Ranil Wickremesinghe: శ్రీలంకను కొత్త అధ్యక్షుడు గాడిలో పెట్టగలరా? లేక ఆయనకు కూడా గొటాబయ పరిస్థితే ఎదురవుతుందా?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, సైమన్ ఫ్రేసర్, రాబర్ట్ ప్లమ్మర్, జార్జ్ రైట్
- హోదా, బీబీసీ న్యూస్
కొన్ని రోజుల్లోనే శ్రీలంక ప్రధాన మంత్రి పదవి నుంచి అధ్యక్షుడి పదవికి రణిల్ విక్రమసింఘే ఎదిగారు. ఈ పదవి కోసం ఆయన ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అయితే, ఆయన ముందు ప్రస్తుతం చాలా సవాళ్లు ఉన్నాయి.
ఆర్థిక సంక్షోభం నడుమ శ్రీలంకలో విధ్వంసకర నిరసనలు చోటుచేసుకోవడంతో ఇదివరకటి అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష దేశాన్ని వదిలి పారిపోయారు.
ప్రస్తుతం శ్రీలంకను అర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడంతోపాటు శాంతి భద్రతలను పునరుద్ధరించాలని విక్రమసింఘే భావిస్తున్నారు.
''మన మధ్య ఏర్పడిన విభేదాలు తొలగిపోయే సమయం వచ్చింది'' అని పార్లమెంటును ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. దేశానికి మంచి చేసేందుకు అందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
అయితే, విక్రమసింఘే నేతృత్వంలో శ్రీలంకలో అన్ని పార్టీలు కలిసి పనిచేస్తాయా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. రాజ్యాంగ బద్ధంగానే ఆయన పదవిలోకి వచ్చినప్పటికీ, అధ్యక్షుడు అయ్యేందుకు ఆయనకేం అర్హతలు ఉన్నాయని ఆయన ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు.

ఫొటో సోర్స్, EPA
విక్రమసింఘే పార్టీలో ఆయన ఒక్కరే ఎంపీ. అయితే, రాజపక్ష కుటుంబానికి చెందిన అధికారిక ఎస్ఎల్‌పీపీ పార్టీ సభ్యులు ఆయనకు మద్దతు పలికారు.
ప్రస్తుతం బెయిల్ అవుట్ ప్యాకేజీ కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)తో శ్రీలంక ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. అయితే, విక్రమసింఘేపై ప్రజల్లోనున్న వ్యతిరేకత వల్ల మరోసారి నిరసనలు పెల్లుబుకుతాయనే ఆందోళన వ్యక్తం అవుతోంది.
తమ నిరసనలు కొనసాగుతాయని ఇప్పటికే ఆందోళనలకు నేతృత్వం వహిస్తున్న కొందరు చెబుతున్నారు. ముఖ్యంగా విక్రమసింఘేకు రాజపక్ష కుటుంబంతో ఉన్న సన్నిహిత సంబంధాలపై వారు ప్రశ్నిస్తున్నారు.
''ఈ పరిస్థితులకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటానని విక్రమసింఘే చెప్పారు. అయితే, ఈ సంక్షోభంలో ప్రధాన పాత్ర రాజపక్ష కుటుంబానిదే. ఈ విషయంలో ఆయనేమీ చేయడం లేదు'' అని ఓ యూనివర్సిటీలో చదువుకుంటున్న అంజలి వాండురాగాల చెప్పారు.
''ఆయన్ను ప్రజలు మళ్లీ నమ్మడం చాలా కష్టమే'' అని అంజలి చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
ఒకప్పుడు శ్రీలంకను పాలించిన యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్‌పీ)కి చెందిన సీనియర్ ఎంపీ విక్రమసింఘే. 1999, 2005 మధ్య రెండుసార్లు ఆయన అధ్యక్ష పదవికి పోటీచేసి ఓటమి పాలయ్యారు.
