భారత ఆర్ధిక వ్యవస్థ బ్రిటన్‌ను అధిగమించిందా, ఇది నిజమేనా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, దిల్‌నవాజ్ పాషా
- హోదా, బీబీసీ ప్రతినిధి
స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో భారత్ బ్రిటన్‌ను అధిగమించి ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. బ్లూమ్‌బర్గ్ తాజాగా వెల్లడించిన డేటా ప్రకారం 2022 మార్చి చివరి నాటికి బ్రిటన్‌ను భారతదేశం అధిగమించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) డేటా ఆధారంగా బ్లూమ్‌బర్గ్ ఈ నిర్ధరణకు వచ్చింది.
బ్లూమ్‌బర్గ్ చెప్పిన దాని ప్రకారం, ఈ ఏడాది మార్చి చివరి నాటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ విలువ 854.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కాగా, బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ 816 బిలియన్ డాలర్లు.
బ్లూమ్‌బెర్గ్ అంచనాల ప్రకారం, రాబోయే కొన్నేళ్లలో భారతదేశం బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను అధిగమించింది.
ఇండియా ఇటీవలే 75 సంవత్సరాల స్వాతంత్ర్యోత్సవాన్ని పూర్తి చేసుకుంది. 2017 నాటికి ప్రపంచంలోనే భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని సంకల్పించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
తలసరి ఆదాయంలో చాలా వెనుకబడిన భారత్
బ్రిటన్ జనాభా దాదాపు 7 కోట్లు కాగా, అంచనాల ప్రకారం ప్రస్తుతం భారతదేశ జనాభా దాదాపు 140 కోట్లు. బ్రిటన్ కంటే భారతదేశం పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం పెద్ద విషయం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే సంపద పరంగా భారతదేశం బ్రిటన్ కంటే ఇరవై రెట్లు వెనుకబడి ఉంది.
"ఆర్థిక వ్యవస్థ మొత్తం పరిమాణంలో భారతదేశం బ్రిటన్‌ను అధిగమిస్తుంది. కానీ, ముఖ్యమైన విషయం ప్రజల ఆర్థిక పరిస్థితి. బ్రిటన్ తలసరి ఆదాయం ఇప్పటికీ 45,000 డాలర్లకు పైగానే ఉంది. అదే ఇండియాలో తలసరి ఆదాయం ఏడాదికి కేవలం 2,000 డాలర్లు మాత్రమే" అని సీనియర్ జర్నలిస్ట్, ఆర్థిక విశ్లేషకుడు ఎం.కె. వేణు అన్నారు.
రెండు దేశాల ఆర్ధిక వ్యవస్థలను పోల్చాలంటే తలసరి ఆదాయాలను పోల్చి చూడటం సరైన విధానమని వేణు అన్నారు.
''ఈ విషయంలో భారతదేశం ఇప్పటికీ యూకే కన్నా చాలా వెనుకబడి ఉంది. తలసరి ఆదాయంలో భారతదేశం చాలా వెనుకబడిన దేశాల జాబితాలో ఉంది. ఈ పరిస్థితుల్లో ఆర్థిక పరంగా భారత్ బ్రిటన్‌ను అధిగమించిందని చెప్పడం సరికాదు'' అన్నారు వేణు.
ఇదే విషయాన్ని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆర్ధిక వ్యవహారాల నిపుణుడు అరుణ్ కుమార్ కూడా చెప్పారు.
''భారత జనాభా బ్రిటన్ జనాభా కంటే ఇరవై రెట్లు ఎక్కువ. మన జీడీపీ వారి జీడీపీతో సమానంగా ఉన్నామంటే, తలసరి ఆదాయంలో మనం 20 రెట్లు వెనకబడి ఉన్నామని అర్ధం. యూకే ఆర్ధిక వ్యవస్థను, భారత ఆర్ధిక వ్యవస్థను పోల్చడం సరికాదు. తలసరి ఆదాయంలో మనం యూకే కన్నా చాలా వెనకబడి ఉన్నాం'' అన్నారు ప్రొఫెసర్ అరుణ్ కుమార్.

ఫొటో సోర్స్, Getty Images
సవాళ్లు ఎదురైనా...
కోవిడ్ మహమ్మారి, యుక్రెయిన్ యుద్ధం ఉన్నప్పటికీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ పురోగతి సరైన దిశలో ఉందనడానికి ఇది సంకేతమని స్టాక్ మార్కెట్ ట్రాకింగ్ కంపెనీ కేడియా క్యాపిటల్ రీసెర్చ్ హెడ్ అజయ్ కేడియా అభిప్రాయపడ్డారు.
