Cost of living: 'ఇష్టమైన భోజనం మర్చిపోదాం... ఏదో ఒకటి తిని బతుకుదాం' - అయిదు దేశాల్లో అధిక ధరల కష్టాలు

ఫొటో సోర్స్, Ben Gray
- రచయిత, స్టెఫానీ హెగార్టీ
- హోదా, పాపులేషన్ కరస్పాండెంట్, బీబీసీ వరల్డ్ సర్వీస్
ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఆకాశాన్నంటిన ఆహార ధరలకు అలవాటుపడిపోతున్నారు. కొన్నిసార్లు తాము తినే ఆహారాన్ని కూడా మార్చుకుంటున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఆహారం చాలా ఖరీదైనదిగా మారిపోయింది. కొన్నిసార్లు లభించడం లేదు కూడా. ప్రతిచోటా ప్రజలు కొత్త పరిస్థితులకు అలవాటు పడుతున్నారు. వారు తినే పదార్థాలను మార్చుకుంటున్నారు.
యూఎస్‌లో అర్థరాత్రి వాల్‌మార్ట్‌కు పరుగులు
అది వేకువజాము 4 గంటలు. అప్పటికే చెమటలు కక్కుకునేలా చేసే జిడ్డుగారే వాతావరణం నెలకొంది. వేసవి కారణంగా జార్జియా వైపు నుంచి వచ్చే వేడి గాలులే ఇలాంటి పరిస్థితిని కలిగించాయి.
అదే సమయంలో డొన్నా మార్టిన్ విధుల నిర్వహణ నిమిత్తం బయలుదేరారు. రోజు మారితే చాలు ఆమెకు మరో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. తన స్కూల్ డిస్ట్రిక్ట్‌లోని పిల్లలకు ఆహారం అందించడం ఎలా అన్నది ఆమెకు సవాలుగా మారింది.
మార్టిన్ ఫుడ్ సర్వీస్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. 4,200 మంది పిల్లలకు ఆహారం సరఫరా చేయాల్సిన బాధ్యత ఆమెది. ఈ పిల్లలు అందరూ ఫెడరల్ ఫ్రీ స్కూల్ మీల్స్ కార్యక్రమం కింద లబ్ధిపొందుతున్నవారే.
"మా మొత్తం కమ్యూనిటీ ప్రాంతంలో 22,000 మంది నివసిస్తుంటే కేవలం రెండు గ్రోసరీ స్టోర్లు మాత్రమే ఉన్నాయి" అని ఆమె చెప్పారు. "ఇది నిజంగా ఆహార ఎడారిలాంటిది" అని వ్యాఖ్యానించారు.
తనకు అవసరమైన ఆహార పదార్థాలు కొనుగోలు చేయడం కోసం గత ఏడాదిగా ఆమె పోరాటమే చేయాల్సి వస్తోంది.

ఫొటో సోర్స్, Ben Gray
వార్షిక ఆహార ద్రవ్యోల్బణం జులైలో 10.9%కు చేరుకుంది. 1979 తరువాత ఇదే అత్యధికం. ధరలు విపరీతంగా పెరుగుతుండడంతో కొందరు ఆహార సరఫరాదార్లు పాఠశాలలకు సప్లయి చేయడానికి ముందుకు రావడం లేదు.
దీనిపై మార్టిన్ మాట్లాడుతూ "వారు నాతో ఇలా చెబుతున్నారు; 'మేమేమీ సమాధానం చెప్పలేకపోతున్నాం. పెద్దగా ఏమీ మిగలడం లేదు' అని అంటున్నారు" అని చెప్పారు.
యూఎస్‌లోని ఫెడరల్ స్కూల్ మీల్స్ ప్రోగ్రాం పూర్తిగా నియంత్రణలోనే ఉంటుంది. అంటే సూచించిన ప్రమాణాల మేరకే అందజేయాల్సి ఉంటుంది.
బ్రెడ్ క్రంబ్స్‌పై చికెన్ నగ్గెట్స్ ఉన్న పదార్థాలను హోల్ మీల్‌గా ఇవ్వాల్సి ఉంటుంది. ఆహారంలో చక్కెర, ఉప్పు తక్కువగా ఉండాలి.
