భారతదేశంలో మత మార్పిళ్లకు కారణాలు ఏంటి? మతమార్పిళ్లపై వివాదాలు ఏంటి?
ఒక మతం నుంచి మరొక మతంలోకి మారడాన్ని మరింత కఠినతరం చేసింది కర్ణాటక. ఇందుకు సంబంధించిన Right to Freedom of Religion-2021 బిల్లును తాజాగా పాస్ చేసింది ఆ రాష్ట్ర అసెంబ్లీ.
ఇది దుర్మార్గం, అన్యాయం, రాజ్యాంగ విరుద్ధమంటూ ప్రతిపక్షాలు అరిచి గీ పెట్టినా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదు.
బలవంతపు మత మార్పిళ్ల వల్ల భారతీయ సమాజానికి పెను ప్రమాదం ముంచుకొస్తోందన్నది బీజేపీ నేతల వాదన.
పెరుగుతున్న ట్రెండ్
కర్ణాటక అసెంబ్లీ ఆమోదించిన 'రైట్ టు ఫ్రీడం ఆఫ్ రిలీజియన్ యాక్ట్-2021' ప్రధాన ఉద్దేశం మత మార్పిళ్ల నియంత్రణ.
బలవంతంగా కానీ మోసపూరితంగా కానీ ఒక మతం నుంచి మరొక మతంలోకి మార్చడాన్ని నిషేధిస్తుంది ఈ చట్టం. అంతేకాదు.. మతం మార్చే ఉద్దేశంతో చేసుకున్న పెళ్లి కూడా చెల్లదని చెబుతున్నాయి రూల్స్.
ఇలాంటి చట్టాలు దేశంలో కొత్తకాదు. పోయిన ఏడాది'లవ్ జిహాద్' పేరుతో ఓ చట్టం చేసింది ఉత్తర్‌ప్రదేశ్. హిందూ అమ్మాయిలను ముస్లిం అబ్బాయిలు పెళ్లి చేసుకొని ఇస్లాంలోకి మారుస్తున్నారనేది హిందుత్వవాదుల ఆరోపణ. దీన్నే వారు లవ్ జిహాద్ అంటున్నారు.
ఇంకాస్త వెనక్కి చరిత్రలోకి వెళ్తే.. మతమార్పిళ్లను నియంత్రిస్తూ చట్టం తీసుకొచ్చిన తొలి రాష్ట్రం ఒడిశా. 1967లో ఒడిశా ఫ్రీడం ఆఫ్ రిలీజియన్ యాక్ట్‌ను పాస్ చేశారు.
ఒడిశాలో పెద్ద ఎత్తున్న మిషనరీలు మతమార్పిళ్లకు పాల్పడుతున్నాయంటూ తరచూ వివాదాలు, ఘర్షణలు చెలరేగుతూ ఉండేవి. 1999లో మతబోధకుడు గ్రాహం స్టెయిన్ కుటుంబాన్ని మంటల్లో కాల్చి చంపడం కూడా ఇందులో భాగమే. ఇదంతా ఒడిశాకు సంబంధించిన పాత చరిత్ర.
ఇక ఇటీవల మధ్యప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు కూడా ఇలాంటి చట్టాలనే తీసుకొచ్చాయ్. మరికొన్ని రాష్ట్రాలు కూడా తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయనే వార్తలు కూడా వింటూ ఉన్నాం.

మతమార్పిడి వివాదాలది పెద్ద చరిత్రే
ఈ మత మార్పిళ్ల వివాదాలు దేశంలో కొత్తేమీ కాదు. బ్రిటిష్ ఇండియా రోజుల నుంచే ఇదొక పెద్ద వివాదంగా ఉంటూ వస్తోంది.
హిందువులను పెద్ద ఎత్తున క్రైస్తవులుగా మార్చి బ్రిటిష్ ప్రభుత్వానికి మిషనరీలు సహకరించాయనేది ఇప్పటికీ వినిపించే ప్రధాన ఆరోపణ. తద్వారా భారత స్వాతంత్ర్య పోరాటాన్ని విచ్ఛిన్నం చేసేందుకు మిషనరీలు ప్రయత్నించాయని అనే వాళ్లు కూడా ఉన్నారు.
ఇక స్వాతంత్ర్యం వచ్చాక రాజ్యాంగ రచన కోసం ఏర్పడిన రాజ్యాంగ పరిషత్ కూడా దీనిపై చాలా లోతుగా చర్చింది. బలవంతపు మత మార్పిళ్లను చట్టపరంగా గుర్తించకూడదంటూ 1947 మే 1న తీర్మానం ప్రవేశపెట్టారు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్.
కానీ టీటీ కృష్ణమాచారి వంటి వాళ్లు మత మార్పిళ్లకు మూలాలేంటో చూడాలని నాడు వాదించారు. అంటరానితనం వంటి సామాజిక దురాచారాల వల్ల హిందువులు క్రైస్తవమతంలోకి మారుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు.
ఇలా అనేక వాదనలు ప్రతివాదనలు ఈ అంశంపై జరిగాయి. ఎవరి వాదనలు ఎలా ఉన్నా నచ్చిన మతాన్ని ఆచరించే హక్కును వ్యక్తుల ప్రాథమిక హక్కుగా రాజ్యాంగ పరిషత్ చూసిందనేది విశ్లేషకుల మాట.