"ఇంతకు ముందు మనకు అభివృద్ధి చెందుతున్న లేదా వెనుకబడిన దేశంగానే పేరుంది. కానీ, ఇప్పుడు భారతదేశం ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. గత పదేళ్లలో లేదా 1990లలో భారతదేశం తీసుకున్న చర్యలు వాటి ప్రభావాన్ని చూపించాయి. భారతదేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు పెరిగాయి. 9వ దశకంలో భారతదేశం దగ్గర పరిమిత నిల్వలు మాత్రమే ఉన్నాయి. కానీ, నేడు భారతదేశం అతిపెద్ద విదేశీ మారక నిల్వలున్న నాలుగు దేశాలలో ఒకటి" అని కేడియా అన్నారు.
"బ్రిటన్, పశ్చిమ ఐరోపా దేశాల ఆర్థిక వ్యవస్థలు కుంచించుకుపోతున్నప్పటికీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా పురోగమిస్తోంది. ఎన్ని సవాళ్లు ఎదురైనా, భారతదేశం తన వృద్ధి రేటును కొనసాగించింది" అని కేడియా అన్నారు.
"ప్రస్తుతం పాశ్చాత్య దేశాల ఆర్థిక వ్యవస్థలలో క్షీణత ఉంది. దాని నుండి భారతదేశం కూడా లాభపడింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా పురోగమిస్తోంది. అయితే భారతదేశ ఆర్థిక వ్యవస్థ రాబోయే నాలుగు-ఐదేళ్ల పాటు వృద్ధి చెందుతూనే ఉన్నప్పటికీ, ప్రజల వ్యక్తిగత ఆదాయం పాశ్చాత్య దేశాల స్థాయికి చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది'' అని వేణు అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
యుక్రెయిన్ యుద్ధం ప్రభావం
యుక్రెయిన్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా అనేక ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపింది. పాశ్చాత్య దేశాలే కాకుండా దక్షిణాసియా కూడా దీని బారిన పడుతోంది.
శ్రీలంక ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉంది. వివిధ కారణాల వల్ల పాకిస్తాన్ ఆర్ధిక రంగం కూడా క్షీణ దశకు చేరుకుంది. బంగ్లాదేశ్ ఎకానమీ మాత్రం చాలా విషయాల్లో రాణిస్తోంది, సవాళ్లను కూడా ఎదుర్కొంటుంది.
దక్షిణాసియా దేశాలలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ మిగతా వాటికన్నా మరింత స్థిరంగా, మెరుగైన స్థితిలో ఉంది. అయితే, ఇతర దక్షిణాసియా దేశాలతో భారత్‌ను పోల్చలేమని విశ్లేషకులు భావిస్తున్నారు.
"దక్షిణాసియాలో గత ఒకటి లేదా రెండు సంవత్సరాలలో బాగా ఉన్న ఆర్థిక వ్యవస్థలు కూడా ప్రభావితమవడం మనం చూశాం. ముఖ్యంగా యుక్రెయిన్ యుద్ధం తరువాత, ద్రవ్యోల్బణం ప్రభావం అందరిపై కనిపించడం ప్రారంభించింది. కానీ భారతదేశం ఈ ప్రభావాలను చాలా వరకు తగ్గించగలిగింది. శ్రీలంక, బంగ్లాదేశ్ లేదా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలతో భారతదేశాన్ని పోల్చలేము ఎందుకంటే, ఈ దేశాలన్నింటి కంటే భారతదేశం చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థ'' అన్నారు అజయ్ కేడియా. అరుణ్ కుమార్ కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించారు.
భారతదేశం తన విదేశాంగ విధానం, వ్యూహాలతో యుక్రెయిన్ యుద్ధం ప్రభావాన్ని చాలా వరకు తగ్గించగలిగిందని కేడియా అభిప్రాయపడ్డారు.
"మనం మందుల కోసం ఇతర దేశాలపై ఆధారపడిన సందర్భాలున్నాయి. పోలియో కాలంలో కూడా విదేశాలపై ఆధారపడ్డాం. కానీ, కోవిడ్ నాటికి స్వావలంబన సాధించాం'' అన్నారు కేడియా.