ఇలాంటి నిబంధనలు ఉండడంతో మార్టిన్ కొన్ని రకాల ఆహార పదార్థాలను మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆహార ధాన్యాలు, చక్రాల్లాంటి రొట్టెలు అయిన బాగెల్స్, యోగర్ట్స్, ఇలా ప్రతి ఒక్కంటినీ ఆ సూచనలకు అనుగుణంగా ఉండే విధంగానే కొనుగోలు చేయక తప్పదు.
ఇలాంటి ప్రమాణాల మేరకు ఆహార పదార్థాలను సరఫరా చేయడంలో సప్లయిదార్లు కూడా ఇబ్బందులు పడుతున్నారన్న విషయం మార్టిన్‌కు తెలుసు.
కార్మికుల కొరత నిరంతర సమస్యగా ఉందంటే వారికి డ్రైవర్లు దొరకరు. గత ఏడాది నుంచి ఇంధనం ధరలు 60% మేర పెరిగాయి.
- యూఎస్‌లో వార్షిక ఆహార ద్రవ్యోల్బణం జులై నాటికి 10.0%గా ఉంది.
- అమెరికన్లు తమ ఆదాయంలో 7.1% మేర ఆహారం కోసం వెచ్చిస్తున్నారు. (యూఎస్‌డీఏ 2021)
సరఫరాదార్లు సరకులను అందివ్వలేకపోతున్న సందర్భాల్లో ఆమె మరిన్ని వనరులను సమకూ ర్చుకోవాల్సి ఉంటుంది.
ఇటీవల ఆమె పిల్లలు ఎంతో ఇష్టపడే పీనట్ బటర్‌ను సంపాదించలేకపోయారు. దాంతో ఆమె దానికి బదులుగా బీన్ డిప్‌ను అందించారు.
"దీన్ని పిల్లలు అంతగా ఇష్టపడరని నాకు తెలుసు. అయితే నేను వారికి ఎదో ఒకటి తినడానికి పెట్టాల్సి ఉంటుంది కదా" అని ఆమె అన్నారు.
చాలా సందర్భాల్లో ఆమె, సిబ్బంది కలిసి అర్ధరాత్రులు, తెల్లవారు జాముల్లో వాల్‌మార్ట్‌ల వంటి స్థానిక స్టోర్లలో కావాల్సిన ఆహార పదార్థాల కోసం వెతుకుతుంటారు.

ఫొటో సోర్స్, Chamil Rupasinghe
శ్రీలంకను ఆదుకుంటున్న పనస
సెంట్రల్ శ్రీలంకలోని కాండీ నగరం చట్టూ ఒకప్పుడు వరిపొలాలు ఉండేవి. ప్రస్తుతం అక్కడ కూరగాయ తోటలు కనిపిస్తున్నాయి.
గుబురుగా పెరిగిన మొక్కల్లో తిరుగుతూ అనోమా కుమారి పరంతల పచ్చని చిక్కుళ్లను ఏరుతున్నారు. తాజా పుదీనాను కోస్తున్నారు.
ఇక్కడి పరిస్థితులు గమనించి దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న గందరగోళాన్ని ఊహించడం కష్టమే. ఎందుకంటే ప్రభుత్వం, ఆర్థిక వ్యవస్థ రెండూ కుంగిపోతుండడంతో ఏమి జరుగుతోందో చెప్పడం కష్టం.
దేశంలో ప్రతిదానికీ కొరత ఉంది. మందులు, ఇంధనం, ఆహారం- ఇలా ప్రతి వస్తువూ లభ్యం కావడం లేదు మంచి ఉద్యోగాలు ఉన్నవారు సయితం కనీస అవసరాలు తీర్చుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు.
"ఇప్పడు ప్రజలంతా భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. తినడానికి ఏమీ దొరకని పరిస్థితి వస్తుందని భయపడుతున్నారు" అని పరంతల చెప్పారు.
ఆమె పనిచేస్తున్న భూమి వారి కుటుంబానికి చెందినదే. కరోనా మహమ్మారి సమయంలో ఏదో సరదా కోసం అక్కడ కూరగాయల మొక్కలు నాటారు. ఇప్పడు అవే వారి మనుగడకు ఆధారంగా మారాయి.
