జపాన్: అబార్షన్ పిల్ తీసుకోవాలంటే భాగస్వామి అనుమతి తప్పనిసరి

జపాన్‌‌లో అబార్షన్ పిల్ తీసుకోవాలంటే భాగస్వామి అనుమతి తప్పనిసరి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రూపర్ట్ వింగ్‌ఫీల్డ్ హేస్
    • హోదా, బీబీసీ న్యూస్ టోక్యో

అమెరికాలో సుమారు 50 ఏళ్ల క్రితం రో వర్సెస్ వేడ్ కేసులో మహిళలకు అబార్షన్ హక్కును అనుమతిస్తూ వెలువడిన తీర్పును ఇటీవల అక్కడి సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఒక వైపు ఈ నిర్ణయంపై చర్చ జరుగుతుండగా మరో వైపు వైపు జపాన్‌లో గర్భస్రావం కోసం పిల్ వాడకం పట్ల నెమ్మదిగా చర్చ మొదలవుతోంది.

బ్రిటిష్ ఔషధ సంస్థ లైన్ ఫార్మా ఇంటర్నేషనల్ ఉత్పత్తి చేసిన అబార్షన్ పిల్ వాడకానికి ఆమోదం ఇవ్వనున్నట్లు ఈ ఏడాది మేలో ఒక సీనియర్ వైద్య ఆరోగ్య అధికారి పార్లమెంటుకు తెలిపారు.

కానీ, ఈ ఆమోదం లభించిన తర్వాత కూడా గర్భస్రావం చేయించుకోవాలంటే మహిళలు తమ భాగస్వామి/భర్త/ బాయ్ ఫ్రెండ్ అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలి.

అయితే, ఈ నిబంధన పితృస్వామ్యాన్ని సమర్ధించేలా ఉందన్న విమర్శలు వస్తున్నాయి.

ఫ్రాన్స్‌లో 34 ఏళ్ళ క్రితమే వైద్య పర్యవేక్షణలో జరిగే గర్భస్రావాలను చట్టబద్ధం చేశారు. ఈ విధమైన అబార్షన్లను బ్రిటన్ 1991లో, స్వీడన్ 2000లో చట్టబద్ధం చేశాయి.

చాలా యూరోపియన్ దేశాల్లో పిల్ వేసుకుని గర్భస్రావం చేయించుకునే విధానాన్ని ఎప్పటి నుంచో అవలంబిస్తున్నారు. స్వీడన్‌లో 90 శాతం, స్కాట్‌లాండ్‌‌లో 70 శాతం అబార్షన్లు పిల్ సహాయంతోనే జరుగుతున్నాయి.

కానీ, లింగ సమానత్వం విషయంలో మెరుగైన రికార్డు లేని జపాన్ మాత్రం మహిళల పునరుత్పత్తికి సంబంధించిన ఔషధాలకు ఆమోదం ఇవ్వడంలో నెమ్మదిగానే వ్యవహరిస్తోంది.

గర్భ నిరోధక పిల్‌ వాడకానికి ఆమోదం ఇచ్చేందుకు ఈ దేశంలో 30 ఏళ్లు పడితే, పురుషుల లైంగిక సామర్ధ్యాన్ని పెంచే వయాగ్రాకు ఆమోదం ఇచ్చేందుకు మాత్రం ఆరు నెలలే పట్టిందని జపాన్‌లో చలోక్తులు విసురుతూ ఉంటారు.

ఈ రెండూ 1999 నుంచే అందుబాటులో ఉన్నప్పటికీ, ముందుగా వయాగ్రా అందుబాటులోకి వచ్చింది.

గర్భనిరోధక మాత్రలు మాత్రం కొన్ని నిబంధనలతో, ఎక్కువ ఖర్చుతో అందుబాటులోకి వచ్చాయి. దీంతో, దీని వాడకం కష్టతరంగా మారింది.

ఈ పరిస్థితికి జపాన్‌ చట్టాలు కొంత వరకు కారణం.

ప్రపంచంలో తొలిసారిగా గర్భస్రావ చట్టాలను అమలు చేసిన దేశాల్లో జపాన్ కూడా ఒకటి. జపాన్ 1948లోనే గర్భస్రావ చట్టాన్ని అమలులోకి తెచ్చింది.

కానీ, ఇది యూజెనిక్స్ సంరక్షణ చట్టంలో భాగంగా ఉంది. జనాభాను జన్యుపరంగా మెరుగైన జాతిగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధమైన పునరుత్పత్తి విధానాలను అవలంబించడాన్ని యూజెనిక్స్ అని అంటారు.

ఈ చట్టాన్ని మహిళలకు పునరుత్పత్తి హక్కులను ఇచ్చేందుకు బదులు అనారోగ్యకరమైన జననాలను నియంత్రించేందుకు రూపొందించారు.

ఈ చట్టంలోని ఆర్టికల్ 1 ... "అనారోగ్యవంతమైన జననాలను నిరోధించి తల్లీబిడ్డల జీవితాన్ని, ఆరోగ్యాన్ని కాపాడటమే" ఉద్దేశం అని పేర్కొంది.

ఈ చట్టాన్ని 1996లో సవరించి మెటర్నల్ హెల్త్ ప్రొటెక్షన్ చట్టంగా పేరు మార్చారు.

కానీ, పాత చట్టంలోని ప్రకరణాల్లో మాత్రం పెద్దగా మార్పులు చేయలేదు. దీంతో, నేటికీ మహిళలు గర్భస్రావం చేయించుకోవాలంటే భాగస్వామి నుంచి కానీ భర్త నుంచి కానీ.. లేదంటే బాయ్ ఫ్రెండ్ నుంచి కానీ రాతపూర్వకంగా అనుమతి తీసుకోవాలి.

