Putin Health-CIA: వ్లాదిమిర్ పుతిన్‌కు క్యాన్సర్ అన్న వార్తలపై అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ ఏమన్నారంటే..

ఫొటో సోర్స్, EPA
- రచయిత, గోర్డాన్ కొరెరా, జార్జ్ రైట్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం మీద అనేక రకాల ఊహాగానాలు ఇటీవల కాలంలో వినిపిస్తున్నాయి. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని, క్యాన్సర్‌తో బాధపడుతున్నారని ఇలా ఏవేవో వార్తలు వస్తున్నాయి.
1952 అక్టోబరు 7న పుట్టిన పుతిన్, మరి కొద్ది నెలల్లో 70వ పడిలోకి అడుగుపెట్టనున్నారు.
కానీ పుతిన్‌కు ఆరోగ్యం బాగాలేదనే సమాచారం తమ నిఘా వర్గాలకు లేదని అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సీఐఏ సారథి విలియమ్ బర్న్స్ అన్నారు. అందుకు తమకు ఎటువంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. అంతేకాదు 'పుతిన్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఆరోగ్యంగా ఉన్నారు' అంటూ విలియమ్ జోక్ కూడా చేశారు.
మరొక వైపు యుక్రెయిన్‌కు లాంగ్ రేంజ్ వెపన్స్ ఇస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.
తూర్పు యుక్రెయిన్ మాత్రమే తమ లక్ష్యం కాదంటూ అంతకు ముందు రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ అన్నారు. యుక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు లాంగ్ రేంజ్ వంటి ఆయుధాలను అందిస్తున్న నేపథ్యంలో తమ వ్యూహం మారుతోందన్న సంకేతాలను రష్యా ఇస్తోంది.
'రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యం గురించి అనేక వదంతులు, ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ మాకు తెలిసినంత వరకు ఆయన చాలా చాలా బాగా ఉన్నారు' అని కొలరడోలో జరిగిన యాస్పెన్ సెక్యూరిటీ ఫోరంలో మాట్లాడుతూ విలియమ్ బర్న్స్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రష్యాలో అమెరికా రాయబారిగా గతంలో పని చేసిన విలియమ్, సుమారు 20 సంవత్సరాలుగా రష్యా నేతలను దగ్గరగా గమనిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 'అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకోవడాన్ని పుతిన్ బలంగా నమ్ముతారు. భయపెట్టడం, గట్టిగా బదులు చెప్పడం ఆయన నైజం. గత కొద్ది సంవత్సరాలలో ఈ లక్షణాలు పుతిన్‌లో బాగా పెరిగాయి. ఆయన సలహాదారుల సంఖ్య కూడా బాగా తగ్గి పోయింది' అని విలియమ్ అన్నారు.
'రష్యాను తిరిగి బలమైన శక్తిగా మార్చడానికే తాను పుట్టానని పుతిన్ అనుకుంటూ ఉంటారు. రష్యా పొరుగు దేశాలపై ఆధిపత్యం చెలాయించడమే దీనికి మార్గమని ఆయన నమ్ముతున్నాడు. యుక్రెయిన్‌ను గుప్పిట్లో పెట్టుకోకుంటే అది పుతిన్‌కు సాధ్యం కాదు' అని ఆయన వివరించారు.
యుక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా బలగాలను మోహరిస్తున్న సమయంలో గత ఏడాది నవంబరులో మాస్కోకు వెళ్లారు విలియమ్ బర్న్స్. యుక్రెయిన్ మీద దాడికి దిగితే పరిణామాలు ఎలా ఉంటాయో హెచ్చరించడానికి ఆయన అక్కడకు వెళ్లారు.
'యుక్రెయిన్ గురించి తప్పుడు ఊహలు, భ్రమల ఆధారంగా పుతిన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. పుతిన్ యుక్రెయిన్‌ను ఒక దేశంగా చూడరు. ప్రైవేటు సంభాషణల్లో అదొక నిజమైన దేశం కాదని పుతిన్ అనడాన్ని నేను విన్నాను.