*శ్రీలంకలో వార్షిక ఆహార ద్రవ్యోల్బణం జూన్ నాటికి 75.8%గా ఉంది.
* లంకేయులు తమ ఆదాయంలో 29.6% మొత్తాన్ని ఆహారంపై వెచ్చిస్తారు.
శ్రీమతి పరంతల పుస్తకాలు చదివి, యూట్యూబ్ లో వీడియోలు చూసి కూరగాయల పెంపకాన్ని సొంతంగా నేర్చుకున్నారు.
ప్రస్తుతం ఆమె పొలంలో టమోటాలు, బచ్చలి వంటి ఆకుకూరలు, బీరకాయ వంటి కూరగాయలు, చేమకూర దుంపలు, చిలగడ దుంపలు పండిస్తున్నారు.
ఇలా పొలాలను కలిగి ఉండే అదృష్టం శ్రీలంకలో ప్రతి ఒక్కరికి ఏమీ లేదు.
అయితే చాలా మంది లంకేయులు మరో ఆహార వనరుపై దృష్టిసారించారు. అదే పనసచెట్టు.
దీనిపై శ్రీమతి పరంతల మాట్లాడుతూ "ప్రతి తోటలోనూ పనస చెట్లు ఉంటాయి. ఇటీవలి కాలం వరకు ప్రజలు వీటికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. చెట్ల మీదనే పళ్లు మగ్గి కిందికి రాలిపడిపోయేవి. అవన్నీ వృథా అయ్యేవి. వీటిని ఇప్పడు ఆహారంగా తీసుకుంటున్నారు" అని తెలిపారు.

ఫొటో సోర్స్, CHAMIL RUPASINGHE
ఇప్పుడు ఆమె కొబ్బరికోరు, పనసకాయ ముక్కలతో మంచి కూర వండుతున్నారు. కూరగాయలు, మాంసం కొనడంతో ఖరీదైన వ్యవహారంగా మారడంతో వాటికి ప్రత్యామ్నాయంగా ఈ కొబ్బరి- పనసకాయ కూరకు ఆదరణ పెరిగింది.
పనస కాయ ముక్కల వేపుడు 'కొట్టు' ఇప్పడు పాపులర్ స్టీట్ ఫుడ్‌గా ప్రాచుర్యం పొందుతోంది.
పనస పిక్కల రుబ్బుతో ఇప్పడు కొందరు బ్రెడ్, కేక్‌లు, రోటీలు తయారు చేస్తున్నారు.
ఎప్పటికప్పుడు నూతనత్వాన్ని చూపించే ప్రపంచంలోని ప్రముఖ రెస్టారెంట్ల మెనూల్లో గత కొన్నేళ్లుగా మాంసానికి ప్రత్యామ్నాయంగా పనస కాయ వంటలు దర్శనమిస్తున్నాయి. ఇప్పడు ఇక్కడ గత్యంతరం లేక పనసకాయల వంటకాలను తింటున్నారు. పనస పెరిగే ప్రాంతంలోనే ఆహార సంక్షోభం నెలకొన్న కారణంగా అది ఇప్పుడు పాపులర్ వంటకంగా మారింది.
మరి, పనస పండు రుచి ఎలా ఉంటుంది?
" అది వర్ణించలేనిది. స్వర్గంలా ఉంటుంది" అని పరంతల అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, TOM SAATER
నైజీరియాలో కనుమరుగు కానున్న బేకరీలు
నైజీరియాకు చెందిన ఎమ్మాన్యుయెల్ ఒనౌరాకు రాజకీయాలు ఉంటే పెద్దగా ఆసక్తి ఉండదు. ఆయన బేకర్. ఆయన శ్రద్ధ అంతా బ్రెడ్ అమ్మకాలపైనే ఉండేది.
అయితే ఇకపై ఈ ఉపాధిలో కొనసాగడం అసాధ్యమేమోనన్న పరిస్థితి ఇటీవల కాలంలో ఆయనకు ఎదురయింది.
"ఏడాది కాలంలో గోధుమ పిండి ధర 200%కు మించి పెరిగింది. చక్కెర ధర దాదాపుగా 150% మేర అధికమయింది. బేకింగ్‌లో ఉపయోగించే కోడి గుడ్ల రేటయితే సుమారు 120% మేర పెరిగింది" అని ఆయన వివరించారు.