ఆరుసార్లు విక్రమసింఘే ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, ఒక్కసారి కూడా పూర్తికాలం కొనసాగలేదు. చివరిసారిగా గత మే నెలలో ఆయన ప్రధాన మంత్రిగా ప్రమాణం చేశారు. నిరసనల నడుమ మహింద రాజపక్ష ఈ పదవికి రాజీనామా చేయడంతో రాజపక్ష కుటుంబం రణిల్‌కు ఆ పదవి అప్పగించింది.
గొటాబయ విదేశాలకు పరారీ కావడంతో గత జూలై 13న తాత్కాలిక అధ్యక్షుడిగా విక్రమసింఘే బాధ్యతలు తీసుకున్నారు. అయితే, ప్రమాణం చేస్తూనే దేశ వ్యాప్తంగా అత్యవసర స్థితిని ఆయన ప్రకటించారు. కొలంబోలోని ఆయన కార్యాలయాన్ని చుట్టుముట్టిన వేల మంది నిరసనకారులను అడ్డుకునేందుకు ఆయన కఠినమైన ఆంక్షలు విధించారు.
నిరసనకారులను ఫాసిస్టులుగా విక్రమసింఘే అభివర్ణించారు. అయితే, అధ్యక్ష పదవి నుంచి ఆయన కూడా దిగిపోవాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కొన్నిరోజుల క్రితం విక్రమసింఘే ప్రైవేటు నివాసానికి నిరసనకారులు నిప్పుపెట్టారు. అయితే, ఆ సమయంలో ఆయన ఇంటిలో లేరు.
గత ఏప్రిల్ నుంచి కొలంబోలో విధ్వంసకర నిరసనలు చోటుచేసుకుంటున్నాయి. ఇవి క్రమంగా పెరుగుతూ దేశం మొత్తం వ్యాపించాయి.
నెలల నుంచీ దేశంలో ఆహారం, ఔషధాలు, పెట్రోలు లాంటి నిత్యావసరాలు దొరకడం లేదు. మరోవైపు పవర్ కట్‌లు కూడా ప్రజలను వేధిస్తున్నాయి.
విదేశీ మారకపు నిల్వలు దాదాపుగా అడుగంటిపోయాయి. అంటే విదేశాల నుంచి నిత్యావసరాలు కొనేందుకు సరిపడా నిధులు శ్రీలంక దగ్గర లేవు.
ప్రజల కష్టాలు నానాటికీ తీవ్రం కావడంతో... నిరసనలు కూడా ఉధృతమయ్యయి. ఫలితంగా గొటాబయ రాజపక్ష దేశాన్ని వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది. అయితే, విక్రమసింఘేకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురుకావొచ్చని విశ్లేషణలు వస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
న్యాయవాదిగా పనిచేసిన విక్రమసింఘే కుటుంబంలోనూ చాలా మంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు కనిపిస్తారు.
1977లో తొలిసారి ఆయన పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 1989లో రణసింఘే ప్రేమదాస అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో పార్టీలో ఉన్నత పదవులు విక్రమసింఘేకు దక్కాయి.
1993 నుంచి 1994 మధ్య తొలిసారి ప్రధాన మంత్రి పదవిని విక్రమసింఘే చేపట్టారు. 1997లో జమిని దిస్సనాయకేను ఎల్‌టీటీఈ సాయుధులు హత్య చేయడంతో యూఎన్‌పీ అధ్యక్షుడి పదవి ఆయనకు దక్కింది.
ఎప్పవాలా నగరంలో ఒక బహిరంగ సభను ఉద్దేశించి విక్రమసింఘే ప్రసంగిస్తున్నప్పుడు ఆయన్ను కూడా హత్య చేసేందుకు బాంబు దాడి జరిగింది. అయితే, తృటిలో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు.
అవినీతిపరులైన రాజకీయ నాయకులపై చర్యలు తీసుకునేందుకు డిసిప్లినరీ కమిషన్‌ను తీసుకురావడం ద్వారా తమ పార్టీని ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు.
