‘హిందువులు, సిక్కులను మిషనరీలు క్రైస్తవులుగా మారుస్తున్నాయ్’ అంటూ పంజాబ్‌లో వివాదం

అకాల్ తఖ్త్ జత్తేదార్ జ్ఞానీ హర్ ప్రీత్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అకాల్ తఖ్త్ జత్తేదార్ జ్ఞానీ హర్ ప్రీత్ సింగ్
    • రచయిత, ప్రియాంక ధీమాన్
    • హోదా, బీబీసీ పంజాబీ

'హిందువులు, సిక్కులను క్రైస్తవులుగా మార్చేందుకు మిషనరీలు ప్రయత్నిస్తున్నాయ్' అంటూ పంజాబ్‌లో ఆందోళనలు చెలరేగాయి.

ఇటీవల అమృత్‌సర్‌లోని ఒక గ్రామానికి క్రైస్తవ మిషనరీలు వెళ్లగా వారిని నిహంగ్ సిక్కులు అడ్డుకున్నారు.

రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నాయి. సుమారు 150 మంది నిహంగ్ సిక్కుల మీద కేసు నమోదు చేశారు.

అకాల్ తఖ్త్‌ జత్తేదార్ జ్ఞానీ హర్‌ప్రీత్ సింగ్ పోలీసుల తీరును తీవ్రంగా విమర్శించారు. క్రైస్తవ మిషనరీలు బలవంతంగా మతం మారుస్తుంటే అడ్డుకోవడానికి నిహంగ్ సిక్కులు అక్కడకు వెళ్లారని ఆయన చెబుతున్నారు.

వీడియో క్యాప్షన్, మత మార్పిళ్లకు కారణాలు ఏమిటి? కర్ణాటక బిల్లుపై వివాదం ఎందుకు?

'మమల్ని మతపరంగా బలహీన పరిచేందుకు పంజాబ్ గడ్డ మీద క్రైస్తవాన్ని తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో చర్చీలు, మసీదులు కడుతున్నారు.

అంతేకాదు హిందువులను, సిక్కులను క్రైస్తవులుగా మార్చేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదంతా ప్రభుత్వ కనుసన్నలలోనే జరుగుతోంది' అని జత్తేదార్ జ్ఞానీ హర్‌ప్రీత్ సింగ్ ఆరోపించారు.

సిక్కులకు ప్రమాదకరంగా మారుతోందని జత్తేదార్ జ్ఞానీ హర్‌ప్రీత్ సింగ్ ఏ మతాన్ని అయితే విమర్శిస్తున్నారో ఆ మతస్తుల సంఖ్య పంజాబ్‌లో 1.5శాతానికి లోపే ఉంది. 2011 నాటికి పంజాబ్‌లో క్రైస్తవుల సంఖ్య 3లక్షల 48వేల 230.

ప్రస్తుతం పంజాబ్‌లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా మతమార్పిడిలను నిషేధిస్తూ చట్టం తీసుకు రావాలని హర్‌ప్రీత్ సింగ్ డిమాండ్ చేస్తున్నారు.

హర్‌ప్రీత్ సింగ్ చేసిన వ్యాఖ్యలు, డిమాండ్లతో మరొకసారి మత మార్పిడి మీద చర్చ మొదలైంది.

అమృత్‌సర్‌లో ఆందోళనకు దిగిన క్రైస్తవులు

ఫొటో సోర్స్, Ravinder Singh Robin/BBC

ఫొటో క్యాప్షన్, అమృత్‌సర్‌లో ఆందోళనకు దిగిన క్రైస్తవులు

పంజాబ్‌లో మతమార్పిడిల చరిత్ర

మతమార్పిడి వివాదాలు పంజాబ్‌కు కొత్తేమీ కాదు. ఎంతో కాలంగా ఈ వివాదం కొనసాగుతూ వస్తోంది.

'స్వాతంత్ర్యానికి ముందు నుంచే ఈ వివాదం ఉంది. మతం మారిన వారిని తిరిగి వెనక్కి తీసుకొచ్చేందుకు సిక్కులు అమృత్ ప్రచార్, హిందువుల్లో శుద్ధి, ముస్లింల్లో తబ్లీగ్, తంజీమ్ వంటి కార్యక్రమాలు చేపట్టేవారు' అని విశ్లేషకులు డాక్టర్ ప్రమోద్ కుమార్ తెలిపారు.

కొన్ని నివేదికల ప్రకారం 2014లో సుమారు 8వేల మంది క్రైస్తవులు సిక్కు మతంలోకి మారారు. నాడు ప్రకాశ్ సింగ్ బాదల్ పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. బలవంతంగా మతం మార్చడాన్ని తాము అంగీకరించమని నాడు ఆయన అన్నారు.

