వివాహం: జంట లేకుండా ఒంటరిగా జీవించటం తప్పా? ‘సింగిల్ షేమింగ్’ ఎందుకు పెరుగుతోంది?

ఒంటరిగా జీవించే ప్రజలను ఎందుకు జడ్జ్ చేస్తుంటారు? ఒంటరిగా ఉంటే తప్పా?

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జెసికా క్లెయిన్
    • హోదా, బీబీసీ వర్క్‌లైఫ్

ఒంటరిగా జీవించే వ్యక్తుల సంఖ్య పెరిగిపోతోంది. అయినా.. ‘ఇంకా పెళ్లి కాలేదా?’, ‘జంట దొరకలేదా?’ అనే ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి. త్వరలోనే అవుతుందని జవాబు చెబుతుంటారు. ఎందుకు ఇంత జాలి చూపిస్తుంటారు?

ఇంకా ఎందుకు ఒంటరిగా ఉంటున్నావని అడగడం, త్వరలోనే మంచి జోడి దొరుకుతుందని భరోసా ఇవ్వడం... ఇదంతా ఒంటరిగా ఉన్న స్నేహితుల బాగోగులు తెలుసుకునేందుకు ఒక సున్నితమైన మార్గంగా భావిస్తుంటారు.

కానీ, ఇలాంటి ప్రశ్నలు ఎదుటివారికి సహాయం కంటే కూడా హాని చేసే అవకాశమే ఎక్కువ. ఇలాంటి ప్రశ్నలు అడగడాన్ని 'సింగిల్ షేమింగ్'గా పరిగణిస్తున్నారు.

'భాగస్వామి లేకపోవడం వల్లే వారు ఒంటరితనంతో విచారంగా ఉంటున్నారు'... 'భాగస్వామి కోసం వెదుకుతున్నారు, కానీ, సరైన జోడి దొరకలేదు'... 'వారు ఏదో తప్పు చేసి ఉంటారు, అందుకే ఒంటరిగా బతకాల్సి వస్తోంది'.... ఇలాంటి మూస వ్యాఖ్యల్ని భరించలేకే చాలామంది ఇళ్లు, పిల్లలు, ఓ తోడు కావాలని అనుకుంటారు. సంతోషకరమైన జీవితం కోసం ఇవన్నీ ఉండాలని భావిస్తున్నారు.

సమాజంలో 'సింగిల్ షేమింగ్' అనేది బలంగా నాటుకుపోయిందని ఇటీవలి పరిశోధనలు సూచిస్తున్నాయి. డేటింగ్ సర్వీస్ మ్యాచ్ అనే సంస్థ చేసిన ఒక సర్వేలోని డేటా ప్రకారం, యూకేలోని 1000 మంది వయోజనుల్లో 52 శాతం మంది కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి సింగిల్ షేమింగ్‌ను ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. తాము రిలేషన్‌షిప్‌లో సంతోషంగా ఉన్నప్పటికీ అనుచిత ప్రశ్నల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని మరో 59 శాతం మంది చెప్పారు.

సింగిల్‌గా ఉండే వ్యక్తులకు వ్యతిరేకంగా ఇలాంటి వైఖరి ప్రదర్శించడం ఏమాత్రం అర్థం లేని చర్య అని నిపుణులు అంటున్నారు.

''ఒకప్పుడు సింగిల్‌హుడ్‌ను పరివర్తన కాలంగా పరిగణించేవారు'' అని 'సింగిల్డ్ అవుట్' అనే పుస్తక రచయిత బెల్లా డిపాలో అన్నారు.

అమెరికన్లు, యుక్త వయస్సులో ఎక్కువ సంవత్సరాలు పెళ్లి చేసుకోవడం కంటే కూడా ఒంటరిగా ఉండటానికే ఇష్టపడుతున్నారని ఆమె చెప్పారు.

అమెరికా సెన్సస్ డేటా ప్రకారం, 1970లలో అమెరికా ప్రజల్లో 40 శాతం మంది వివాహబంధంలో ఉండేవారని, 17 శాతం మాత్రమే సింగిల్‌గా ఉండేవారని ఆమె గుర్తు చేశారు.