"మేం నష్టాల్లో ఉన్నాం" అని ఆయన చెప్పారు.
ఆయన వద్ద మొత్తం 350 మంది పనిచేస్తుండగా అందులో 305 మందికి లేఆఫ్ ఇచ్చారు.
"వారు కుటుంబాలను ఎలా పోషించుకోగలుతారు? " అని ప్రశ్నించారు.
ప్రీమియం బ్రెడ్ మేకర్స్ అసోసియేషన్ ఆఫ్ నైజీరియాకు అధ్యక్షునిగా కూడా వ్యవహరిస్తున్న ఒనౌరో బేకరీల సమస్యలపై జరుగుతున్న ఉద్యమానికి కేంద్ర బిందువుగా ఉన్నారు.
జులై నెలలో దాదాపు అయిదు లక్షల మంది బేకర్లు నాలుగు రోజుల పాటు "సేవల ఉపసంహరణ" ఆందోళన చేపట్టి బేకరీల తలుపులు మూసివేశారు. ఈ ఉద్యమంలో ఆయన చాలా కీలకంగా వ్యవహరించారు.
తమ సమస్యలను ప్రభుత్వం గుర్తించి, తాము దిగుమతులు చేసుకునే వస్తువులపై పన్నులు తగ్గిస్తుందని ఆశతో ఆయన ఉన్నారు.
పంటలు సరిగ్గా పండకపోవడం, కరోనా అనంతరం గోధుమలు. విజిటబుల్ ఆయిల్స్‌కు డిమాండ్ అధికమవడంతో ప్రపంచ వ్యాప్తంగా వాటి ధరలు పైకి ఎగబాకాయి. ఉక్రెయిన్‌ను దురాక్రమణ చేయడం పరిస్థితులను మరింత దిగజార్చాయి.
నైజీరియాలో బేకరీలకు అవసరమైన పదార్థాలను ఎక్కువగా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. యూరోప్‌తో పోల్చితే ఇక్కడ బ్రెడ్ ధరలు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల రొట్టెల తయారీకి ఉపయోగించే వస్తువుల ధరలు ఏమాత్రం పెరిగినా వాటిని ఇక్కడ భరించడం చాలా కష్టంగా ఉంటుంది.
*నైజీరియాలో జులై నాటికి వార్షిక ఆహార ద్రవ్యోల్బణం 22% గా ఉంది.
* నైజీరియన్లు తమ ఆదాయంలో 59.1% ఆహారంపై వెచ్చిస్తారు.
దేశంలో విద్యుత్తు సరఫరా అధ్వానంగా ఉంటుంది. దాంతో చాలా మంది వ్యాపారులు డీజిల్‌తో నడిచే ప్రైవేటు జనరేటర్లపై ఆధారపడుతుంటారు. మరోవైపు ఇంధనం ధరలు 30% మేర పెరిగాయి.
నిజానికి నైజీరియాలో చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. రిఫైనరీలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే మొత్తం డీజిల్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.
ముడిసరకులు ఖర్చులు మూడింతలు పెరిగినా, బ్రెడ్ ధర మాత్రం 10-12% మేర పెంచినట్టు మిస్టర్ ఒనౌరా చెప్పారు. అంతకుమించితే నా వినియోగదారులు భరించలేరని అన్నారు.

ఫొటో సోర్స్, TOM SAATER
"నైజీరియన్లు దారిద్య్రంతో బాధపడుతున్నారు. వ్యాపారాలు మూతపడుతున్నాయి. జీతాలు పెరగడం లేదు. అందువల్ల వారిపై మరింత భారం మోపలేరు" అని అన్నారు.
సగటున నైజీరియన్లు తమ ఆదాయంలో దాదాపు 60% మేర ఆహారంపై వెచ్చిస్తారు. అదే అమెరికాలో అయితే ఈ సంఖ్య దాదాపు 7%గా ఉంటుంది.
పరిస్థితులు ఇలాగే కొనసాగుతుంటే బేకర్లు నిలదొక్కుకోలేరు.
