బిహార్: ‘8 ఏళ్ల’ బాలుడు రిజ్వాన్ అరెస్ట్‌పై దుమారం? అసలు ఏం జరిగింది? అసదుద్దీన్ ఒవైసీ ఏమన్నారు?

ఫొటో సోర్స్, ANI
- రచయిత, విష్ణు నారాయణ్
- హోదా, బీబీసీ హిందీ
బిహార్‌లోని సివాన్ జిల్లా మరోసారి వార్తల్లో నిలిచింది. జిల్లాలో చెలరేగిన మత ఘర్షణల తర్వాత మైనర్ బాలుడిని పోలీసులు అరెస్ట్ చేయడంతో సివాన్ పేరు ప్రధానాంశాల్లో మరోసారి వినిపిస్తోంది.
సెప్టెంబర్ 8వ తేదీన మహావీరీ అఖాడా ఊరేగింపు సమయంలో అక్కడ హింస జరిగింది. దీని తర్వాత జరిగిన అరెస్టు విషయంలో సోషల్ మీడియాలో దుమారం రేగింది.
ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ట్వీట్‌తో ఈ అంశం మరింత వేడెక్కుతున్నట్లుగా కనబడుతోంది. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై అసదుద్దీన్ ట్విటర్ వేదికగా విరుచుకుపడ్డారు.
''నితీశ్ కుమార్ పాలనలో పిల్లలకు రక్షణ లేదు. అల్లరి మూకలను పట్టుకోవడానికి బదులుగా పోలీసులు, ముస్లిం పిల్లలను లక్ష్యంగా చేసుకుంటున్నారు'' అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, TWITTER/@ASADOWAISI
అసలు విషయం ఏంటి?
సివాన్ జిల్లా బర్హరియా పోలీస్ స్టేషన్ పరిధిలోని పశ్చిమ టోలా ప్రాంతంలో సెప్టెంబర్ 8న మహావీరీ అఖాడా శోభాయాత్ర జరిగింది.
ఈ ఊరేగింపు పశ్చిమ టోలా మసీదు వరకు చేరుకోగానే హింస చెలరేగింది. హిందు, ముస్లిం వర్గాలకు చెందిన ప్రజలు బాహాబాహీకి దిగారు. ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. ఆ ప్రాంతంలో మంటలు అంటించారు. పోలీసులతో పాటు ఈ ఘటనలో చాలామంది గాయపడ్డారు.
హింస, దాడి అభియోగాలు మోపుతూ మొత్తం 135 మందిని నిందితులుగా చేర్చుతూ ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఇందులో 100 మంది గుర్తు తెలియని వారే ఉన్నారు.
ఇరు వర్గాలకు చెందిన 10 మంది చొప్పున మొత్తం 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇందులో 'రిజ్వాన్' అనే మైనర్ బాలుడు కూడా ఉండటంతో ఈ అంశంపై వివాదం మొదలైంది.
మైనర్ బాలుడి విడుదలపై సామాజిక మాధ్యమాల్లో చర్చ నడుస్తోంది. #ReleaseRizwan హ్యాష్ ట్యాగ్ ట్విటర్‌లో ట్రెండ్ అవుతోంది.
కొంతమంది రిజ్వాన్ వయస్సు 8 ఏళ్లు అని, మరికొంతమంది 12-13 ఏళ్లు ఉంటాయని సోషల్ మీడియాలో రాస్తున్నారు.
అయితే, అందిన సమాచారం మేరకు ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు ఆయనను జువైనల్ హోంకు తరలించారు.

ఫొటో సోర్స్, MOHAMMAD SHAHABUDDIN
కుటుంబ సభ్యులు ఏమంటున్నారు?
రిజ్వాన్‌ను విడుదల చేయడానికి పోలీసులు డబ్బులు అడుగుతున్నారని రిజ్వాన్ కుటుంబ సభ్యులు ఆరోపించారు.
రిజ్వాన్ కజిన్ మొహమ్మద్ షాబుద్దీన్ (24 ఏళ్లు), బీబీసీతో మాట్లాడారు.
''ఆ ఘటన జరిగిన రోజు, మా తమ్ముడు మాగ్రిబ్ ప్రార్థనల కోసం మసీదుకు వెళ్లాడు. నమాజ్ చేయడానికి కేవలం 10 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చారు. అప్పుడే, అక్కడ నుంచి మహావీరీ ఊరేగింపు బయల్దేరింది. తొక్కిసలాట జరిగింది.
ప్రతీ సంవత్సరం ఈ ఊరేగింపు జరుగుతుంది. కానీ, ఈసారి అధికార యంత్రాంగం దీనికి సరిగా సిద్ధమవలేదు. గతంలో కూడా ఇక్కడ హింస జరిగింది.
పోలీసులు బాగా రాత్రి అయ్యాక వచ్చి, విచారణ కోసం మా తాతయ్య మొహమ్మద్ యాసిన్ (65 ఏళ్లు)తో పాటు రిజ్వాన్‌ను కూడా తీసుకెళ్లారు. మా తాతయ్య మాజీ సర్పంచ్. ఈ ఊరేగింపు ప్రశాంతంగా జరిగేలా చేయడంలో వారు నిమగ్నమై ఉన్నారు. కానీ, పోలీసులు వారిని కూడా తీసుకెళ్లారు.
విచారణ తర్వాత వారిని వదిలేస్తాం అని చెప్పారు. కానీ, జైలుకు పంపినట్లు తర్వాత మాకు తెలిసింది'' అని షాబుద్దీన్ చెప్పారు.
రిజ్వాన్, 2014 జనవరి 1వ తేదీన జన్మించినట్లు ఆయన చెప్పారు. రిజ్వాన్ వయస్సును ధ్రువీకరించుకోవడం కోసం పోలీసులు తమకు పేపర్లు కూడా పంపినట్లు తెలిపారు.