2012 నాటికి సింగిల్‌గా ఉండే వారి సంఖ్య 27 శాతానికి పెరిగిందని... తల్లిదండ్రులు, పిల్లలతో ఉండేవారి సంఖ్య 20 శాతానికి పడిపోయిందని వివరించారు.

సింగిల్ షేమింగ్

ఫొటో సోర్స్, Getty Images

సింగిల్ షేమింగ్ పరిణామాలు

న్యూయార్క్‌కు చెందిన మానసిక నిపుణుడు అలిషన్ అబ్రామ్స్ ప్రకారం, సింగిల్ షేమింగ్ అంటే సమాజం అంచనాలకు అనుగుణంగా ఒక నిర్ణీత వయస్సులో పెళ్లి చేసుకోని, లేదా ఒంటరిగా జీవించే వ్యక్తులకు వ్యతిరేకంగా ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడం.

భాగస్వాములు లేని వ్యక్తులతో ప్రజలు భిన్నంగా వ్యవహరిస్తారని ఆమె చెప్పారు.

''సింగిల్‌గా ఉండేవారు ఒంటరితనంతో, నైరాశ్యంలో ఉంటారని ప్రజలు భావిస్తుంటారు'' అని ప్యారిస్‌కు చెందిన డేటింగ్ ఎక్స్‌పర్ట్ ఇపెక్ కుచుక్ అన్నారు.

సింగిల్‌గా ఉండే వ్యక్తులు తరచుగా ఎలాంటి మాటలు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసుకోవడానికి పరిశోధకులు ఒక అధ్యయం చేశారు. ఈ అధ్యయనంలో 35 శాతం మంది, తమకు త్వరలోనే సరైన జోడి దొరకుతుందని అందరూ చెప్పేవారని తెలిపారు. 'మీరు చాలా ఒంటరిగా భావిస్తుంటారు కదా' అని అందరూ తమను అడిగేవారని 29 శాతం మంది అన్నారు. తమకు భాగస్వామి లేకపోవడం పట్ల చాలామంది ఒకరకమైన జాలిని చూపేవారని 38 శాతం చెప్పారు.

వివాహ బంధంలో ఉన్నవారు జీవితాన్ని ప్రత్యేకంగా గడుపుతారని, సింగిల్‌గా ఉండేవారికి ఇలాంటి అవకాశం లేదని, సింగిల్‌గా ఉండే వారి జీవితాలు విషాదకరంగా ఉంటాయని, వారు స్వార్థపూరితంగా వ్యవహరిస్తుంటారని ఇలా రకరకాల అపోహలు ఉన్నాయని బెల్లా చెప్పారు. ఇవన్నీ అపోహలే అని కొన్ని అధ్యయనాల్లో తేలింది.

సింగిల్‌ వ్యక్తుల పట్ల ఉండే ఇలాంటి మూస ధోరణులు, విపరీత పర్యావసనాలకు దారి తీస్తాయి. మానసిక నిపుణులు అబ్రామ్స్ చెప్పినట్లు సమాజ ధోరణి వల్ల సింగిల్ వ్యక్తుల వ్యక్తిత్వంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది.

''డిప్రెషన్‌కు ఇది కూడా కారణం అవుతున్నట్లు నేను చాలా సార్లు గమనించాను'' అని అబ్రామ్స్ చెప్పారు.

సింగిల్ షేమింగ్ అనేక రూపాల్లో ఎదురవుతుంది. తల్లిదండ్రులు, స్నేహితులే కాదు ప్రభుత్వాలు కూడా ఇందులో భాగమవుతాయి. చట్టబద్ధంగా వివాహం చేసుకున్నవారికి ప్రభుత్వం నుంచి పలు రకాల ప్రయోజనాలు అందుతాయి. ఒంటరి వ్యక్తులను ఇలాంటివి అందుబాటులో ఉండవు. ఇది ఒంటరి వ్యక్తులు తమ నిర్ణయం గురించి ఆలోచనలో పడేలా చేస్తుంది.

అమెరికాలో ఒక ఉద్యోగి ఆరోగ్య సంరక్షణ పథకంలో తన భాగస్వామిని కూడా చేర్చవచ్చు. కానీ సింగిల్‌గా ఉండే వ్యక్తులు తోడబుట్టినవారు లేదా స్నేహితులను ఈ పథకం పరిధిలోకి తీసుకురాలేరు అని బెల్లా చెప్పారు.