"మాది ధార్మిక సంఘమేమీ కాదు. లాభాలు రావడం కోసం వ్యాపారం చేస్తున్నాం. అయినా భారాన్ని మోస్తున్నాం. ఎందుకంటే నైజీరియన్లు ఏమైనా తినాలి కదా" అని ఒనౌరు చెప్పారు.
పెరూలో 75 మందికి భోజనాలు అందిస్తున్న సామాజిక పాత్ర

ఫొటో సోర్స్, GUADALUPE PARDO
సన్నని దారి గుండా కొండ ఎక్కుతూ జస్టినా ఫ్లోరెస్ పొగమంచుతో నిండిన లిమా నగరాన్ని చూసింది. ఈ రోజు ఏమి వండాలన్నదానిపైనే ఆమె చూపులన్నీ నిలచాయి.
ఈ సమస్యను ఎలా పరిష్కరించడమన్నది ఆమెకు ప్రతిరోజూ మరింత కష్టంగా మారుతోంది.
కరోనా మహమ్మారి తీవ్ర దశలో ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉన్న 60 మంది పొరుగువారిని జమ చేసింది. తమ దగ్గర ఉన్న ఆహార పదార్థాలేవో అందరూ ఒక దగ్గరకు తీసుకువస్తే కలిసి వండుకుందామని ప్రతిపాదించి, అమలు చేసింది.
శాన్ జువాన్ డి మిరాఫ్లోరిస్‌లో ఉండేవారిలో ఎక్కువ మంది ఇంటి పనివారే. వంటవారు, పనిమనుషులు, నానీలు, తోటమాలిలుగా పనిచేసేవారే.
మిసెస్ ఫ్లోరెస్ మాదిరిగా వారిలో ఎక్కువ మంది పాండమిక్ సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన వారే. వారి కుటుంబాలన్నీ ఆకలితో అలమటిస్తున్నాయి.
జస్టినా ఇంటి బయట ఓ పాత్రలో వారు వంట చేయడం ప్రారంభించారు. వంట కోసం చుట్టుపక్కల దొరికే కట్టెలను తీసుకొచ్చేవారు. తరువాత అక్కడ చిన్న గుడిసె వేశారు. స్థానిక ప్రీస్ట్ ఒకరు వారికి స్టవ్ అందజేశారు.
మిసెస్ ఫ్లోరెన్స్ మార్కెట్‌లోని వ్యాపారులను కలిసి వృథాగా పారబోసే ఆహార పదార్థాలను విరాళంగా ఇవ్వాలని కోరారు.
రెండేళ్ల తరువాత ఇప్పుడు వారు 75 మందికి ఆహారాన్ని అందిస్తున్నారు. వారానికి మూడుసార్లు ఆహారం పెట్టగలుగుతున్నారు.
కొవిడ్‌కు ముందు కిచెన్ అసిస్టెంట్‌గా పనిచేసిన మిసెస్ ఫ్లోరెన్స్ ఇప్పుడు తన కమ్యూనిటీకి డీ ప్యాక్టో నాయకురాలిగా మారారు.
"నేను తలుపులు కొడుతునే ఉంటా. సాయం కోసం ఎదురు చూస్తునే ఉంటా" అని ఆమె చెప్పారు.
* పెరూలో వార్షిక ఆహార ద్రవ్యోల్బణం జులై నాటికి 11.59%
* పెరూవియన్లు తమ ఆదాయంలో 26.6% ఆహారంపై ఖర్చు చేస్తారు.
మొదట్లో ఆమె చాలా ఉత్సాహంతో మాంసం, కూరగాయలు ఉడికించి స్ట్యూ తయారు చేసేవారు. అన్నంతో కలిపి వడ్డించే వారు. గత కొన్ని నెలలుగా విరాళాలు క్రమేణా తగ్గుతున్నాయి. అన్ని రకాల ఆహార పదార్థాలను పొందడం చాలా కష్టంగా మారింది.
"మేం చాలా నిరాశలో ఉన్నాం. నేను వాటాలను తగ్గించక తప్పడం లేదు" అని మిసెస్ ఫ్లోరెన్స్ చెప్పారు. ప్రాథమిక అవసరమైన బియ్యం సంపాదించడానికే ఆమె చాలా కష్టపడుతున్నారు.