ఫొటో సోర్స్, MOHAMMAD SHAHABUDDIN
పోలీసులు డబ్బులు అడిగారనే ఆరోపణల గురించి రిజ్వాన్ తల్లి వకీలన్ ఖాతూన్ మాట్లాడారు.
''కొంతమందిని గుర్తుపట్టడం కోసం రిజ్వాన్‌ను తీసుకెళ్తున్నామని పోలీసులు చెప్పారు. కానీ, అతన్ని జైల్లో పెట్టారు. కోర్టు పిలిస్తే మేం అక్కడికి వెళ్లాం. అప్పుడు రిజ్వాన్ చేతులు తాడుతో కట్టేసి ఉన్నాయి. మా ముందే కట్లు విప్పారు. వెంటనే వచ్చి గట్టిగా కౌగిలించుకున్నాడు. బాగా ఏడ్చాడు. ఏం కాదు. నిన్ను వదిలేస్తారు అని చెప్పాం. కానీ, తను చిన్నపిల్లాడు.
అసలు తన తప్పేమీ లేదు. మేం బయటకు రాగానే పోలీసులు మా దగ్గరకు వచ్చారు. ఒకరు యూనిఫామ్‌లో ఉన్నారు. మరొకరు సాధారణ దుస్తుల్లో ఉన్నారు. రిజ్వాన్ కుటుంబ సభ్యులు ఎవరు అని అడిగారు. మేమే అని చెప్పడంతో 10 నుంచి 12 వేలు ఇవ్వాలని అడగడం మొదలుపెట్టారు. మేం చాలా పేదవాళ్లం, డబ్బులు ఎలా ఇవ్వగలం? అని అన్నాం. అది మీకే తెలియాలి అని వారు మాతో అన్నారు. మేం పేదవాళ్లం, ఎక్కడి నుంచి డబ్బులు తీసుకురావాలి? అసలు ఇందులో రిజ్వాన్ తప్పేం లేదు'' అని ఆమె వివరించారు.
పోలీసులు ఏం చెబుతున్నారు?
రిజ్వాన్ అరెస్ట్ గురించి బర్హరియా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్ఓ ప్రవీణ్ ప్రభాకర్‌తో మేం మాట్లాడాం.
''రిజ్వాన్ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో రిజ్వాన్‌ది కాదు. మెజిస్ట్రేట్ ముందు స్వయంగా తన వయస్సు 13 ఏళ్లు అని అతనే చెప్పారు. అంతేకాకుండా అతను రాళ్లు రువ్వాడని నిరూపించే కచ్చితమైన సాక్ష్యాధారాలు పోలీసుల వద్ద ఉన్నాయి. కచ్చితంగా అతని వయస్సు ఎంతో విచారణలో తెలుస్తుంది'' అని అన్నారు.
లంచం డిమాండ్ చేశారన్న రిజ్వాన్ తల్లి ఆరోపణలపై స్పందిస్తూ ''అదంతా అబద్ధం. అసలు అలా జరుగుతుందా?'' అని అన్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో గురించి తెలుసుకోవడానికి మేం మరోసారి రిజ్వాన్ కుటుంబాన్ని సంప్రదించాం. రిజ్వాన్ ఫొటోను చూపించాలని అడిగాం.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు రిజ్వాన్ ఫొటోలే అని షాబుద్దీన్ చెప్పారు. ఆ ఫొటో గతేడాది ఈద్ సందర్భంగా తీసినది అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- బ్రిటన్ రాజుగా కింగ్ చార్లెస్ 3 అధికారిక ప్రకటన.. తొలిసారి టీవీల్లో ప్రసారమైన చారిత్రక కార్యక్రమం
- బ్రిటన్ రాజరికం: కింగ్ చార్లెస్ 3 భార్య కామిలా ఎవరు, క్వీన్ కన్సొర్ట్ అని ఎందుకు పిలుస్తున్నారు?
- కొత్త రాజు చార్లెస్ 3 వ్యక్తిత్వం ఎలా ఉండబోతోంది?
- క్వీన్ ఎలిజబెత్ 2: బ్రిటన్ రాణికి అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారు?
- రాజ కుటుంబంలోని సభ్యులు ఎవరు, రాజు నిర్వర్తించే విధులు ఏంటి?
- క్వీన్ ఎలిజబెత్ 2: రాజు చార్లెస్ తర్వాత సింహాసనాన్ని అధిష్టించే వారసులు ఎవరు?
- రాయల్ బ్రాండింగ్: రాణి మరణంతో బ్రిటన్ కరెన్సీ నోట్లు, నాణేలు, స్టాంపులు, పాస్‌పోర్టుల్లో వచ్చే మార్పులేంటి?
- క్వీన్ ఎలిజబెత్ 2: కోట్ల మంది భారతీయుల హృదయాలను ఈ రాణి ఎలా గెలుచుకున్నారు
- సంస్మరణ: బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ 2
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















