Saudi Aramco: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మొత్తం అప్పులు తీర్చడానికి ఈ కంపెనీ 6 నెలల లాభాలు చాలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్

ఫొటో సోర్స్, Telangana CMO

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల అప్పులు తీర్చడానికి ఒక కంపెనీ ఆరు నెలల లాభాలు సరిపోతాయి. వినడానికి కాస్త ఆశ్చర్యంగానే ఉన్నా ఇది నిజమే.

2022 మార్చి నాటికి తెలంగాణ రాష్ట్రం అప్పులు 3లక్షల 12వేల 191కోట్ల రూపాయలు. అదే ఆంధ్రప్రదేశ్ అప్పులు 3లక్షల 98వేల 903 కోట్లు.

రెండు రాష్ట్రాల అప్పులు కలిపితే సుమారు రూ.7.11 లక్షల కోట్లు.

సౌదీ అరేబియా ప్రభుత్వ ఆయిల్ కంపెనీ 'సౌదీ ఆరామ్‌కో'‌కు గత ఆరు నెలల్లో వచ్చిన లాభాలు ఎంతో తెలుసా. సుమారు 87.4 బిలియన్ డాలర్లు. మన రూపాయల్లో చెప్పాలంటే దాదాపు రూ.7 లక్షల కోట్లు.

2022 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో సౌదీ ఆరామ్‌కోకు రికార్డు స్థాయిలో 48.4 బిలియన్ డాలర్ల లాభం వచ్చింది. ఆ లాభం విలువ రూపాయల్లో సుమారు 3.82 లక్షల కోట్లు.

2021 ఏప్రిల్-జూన్ త్రైమాసికంతో పోలిస్తే ఇది 90శాతం ఎక్కువ.

దేశమైతే 88వ స్థానం

  • సౌదీ ఆరామ్‌కో ఏప్రిల్-జూన్ త్రైమాసిక లాభం 48.4 బిలియన్ డాలర్లు
  • ఒకవేళ ఈ కంపెనీ దేశమైతే వరల్డ్ బ్యాంక్ జాబితాలోని 207 దేశాల్లో 88వ స్థానంలో నిలుస్తుంది.
  • 53.9 బిలియన్ డాలర్ల జీడీపీతో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశం సౌదీ ఆరామ్‌కో కంటే ముందు ఉంటుంది.
  • 46.8 బిలియన్ డాలర్ల జీడీపీతో టూనిసియా దేశం ఆ కంపెనీకి వెనుక ఉంటుంది.
  • బొలీవియా, పరాగ్వే, ఎల్ సాల్వడార్, హోండూరస్, హైతీ వంటి దేశాల జీడీపీ కంటే కూడా సౌదీ ఆరామ్‌కో త్రైమాసిక లాభాలే ఎక్కువ.

సౌదీ ఆరామ్‌కో మార్కెట్ విలువ ప్రస్తుతం 8.76 ట్రిలియన్ డాలర్లు. ఇది ప్రపంచంలోని సగం దేశాల జీడీపీ కంటే చాలా ఎక్కువ.

సౌదీ ఆరామ్‌కో చమురు కంపెనీ

ఫొటో సోర్స్, Getty Images

కలిసొచ్చిన రష్యా-యుక్రెయిన్ యుద్ధం

రష్యా-యుక్రెయిన్ యుద్ధంతో ముడిచమురు ధరలు పెరగడం కంపెనీకి బాగా కలిసొచ్చింది. ప్రపంచంలో ముడి చమురు భారీగా ఎగుమతి దేశాల్లో రష్యా ఒకటి. కానీ యుక్రెయిన్ మీద రష్యా దాడి వల్ల ఆ దేశం ముడి చమురు కొనుగోలు చేయడాన్ని తగ్గించాలని పశ్చిమ దేశాలు నిర్ణయించాయి.

పెరిగిన ముడిచమురు ధరల వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక చమురు కంపెనీలు లాభపడ్డాయి. అమెరికాకు చెందిన ఎక్జాన్ మోబిల్, బ్రిటన్‌కు చెందిన బీపీ కంపెనీల లాభాలు బాగా పెరిగాయి.

చమురు కంపెనీల కళ్లు చెదిరే లాభాలు చూస్తున్న కొందరు వాటి మీద భారీగా పన్నులు విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు ప్రజల బతుకు భారమవుతుంటే కంపెనీల లాభాలు పెరుగుతూ పోతున్నాయని విమర్శిస్తున్నారు.

గత జూన్‌లో 'ఈ ఏడాది దేవుని కంటే ఎక్జాన్ కంపెనీకే ఎక్కుల ఆదాయం వచ్చింది' అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు.

చమురు ఉత్పత్తి

ఫొటో సోర్స్, Reuters

ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్(ఒపెక్)‌లో అతి పెద్ద ముడిచమురు ఉత్పత్తిదారుగా సౌదీ అరేబియా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలను తగ్గించేందుకు చమురు ఉత్పత్తి, సరఫరా పెంచాలని బైడెన్ వంటి నేతలు పిలుపునిచ్చారు.

కానీ ఒపెక్ దేశాలతోపాటు రష్యా వంటి ఇతర చమురు ఉత్పత్తి దేశాలు ఉండే ఒపెక్ ప్లస్ కూటమి ముడిచమురు ఉత్పత్తి స్వల్పంగా పెంచాలని నిర్ణయించాయి. తద్వారా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు కొంత మేరకు తగ్గే అవకాశం ఉంది.

ఇక అనుకున్న మాదిరిగానే మూడో త్రైమాసికంలో 18.8 బిలియన్ డాలర్లు డివిడెండ్ ఇస్తామని సౌదీ ఆరామ్‌కో తెలిపింది.

వీడియో క్యాప్షన్, 35ఏళ్ల వయసులో తండ్రి అవుతున్నారా? పిల్లలకు ఈ అనారోగ్య ముప్పు ఉంది జాగ్రత్త

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)