యుక్రెయిన్ యుద్ధం చాలా కాలం పాటు కొనసాగుతుందని, దాని ప్రభావం భారత్‌పై కూడా ఉండొచ్చని అరుణ్ కుమార్ చెప్పారు.
"ప్రస్తుతం యుక్రెయిన్‌లో యుద్ధం జరుగుతోంది. ఒకవైపు యూరప్, అమెరికా దేశాలు యుక్రెయిన్‌కు మద్దతిస్తున్నాయి. మరోవైపు రష్యా ఉంది. ఈ యుద్ధంలో ఏ పక్షమూ ఓడిపోవాలని కోరుకోదు. పరాజయం పాలైన వెంటనే వాళ్లు పతనం అంచుకు చేరుకుంటారు. ఇది ఆర్థిక సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. ఇది ఒక విధంగా కొత్త ప్రచ్ఛన్న యుద్ధం. భారత దేశం సహా ప్రపంచ దేశాలపై దీని ప్రభావం పడటం ఖాయం. కాబట్టి భారత్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి'' అన్నారు అరుణ్ కుమార్.

ఫొటో సోర్స్, Getty Images
గణాంకాలపై సందేహాలు
జీడీపీ పరంగా భారతదేశం బ్రిటన్‌ను అధిగమించి ఐదో స్థానానికి చేరుకుంది. అయితే, కొంతమంది విశ్లేషకులు ఈ గణాంకాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
"2019-20కి ముందు కూడా మనం బ్రిటన్‌ను దాటుతామని అనుకున్నాము. కానీ, కోవిడ్ మహమ్మారి వచ్చి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. ఇప్పుడు ఎకానమీ తిరిగి గాడిన పడిందని ప్రభుత్వం చెబుతోంది. వృద్ధి రేటు ఏడున్నర శాతంగా ఉంది. కానీ ఈ గణాంకాలు కేవలం సంఘటిత రంగంపై ఆధారపడి ఉన్నాయి. అసంఘటిత రంగాన్ని చేర్చలేదు" అని అరుణ్ కుమార్ అన్నారు.
"నా అంచనా ప్రకారం, భారతదేశంలోని 94 శాతం మంది కార్మికులు అసంఘటిత రంగంలో పని చేస్తున్నారు. దేశ ఉత్పత్తిలో 45 శాతం వాటాను కలిగి ఉన్నందున భారతదేశ ఆర్థిక వ్యవస్థ వాస్తవ గణాంకాలలో ఐదో స్థానం నుండి ఏడో స్థానానికి చేరుకుంది. అసంఘటిత రంగంలో స్థిరమైన క్షీణత ఉంది. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి సమయంలో ఈ రంగంలో క్షీణత ఉంది. కానీ ఈ గణాంకాలు మా అంచనాలో చేర్చలేదు. కేవలం వ్యవస్థీకృత రంగ గణాంకాలను మాత్రమే చేర్చాము" అన్నారాయన.
ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) డేటా ఆధారంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి బ్లూమ్‌బెర్గ్ తాజా అంచనా వేసింది. అయితే, ఐఎంఎఫ్ డేటాపై ప్రొఫెసర్ అరుణ్ కుమార్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
''ఐఎంఎఫ్ డేటా ఆధారంగా మనం ఐదో స్థానానికి వచ్చామని చెబుతున్నారు. అయితే ఐఎంఎఫ్ వద్ద సొంతంగా ఎలాంటి డేటా లేదు. ఇది భారతదేశంలో సంఘటిత రంగానికి సంబంధించిన డేటా. అంటే కార్పొరేట్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. కానీ, అసంఘటిత రంగం వెనుకకు నడుస్తోంది. దీని అర్థం మన పంపిణీ నిరంతరం దిగజారుతోంది. ఉన్నత తరగతి బాగానే ఉంది, దాని ఆదాయం పెరుగుతోంది. కానీ దిగువ తరగతి వారు పేదలుగా మారుతున్నారు" అన్నారు ప్రొఫెసర్ అరుణ్ కుమార్.

భారత్‌లో పెరిగిన ఆర్థిక అసమానతలు
భారతదేశపు లేబర్ పోర్టల్‌లో 27.5 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 94% మంది ప్రతి నెలా పది వేల రూపాయల లోపు సంపాదిస్తున్నారని చెప్పారు.