సింగిల్ షేమింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఇక్కడ కూడా వివక్షే..

చాలా సామాజిక రుగ్మతల్లానే ''సింగిల్ షేమింగ్''లోనూ జెండర్, సంస్కృతి పరంగా చాలా వివక్ష ఉంది. ముఖ్యంగా మహిళలు దీనికి ఎక్కువ బాధితులుగా మారుతున్నారు. కొన్ని సంస్కృతుల్లో పెళ్లి చేసుకోవడం, పిల్లలను కనడం లాంటి జంట తంతులకు మరింత ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. దీంతో ఇలాంటి ప్రాంతాల్లో ఒంటరులపై వివక్ష ఎక్కువగా ఉంటుంది.

ముఖ్యంగా ఇక్కడ ఒంటరి మహిళలను సంబోధించే పదాలను గమనించండి. ఇక్కడ అబ్బాయిలను బ్యాచ్‌లర్లు అని పిలుస్తారు. అమ్మాయిలను మాత్రం ''స్పిన్‌స్టెర్లు''అని పిలుస్తారు. ఈ పదాన్ని మధ్యయుగంలో ఎక్కువగా ఉపయోగించేవారు. నూలు వడికే పెళ్లికాని మహిళలను ఈ పేరుతో పిలిచేవారు. ఈ వృత్తిపై అప్పటి సమాజంలో చిన్నచూపు ఉండేది. సాధారణంగా మంచి ఉద్యోగాలను పెళ్లైన మహిళల కోసం కేటాయించేవారు. ఇక్కడ కూడా గౌరవం అనేది వారి భర్తలపైనే ఆధారపడి ఉంటుంది. మరోవైపు బ్యాచ్‌లర్ అనే పదాన్ని చూడండి. ఇది చాలా సరదా పదం. ఎలాంటి చీకూచింత లేకుండా హాయిగా గడిపేవారి కోసం ఉద్దేశించినది. జాఫరీ చాసెర్ రాసిన ''ద కాంటెర్‌బరీ టేల్స్‌''లోనూ ఈ పదం చాలా పాజిటివ్‌గా కనిపిస్తుంది. ఇక స్పిన్‌స్టెర్ అనే పదం నెగెటివ్ ధోరణిలో ఉంటుంది.

''అందుకే పెళ్లి గురించి పురుషుల కంటే మహిళలే ఎక్కువ ఆలోచిస్తుంటారు''అని డిపాలో చెప్పారు. ''నువ్వు ఒంటరిగా ఉన్నావా?''లాంటి ప్రశ్నలు ఎక్కువగా మహిళలకే ఎదురవుతుంటాయని ఆమె అన్నారు.

మరోవైపు సింగిల్ షేమింగ్ గురించి పురుషులతో పోలిస్తే మహిళల నుంచే ఎక్కువ ఫిర్యాదులు వస్తుంటాయని అబ్రామ్స్ కూడా చెప్పారు. తన క్లయింట్లలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారని ఆమె వెల్లడించారు.

''ఇక్కడ పురుషులపైనా ఇలాంటి వివక్ష కొంతవరకు ఉండొచ్చు. వీరిని చిన్న పిల్లలుగా లేదా తమ పని తాము చేసుకోలేని వారిగా లేదా విపరీతమైన సెక్స్ పిచ్చి ఉండేవారిగా చూస్తారు'' అని డీపాలో అన్నారు.

సింగిల్ షేమింగ్‌లో సంస్కృతుల ప్రభావం కూడా ఉంటుంది. ముఖ్యంగా కొరియా, చైనా, భారత్‌ లాంటి సంస్కృతుల నుంచి వచ్చిన తన క్లయింట్లలో సింగిల్ షేమింగ్ ఎక్కువగా కనిపిస్తుందని అబ్రామ్స్ అన్నారు. ఈ సంస్కృతుల్లో పెళ్లితోపాటు జంటలు చేయాల్సిన పనులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. ''30ల వయసు వచ్చినప్పటికీ పిల్లలు లేకపోవడం సిగ్గుచేటని ఆ ప్రాంతం నుంచి వచ్చిన ఒక కుటుంబం భావిస్తున్నట్లు నాతో చెప్పింది''అని అబ్రామ్ వివరించారు.

