F-INSAS: ఈ అత్యాధునిక ఆయుధ వ్యవస్థతో భారతీయ సైనికులు ఫైటింగ్ మెషీ‌న్‌లుగా మారుతారా

F-INSAS సిస్టమ్‌తో భారతీయ సైనికుడు

ఫొటో సోర్స్, @RAJNATHSINGH

ఫొటో క్యాప్షన్, F-INSAS సిస్టమ్‌తో భారతీయ సైనికుడు
    • రచయిత, దిల్‌నవాజ్ పాషా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భవిష్యత్ సైనిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని దేశంలో సిద్ధం చేసిన ప్రత్యేక రక్షణ వ్యవస్థలు, పరికరాలను భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైన్యానికి అప్పగించారు.

వీటిలో ఫ్యూచర్ ఇన్‌ఫాంట్రీ సోల్జర్(భవిష్యత్ సైనికుడు), సైనికుల భద్రతే లక్ష్యంగా కొత్తతరం ల్యాండ్‌మైన్‌లు, ట్యాంకుల కోసం అప్‌గ్రేడ్ చేసిన సైట్ సిస్టమ్, అటాక్ బోట్‌లు, హై మొబిలిటీ ఇన్‌ఫాంట్రీ వాహనాలు ఉన్నాయి.

ఆపరేషన్ల నిర్వహణలో ఈ వ్యవస్థలు సైనికులకు ఉపయోగపడతాయని ఆగస్టు 16న వీటిని సైన్యానికి అప్పగిస్తున్న సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. భవిష్యత్ సైనిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవస్థలు ప్రత్యేకంగా రూపొందించినట్లు ఆయన చెప్పారు.

రక్షణ మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం, ఫ్యూచర్ ఇన్‌ఫాంట్రీ సోల్జర్ మూడు ప్రధాన వ్యవస్థలను అమర్చుకోవాల్సి ఉంటుంది.

రాత్రి కూడా చూడగలిగేలా హోలోగ్రాఫిక్, రిఫ్లెక్స్ విజన్‌తో కూడిన మొట్టమొదటి ఆధునిక అసాల్ట్ రైఫిల్ సైనికుల చేతిలో ఉంటుంది.

వీడియో క్యాప్షన్, హిమాలయాల్లో గల్లంతైన భారత సైనికుడి మృతదేహం 38 ఏళ్ల తర్వాత దొరికింది.

సైనికుడి హెల్మెట్‌లో 360 డిగ్రీల బైనాక్యులర్‌లు ఉంటాయి. రైఫిల్‌తో పాటు, సైనికుడి వద్ద వివిధ రకాల అవసరాల కోసం కత్తులు, వివిధ రకాల హ్యాండ్ గ్రెనేడ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి.

ఇక రెండవ వ్యవస్థ భద్రతా వ్యవస్థ. ఇందులో సైనికుడికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, బులెట్ ప్రూఫ్ హెల్మెట్ అమర్చారు. ఈ జాకెట్ ఏకే-47 వంటి ఆయుధాల నుంచి వచ్చే బుల్లెట్ల నుండి కూడా సైనికుడిని రక్షిస్తుంది.

మూడవ వ్యవస్థ కమ్యూనికేషన్ అండ్ సర్వైవలెన్స్ సిస్టమ్. యుద్ధం లేదా ఏదైనా ఆపరేషన్ సమయంలో, సైనికులు ఈ వ్యవస్థ ద్వారా రియల్ టైమ్‌లో ఒకరితో ఒకరు మాట్లాడుకోగలుగుతారు. అంతేకాకుండా దీనిని రియల్ టైమ్ డేటాకు కూడా కనెక్ట్ చేస్తారు. అవసరమైనప్పుడు అప్‌గ్రేడ్ కూడా చేయవచ్చు.

ఈ సామగ్రిని నిఘా, శత్రువులను పట్టుకోవడం కోసం సిద్ధం చేశారు. దీని ద్వారా, సైనికులు శత్రువులపై నిఘా ఉంచగలరు. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా ఎలాంటి వాతావరణంలోనైనా వారి కదలికలను గుర్తించగలుగుతారు.