ఫొటో సోర్స్, AFP
ఏప్రిల్‌లో రైతులు, రవాణా కార్మికులు ఆందోళనలు ప్రారంభించినప్పటి నుంచి ఇదంతా మొదలయింది. ఇంధనం ఖర్చులు, ఎరువుల ధరలు పెరగడానికి నిరసనగా వారు పలుమార్లు సమ్మె చేశారు. దాంతో ఫుడ్ సప్లయిలో అంతరాయాలు కలిగాయి.
ధరలు పెరగడంతో ఇటీవల కాలంలో మాంసం వడ్డించడాన్ని మిసెస్ ఫ్లోరెన్స్ నిలిపివేశారు.
రక్తం, లివర్, బోన్స్, గిజార్డ్‌లతో చేసిన వంటకాలను అందించే వారు. అప్పుడు వాటి ధరలు అందుబాటులో ఉండేవి. ఆ చిన్న చిన్న మాంసం ముక్కలు కూడా ఇప్పుడు చాలా ఖరీదైనవిగా మారాయి.
దాంతో ఆమె వేయించిన కోడి గుడ్లను ఇచ్చేవారు. నూనె ధరలు పెరిగిన దగ్గర నుంచి వేయించడాన్ని అదీ మానేశారు.
అక్కడి కుటుంబాల వారికి కోడిగుడ్లను ఇచ్చి ఇళ్లలోనే వండుకోవాలని చెప్పారు. ఇప్పుడు కోడిగుడ్లు కూడా ఇవ్వలేకపోతున్నారు.
ప్రస్తుతం ఆమె పాస్తా, ఉల్లి పాయలు, దుంపలతో చేసిన సాస్‌ను మాత్రమే అందజేయగలుగుతున్నారు.
జరుగుతున్న సమ్మెలకు, ఆహార పదార్థాల కొరతకు మిసెస్ ఫ్లోరెన్స్ రైతుల్ని నిందించడం లేదు.
"పెరూలో మేం ఆహారాన్ని పండించగలం. అయితే ప్రభుత్వమే మాకు సహకరించడం లేదు" అని ఆమె అన్నారు.
జోర్డాన్‌లో కోడి మాంసం బహిష్కరణ

ఫొటో సోర్స్, AHMAD JABER
జోర్డాన్‌లో మే 22న గుర్తు తెలియని ఓ అకౌంట్ నుంచి అరబిక్‌లో ట్వీట్ వచ్చింది. చికెన్ పదార్థాల బొమ్మలను ట్యాగ్ చేసి, దానికి హ్యాష్‌ట్యాగ్ కింద # బాయ్‌కాట్_గ్రీడీ_చికెన్_ కంపెనీస్ అని పెట్టాలన్నది దాని సారాంశం
కొద్ది రోజుల తరువాత సలాం నస్రల్లా ఇంటి నుంచి సూపర్ మార్కెట్‌కు వెళ్తూ దారిలో ఈ ప్రచారం వైరల్‌గా మారడాన్ని గమనించారు.
"ప్రతి చోటా దీన్ని వింటున్నాం. మా స్నేహితులు, కుటుంబ సభ్యులు దీని గురించే మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియా, టీవీల్లో ఇదే నడుస్తోంది" అని మిసెస్ నస్రల్లా చెప్పారు.
చికెన్ ధరలు ఎంతగా పెరిగాయన్నదాన్ని షాపింగ్ బిల్లును చూసిన తరువాత ఇప్పుడే ఆమె గమనించారు.
ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆమె నిత్యం తల్లిదండ్రులు, అక్కా చెల్లెళ్లు, వారి కుమార్తెలు, కుమారుల కోసం నిత్యం పెద్ద మెత్తంలో చికెన్ కొనుగోలు చేస్తుంటారు.
దీన్ని తగ్గించుకోక తప్పని పరిస్థితి ఆమెకు ఎదురయింది.
పది రోజుల పాటు ఆమె చికెన్ వండలేదు. ఇది ఆమెకు చాలా కష్టమైన పరిస్థితి. ఎందుకంటే ఇతర రకాల మాంసాలు, చేపలు మరింత ఖరీదైనవిగా మారాయి.
ఆమె, కుటుంబ సభ్యులు దాదాపుగా ప్రతి రోజూ చికెన్ తింటారు.
