మురుగా మఠం అధిపతి స్వామి శివమూర్తిపై లైంగిక వేధింపుల కేసు... అసలేం జరిగింది?

స్వామి శివమూర్తి (కుడివైపు వ్యక్తి)

ఫొటో సోర్స్, Hindustan Times

ఫొటో క్యాప్షన్, స్వామి శివమూర్తి (కుడివైపు వ్యక్తి)
    • రచయిత, ఇమ్రాన్ ఖురేషి
    • హోదా, బీబీసీ కోసం

కర్నాటకలోని ప్రముఖ లింగాయత్ మఠాల్లో ఒకటైన మురుగా మఠం అధిపతి డాక్టర్ స్వామి శివమూర్తి మురుగా శరణరుపై ఇద్దరు బాలికలను లైంగికంగా వేధించారని ఆరోపణలు వచ్చాయి. ఆయనపై కేసు కూడా నమోదైంది.

షెడ్యూల్ కులాలు, తెగలపై అకృత్యాల నిరోధక చట్టం కింద స్వామి శివమూర్తిపై ఆరోపణలు మోపారు.

మైసూరులో పోక్సో చట్టం కింద శివమూర్తిపై ప్రాథమిక విచారణ నివేదిక కూడా పోలీసులు నమోదు చేశారు.

ఆరోపణలు చేసిన బాలికలు ఇద్దరూ మంగళవారం మేజిస్ట్రేట్ ఎదుట తమ వాంగ్మూలాన్ని సమర్పించారు.

ప్రస్తుతం మైసూరు నుంచి చిత్రదుర్గకు ఈ కేసును బదిలీ చేశారు. స్వామి శివమూర్తి మఠం చిత్రదుర్గలోనే ఉంది.

‘‘ఇద్దరు బాలికల్లో ఒకరు షెడ్యూల్ కులాలకు చెందినవారని చెప్పారు. దీంతో ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కూడా ఆరోపణలు మోపాం. మహిళా, శిశు సంక్షేమ విభాగానికి కూడా సమాచారం అందించాం’’అని చిత్రదుర్గ ఎస్పీ కే పరశురామ్ బీబీసీతో చెప్పారు.

లింగాయత్‌ల సదస్సు (పాత ఫోటో)

ఫొటో సోర్స్, GOPICHAND TANDLE

ఫొటో క్యాప్షన్, లింగాయత్‌ల సదస్సు (పాత ఫోటో)

మురుగా మఠం ఏం చెబుతోంది?

స్వామి శివమూర్తిపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిజమూలేదని మురుగా మఠం న్యాయవాది ఎన్‌బీ విశ్వనాథన్ బీబీసీతో చెప్పారు.

అయితే, మురుగా మఠం పరిధిలోని ఓ వసతి గృహంలో ఉండే హైస్కూల్ బాలికలను లైంగిక వేధించేవారని స్వామి శివమూర్తిపై ఫిర్యాదులో ఆరోపణలు ఉన్నాయి.

ఆ బాలికల వయసు 15, 16ఏళ్లు. మఠానికి అనుబంధంగా ఉండే పాఠశాలలోనే వీరిద్దరూ చదువుతున్నారు. ఆ వసతి గృహంలో ఉంటున్న మిగతా బాలికలను కూడా అధికారులు ప్రశ్నించారు.

లింగాయత్ మఠం

ఫొటో సోర్స్, GOPICHAND TANDLE

ఫొటో క్యాప్షన్, లింగాయత్ మఠం

150 విద్యా సంస్థలు..

కర్నాటకలో ఇతర మఠాల్లానే మురుగా మఠం కూడా దాదాపు 150 ఆధ్యాత్మిక, విద్యా సంస్థలను నడిపిస్తోంది. ఈ మఠం ప్రధాన కార్యాలయం చిత్రదుర్గలో ఉంది.

కర్నాటకలోని ప్రముఖ లింగాయత్‌ మఠాల్లో ఇది కూడా ఒకటి. 12వ శతాబ్దంనాటి సంఘ సంస్కర్త బసవన్నను లింగాయత్‌లు అనుసరిస్తారు. రాష్ట్ర జనాభాలో లింగాయత్‌ల వాటా 17 శాతం వరకు ఉంటుంది.

ఈ కేసులో స్వామి శివమూర్తి దాఖలు చేసుకున్న ముందస్తు జామీను పిటిషన్‌పై సెప్టెంబరు 1న చిత్రదుర్గ సెషన్సు కోర్టులో విచారణ జరుగనుంది.