అధునాత పరికరాలను పరిశీలిస్తున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

ఫొటో సోర్స్, @RAJNATHSINGH

ఫొటో క్యాప్షన్, అధునాత పరికరాలను పరిశీలిస్తున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

యాంటీ పర్సనల్ మైన్ 'స్కిల్డ్'

పుణెలోని ఆర్మమెంట్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ అండ్ ఇండియన్ డిఫెన్స్ ఇండస్ట్రీ సహకారంతో కొత్త రకం ల్యాండ్‌మైన్ కూడా తయారు చేశారు. దీనికి ‘నిపుణ్’ అని పేరు పెట్టారు. దీని ద్వారా సరిహద్దుల్లో మోహరించిన సైనికులకు భద్రత పెరుగుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ల్యాండ్‌మైన్ ఇప్పుడు ఉపయోగిస్తున్న ల్యాండ్‌మైన్‌ల కంటే మరింత ప్రభావవంతంగా, ప్రాణాంతకంగా ఉంటుంది.

అమెరికా సైనికులతో శిక్షణ తీసుకుంటున్న భారతీయ సైనికులు

ఫొటో సోర్స్, @ADGPI

ఫొటో క్యాప్షన్, అమెరికా సైనికులతో శిక్షణ తీసుకుంటున్న భారతీయ సైనికులు

ఈ వ్యవస్థ అవసరం ఏంటి?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైన్యాలు ఆధునికీకరణపై దృష్టిపెడుతూ, బడ్జెట్‌ను ఖర్చు చేస్తున్నాయి. సైనికుల సంఖ్యను తగ్గిస్తున్నాయి. అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్ వంటి దేశాలు ఇప్పటికే ఫ్యూచర్ మిలిటరీ ప్రాజెక్టుల మీద పని చేస్తున్నాయి.

సైన్యాలు తమ ఫైర్‌పవర్‌ను పెంచడం, సైనికులకు అత్యున్నత సాంకేతికత, ఆయుధాలను అందించడం ద్వారా, వారిని మరింత సురక్షితం చేయడంపై దృష్టి పెడుతున్నాయి. రక్షణ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, భారత సైన్యం కూడా ఇదే బాటలో నడుస్తోంది.

సైన్యాన్ని ఆధునికీకరించే ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైనదని మాజీ జనరల్ డి.ఎస్.హుడా అభిప్రాయపడ్డారు.

"ఆధునికీకరణ అనేది ఒక నిరంతర ప్రక్రియ. కొత్త సాంకేతికత ఎప్పుడూ వస్తుంది. ఇప్పటికే ఉన్న పరికరాలు వాడుకకు వీలుకాకుండా ఉన్నాయి. అందువల్ల ఫ్యూచర్ ఇన్‌ఫాంట్రీ సోల్జర్ యాజ్ ఏ సిస్టమ్ (F-INSAS) ద్వారా సైనికులను అత్యాధునిక ఆయుధాలతో సన్నద్ధం చేయడానికి ఈ పథకాన్ని అమలు చేయడానికి నిర్ణయించారు. ఆధునిక సైనికుడు తన భద్రతతోపాటు, కమ్యునికేషన్ పరికరాలు, లక్ష్యాన్ని చేరుకోగల సామర్ధ్యం లాంటివన్నీ ఏకీకృతంగా అందుబాటులో ఉంటాయి'' అని హుడా అన్నారు.

ఇదే కాకుండా, సైన్యానికి చెందిన ఇతర పరికరాలను కూడా అప్‌గ్రేడ్ చేస్తున్నారు.

అధునాతన సామాగ్రిని సైనికులకు అందజేస్తున్న రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్

ఫొటో సోర్స్, @RAJNATHSINGH

ఫొటో క్యాప్షన్, అధునాతన సామాగ్రిని సైనికులకు అందజేస్తున్న రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్

భారత సైన్యపు ఆధునీకరణ కార్యక్రమంలో లోపాలు, సవాళ్లు ఉన్నాయని జనరల్ హుడా అంగీకరించారు. F-INSAS వ్యవస్థను తీసుకురావడం సరైన దిశలో అవసరమైన దశగా ఆయన అభివర్ణించారు.