అమెరికాలో రో వెర్సస్ వేడ్ తీర్పు కొట్టివేతకు వ్యతిరేకంగా నిరసనలు

ఫొటో సోర్స్, EPA

ఓటా మినామీ విషయంలో ఇదే జరిగింది..

ఆమె బాయ్ ఫ్రెండ్ వల్ల గర్భం దాల్చారు. అయితే, అబార్షన్ చేయించుకునేందుకు ఆమెకు అనుమతి ఇవ్వడానికి మాత్రం ఆయన నిరాకరించారు.

"గర్భ నిరోధక సాధనాలను వాడమని ఆయనకు నేను చెప్పాలి. కానీ, ఆయన కండోమ్ వాడకపోవడం వల్ల గర్భం వచ్చి అబార్షన్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, కానీ, ఇప్పుడు అబార్షన్ కోసం నేనాయన అనుమతి తీసుకోవాల్సి రావడం విచిత్రంగా అనిపిస్తోంది" అని అన్నారు ఓటా మినామీ.

"నాకొచ్చిన గర్భానికి నేను ఇంకొకరి అనుమతి తీసుకోవాలి. నాకు శక్తి విహీనంగా అనిపించింది. నా శరీరం గురించి, భవిష్యత్తు గురించి ఒక నిర్ణయం తీసుకోలేకపోయాను" అని అన్నారు.

అమెరికా మాదిరిగా కాకుండా జపాన్‌లో అబార్షన్ పట్ల ఉన్న అభిప్రాయాలు మతపరమైనవి కావు. ఇవి మహిళలు, మాతృత్వం గురించి సుదీర్ఘమైన జపాన్ చరిత్రలో నాటుకుపోయిన పితృస్వామ్య భావాలు, సంప్రదాయ ఆలోచనల నుంచి పుట్టినవి.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

"దీని వెనుక చాలా కథ ఉంది" అని ఓటా అన్నారు.

"జపాన్‌లో ఒక మహిళ గర్భం దాలిస్తే ఆమె తల్లిగా మారిపోయినట్లే. ఆ బిడ్డ కోసం ఆ మహిళ అన్నీ త్యాగం చేయాల్సిందే. ఇది చాలా అద్భుతమైన విషయంగా చూస్తారు. ఇది మా శరీరం. కానీ, ఒకసారి గర్భం దాలిస్తే, మా శరీరం ఇక మాది కాదు" అని ఓటా అన్నారు.

జపాన్‌లో అబార్షన్ పిల్ సంపాదించడం చాలా ఖరీదైన వ్యవహారం. ఇది సుమారు 700 డాలర్లు ఉంటుంది. ఈ పిల్‌తో గర్భస్రావం చేయించుకునేందుకు కూడా ఆస్పత్రిలో చేరాల్సి ఉంటుంది.

"దీనికి సాధారణ అబార్షన్ కంటే ఎక్కువ సమయం ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుంది. దీని వల్ల రోగి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించగలం" అని జపాన్ గైనకాలాజికల్ అసోసియేషన్ డిప్యూటీ హెడ్ డాక్టర్ సూగియో మేడా బీబీసీకి చెప్పారు.

యూకే లాంటి దేశాల్లో మహిళలు ఇంటి దగ్గర నుంచే గర్భస్రావం కోసం పిల్ తీసుకోవడం చట్టబద్ధం.

"జపాన్‌లో చట్టరీత్యా అబార్షన్ చేయించుకోవాలంటే ఆస్పత్రిలో చేరడం తప్పనిసరి. ఈ చట్టాన్ని అనుసరించి అబార్షన్ పిల్‌ను మందుల షాపుల్లో నేరుగా అమ్మేందుకు అనుమతి లేదు" అని అన్నారు.

ఇలాంటి నిబంధనలు మహిళల పునరుత్పత్తికి సంబంధించిన ఆరోగ్యం కంటే కూడా ఔషధ సంస్థల వ్యాపారానికి ప్రయోజనం చేకూర్చేవిగా ఉన్నాయని మహిళల లైంగిక ఆరోగ్యం కోసం ప్రచారం చేసే ప్రచారకర్తలు అంటున్నారు.

"చాలా నిర్ణయాలు బిడ్డను ఎన్నడూ మోయని పురుషులు తీసుకుంటున్నారు" అని అసూకా సోమేయా అనే ప్రచారకర్త అన్నారు. ఆమె సొంత స్వచ్చంద సంస్థను నిర్వహిస్తున్నారు.

అసూకా

అబార్షన్ సులభం చేసేందుకు జపాన్‌లో పురుషాధిత్య వర్గాల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోందని అసూకా చెప్పారు.

మహిళలు అబార్షన్ చేయించుకోవడాన్ని సులభతరం చేస్తే అబార్షన్ చేయించుకునే మహిళల సంఖ్య పెరుగుతుందని కొందరు వాదిస్తారు.

మెరుగైన లైంగిక విజ్ఞానం కలిగి ఉండటంతో పాటు, పురుషుల పై ఆధారపడకుండా మహిళలే గర్భ నిరోధక సాధనాల వాడకం పట్ల అవగాహన కలిగి ఉండటమే దీనికి సమాధానం అని అసూకా అన్నారు.

యూరప్‌లో కుటుంబ నియంత్రణ కోసం ఎక్కువగా గర్భ నిరోధక పిల్స్‌పై ఆధారపడతారు. జపాన్ లో వీటిని కేవలం 3 శాతం మంది మహిళలే ఉపయోగిస్తారు.

"అమ్మాయిలు, మహిళల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని విధానాలను రూపొందించాలని కోరుకుంటున్నాను" అని అసూకా అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)