సింగిల్ షేమింగ్

మారుతున్న పరిస్థితులు..

అసలు సింగిల్‌గా ఉండటం అంటే ఏమిటి? అనే నిర్వచనంలోనూ మార్పులు కనిపిస్తున్నాయి. ప్రజల ఆలోచనల్లో, జనాభాలో మార్పులు కూడా దీనికి కారణమని నిపుణులు భావిస్తున్నారు.

ఇటీవల కాలంలో కొంతమంది ప్రముఖులు తమ సోషల్ మీడియా వేదికల ద్వారా తమ సింగిల్ స్టేటస్‌ విషయంలో తాము గొప్పగా ఫీల్ అవుతున్నట్లు చెప్పారు. ఉదాహరణకు ఎమ్మా వాట్సన్‌ను తీసుకోండి. తనను తాను ''సెల్ఫ్ పార్ట్‌నర్డ్''గా ఆమె ప్రకటించుకున్నారు. తమకు రొమాంటిక్ భాగస్వామి లేకపోవడాన్ని కూడా పాజిటివ్‌గా చూడాలని ఆమె చెబుతున్నారు. ''సింగిల్‌గా తమను తాము గుర్తించుకుంటున్న వారి సంఖ్య పెరుగుతున్నప్పుడు.. ఇలా ఒంటరిగా జీవితం గడుపుతున్న చాలా మందికి సాంత్వన లభిస్తుంది''అని అబ్రామ్స్ అన్నారు.

డేటింగ్ ఆప్ బంబుల్ అక్టోబరు 2021లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, మెక్సికో, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్‌లలోని 8500 బంబుల్ యూజర్లలో 53 శాతం మంది ఒంటరిగా ఉండటంలోనూ తప్పేమీ లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా కోవిడ్-19 వ్యాప్తితో తమ ధోరణిలో చాలా మార్పు వచ్చిందని వివరించారు.

వీడియో క్యాప్షన్, మొదటి కలయిక తర్వాత కన్నెపొరకు ఏమవుతుంది, అసలు కన్యత్వంతో దానికి లింకేంటి?

నిజానికి కోవిడ్-19 వ్యాప్తి తర్వాత రిలేషన్‌షిప్ స్టేటస్ విషయంలో చాలా మందిలో సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. వైరస్ వ్యాప్తి సమయంలో ఒంటరిగా గడపడాన్ని ఆస్వాదించినట్లు 42 శాతం మంది మ్యాచ్ యూజర్లు వెల్లడించారు.

అయితే, ఇక్కడ మరో 58 శాతం మంది ఒంటరి జీవితాన్ని ఆస్వాదించలేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరోవైపు చాలామంది ఒంటరులపై కరోనావైరస్ మహమ్మాది ప్రతికూల ప్రభావాన్ని కూడా చూపించింది. అయితే, అమెరికా లాంటి దేశాల్లో పెరుగుతున్న ''సింగిల్స్'' వల్ల ఈ ధోరణుల్లో మార్పులు రావొచ్చని నిపుణులు అంటున్నారు.

జనాభాలో వస్తున్న ఈ మార్పుల వల్ల సింగిల్స్‌పై మన అభిప్రాయాలూ మారుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ''సెన్సస్ బ్యూరో తాజా గణాంకాలను విడుదల చేసేటప్పుడు ఒంటరిగా ఉండే వారి సంఖ్య క్రమంగా పెరుగతున్నట్లు కనిపిస్తోంది. ఇదివరకటి కంటే వీరి సంఖ్య ఎప్పుడూ ఎక్కువగానే ఉంటోంది''అని డీపాలో అన్నారు.

''అమెరికా లాంటి దేశాల్లో సగం జనాభా పెళ్లికాని వారే ఉన్నప్పుడు.. వారిలో ఏదో లోపం ఉందని ఆలోచించడంలో అసలు అర్థమేలేదని ప్రజలు కూడా గ్రహిస్తున్నారు''అని ఆమె వివరించారు.

వీడియో క్యాప్షన్, ప్రేమలో పడ్డారా, కామంలో కూరుకుపోయారా... ఎలా తెలుస్తుంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)