ట్రిపుల్ తలాక్‌: ముస్లింలు తలాక్- ఏ- హసన్‌ పద్ధతిలో భార్యకు విడాకులు ఇవ్వడం నేరం కాదా, కోర్టు ఏమన్నది?

ముస్లిం మహిళ

ఫొటో సోర్స్, AFP

    • రచయిత, సల్మాన్ రావి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భార్యకు విడాకులు ఇచ్చేందుకు భర్త తలాక్-ఏ-హసన్ చెప్పడంలో అన్యాయమేమి లేదని సుప్రీం కోర్టు పేర్కొంది. ముస్లిం మహిళ బెనజీర్ విడాకులకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ ను విచారిస్తూ సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

‘‘బెనజీర్ హీనాకు ఆమె భర్త ఒక లాయర్ ద్వారా రాత పూర్వకంగా మూడు సార్లు తలాక్ విడాకుల నోటీసు పంపారు. తలాక్- ఏ-హసన్ కింద ఆమెకు విడాకులు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు" అని బెనజీర్ తరుపున వాదిస్తున్న న్యాయవాది సౌదామిని శర్మ బీబీసీకి చెప్పారు.

ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులివ్వడం నేరమని సుప్రీం కోర్టు 2017లో పేర్కొంది.

తనకిచ్చిన తలాక్- ఏ- హసన్ ను సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు బెనజీర్. ఈ విడాకుల ప్రక్రియ రాజ్యాంగంలోని 14,15,21, 25 ఆర్టికల్స్ ను ఉల్లంఘిస్తూ ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉందని కోర్టు ప్రకటించాలని ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు.

కానీ, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎమ్. ఎమ్ సుందరేష్‌లతో కూడిన సుప్రీం కోర్టు డివిజన్ బెంచ్ "తలాక్-ఏ-హసన్ ద్వారా విడాకులివ్వడం అన్యాయం కాదు" అని పేర్కొంది. అయితే, తీర్పును రాస్తూ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ మౌఖికంగా ఈ మాటలను అన్నారు.

"ఇది ట్రిపుల్ తలాక్ కాదు. ఖులా విధానం ద్వారా ముస్లిం మహిళలకు కూడా విడాకులు పొందే స్వేచ్ఛ ఉంది. ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించే పరిస్థితులు లేనప్పుడు కోర్టు కూడా విడాకులు మంజూరు చేస్తుంది. వివాహ సమయంలో ఇచ్చిన కట్నం తిరిగి ఇస్తే విడాకులు తీసుకునేందుకు సంసిద్ధంగా ఉన్నావా? ఈ పిటిషన్ వేసిన వారి అభిప్రాయాన్ని నేను ఏకీభవించడం లేదు. వేరే కారణాలను పెట్టుకుని దీనినొక ఎజెండాగా వాడొద్దు" అని జస్టిస్ కౌల్ అన్నారు.

ముస్లిం మహిళ

ఫొటో సోర్స్, Getty Images

విడాకులు దారుణమైనవి

బెనజీర్ భర్త విడాకులను రాతపూర్వకంగా పంపలేదు. కానీ, ఆయన న్యాయవాది ద్వారా మూడు సార్లు విడాకుల నోటీసు పంపారు. ఈ విధానానికున్న రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దీని పై నిషేధం విధించాలని బెనజీర్ కోరినట్లు సౌదామిని చెప్పారు.

బెనజీర్ భర్త వివాహ సమయంలో ఇచ్చిన కట్నం రూ.15,000 ఇవ్వగా వాటిని ఆమె వెనక్కి తిరిగి ఇచ్చేసినట్లు చెప్పారు.

ఈ కేసు విచారణను కోర్టు ఆగస్టు 28కి వాయిదా వేసింది.

వీడియో క్యాప్షన్, మత విద్వేష వ్యాప్తికి మాధ్యమంగా సంగీతాన్ని వాడుకుంటున్న హిందూ రైట్ వింగ్ సమర్థకులు

సుప్రీం కోర్టు వ్యాఖ్యలను ఇస్లామిక్ వ్యవహారాల నిపుణులు మౌలానా రషీద్ స్వాగతించారు. కానీ, బెనజీర్ భర్త యూసుఫ్ నఖ్వీ విడాకులిచ్చిన విధానానికి మాత్రం అభ్యంతరం తెలిపారు. "ఈ మొత్తం వ్యవహారంలో మధ్యవర్తిత్వం కోసం ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు" అని ఆయన అన్నారు.

"జీవిత భాగస్వాములు విడాకులు తీసుకోవడాన్ని అల్లా దారుణంగా భావిస్తారు" అని ఆయన అన్నారు.

