బెంగళూరు వరదలు: సంపన్నులకు కూడా తప్పని కష్టాలు... ఇళ్లను ముంచెత్తిన వరదనీటితో ఇబ్బందులు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రుద్రనీల్ సేన్‌గుప్త
- హోదా, బీబీసీ కోసం
బెంగళూరు నగరాన్ని ఇటీవల వానలు, వరదలు ముంచెత్తాయి. ఇళ్లు, ఆఫీసులను నీరు చుట్టుముట్టింది. ఎంతో మంది ఇళ్లలో చిక్కుకుని పోయారు.
వీధులన్నీ నీళ్లతో నిండిపోయాయి. ఐటీ ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లలేక పోయారు.
ఈ నెల 5వ తారీఖు సాయంత్రం రుచే మిత్తల్ ఇంట్లోకి నీళ్లు రావడం మొదలైంది. రుచే మిత్తల్ వ్యాపారి కాగా ఆమె భర్త మనీశ్ ఒక బయోటెక్ కంపెనీలో డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.
మిత్తల్ నివాసం బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో ఉంది. భారీగా కురిసిన వానల వల్ల నీరు వాళ్ల ఇంటిని చుట్టుముట్టాయి. బేస్‌మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ నీటితో నిండిపోయాయి.
వారు ఇంటి మొదటి అంతస్తులో ఉండాల్సి వచ్చింది. అయితే మనీశ్ తండ్రికి ఆరోగ్యం బాగాలేదు. ఆయన బాగోగులు చూడటం మందులు వంటివి అందుబాటులో ఉంచుకోవడం వాళ్లకు కష్టంగా అనిపించింది.

ఫొటో సోర్స్, Nitya Ramakrishna/BBC
వాన నీరు రావడమనేది మిత్తల్ ఉండే ప్రాంతంలో కొత్తేమీ కాదు. కానీ ఈసారి రాత్రికి రాత్రే ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. చాలా మంది పై అంతస్తుల్లో తలదాచుకోవాల్సి వచ్చింది. కొందరు ఇళ్లు వదలి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు.
'సుమారు రెండు గంటల ప్రాంతంలో సాయం కోసం ఫోన్ చేశాను. పోలీసులు, ఫైర్, మున్సిపాలిటీ ఎవరూ తీయలేదు. ఒకవేళ వారు సాయం చేయలేని పరిస్థితుల్లో ఉండి ఉండొచ్చు' అని మిత్తల్ ఫోనులో వివరించారు.
మనీశ్ తండ్రిని బంధువుల ఇంటికి తీసుకెళ్లేందుకు వారికి అంబులెన్స్ కూడా దొరకలేదు. బేస్‌మెంట్‌లో ఉన్న వారి కార్లు నీటిలో మునిగి పాడైపోయాయి. సాయం చేసేందుకు చుట్టుపక్కల కూడా ఎక్కువ మంది లేరు. కొందరు ముందుగానే అక్కడి నుంచి వెళ్లి పోయారు.
కరెంటు సరఫరా కూడా అంతంతమాత్రంగానే ఉంది. వరద నీరు చేరి కలుషితం కావడం వల్ల మున్సిపల్ నీళ్ల సరఫరా ఆపేశారు.

ఫొటో సోర్స్, Seemanthini Desai/BBC
క్లినికల్ మైక్రోబయాలజిస్ట్ డాక్టర్ సీమంతిని దేశాయ్, అదే ప్రాంతంలో ఇండిపెండెంట్ విల్లాలో నివసిస్తున్నారు. రాత్రి నిద్రపోతున్న ఆమెను దగ్గర్లోనే ఉంటున్న ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి లేపారు. మీ ఇంట్లోకి నీళ్లు వస్తున్నాయంటూ చెప్పారు.
అంతకు కొన్ని గంటల ముందే తన భర్త డాక్టర్ సతీశ్ రుద్రప్పను సీమంతిని దేశాయ్ ఎయిర్‌పోర్ట్ వద్ద వదిలి పెట్టి వచ్చారు.
వరదలో చిక్కుకున్న నాలుగు పిల్లులు, రెండు కోళ్లను దేశాయ్ కుటుంబం రక్షించింది. వాటిని రెండో అంతస్తులోకి తీసుకెళ్లారు.
'ఆ తరువాత నేను నాకు తెలిసిన ఒక పోలీసుకు ఫోన్ చేశాను. ఒక స్నేహితునిగా నేను నిన్ను మాత్రమే బయటకు తీసుకురాగలను. కానీ మీ కాలనీలోని వాళ్లందరికీ సాయం చేసే స్థితిలో నేను లేను అని అతను నాతో అన్నాడు' అని దేశాయ్ అన్నారు.
'అయితే వద్దు అని చెప్పాను. ఎందుకంటే మా ఇంటి దగ్గర్లోని విల్లాలో 85ఏళ్ల పెద్దామె మంచంలో ఉంటున్నారు. మా ఇంటికి ఎడమ వైపున ఉన్న విల్లాలో 92, 88, 80 ఏళ్ల వయసు గల వారు ముగ్గురు ఉన్నారు. వారికి ముందు సాయం చేయాలి' అని దేశాయ్ తెలిపారు.