వీడియో క్యాప్షన్, రుతుస్రావంతో ఉన్న మహిళలకు ఆలయ ప్రవేశం.. పాండురంగ దర్శనం కోసం యాత్రగా వస్తున్న భక్తులు

ఆలస్యం ఎందుకు?

మొదట ఆ ఇద్దరు బాలికలు చిత్రదుర్గ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారని, కానీ ఫలితం లేకపోవడంతో బెంగళూరు వెళ్లిపోయారని మైసూరుకు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘‘ఓడాండి సేవ’’ తెలిపింది.

‘‘వారు చిత్రదుర్గ పోలీసుల దగ్గరకు వెళ్లినా ఎలాంటి ఫలితమూ కనిపించలేదు. దీంతో వారు సొంత ఇళ్లకు వెళ్లిపోయారు. రాత్రిపూట నిద్రలో వారు భయంతో కేకలు వేస్తుంటే తల్లిదండ్రులు వారి పరిస్థితి అర్థం చేసుకున్నారు. మరోవైపు మళ్లీ ఆ స్కూలుకు, వసతి గృహానికి వెళ్లబోమని ఆ బాలికలు తల్లిదండ్రులకు తెగేసిచెప్పారు’’అని ఓడాండి సేవ వ్యవస్థాపకుల్లో ఒకరైన పరశురామ్ ఎంఎల్ చెప్పారు.

ఆ తర్వాత బాలికలు మైసూరులోని నజారాబాద్ పోలీసులను ఆశ్రయించారు.

అక్కడే పోక్సో చట్టంతోపాటు ఐపీసీలోని సెక్షన్ 376సీ, 376(3)(16) తదితర సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.

స్వామి శివమూర్తి, వసతి గృహం వార్డెన్‌తోపాటు ఐదుగురిపై ప్రాథమిక విచారణ నివేదిక నమోదుచేశారు.

చిత్రదుర్గలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఈ కేసును మైసూరు పోలీసులు అక్కడకు బదిలీ చేశారు.

వీడియో క్యాప్షన్, అల్లా-హు-అక్బర్ అంటూ నినాదాలు చేసిన ముస్లిం యువతి ముస్కాన్ ఇంటర్వ్యూ

‘‘చంపేస్తామని బెదిరించారు’’

ప్రస్తుతం మురుగా మఠం అడ్మినిస్టేటివ్ ఆఫీసర్ ఎస్‌కే బసవరాజన్‌పై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు మోపారు.

ఈకేసులో బసవరాజన్ భార్య సౌభాగ్యను కూడా నిందితురాలిగా పేర్కొన్నారు. బసవరాజన్.. జనతా దళ్ సెక్యులర్ (జేడీఎస్) మాజీ ఎమ్మెల్యే. ఆయన భార్య జిల్లా పంచాయత్ అధ్యక్షురాలిగా పనిచేశారు.

జులై 27న సాయంత్రం ఆరు గంటలకు బసవరాజన్ తమ వసతి గృహానికి వచ్చి వేధింపులకు పాల్పడ్డారని ఓ బాలిక ఆరోపణలు చేశారు.

‘‘బసవరాజన్ నాపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. నేను గట్టిగా అడ్డుకోవడంతో ఆయనకు కోపం వచ్చింది. నన్ను చంపేస్తానని బెదిరించారు’’ అని ఫిర్యాదులో ఆ బాలిక పేర్కొన్నారు.

బీఎస్ యడియూరప్ప

ఫొటో సోర్స్, RAVEENDRAN/AFP/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, బీఎస్ యడియూరప్ప

స్వామీజీ, రాజకీయాలు..

ఈ కేసు బయటకు వచ్చిన వెంటనే స్వామీ శివమూర్తికి కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బీఎస్ యడియూరప్ప మద్దతు ప్రకటించారు. ‘‘స్వామీజీపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిజమూలేదు. విచారణలో అదే విషయం తేటతెల్లం అవుతుంది’’అని ఆయన వ్యాఖ్యానించారు.

అయితే, ఈ కేసులో విచారణ తర్వాతే పూర్తి విషయాలు తేలుతాయని ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై అన్నారు.

మరోవైపు ఈ ఆరోపణల నడుమ ఎలాంటి గందరగోళానికి గురికావొద్దని అనుచరులకు స్వామి శివమూర్తి సూచించారు. ‘‘నా ప్రతిష్టను మసకబార్చేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఈ కేసులో పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నా’’అని ఆయన చెప్పారు.

లింగాయత్‌లను ప్రత్యేక మతంగా గుర్తించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినప్పుడు ఆ పార్టీకి స్వామి శివమూర్తి మద్దతు ప్రకటించారు. గత నెలలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఆయనను కలిశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)