శ్రీలంక: రాజకీయ నాయకత్వం మారింది.. ఆర్థిక వ్యవస్థ గట్టెక్కుతుందా?

వీడియో క్యాప్షన్, గొటబయ రాజీనామాతో ప్రస్తుత శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి పరిష్కారం దొరుకుతుందా?

అర్చన శుక్ల, బీబీసీ న్యూస్, కొలంబొ

రాజపక్ష కుటుంబం పెత్తనం అంతం కావడంతో ప్రజలు చేసుకుంటున్న విజయోత్సవ సంబరాలివి. దేశంలో ఆర్థిక సంక్షోభానికి కారణమని వారి కుటుంబ పాలనే కారణమని మెజార్టీ జనం భావిస్తున్నారు.

అయితే మళ్లీ శ్రీలంక ఆర్థిక వ్యవస్థ ఎప్పటిలా గాడిన పడాలంటే చెయ్యాల్సింది ఇంకా చాలా చాలా ఉంది.

రాజకీయ నాయకత్వం మారినంత మాత్రాన తన జీవితం మారిపోతుందని నదీన్ చతుర భావించడం లేదు. ఇప్పటికే తన రెస్టారెంట్లో సగ భాగాన్ని మూసేసిన ఆయన కరెంటు కోతల కారణంగా సాయంత్రం వేళల్లో లోపల కూర్చునేందుకు సౌకర్యంగా లేకపోవడంతో కుర్చీలు, టేబుళ్లు ఆరు బయట వేయిస్తున్నారు. ఎప్పుడూ బిజీగా ఉండే ఆయన బార్బెక్యూ ఔట్‌లెట్ గడిచిన ఆరు నెలల్లో 90 శాతం వ్యాపారాన్ని కోల్పోయింది.

‘‘ఇప్పుడున్న పరిస్థితుల్లో బతికి బట్టకడతామన్ననమ్మకం నాకు లేదు. అందుకే ఇప్పుడైనా దేశాన్ని విడిచి వెళ్లిపోవాలనుకుంటున్నాను. ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నా. ప్రభుత్వం నుంచి మా వ్యాపారానికి ఎటువంటి సహాయ సహకారాలు లేవు’’ అని ఏక నాయకే రెస్టారెంట్ యజమాని నదిన్ చతుర బీబీసీతో అన్నారు.

శ్రీలంక దేశ వ్యాప్తంగా చాలా వ్యాపారాలు మూత పడ్డాయి. మరి కొన్ని తమ కార్యకలాపాలను కుదించుకున్నాయి. ఈ లైన్లో చాలా షాపులు ఉండేవి. అయితే కరెంటు కోతలు, పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా వాటిని తెరిచే పరిస్థితి లేదు. చిన్న వ్యాపారులైతే తమకు ప్రభుత్వం కచ్చితంగా సాయం చేసి తీరాలని డిమాండ్ చేస్తున్నారు.

అధ్యక్షుడు దేశం విడిచి వెళ్లినా ఇంకా గందరగోళంగా ఉంది. శ్రీలంకలో సరైన నాయకత్వం లేదు. దేశానికిప్పుడు పని చేసే ప్రభుత్వం కావాలి. ఆ ప్రభుత్వం అంతర్జాతీయ సంస్థలు, ద్వైపాక్షిక భాగస్వాములతో సంప్రదింపులు జరిపి వారి నుంచి లభించే సాయంతో చెల్లింపులు జరిపి వ్యాపార లావాదేవీల్ని తిరిగి మొదలు పెట్టాలి.

తమ జీవితాల్ని మెరుగు పరుస్తుందన్న నమ్మకం ప్రస్తుత ప్రభుత్వం సంపాదించాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు.

‘‘ప్రస్తుతం శ్రీలంక ఆర్థిక వ్యవస్థ విశ్వాసాన్ని కోల్పోయింది. తక్షణం రాజకీయ సంస్కరణలు చేపట్టి తిరిగి విశ్వాసం నెలకొనేలా చర్యలు తీసుకోవాలి. తాత్కాలిక ప్రభుత్వం ఆ సందేశాన్ని అంతటా పంపడానికి, నిర్దిష్ట ప్రతిపాదనలను ఉదాహరణకు పన్నులు, వడ్డీ రేట్లు, మారకపు రేటు సర్దుబాటు వంటివి అమలు చేసేందుకు ప్రజల నుండి తగినంత విశ్వాసాన్ని పొందగలదా ? మీరు నిజంగా ఆ విధానాలను అమలు చేయగలరా ? నిజంగా ప్రజలు మీ మాట వినేలా చేయగలరా?’’ అని ఫ్రంటయిర్ రీసెర్చ్ కి చెందిన ఆర్థిక నిపుణులు ఛాయు దంసింఘే అన్నారు.

పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన దేశానికి ఎవరు పూర్తి స్థాయిలో నాయకత్వం వహిస్తారన్న అనిశ్చితి ప్రస్తుతం నెలకొంది. అలాగే వారు ఆర్థిక పరంగా అత్యంత కఠినమైన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది కూడా.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)