ఫొటో సోర్స్, Seemanthini Desai/BBC
తన ఇంటి ప్రహరీ గోడ పడిపోయి నీళ్లు లోపలికి రావడం దేశాయ్ చూశారు. చూస్తుండగానే ఇల్లు అంతా నీటితో నిండి పోయింది. నడుము లోతు వరకు నీళ్లు వచ్చేశాయి. విద్యుత్ సరఫరా నిలిపి వేశారు. స్థానిక అధికారులకు ఫోన్లు చేసినా ఎటువంటి స్పందనా రాలేదు.
చివరకు నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్(ఎన్‌డీఆర్ఆఫ్)కు చెందిన ఒక ఇన్‌స్పెక్టర్ లైన్‌లోకి వచ్చారు. తప్పకుండా వచ్చి రక్షిస్తామని హామీ ఇచ్చారు.
తూర్పు బెంగళూరులో ఉండే వైట్‌ఫీల్డ్‌లో 1990ల నాటి నుంచి ఐటీ కంపెనీల రాక పెరిగి భారీగా నిర్మాణాలు పెరిగి పోయాయి.
కాలక్రమంలో ఇక్కడ చిన్నచిన్న చెరువులు, కుంటలు, కాలువలు వంటి వాటిని కూడా పూడ్చేసి భవనాలు కట్టారు.
'మా కాంప్లెక్స్ నిర్మాణం కొంత మేరకు, వరద నీరు పోయే కాలువలను ఆక్రమించినట్లు 2017లో తెలిసింది. మరొక 7-8 హౌసింగ్ కాంప్లెక్స్‌ల విషయంలోనూ ఇలాగే జరిగింది. ఆక్రమించిన భూమిని వెనక్కి ఇచ్చేయాలని అప్పుడే నేను చెప్పాను. ఈ వరదలు మనకొక మేల్కొలుపు' అని దేశాయ్ అన్నారు.
వైట్‌ఫీల్డ్‌లోని ఇంటికి తన పెళ్లి అయిన తరువాత 2013లో మిత్తల్ వచ్చారు. ఇక్కడి పచ్చదనం, సౌకర్యాలు వారికి నచ్చాయి. మురికి నీళ్లను రీసైకిల్ చేయడం, సోలార్ ఎనర్జీతో నీళ్లు వేడి చేయడం వంటివి బాగా ఆకర్షించాయి.
ఇలా వరదలు వచ్చి ఇల్లు ముగినిపోతుందని తాము ఎన్నడూ ఊహించలేదని మిత్తల్ చెప్పారు.

ఫొటో సోర్స్, Seemanthini Desai/BBC
సెప్టెంబరు 6 పొద్దున, చివరకు మిత్తల్ కుటుంబానికి అంబులెన్స్ దొరికింది. అప్పటికే సీమంతిని దేశాయ్ ఫోన్ చేయగా స్పందించిన ఎన్‌డీఆర్ఎఫ్ బృందం కూడా అక్కడికి వచ్చింది.
తమ కాంప్లెక్స్‌లోని మనుషులను, పెంపుడు జంతువులను సురక్షితంగా వారు బయటకు తీసుకొచ్చినట్లు మిత్తల్ తెలిపారు. తన పెంపుడు జంతువులతో ఉండేందుకు సీమంతిని దేశాయ్‌కు ఒక ఫ్రెండ్ ఆశ్రయం ఇచ్చారు.
కొన్ని విలువైన వస్తువులు, నగలు, ఇంటి పత్రాలు తీసుకుని దేశాయ్ బయటపడగలిగారు.
మలేసియా నుంచి ఆమె భర్త ఫోన్ చేయగా జరిగినదంతా దేశాయ్ వివరించారు.
'అయ్యో, నా పేషెంట్ల ఎంఆర్‌ఐ రిపోర్లు అన్నీ ఇంట్లోనే ఉన్నాయి. నువ్వు వాటిని తీసుకు రాగలవా?' అని తన డాక్టర్ భర్త అన్నారని దేశాయ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- జ్ఞాన్వాపి కేసు: ముస్లింల పిటిషన్ కొట్టేసిన కోర్టు.. పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలన్న హిందువుల పిటిషన్ విచారణ కొనసాగించాలని ఆదేశం
- క్వీన్ ఎలిజబెత్-2: రాణి ఉన్న చోట నవ్వుల జల్లులే
- ఆంధ్రప్రదేశ్‌లోనే రాజ్యద్రోహం కేసులు ఎందుకు ఎక్కువగా ఉన్నాయి?
- తమిళులను చూసి తెలుగు ప్రజలు ఎందుకు దాక్కుంటున్నారు?
- క్వీన్ ఎలిజబెత్ 2: బ్రిటన్ రాణికి అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













