ఒలేనా జెలెన్‌స్కా: ‘యుద్ధం వల్ల నా కొడుకు సైనికుడు అవుతానంటున్నాడు’ - యుక్రెయిన్ ప్రథమ మహిళ

ఫొటో సోర్స్, Facebook/Oleva Zelenska
తన తొమ్మిదేళ్ల కొడుకు సైనికుడు కావాలనుకుంటున్నాడని, అందుకు కారణం యుక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధమే అంటూ చెప్పుకొచ్చారు ఆ దేశ ప్రథమ మహిళ ఒలేనా జెలెన్‌స్కా.
తనకు కొడుకు కిరిలో ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్‌తోపాటు తుపాకీ కాల్చడం మాత్రమే నేర్చుకోవాలని భావిస్తున్నట్లు ఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒలేనా అన్నారు.
యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ భార్య అయిన ఒలేనా ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు.
రష్యాతో జరుగుతున్న పోరులో తమ గెలుపు కోసం మరిన్ని ఆయుధాలు ఇవ్వాలంటూ ఆమె అమెరికాను అభ్యర్థించారు.

ఫొటో సోర్స్, Facebook/Olena Zelenska
యుక్రెయిన్‌లో సుమారు అయిదు నెలలుగా జరుగుతున్న యుద్ధం తన కొడుకు మీద ఎలాంటి ప్రభావం చూపిందో ఇంటర్వ్యూలో ఆమె వివరించారు.
'యుద్ధం మొదలు కాకముందు మా అబ్బాయి జానపద నృత్యాలను ఇష్టపడే వాడు. పియానో వాయిస్తాడు. ఇంగ్లిష్ కూడా నేర్చుకున్నాడు.
కానీ రష్యా దాడి మొదలైన తరువాత వాడు సైనికుడు కావాలని నిర్ణయించుకున్నాడు. ఇక వాడిని మళ్లీ కళల వైపు మళ్లించడం నా వల్ల కాని పని.
మా అబ్బాయి బాల్యాన్ని తిరిగి వాడికి ఇవ్వాలని అనుకుంటున్నా. అప్పుడే వాడు తన జీవితమంతా సంతోషంగా ఉండగలడు' అని ఒలేనా చెప్పుకొచ్చారు.
ఒలేనాకు 18 ఏళ్ల కూతురు ఒలెక్జాండ్రా కూడా ఉన్నారు. అమెరికా పర్యటనలో యుక్రెయిన్ పిల్లలు, వారి తల్లిదండ్రులు పడుతున్న బాధలను కూడా ఆమె ప్రస్తావించారు.

ఫొటో సోర్స్, Facebook/Olena Zelenska
బుధవారం 15 నిమిషాల పాటు అమెరికా కాంగ్రెస్‌లో మాట్లాడిన ఆమె, యుద్ధంలో చనిపోయిన యుక్రెయిన్ చిన్నారుల ఫొటోలు, వీడియోలను చూపించారు.
'ప్రశాంతంగా నిద్రపోండి... అంటూ ప్రతి తల్లితండ్రి తమ బిడ్డలకు చెప్పే రోజు రావాలని మేం కోరుకుంటున్నాం. ఇకపై వైమానిక దాడులు కానీ మిసైల్ దాడులు కానీ ఉండకూడదు. ఇలా కోరుకోవడం అత్యాశ అవుతుందా?
కానీ దురదృష్టవశాత్తు యుద్ధం ముగియలేదు. ఆ టెర్రర్ కొనసాగుతూనే ఉంది.
నేను ఆయుధాలను అడుగుతున్నా. ఆయుధాలు అడుగుతోంది ఎవరి మీదనో యుద్ధానికి దిగడానికి కాదు. వారి భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి కాదు. మా ఇంటిని రక్షించుకోవడానికి మాత్రమే అడుగుతున్నా' అంటూ ఆమె ప్రసంగించారు.
ఇప్పటి వరకు యుక్రెయిన్‌కు సుమారు 8 బిలియన్ డాలర్ల సాయాన్ని అమెరికా చేసింది.
ఇవి కూడా చదవండి:
- డీఎస్పీని ట్రక్కుతో తొక్కించి హత్య, అసలేం జరిగింది? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- హిందీ గడ్డపై దక్షిణాది మూవీలు బాక్సాఫీసులు బద్దలుకొడుతోంటే.. బాలీవుడ్ సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి?
- ‘‘మా భర్త 11 మందిని పెళ్లి చేసుకున్నాడు.. పక్క పక్క వీధుల్లో ముగ్గురితో కాపురాలు పెట్టాడు’’
- కారంచేడు దాడికి 37 ఏళ్లు: 'చుట్టూ చేరి కర్రలతో కొట్టారు... మమ్మల్ని తగలబెట్టాలని చెత్త అంతా పోగేశారు'
- డిజిటల్ మీడియాపై కొత్త చట్టం...ఇందులో ఏముంది? దీనిపై ఎందుకింత చర్చ జరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