మరోవైపు భిన్నమైన హెయిర్ కట్‌లతో తన వ్యక్తిగత ఇమేజ్‌ను కూడా మార్చుకునేందుకు విక్రమసింఘే ప్రయత్నించేవారు. మారుమూల గ్రామాల్లోనూ ఆయన తరచూ పర్యటించేవారు.
2019లో దాదాపు 250 మందిని బలి తీసుకున్న ఈస్టర్ బాంబు దాడుల సమయంలో ఆయనే ప్రధాన మంత్రిగా ఉన్నారు.
ఈ దాడులు జరిగే ముప్పుందని నిఘా వర్గాలు హెచ్చరించాయా? అని బీబీసీ ప్రశ్నించినప్పుడు.. అలాంటి సమాచారమేదీ లేదని ఆయన చెప్పారు.
గత ఎన్నికల్లో యూఎన్‌పీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. కేవలం ఒకే ఒక్క ఎంపీ స్థానం పార్టీ గెలుచుకుంది. ఆ పార్టీ నుంచి గెలిచిన ఏకైక సభ్యుడు రణిల్ ఒక్కరే. ప్రస్తుతం అధ్యక్షుడు అయ్యే అర్హత ఆయనకు లేదని అందుకే ప్రత్యర్థులు చెబుతున్నారు.
విక్రమసింఘేపై ప్రజలు ఆగ్రహంతో ఉండటానికి రాజపక్ష కుటుంబంతో ఆయనకున్న దగ్గరి సంబంధాలను ఒక కారణంగా చెప్పుకోవచ్చు. 2015లో రాజపక్ష కుటుంబం అధికారాన్ని కోల్పోయినప్పుడు ఈయన అండగా నిలిచారని చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే, తాత్కాలిక అధ్యక్షుడిగా మొదట విక్రమసింఘేను నియమించినప్పుడు.. శాంతి, భద్రతలను పునరుద్ధరించేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటానని ఆయన చెప్పారు.
నిరసనకారులపై ఉక్కుపాదం మోపాలని సైన్యానికి ఆయన ఆదేశాలు జారీచేయొచ్చని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే సంక్షోభ పరిస్థితులు ఇప్పట్లో చక్కబడే అవకాశం కనిపించడం లేదు.
''పరిస్థితులు మరింత దిగజారే ముప్పుంది'' అని గత మే నెలలో బీబీసీతో ఆయన చెప్పారు.
అయితే, ఇప్పుడు ఏం చర్యలు తీసుకోవాలో తెలియని స్థాయికి పరిస్థితులు దిగజారిపోయాయి. మరోవైపు దేశాన్ని విక్రమసింఘే నడిపించగలరా? అనే దానిపైనా చాలా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- కార్లలో ఎయిర్ బ్యాగ్‌లు పెంచాలని కేంద్రం అంటుంటే మారుతి సుజుకి వద్దంటోంది. ఎందుకు
- హిందీ గడ్డపై దక్షిణాది మూవీలు బాక్సాఫీసులు బద్దలుకొడుతోంటే.. బాలీవుడ్ సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి?
- జెన్నిఫర్ లోపెజ్, బెన్ ఆఫ్లెక్: 2003లో నిశ్చితార్థం చేసుకున్న హాలీవుడ్ జంట.. 19 ఏళ్ల తర్వాత పెళ్లి
- UFO: అంతుచిక్కని ఫ్లయింగ్ సాసర్ల రహస్యం ఏంటి? ఒకప్పుడు అమెరికాను ఊపేసిన ఈ ‘ఏలియన్ స్పేష్ షిప్‌లు’ ఇప్పుడు ఏమయ్యాయి?
- డాలరుతో పోలిస్తే రూపాయి ఎందుకు పతనం అవుతోంది? కారణాలు తెలుసుకోండి...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