వారు మాంసం బదులు జామ్‌లాంటి హుమ్మాస్, ఫలాఫెల్, కాల్చిన వంకాయలను తింటున్నారు.
ధరలు తగ్గించాలన్న ప్రచారం మొదలైన 12 రోజుల తరువాత చికెన్ రేటు మూడో వంతుకు పడిపోయింది. కిలో సుమారు ఒక డాలర్ (0.7 దీనార్) పలుకుతోంది.
* జోర్డాన్‌లో వార్షిక ఆహార ద్రవ్యోల్బణం జూన్ నాటికి 4.1%
* జోర్డానియన్లు తమ ఆదాయంలో 26.9% ఆహారంపై ఖర్చు చేస్తారు.
కోళ్ల ఫారాలు, కబేళాలను నిర్వహిస్తున్న రమీ బర్హౌష్ ఈ బహిష్కరణలకు మద్దతు తెలుపుతున్నారు. అయితే ఇది తప్పడు అభిప్రాయంతో కూడుకున్నదని అంటున్నారు.
ఏ ఈఏడాది ప్రారంభం నుంచి పెరుగుతున్న ధరల కారణంగా తన ఫారాలు ఇబ్బందులు పడుతున్నట్టు చెప్పారు. ముఖ్యంగా ఆయిల్, ఫీడ్ ధరల పెరుగుదలను తట్టుకోలేకపోతున్నట్టు చెప్పారు.
ధాన్యం గింజలు, ఆయిల్ ధరలు పెరగడానికి తోడు ప్రపంచంలోని ఇతర పరిస్థితులు కూడా ఇందుకు తోడయ్యాయి. స్వయిన్ ఫ్లూ తరువాత చైనా పందుల ఫారాన్ని నిర్మిస్తుండడం, దక్షిణ అమెరికాలో కరవు, ఉక్రెయిన్ యుద్ధం ఇవన్నీ కారణాలయ్యాయి.

ఫొటో సోర్స్, AHMAD JABER
చికెన్ ధరలపై పరిమితి విధించాలని జోర్డాన్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇతర పదార్థాల ధరలనూ నియంత్రించింది.
రమదాన్ చివరి వరకు ఈ ధరల పరిమితిని పాటిస్తామని కోళ్ల రైతులు అంగీకరించారు.
మే మొదటి వారం నుంచి ధరలు పెంచక వారికి తప్పలేదు. అప్పటి నుంచి ఒకటే పెరుగుదల.
ఆ సమయంలోనే సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి.
"మొత్తం అన్ని వస్తువుల ధరలు పెరుగుదలపై వ్యక్తమయిన నిరసనకు చికెన్ ఒక ప్రతీకగా నిలిచింది" అని రమీ బర్హౌష్ అన్నారు.
ఈ నిరసన ప్రభావం చూపించినందుకు నస్రల్లా సంతోషంతో ఉన్నారు. కానీ అసలు సమస్యలను ఇది పట్టించుకోలేదని బాధపడుతున్నారు.
"దురదృష్టవశాత్తూ చిన్న రైతులు, చికెన్ అమ్మకందార్లే ఇబ్బందిపడుతున్నారు. పెద్ద వ్యాపారులకు ఏమీ కాదు. రైతులకు కావాల్సిన అన్ని సరకులపైనా వారే ధరలను భారీగా పెంచుతున్నారు" అని అసలు సమస్యను వివరించారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మొత్తం అప్పులు తీర్చడానికి ఆ కంపెనీ 6 నెలల లాభాలు చాలు
- పీరియడ్ రోజుల చార్టులను ఈ అమ్మాయిలు ఇంటి తలుపులపై ఎందుకు పెడుతున్నారు?
- ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు రానుందా? సోషల్ మీడియాలో చర్చ ఎందుకు మొదలైంది
- ముస్లింలు తలాక్- ఏ- హసన్ పద్ధతిలో భార్యకు విడాకులు ఇవ్వడం నేరం కాదా?
- ఇండియా@75: స్వతంత్ర భారతదేశం సాధించిన అతి పెద్ద విజయం ఏమిటి? అతిపెద్ద సమస్య ఏమిటి? - ఎడిటర్స్ కామెంట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