"ద్రవ్యోల్బణం పెరుగుతున్నందున వారి ఆదాయం పడిపోయింది. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు, సంఘటిత రంగంలో డియర్‌నెస్ అలవెన్స్ లభిస్తుంది, కానీ, అసంఘటిత రంగంలో జీతం పెరగదు'' అన్నారు ప్రొఫెసర్ అరుణ్ కుమార్.
భారతదేశం ఆర్థికంగా పురోగమిస్తోంది, అయితే అందరికీ ఒకే రకమైన ప్రయోజనాలు అందడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
"భారతదేశంలో పారిశ్రామిక ఉత్పత్తి, సేవలు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పెరుగుతోంది. అయితే, వాటి ప్రయోజనాలు ఎంత మందికి చేరుతున్నాయన్నది ప్రశ్న. చాలామంది రూ. 10వేల లోపే సంపాదిస్తున్నారు. రోజువారీ అవసరాల కోసం పోరాడుతున్నారు" అని ఆర్ధిక నిపుణుడు ఎం.కె. వేణు అన్నారు.

ఫొటో సోర్స్, AFP
ఇండియా ముందున్న సవాళ్లు
కోవిడ్ మహమ్మారి తర్వాత భారతదేశంలో ఉపాధి సంక్షోభం చాలా తీవ్రంగా మారింది. యువత ఉద్యోగాల కోసం వీధుల్లోకి రావాల్సి వస్తోంది.
సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రకారం, జూలై 2022లో భారతదేశంలో నిరుద్యోగం రేటు 6.80 శాతంగా ఉంది. జూన్‌లో ఈ రేటు 7.80 శాతంగా ఉంది.
భారత ఆర్థిక వ్యవస్థ ముందు ఇంకా చాలా పెద్ద సవాళ్లు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
''ప్రస్తుతం భారతదేశ ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద సవాలు నిరుద్యోగం. యువత నిరాశలో ఉన్నారు. అసంఘటిత రంగంలో ఈ యువకులు అత్యధిక పనిని పొందాలి. అసంఘటిత రంగం బలహీనపడుతోంది, నిరుద్యోగం కూడా పెరుగుతోంది'' అన్నారు ప్రొఫెసర్ అరుణ్ కుమార్.
అదే సమయంలో ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉండడం కూడా భారత ఆర్థిక వ్యవస్థ ముందున్న పెద్ద సవాలు.
''ప్రపంచ నిష్పత్తితో పోల్చితే భారతదేశ కార్మిక మార్కెట్‌లో మహిళల భాగస్వామ్యం అత్యల్పంగా ఉంది. కేవలం 19 శాతం మంది మహిళలు మాత్రమే జాబ్ మార్కెట్‌లో ఉన్నారు. యూపీ, బిహార్ వంటి రాష్ట్రాల్లో ఇది పది శాతానికి పైగా ఉంది. ఇది చాలా తక్కువ. ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెరగకపోతే భారత ఆర్థిక వ్యవస్థకు మున్ముందు సవాళ్లు ఎదురవుతాయి'' అని ఎం.కె. వేణు అభిప్రాయపడ్డారు.
అయితే, సవాళ్లు ఉన్నప్పటికీ, భారతదేశం ఆర్థికంగా సరైన దిశలో పయనిస్తోందని అజయ్ కేడియా అన్నారు.
"భారతదేశం కచ్చితంగా సవాళ్లను ఎదుర్కొంటోంది. అయితే ప్రస్తుతం సరైన దిశలో పయనిస్తోంది. రాబోయే కొద్ది సంవత్సరాలలో భారతదేశం కూడా ఇలాగే ఉంటుందని చెప్పవచ్చు'' అన్నారాయన.
ఇవి కూడా చదవండి:
- నరేంద్ర మోదీని రాజులా, యోగిలా కొలిచిన నేపాలీ హిందువులు ఇప్పుడు ఏమంటున్నారు?
- 'వీగర్ ముస్లింలపై చైనా ప్రభుత్వానిది మారణహోమం.. కళ్లుమూసుకుని కూర్చోకండి’
- ఏమిటీ ‘స్మోకింగ్ పనిష్మెంట్’ టెక్నిక్.. ఇలా చేస్తే సిగరెట్లు మానేయవచ్చా
- మీరు డార్క్ చాక్లెట్‌ను ఇష్టంగా తింటారా, అది ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా?
- ప్రేమలో విఫలమయ్యారా? ఆ బాధ నుంచి కోలుకోవడం ఎలా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