"దీనిలో కొన్ని లోపాలు ఉన్నాయని నేను అంగీకరిస్తాను. కానీ కాలక్రమంలో మనం సైన్యాన్ని ఆధునీకరించుకుంటున్నాం. భారత సైన్యంలోని సైనికులందరూ ఈ వ్యవస్థను కలిగి ఉండాలనేది ఆలోచన" అని హుడా అన్నారు.

ఇండియన్ ఆర్మీలో మొత్తం పోస్టుల సంఖ్య 12,29,559 కాగా అందులో 97,177 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం, గత ఏడేళ్లలో, భారతదేశంలో ప్రతి సంవత్సరం సగటున 60,000 మంది సైనికులు రిక్రూట్ అయ్యారు.

భారత సైన్యంలో సైనికుల సంఖ్య ఎక్కువగా ఉందని, దీని కారణంగా సైన్యానికి కొత్త ఆయుధాలు, సాంకేతికతను అందించడానికి తగినంత నిధులు లేవన్న మాట వినిపిస్తోంది.

సైనికుల సంఖ్యను తగ్గించడంతోపాటు ఆయుధాలు, పరికరాలపై ఎక్కువ ఖర్చు చేయడం మీద సైన్యం దృష్టి సారిస్తోందని, భవిష్యత్ సైనిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇదే సరైన వ్యూహమని విశ్లేషకులు భావిస్తున్నారు.

అగ్నివీర్ యోజన భవిష్యత్తులో నిధులను, ముఖ్యంగా పెన్షన్ డబ్బును కూడా ఆదా చేస్తుంది. దీంతో ఆధునీకరణ కోసం సైన్యానికి మరిన్ని నిధులు అందుతాయి.

సైనిక శక్తికి సంబంధించి భారతదేశపు వ్యూహాత్మక స్థానం కూడా గత దశాబ్దంలో మారిపోయింది. భారత సైన్యపు సన్నాహాలు ఇప్పటివరకు సంప్రదాయ శత్రువు, పొరుగున ఉన్న పాకిస్తాన్‌పై దృష్టి సారించాయి. అయితే ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న చైనా సైన్యం ఆధునీకరణపై భారత్ ఆందోళనలో ఉంది.

భారతీయ సైనికుడు

ఫొటో సోర్స్, @ADGPI

చైనాతో పోలిస్తే భారత వైమానిక దళం సామర్థ్యం బలహీనంగా ఉంది. గత ఏడాది గల్వాన్ లోయలో చైనాతో ఘర్షణ తర్వాత, సైన్యాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని భారత్ గ్రహించి, వేగవంతమైన ఆధునికీకరణపై దృష్టి పెట్టింది.

F-INSAS వ్యవస్థ పాకిస్థాన్ లేదా చైనా సైనికులపై భారత సైనికులకు ఆధిపత్యం ఇవ్వగలదని జనరల్ హుడా అభిప్రాయపడ్డారు.

భారత సైన్యపు వ్యూహకర్తలు ఆధునీకరణ అవసరాన్ని ఇటీవల తరచుగా నొక్కిచెబుతున్నారు. దానిపైనే ఎక్కువ ఖర్చు పెట్టాలని కూడా వాదిస్తున్నారు.

"భారత సైన్యం నిరంతరం మారుతూనే ఉంటుంది. కొత్త టెక్నాలజీని అవలంబిస్తూనే ఉంటుంది. ఇప్పుడు డీఆర్‌డీవో ఈ కొత్త వ్యవస్థను అభివృద్ధి చేసింది. దీనిని పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేస్తారు'' అని జనరల్ హుడా అన్నారు.

అనేక కొత్త పరికరాలు, వ్యవస్థలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ F-INSAS కమిటీకి అందజేశారు. అయితే, భారత సైన్యం ఈ వ్యవస్థలతో పూర్తి స్థాయిలో అనుసంధానమవుతుందో ఇంకా స్పష్టంగా తెలియలేదు. దీనికి సంబంధించిన టైమ్‌లైన్‌ను కూడా సైన్యం ఇంకా విడుదల చేయలేదు.

వీడియో క్యాప్షన్, స్పెషల్ మిషన్‌తో దూసుకుపోతున్న మహిళా స్క్వాడ్రన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)