నిజమైన దేశాలు తిరిగి పోరడతాయి. ఇప్పుడు యుక్రెయిన్ అదే చేస్తోంది.
యుక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో ఇప్పటి వరకు సుమారు 15 వేల మంది రష్యా సైనికులు చనిపోయి ఉంటారని, 45 వేల మంది గాయపడి ఉంటారని అమెరికా అంచనా వేస్తోంది. ఈ యుద్ధంలో ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్న రష్యా సైన్యం, ప్రస్తుతం దోన్బస్ ప్రాంతం మీద మాత్రమే దృష్టి పెట్టింది' అని విలియమ్ అన్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో యుక్రెయిన్ మీద రష్యా దాడి మొదలైంది. తూర్పు యుక్రెయిన్‌లో గల దోన్బస్ ప్రాంతంలో రష్యా జాతీయుల జాతిహననం జరుగుతోందంటూ దీనికి కారణం చెప్పింది రష్యా.
అయిదు నెలల దాటి పోయింది. యుక్రెయిన్ తూర్పు, దక్షిణ భాగాల్లోని కొన్ని ప్రాంతాలను రష్యా ఆక్రమించుకుంది. కానీ యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌ను పట్టుకోవడంలో విఫలమైంది. అప్పటి నుంచి దోన్బస్ ప్రాంతానికి విముక్తి ప్రసాదించడమే తమ లక్ష్యమని చెప్పుకుంటోంది.
యుక్రెయిన్‌లో కొన్ని ప్రాంతాలను తమ భూభాగంలో కలుపుకునేందుకు రష్యా సిద్ధమవుతోందని అమెరికా ఆరోపిస్తోంది.

ఫొటో సోర్స్, SERGEI ILNITSKY/EPA
అమెరికా లాంగ్ రేంజ్ వెపన్స్ సరఫరా చేయాలని నిర్ణయిస్తే యుక్రెయిన్ విషయంలో తమ వ్యూహాం మారుతుందని ముందే రష్యా విదేశాంగశాఖ మంత్రి సెర్జీ లావ్రోవ్ హెచ్చరించారు. అయినా ఆయుధాలు ఇవ్వాలనే అమెరికా నిర్ణయించింది.
రష్యా బలగాలను అడ్డుకునేందుకు మరొ నాలుగు హిమార్ అడ్వాన్స్‌డ్ రాకెట్ సిస్టమ్స్‌ను యుక్రెయిన్ త్వరలోనే అందుకోనుంది. దీంతో మొత్తం రాకెట్ సిస్టమ్స్ సంఖ్య 16కు చేరతాయి.
మరొకవైపు అమెరికాలో పర్యటిస్తున్న యుక్రెయిన్ తొలి మహిళ, తమకు మరింత ఎయిర్ డిఫెన్స్ సాయం కావాలని విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి:
- పాములు పగబడతాయా, నాగస్వరం విని నాట్యం చేస్తాయా...పాముల గురించి తెలుసుకోవాల్సిన తొమ్మిది విషయాలు
- హిందీ గడ్డపై దక్షిణాది మూవీలు బాక్సాఫీసులు బద్దలుకొడుతోంటే.. బాలీవుడ్ సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి?
- Rishi Sunak: భారత సంతతి వ్యక్తి రిషి సునాక్.. బ్రిటన్‌కు ప్రధాన మంత్రి అవుతారా?
- కారంచేడు దాడికి 37 ఏళ్లు: 'చుట్టూ చేరి కర్రలతో కొట్టారు... మమ్మల్ని తగలబెట్టాలని చెత్త అంతా పోగేశారు'
- డాలరుతో పోలిస్తే రూపాయి ఎందుకు పతనం అవుతోంది? కారణాలు తెలుసుకోండి...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