ఈ వివాదం అంతటితో ముగియలేదు. ఆయా సందర్భాల్లో మత మార్పిళ్ల నియంత్రణ కోసం పార్లమెంటులో బిల్లులు ప్రవేశపెడుతూ వచ్చారు.
1954లో ఇండియన్ కన్వర్షన్ రెగ్యులేషన్ అండ్ రిజిష్ట్రేన్ బిల్లును, 1960లో బ్యాక్ వార్డ్ కమ్యూనిటీస్ రిలీజియస్ ప్రొటెక్షన్ బిల్లును, 1979లో ఫ్రీడం ఆఫ్ రిలీజియన్ బిల్‌ను తీసుకొచ్చారు. కానీ వీటిలో ఏ బిల్లు కూడా చట్ట రూపం దాల్చలేదు.
మత మార్పిళ్లకు కారణాలు ఏంటి?
ఏదో ఒకటి ఆశ చూపి బతిమిలాడో బెదిరించో బలవంతంగా మతం మారుస్తున్నారనే ఆరోపణలు ఎన్నైనా ఉండొచ్చు... కానీ మత మార్పిళ్ల వెనుక బలమైన సామాజిక, ఆర్థిక కారణాలు ఉన్నాయనేది ఎవరూ కాదనలేని వాస్తవం.
హిందూమతంలో అంటరానితనానికి, వెలివేతకు గురైన కులాలు దాన్ని భరించలేక మతం మారుతూ వచ్చాయి.
దేశంలో దళిత ఉద్యమానికి ఆద్యుడైన అంబేడ్కర్, 1956 అక్టోబరు 14న బౌద్ధాన్ని స్వీకరించిన విషయం తెలిసిందే. నాడు ఆయనతోపాటు మూడు లక్షలకు పైగా దళితులు హిందూ మతాన్ని వదిలేశారు.
పేదరికం కూడా దీనికి మరొక కారణం. కొన్ని చోట్ల అగ్రవర్ణాలుగా చెప్పుకునే కులాల్లోని పేదలు కూడా మతం మారారు.
ఛత్తీస్‌గఢ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో గతంలో క్రైస్తవంలో చేరిన ఆదివాసులను హిందూత్వ సంస్థలు ఘర్ వాపసీ పేరుతో హిందూమతంలోకి చేర్పించాయి. ఇవి చాలా సార్లు ఘర్షణలకు, కొన్ని సార్లు మతకల్లోలాలకు కూడా దారితీశాయి.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు కావొస్తున్నా, అభివృద్ధి గురించి ఎన్ని మాటలు మాట్లాడుకుంటున్నా.. మతం అనే అంశమే రాజకీయ అజెండాలో అన్నింటికన్నా మిన్నగా ఉంటోందనేది వాస్తవం.
మతములన్నియు మాసిపోవును
జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును…
అంటూ కవి గురజాడ దాదాపు నూటాయాభై ఏళ్ల కింద కన్న కలలు నిజం కావడానికి మరెన్ని ఏళ్లు వేచి ఉండాలో..
ఇవి కూడా చదవండి:
- హిమాన్షు బాడీషేమింగ్.. ‘అమిత్ షా గురించి, మోదీ కుటుంబం గురించి ఇలాగే మాట్లాడొచ్చా?’ - కేటీఆర్ ఆగ్రహం
- క్రిస్మస్ 2021: ఒమిక్రాన్ భయంతో తగ్గిన వేడుకలు.. మార్కెట్లలో కొనసాగుతున్న షాపింగ్ రద్దీ
- వాజ్‌పేయి మాటల్ని నెహ్రూ ఎందుకంత శ్రద్ధగా వినేవారు?
- ఏసుక్రీస్తు ఎలా కనిపించేవారు.. ఆయన అసలు చిత్రం ఏది?
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ నైట్ కర్ఫ్యూ తప్పదా... ఒమిక్రాన్ ఆంక్షలు ఎప్పటి నుంచి?
- కోవిడ్ -19తో మగవాళ్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతోందా... ఈ ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎలా?
- చైనా: ప్రపంచ ఆయుధ పోటీలో డ్రాగన్‌దే విజయమా?
- శ్యామ్ సింగరాయ్ రివ్యూ: అన్నీ ఉన్న కథలో ఆ ఒక్క ఎలిమెంట్‌ను దర్శకుడు ఎలా మిస్సయ్యారు?
- హిందూ రాజ్యం: హరిద్వార్ ధర్మ సంసద్‌లో వివాదాస్పద ప్రసంగాలపై కలకలం.. ఎవరెవరు ఏమన్నారు?
- ఉత్తర తెలంగాణపై దండెత్తిన కోతులు.. కొండ ముచ్చులు వీటికి చెక్ పెట్టగలవా?
- అప్పుడే పుట్టిన శిశువుల్లో కామెర్లు ప్రమాదకరమా? కళ్లు పచ్చగా ఉంటే బాక్సులో పెట్టాలా? ఎండలో పెడితే సరిపోతుందా?
- బాయ్‌ఫ్రెండ్ ఆత్మహత్య.. గర్ల్‌ఫ్రెండ్‌కు జైలు శిక్ష విధించిన అమెరికా కోర్టు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)