూడటం కూడా అబ్బాయిల్లో సెక్స్ సామర్థ్యంపై సందేహాలు పెంచుతోందని ఆమె అన్నారు. 'నీలి చిత్రాలు చూసి యువకులు అపోహలకు లోనవుతున్నారు. సెక్స్ సామర్థ్యం మీద వారు అంచనాలు పెంచేసుకుంటున్నారు. చివరకు నీలి చిత్రాల్లో చూపించేదే నిజమనే భావనలోకి వచ్చేస్తున్నారు.' అని షెరీన్ తెలిపారు.

వయాగ్రా

ఫొటో సోర్స్, Getty Images

‘మగవారి కంటే ఆడవారికే సెక్స్ కోరికలు ఎక్కువ’

అరబ్ దేశాల్లో శృంగార ఉద్దీపనలు కలిగించే సంపద్రాయ మూలికలు, ఆహారం తీసుకోవడం పురాతన కాలం నుంచే వస్తోంది.

'ప్రొవిజన్స్ ఫర్ ది హియరాఫ్టర్' అనే పుస్తకాల సిరీస్‌ ద్వారా సెక్స్ కోరికలను పెంచే మూలికల గురించి రాశారు, 14వ శతాబ్దానికి చెందిన ఇస్లామిక్ రచయిత ఇబిన్ ఖయిమ్ అల్ జొజియా.

'అరబ్ ప్రాంతంలో మగవారి కంటే ఆడవారికే సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటాయి. ఆడవారికి సెక్స్ సామర్థ్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు. అందువల్ల ఆడవారిని తృప్తి పరిచేందుకు సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని మగవారు భావిస్తారు.' అని షెరీన్ ఎల్ ఫెకీ వివరించారు.

ఒట్టోమన్ సామ్రాజ్యం కాలంలోనూ శృంగార ఉద్దీపనలు కలిగించే మూలికలు వాడారు అనడానికి ఆధారాలున్నాయి. మగవారిలోనూ ఆడవారిలోనూ సెక్స్ కోరికలు పెంచే ఔషధాల గురించి ఒక పుస్తకం రాయాలని రచయిత అహ్మద్ బిన్ సులేమానీని కోరారు క్రీ.శ.1512-1520 మధ్య ఒట్టోమన్ సామ్రాజ్యాని పాలించిన సుల్తాన్ సలీం-1.

అలా 'షేక్స్ రిటర్న్ టు యూత్' అనే పుస్తకాన్ని సులేమానీ రాశారు. సెక్స్ కోరికలు పెంచే దినుసులతో పాటు సెక్స్ వల్ల సంక్రమించే వ్యాధుల నివారణకు మూలికలను పుస్తకంలో ప్రస్తావించారు.

వయాగ్రా

ఫొటో సోర్స్, Getty Images

పిల్స్ వాడటం లేదంటున్న అబ్బాయిలు

పరిశోధనల మాట అలా ఉంచితే బీబీసీతో మాట్లాడిన యువకులు మాత్రం తాము సెక్స్ సామర్థ్యం కోసం లేదా అంగస్తంభన సమస్యల కోసం పిల్స్ వాడటం లేదని అంటున్నారు. కొందరు అలాంటివి ఉన్నట్లుగా కూడా తమకు తెలియదని అన్నారు.

ఈజిప్ట్, బహ్రెయిన్‌లోని కొందరు యువకులతో బీబీసీ మాట్లాడింది. తమ 'సామాజిక కట్టుబాట్లకు విరుద్ధం' అంటూ మరికొందరు ఆ విషయం గురించి మాట్లాడటానికే నిరాకరించారు.

నిజానికి సెక్స్ సామర్థ్యం పెంచుకునే పిల్స్ వాడే దేశాల్లో సౌదీ అరేబియా తొలి స్థానంలో ఉండగా ఈజిప్టు రెండో స్థానంలో ఉన్నట్లు 2012 నాటికి ఒక రిపోర్ట్ చెబుతోంది. ఇలాంటి పిల్స్ కోసం సౌదీ అరేబియా 1.5 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు నాడు పబ్లిష్ చేసిన అల్-రియాద్ అనే సౌదీ న్యూస్ పేపర్ వెల్లడించింది.

'రష్యాతో పోలిస్తే సెక్స్ సామర్థ్యం పెంచే పిల్స్ వాడకం సౌదీ అరేబియాలో 10 రెట్లు ఎక్కువ. సౌదీ అరేబియా జనాభా 3.5 కోట్లుగా. కానీ రష్యా జనాభా సుమారు 14.41 కోట్లు. అంటే సౌదీ అరేబియా కన్నా దాదాపు మూడు రెట్లు ఎక్కువ.' అని ఆ రిపోర్ట్ పేర్కొంది.

2021 గణాంకాల ప్రకారం ఈజిప్టులో ఏడాదికి 127 మిలియన్ డాలర్ల చొప్పున సెక్స్ సామర్థ్యాన్ని పెంచే మందులు అమ్ముడుపోతున్నాయి. మొత్తం ఈజిప్టు ఫార్మా మార్కెట్‌లో వీటి వాటా 2.8శాతం.

ఇటీవల అరబ్ జర్నల్ ఆఫ్ యూరాలజీ ప్రచురించిన పరిశోధన ఫలితాల ప్రకారం 40శాతం సౌదీ అరేబియా యువకులు ఒక్కసారైనా సెక్స్ సామర్థ్యాన్ని పెంచే డ్రగ్స్‌ను తీసుకున్నారు.

వీడియో క్యాప్షన్, ప్రేమలో పడ్డారా, కామంలో కూరుకుపోయారా... ఎలా తెలుస్తుంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)