'పంజాబ్‌లో మతమార్పిడి వివాదాలు రాజకీయాలకు మాత్రమే పరిమితం కానీ సాధారణ ప్రజల్లో లేవు. వివిధ మతాలకు చెందిన మతాధిపతులు ఈ విషయంలో ఆందోళనగా ఉన్నారు' అని డాక్టర్ ప్రమోద్ కుమార్ అన్నారు.

'ప్రజలు తమకు నచ్చిన మతాన్ని ఆచరించే స్వేచ్ఛను భారత రాజ్యాంగం ప్రసాదించింది. ఎవరైనా చట్టవ్యతిరేకంగా నడుచుకుంటూ ఉంటే వారి మీద చర్యలు తీసుకోవాల్సిందే.

భారతదేశ నిర్మాణం కోసం ఇక్కడి చర్చి అంకితమై పని చేస్తోంది.

అందరి భారతీయుల మాదిరిగానే మేం కూడా ఇక్కడే పుట్టి పెరిగాం. కాబట్టి మా మతాన్ని స్వేచ్ఛగా ఆచరించే హక్కు మాకు ఉంది' అని అమృత్‌సర్ బిషప్ సామంతా రాయ్ అన్నారు.

మతం

ఫొటో సోర్స్, Getty Images

రాజ్యాంగం ఏం చెబుతోంది?

భారతదేశంలో ప్రతి వ్యక్తీ స్వేచ్ఛగా తమకు నచ్చిన మతాన్ని ఆచరించొచ్చు. అలాగే ఒక మతం నుంచి మరొక మతానికి కూడా మారొచ్చు. ఒక హిందువు ఇస్లాం స్వీకరించొచ్చు. ఇస్లాం నుంచి క్రైస్తవంలోకి వెళ్లొచ్చు. తిరిగి హిందువుగాను మారొచ్చు.

రాజ్యాంగంలోని 25 నుంచి 28 వరకు ఉన్న ఆర్టికల్స్ మత స్వేచ్ఛ గురించి చెబుతున్నాయి. భారతదేశ పౌరులు స్వేచ్ఛగా తమకు నచ్చిన మతాన్ని ఆచరించే హక్కు, ప్రచారం చేసుకునే హక్కును ఈ ఆర్టికల్స్ కల్పిస్తున్నాయి.

బలవంతంగా మతం మార్చడం నేరం

భారతీయ శిక్షా స్మృతిలోని 295-ఎ, 298 సెక్షన్ల ప్రకారం ఒక వ్యక్తిని భయపెట్టి లేదా ప్రలోభపెట్టి మతం మార్చడం అనేది నేరం. అలా చేసిన వ్యక్తులకు ఏడాది వరకు జైలు శిక్ష పడుతుంది.

'ఒక వ్యక్తి మతాన్ని మార్చే హక్కును మరొక వ్యక్తికి రాజ్యాంగం ఇవ్వలేదు' అని 2011లో ఒక తీర్పు సందర్భంగా సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

మతం

ఫొటో సోర్స్, Getty Images

మతమార్పిడి వ్యతిరేక చట్టాలు

ప్రస్తుతం దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మతమార్పిడి నిషేధ చట్టాలున్నాయి. అయితే మతమార్పిడులను నిషేధించే కేంద్ర చట్టాలు లేవు.

కేంద్రం సైతం చట్టం తీసుకురావాలనే డిమాండ్లు పెరుగుతూ వస్తున్నాయి.

2020లో ఈ విషయం మీద విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు... 'చట్టాలు చేయడమనేది పార్లమెంటు, అసెంబ్లీ పరిధిలోనిది. చట్టాలు చేయమంటూ కోర్టులు ఆదేశాలు ఇవ్వలేవు' అని వ్యాఖ్యానించింది.

ప్రస్తుతం 10 రాష్ట్రాల్లో మతమార్పిడి నిషేధ చట్టాలు అమల్లో ఉన్నాయి. 1967లో తొలిసారి ఒడిశాలో ఈ చట్టం తీసుకొచ్చారు.

ఆ తరువాత గుజరాత్, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్‌లు చట్టాలు చేశాయి.

సిక్కు మతం

ఫొటో సోర్స్, Getty Images

చట్టప్రకారం మతం మారడం ఎలా?

మతం మారాలి అనుకున్న వ్యక్తి జిల్లా కలెక్టర్ లేదా సంబంధిత అధికారికి దరఖాస్తు చేసుకోవాలి.

ప్రస్తుతం ఏ మతంలో ఉన్నారు? ఏ మతానికి మారాలని అనుకుంటున్నారు? పేరు, చిరునామా వంటి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలి.

ఆ తరువాత 30 నుంచి 60 రోజులలోపు మత మార్పిడి ప్రక్రియ ముగుస్తుంది.

మతం మారిన వ్యక్తి కొత్త పేరు, కొత్త మతం వంటి వివరాలను అధికారుల వద్ద నమోదు చేయించుకోవాలి.

వీడియో క్యాప్షన్, ఈ ఆటో డ్రైవర్ రోగులకు ఉచితంగా సేవలు అందిస్తారు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)