ఇలాంటి విషయాల్లో పెద్దవాళ్ళు జోక్యం చేసుకోవాలి. ఈ ప్రక్రియ గురించి షరియత్ లో వివరంగా ఉన్నట్లు ఇస్లామిక్ నిపుణులు చెబుతున్నారు.

విడాకులు

ఫొటో సోర్స్, AFP

హసన్ అంటే ఉత్తమం అని అర్ధం

‘‘తలాక్-ఏ-హసన్ చాలా సుదీర్ఘమైన ప్రక్రియ. హసన్ అంటే మెరుగైనది అని అర్ధం. ఇదే ఉత్తమమైన మార్గం" అని అర్ధం అని మౌలానా రషీద్ వివరించారు.

అయితే, తలాక్ అని చెప్పినంత మాత్రాన సరిపోదని ముస్లిం పెద్దలు చెబుతున్నారు. "మొదటిసారి విడాకులు చెప్పిన తర్వాత దంపతులిద్దరూ విడి విడిగా ఉండాలి, వారి మధ్య ఎటువంటి శారీరక సంబంధం ఉండకూడదు. ఇలా మహిళకు మూడు సార్లు నెలసరి వచ్చేవరకు జరగాలి" అని వివరించారు.

"విడాకులివ్వడాన్ని షరియత్ తప్పుగా పరిగణిస్తుంది" అని మౌలానా చెప్పారు.

"తలాక్-ఏ- హసన్ కింద మొదటి సారి విడాకులు ప్రకటించిన తర్వాత పంచాయతీ లేదా కుటుంబ సభ్యులు వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు జరగాలి" అని చెప్పారు.

‘‘రెండవ సారి తలాక్ చెప్పేటప్పుడు సాక్షులు కూడా ఉండాలి. అన్ని ప్రయత్నాల తర్వాత కూడా భార్యా భర్తలు కలిసి జీవించే పరిస్థితులు లేనప్పుడు విడాకులు ఇవ్వవచ్చు. అయితే, ఇందుకు భార్య అంగీకారం కూడా అవసరం" అని చెప్పారు.

ఇదంతా జరుగుతున్న సమయంలో భార్యా భర్తలు కలిసి ఉన్నా, శారీరక సంబంధం కొనసాగించినా కూడా ఆ విడాకులు వర్తించవని కొంత మంది ఇస్లామిక్ నిపుణులు చెబుతున్నారు. "ఇద్దరూ వేర్వేరుగా బతకడం వల్ల అందులో ఉన్న కష్టనష్టాలను గ్రహించి, విడిపోయి బతకగలరో లేదో అర్ధం చేసుకునేందుకు అవకాశం దొరుకుతుంది" అని అన్నారు.

ముస్లిం మహిళ

ఫొటో సోర్స్, Getty Images

మహిళలకు కూడా విడాకులిచ్చే హక్కు

కానీ, బెనజీర్‌కు మాత్రం తన అంగీకారం లేకుండా విడాకులు ఇచ్చినట్లు చెప్పారు. ఆమె ఒక విలేఖరిగా పని చేసేవారు.

విడాకులు కావాలో వద్దో నిర్ణయించుకునే హక్కు మహిళకు కూడా ఉండాలని ఆమె అంటారు.

ముస్లిం మహిళలకు కూడా ఖులా అనే విధానం ద్వారా విడాకులిచ్చే స్వేచ్ఛ ఉందని జస్టిస్ కౌల్ అన్నారు.

కానీ, ముస్లిం మహిళలు ఖులా ద్వారా విడాకులు తీసుకుంటే, వివాహ సమయంలో ఇచ్చిన కట్నం ఆమెకు తిరిగి లభించదని ముస్లిం పెద్దలు చెబుతున్నారు.

అయితే, వివిధ ముస్లిం వర్గాలు వేర్వేరు విధానాలను ఆచరించడం పట్ల కూడా చర్చలు జరుగుతున్నాయి. బరేల్వీ, ముస్లింలు షరియత్, హదీత్ ను తమకు నచ్చిన విధంగా విశ్లేషిస్తారని, దేవ్‌బందీ, సలాఫీ ముస్లిం లు వారికిష్టమైనట్లు అర్ధం చేసుకుంటారని అంటున్నారు.

అయితే, మతపరమైన స్వేచ్ఛ కారణంగా కోర్టులు కూడా ఇలాంటి అంశాలను సమాజ నిర్ణయానికే వదిలేస్తాయి. బెనజీర్ విషయంలో కూడా ఇదే జరిగింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)